
వాషింగ్టన్, డీసీ: ఈ సంవత్సరపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక ముందస్తు హెచ్చరికగానూ, ఇంకా చెప్పాలంటే నిరాశగానూ గడిచింది. మహిళల హక్కుల పురోగతి, వారి ప్రాతినిధ్యం ఆగిపోయాయి. చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం మన తరానికంతటిలోనూ అత్యంత కనిష్టస్థాయి పెరుగుదలని సాధించింది. లింగపర వివక్షా వ్యతిరేక కార్యక్రమాలకు ప్రోత్సాహకంగా ఇచ్చే గ్లోబల్ ఫైనాన్సింగ్ మొత్తంలో తేడా ఏడాదికేడాదికీ పెరిగిపోతుంది. ప్రజాస్వామిక ధోరణులు విస్తృతస్థాయిలో వెనుకబాట పట్టడం- లింగపర వివక్షా వ్యతిరేక కార్యక్రమ ప్రోత్సాహకాలతో పాటుగా, విదేశీ ద్రవ్య సహాయాలను ట్రంప్ నిలుపుదల చేయడం- వంటి వాటితో భవిష్యత్ దృశ్యం అంధకారంగా మారింది.
ఈ వెనుకబాటు పరిస్థితుల పరిణామాలను ఆఫ్ఘనిస్తాన్ మహిళలు, బాలికల కంటే మరింకెవ్వరూ అంత బాగా అర్థం చేసుకోలేరు. ఆఫ్ఘనిస్తాన్, ప్రపంచం మొత్తం మీదనే పెద్ద సంఖ్యలో అత్యంత తీవ్ర స్థాయి లింగ వివక్షతతో కూడిన హక్కుల ఉల్లంఘనలు జరిగే చోటు. ఆఫ్ఘన్ మహిళలు- ప్రత్యేకించి హక్కులు, స్వేఛ్ఛ, అవకాశాలూ కలిగిఉన్న వారందరికీ.. అవి తమకు లేనప్పటికీ- పోరాటాన్ని కొనసాగించేందుకుగానూ ఆమోదించక తప్పని దృఢమైన నమ్మకాన్నీ శక్తివంతమైన ప్రేరణనూ అందిస్తున్నారు.
కఠినమైన అణచివేతను ప్రతిఘటించడానికిగానూ ఆఫ్ఘన్ మహిళలు ఎంతో కాలంగా సృజనాత్మకమైన, యుక్తితో కూడిన పద్దతులను అవలంబించవలసి వచ్చింది. 1990లలో దేశమంతటినీ, తాలిబాన్ తన ఏకీకృత అదుపులోకి తెచ్చుకొని, తిరోగమన విధానాలను అమలు చేశాక, మహిళలు రహస్య పాఠశాలలను, సామాజిక కేంద్రాలనూ ఆరోగ్య కేంద్రాలనూ ఏర్పరచారు. తాలిబాన్లు తిరిగి 2021లో అధికారంలోకి వచ్చాక ఆఫ్ఘన్ మహిళలు తిరిగి తమ విధానాలను పునరుద్ధరించుకున్నారు. ఉదాహరణకు- ఆరవతరగతి తర్వాత బాలికలకు చదువు నిషేధం కాబట్టి వారికోసం రహస్య పాఠశాలలను ఏర్పాటు చేశారు. వారు ఈ పాఠశాలలకు వ్యక్తిగతంగాగానీ, ఆన్ లైన్ లో గానీ హాజరు కావొచ్చు. అటువంటి పాఠశాలలు అందుబాటులో లేని చోట తల్లులే తరుచుగా తమ ఇంటి వద్ద బిడ్డలకు ఫోన్లు, టాబ్లెట్లను ఉపయోగించి చదువుచెప్పడం మనం చూడవచ్చు.
