
అధికారాన్ని అందిపుచ్చుకోడానికి ఎలాంటి అడ్డదారులైనా అవలీలగా తొక్కి అబద్ధాలతో తిమ్మిని బమ్మిని చేయగలిగే బీజేపీ చేతికి ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అనే అద్బుత అస్త్రం దొరికింది.
బీజేపీకి అత్యంత లాభాన్ని చేకూర్చి మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించే ఈ డీలిమిటేషన్ అవకాశాన్ని బిజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒదులుకోడానికి సిద్ధంగా ఉండదు. అబద్ధాలు, కుట్రలు, గిమ్మిక్కులతో శతవిధాలా ప్రయత్నించిన బిజేపీ ఉత్తరాధిలో మతవిద్వేషాలు రగిల్చి తిరుగులేని రాజకీయ లబ్ధి పొందినట్టు దక్షిణభారత దేశంలో నామమాత్రంగా కూడా చేయలేకపోతోంది. కమ్యునల్ రాజకీయాలతో దక్షిణ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు దీర్ఘ కాలంగా ప్రయత్నిస్తూ విఫలమవుతోంది. బీజేపీ మత రాజకీయ పప్పులు ఇక్కడ ఉడకవని ఈ పాటికి ఆ పార్టీకి బాగానే అర్థమై ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలను వీలైనంతగా అణిచివేసి , నేరుగా ఆధిపత్యం చలాయించడానికి ఇప్పుడు బీజేపీ ముందున్న తిరుగులేని మార్గమే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ.
ఒకవేళ బీజేపీ అనుకుంటున్న పద్ధతిలో డీలిమిటేషన్ అనేది జరిగితే సౌత్ ఇండియాకి జరిగే అన్యాయం, నష్టం మామూలు స్థాయిలో ఉండదు. పార్లమెంట్లో ఈ రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా పడిపోవడమే కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియకు, దక్షిణ భారతదేశ పౌరుల ఓటుకు ఏమాత్రం విలువుండదు. ఈ రాష్ట్రాల నుంచి ఒక్క సీటు రాకపోయినా , ఒక్క ఓటు పడకపోయినా సరే ఈ జాతీయ పార్టీలకు కేంద్రంలో అధికారం సునాయాసంగా దక్కుతుంది. దేశాన్నంతటినీ పాలించాల్సిన కేంద్ర ప్రభుత్వ ఎన్నికలో దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం అవసరమే ఉండదు. కేంద్రంలో ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే దక్షిణాది పార్లమెంటరీ సీట్లు కూడా కీలకమైన ప్రస్తుత పరిస్థితుల్లోనే వాళ్ళు సౌత్ స్టేట్స్‌ని ఘోరమైన వివక్షతో చిన్న చూపు చూస్తూ నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తుంటే ఇక ఈ రాష్ట్రాల సీట్లు, ఓట్లు ఢీల్లీ గద్దె మీద ఎలాంటి ప్రభావం చూపించలేని స్థితికి ఈ రాష్ట్రాలు దిగజారిపోతే, ఓ పక్క మనల్ని దోచుకుంటూ ఇప్పుడు విదిల్చే ఈ నాలుగు మెతుకులు కూడా అప్పుడు విదల్చకుండా పూర్తి మొండిచేయి చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హక్కుగా తమకు రావలసిన వాటాని పొందే మాట అటుంచి అడిగే హక్కుని కూడా ఈ రాష్ట్రాలు కోల్పోతాయి.
ఉత్తరాది దురహంకారాన్ని , దుర్మార్గమైన ఈ డీలిమిటేషన్ చర్యని దక్షిణ భారతీయులందరూ ఏకతాటిపైకొచ్చి తీవ్రంగా ప్రతిఘటించకపోతే దక్షిణాది ప్రజల మనుగడే ప్రశ్నార్థంగా మారే ప్రమాదముంది.
అసలు డీలిమిటేషన్ అంటే ?