స్త్రీలను ఇంటి బయట మాటాడకుండా చేశాక, వారు తమ కథలను చెప్పడంకోసం సామాజిక మాధ్యమాలనూ ప్రెస్ నూ ఉపయోగించారు. హింసను ఎదుర్కోకుండా శాంతియుతంగా నిరసన తెలపడం అసాధ్యమయిన తర్వాత మహిళలు సృజనాత్మక ప్రతిఘటనా రూపాలను సొంతం చేసుకున్నారు. తమ అనుభవాలను చిత్రిస్తూ కవిత్వం, పెయింటింగ్, సినిమాలలో మార్పును డిమాండ్ చేశారు. తాలిబాన్ అణచివేతకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ మహిళల ప్రతిఘటనా ప్రయత్నాలను సహ్రామణి (SAHRAMANI) తన బ్రెడ్ అండ్ రోజెస్(BRED & ROSES) డాక్యుమెంటరీలో చిత్రీకరించింది. ఇది అంతర్జాతీయంగా ప్రశంసలను అందుకుంది.
మేము ఆఫ్ఘన్ వాసులము. కానీ మా ఈ నూతన దేశంలో, మా జీవితాలను కొత్తగా మొదలుపెట్టడమనే అవకాశాన్ని పొందినందుకు ఎంతో సంతోషిస్తున్నాము. ఇక్కడ మేము మా వ్యక్తిగత రక్షణ గురించి ఏ మాత్రమూ భయపడకుండా మా సోదరిమణులకు మద్దతును ప్రకటిస్తున్నాము. కానీ బ్రెడ్ అండ్ రోజెస్ నాయికలు, లెక్కెలేనంతగా ఉన్న ఆఫ్ఘన్ మహళా కార్యకర్తలూ ఇక్కడ ప్రతీరోజూ ప్రాణాంతక ప్రమాదం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుచేత మేము వారి కథలను విని ఊరకే ఆగిపోలేము. వారి ధైర్యాన్ని ఆరాధించడానికో, వారి కష్టాన్ని సానుభూతి చెప్పడానికో పరిమితం చేయడం అంటే ప్రపంచ వేదిక మీద వారిని నిలపడానికి ఏమీ చేయడం లేదనే అర్థం. కాబట్టి, రానున్న యునైటెడ్ నేషన్స్ కమీషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ విమెన్(CSW) సమావేశంలో, ఆఫ్ఘన్ మహిళలకు మద్దతు ప్రకటించడానికిగానూ మూడు సంక్లిష్టమైన దశలను అనుసరించమని అంతర్జాతీయ సమాజానికి మేము పిలుపునిస్తున్నాము.
మొదటిది- ఆఫ్ఘన్ శరణార్ధులకు సురక్షితమైన, శాశ్వత పునరావాసానికిగానూ నమ్మదగిన, సకాలయుతమైన ఎంపికలను అందుబాటులో ఉంచాలి. తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత, వందలు, వేల మంది శరణార్దులు- అమెరికా, నాటో దళాలతో కలిసి యుద్ధ సమయంలో పని చేసిన ఆఫ్ఘన్ జాతీయులతో కలిపి- పాకిస్తాన్ కు పారిపోయారు. అక్కడ వారు తాము పొందిన వాగ్ధానం ప్రకారం అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. పునరావాసం పొందే అవకాశం కోసం ఎదురు చూశారు. ఈ సమయంలో వారు తరుచుగా ఏకపక్ష నిర్బంధానికీ, వేధింపులకూ గురయ్యారు.
అయితే, పునరావాస ప్రక్రియను వేగవంతం చేయడానికి బదులుగా శరణార్ధుల అంగీకార కార్యక్రమాన్ని ట్రంప్ ఆపివేశాడు. దీనివల్ల ఆఫ్ఘన్ శరణార్ధులకు బలవంతపు తరలింపు అనే మరింత పెద్ద ప్రమాదం వచ్చిపడింది- అంటే దీని అర్థం, పాకిస్తానీ ప్రభుత్వపు చేతిలో అనేక మందికి ఇది చావుతో సమానం. ఇది సుదీర్ఘ కాలం పాటు సాగే పునరావాస కార్యక్రమంగా మారి, నమ్ముకున్న వారికి నిరాశను కలిగిస్తుంది. కాబట్టి సాధ్యమయినంత త్వరగా శరణార్ధులందరికీ సురక్షితమయిన ప్రాంతాలలో పునరావాసాన్ని విశ్వసనీయ పద్ధతులలో ఏర్పరచాలి.
రెండవది- ఆఫ్ఘనిస్థాన్ లో రావాల్సిన మార్పులకుగానూ ఆఫ్ఘన్ మహిళలకు అవసరమయిన వనరులను అంతర్జాతీయ సమాజం అందించాలి. దేశంలో మార్పును తీసుకొనిరావడానికి కావలసిన దార్శనికత, దృఢత్వము, అనుభవము, అంకితభావము ఇక్కడి మహిళలకున్నాయి. కానీ తాలిబాన్లు ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు మద్దతు తెలపడానికి దాతలు భయపడుతున్నారు. కాబట్టి, అటు బహిష్కరణలోనూ, ఇటు దేశంలోనూ ఉన్న మహిళలతో సంభాషణలను నిర్వహిస్తున్నవారికి, మహిళల ఆధ్వర్యంలో నడిచే కార్యక్రమాలకన్నింటికీ తప్పని సరిగా ధనసహాయాన్ని అందించాలి.
చివరగా- ఆఫ్ఘనిస్థాన్ కు సంబంధించిన ఏ రాజకీయ చర్చలలో అయినా, శాంతి ప్రక్రియలో అయినా మహిళలనూ, విస్తృత పౌర సమాజాన్నీ భాగం చేయాలి. ఇప్పటివరకూ చేసినట్టుగా, తాలిబాన్ స్త్రీలకు భాగం ఇవ్వక పోయినట్లయితే అంతర్జాతీయ సమాజం ఆ చర్చల నుండి వైదొలగాలి. ఆఫ్ఘన్ భవిష్యత్తు, ప్రాంతీయ సుస్థిరత వీటిమీదే ఆధారపడి ఉంది.
మహిళల అభివృద్ధి కోసం ప్రపంచంలోనే అత్యంత పురోగామి అయిన బ్లూప్రింట్‌గా పిలుచుకొనే బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్‌ఫామ్ ఫర్ యాక్షన్ కు రానున్న CSW సమావేశం 30 వసంతాల సంబరం కానుంది. మూడు దశాబ్ధాల క్రితం అది ఏర్పడినపుడు దానిలో పాల్గొన్న మహిళలు లింగ సమానత్వం కోసం స్త్రీలు చేసిన పోరాటం ఒక మలుపుకు చేరుకున్నట్టుగా నమ్మారు. అనుకున్నట్టుగానే కొన్ని రంగాలలో అభివృద్ధి జరిగినప్పటికీ- స్త్రీల శ్రామిక సంఘాలు పాల్గొనడం, రాజకీయ ప్రాతినిధ్యం, పైనాన్సియల్ ఇంక్లూజన్ వంటి వాటితో కలిపి-ఈ డిక్లరేషన్ ఇచ్చిన హామీ ఇంకా అనేక రంగాలలో నెరవేరకుండానే ఉంది. రానున్న సమావేశం సృజనాత్మకత, నాయకత్వం, నిపుణత, కొత్త తరం మహిళా కార్యకర్తల ధైర్యం వంటి వాటికి వేదిక కానుంది. వీటిలో దేనిలోనూ ఆఫ్ఘన్ స్త్రీలు తక్కువకారు.
పల్వాశా హసన్- మినాస్ లిస్ట్‌లో
(• పల్వాశా హసన్- మినాస్ లిస్ట్‌లో సీనియర్ టెక్నికల్ అండ్ ప్రోగ్రాం డైరెక్టర్. జార్జియానా యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఫర్ విమెన్, పీస్ అండ్ సెక్యూరిటీలో సీనియర్ ఫెలో.
* షఫికా క్ఫల్వాక్- కవి, రచయిత, కార్యకర్త, మినాస్ లిస్ట్ విత్ కమ్యునికేషన్ అండ్ అడ్వకసీ మద్దతుదారు.)
ప్రాజెక్ట్ సిండికేట్ ప్రత్యేక సౌజన్యం ది వైర్ తెలుగు కోసం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.