దేశంలో వివిధ రాష్ట్రాల్లో పెరిగిన జనాభాకి అనుగుణంగా పార్టమెంట్‌లో ఆయా రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల సంఖ్య పెంచడమో లేక తగ్గించడమో చేసే ప్రక్రియ.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1951లో జరిగిన జనాభా లెక్కల ఆధారంగా అప్పటి దేశజనాభా 36.1 కోట్లకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ నియోజకవర్గాలను 494 సీట్లగా విభజించారు. 1961 లో దేశ జనాభా 43.9 కోట్లకు పెరిగితే పార్లమెంట్ సీట్లను 522కు పెంచారు. తిరిగి 1971 లెక్కల ప్రకారం దేశ జనాభా 54.8 కోట్లకు పెరగడంతో అప్పుడు జరిగిన డీలిమిటేషన్లో నియోజకవర్గాల సంఖ్య 543కి చేరుకుంది. అప్పటికే జనాభా పెరుగుదల నిష్పత్తిలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య గణనీయమైన వ్యత్యాసాన్ని గుర్తించిన ఇందిరాగాంధీ నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం , జనాభా నియంత్రణ ఆవశక్యతను పరిగణలోకి తీసుకుని అన్ని రాష్ట్రాలు జనాభా నియంత్రణా విధానాలు కచ్చితంగా పాటించేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల్లో జనాభా నియంత్రణా నిష్పత్తి దాదాపు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని లేనిపక్షంలో జనాభాని నియంత్రించి దేశాభివృద్ధికి తోడ్పడే రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని భావించింది. కాబట్టి ఉత్తరాది రాష్ట్రాలు కూడా దక్షిణ రాష్ట్రాలతో సమానంగా జనాభాని కంట్రోల్ చేసేందుకు మరో 25 సంవత్సరాలు గడువు (2001 వరకు) విధిస్తూ అప్పటి వరకూ డీలిమిటేషన్ ప్రక్రియను హోల్డ్ చేస్తూ 1976లో 42 అమెండ్మెంట్ తీసుకొచ్చారు.
అక్షరాస్యతలో వెనక…జనాభాలో ముందు
దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రతిపాదనను బాధ్యతగా అమలుచేసి జనాభా నియంత్రణ, అక్షరాస్యత పెంపు, ఆరోగ్యాభివృద్ధి వంటి అనేక అంశాలను సమర్థవంతంగా సాధించగలిగాయి. మరో పక్క ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా హిందీ బెల్ట్ అని చెప్పుకునే ఉత్తరప్రదేశ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లు అక్షరాస్యత, అభివృద్ధిలో వెనుకబడడమే కాకుండా విఛక్షణారహింతంగా జనాభాను గణనీయంగా పెంచాయి.
2001 నాటి జనాభా లెక్కల ప్రకారం ఉత్తర దక్షిణ రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు వ్యత్యాసం తగ్గకపోగా మరింత పెరగడంతో జనాభా ఆధారంగా జరిగే డీ లిమిటేషన్ ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించడంతో అప్పటి ప్రధాని వాజ్‌పాయి 1971లో చేసిన 543 పార్లమెంట్ సీట్ల నే కొనసాగిస్తూ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ గడువు మరో 25 ఏళ్ళకు పొడిగించారు.
యాభయ్యేళ్ళ వాయిదాకు ఒకే కారణం
ఈ డీలిమిటేషన్ పద్ధతిని ఇందిరాగాంధీ 25 ఏళ్ళు వాయిదా వేయడానికీ, వాజ్‌పాయి మరో 25 ఏళ్ళు వాయిదా వేయడానికీ కారణం ఒక్కటే ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ఫెయిలయ్యాయి కాబట్టి జనాభా ప్రాతిపధికన విభజన జరిగితే సౌత్ స్టేట్స్ తీవ్రంగా నష్టపోతాయి కాబట్టి జనాభాని నియంత్రించేందుకు ఉత్తరాది రాష్ట్రాలకు మరికొంత సమయం ఇస్తే అవి కూడా టార్గెట్ రీచ్ అయిన తర్వాత డీలిమిటేషన్ చేయడం అనేది న్యాయమైన పద్దతి అని భావించడమే ఈ 50 ఏళ్ళ సుదీర్ఘ వాయిదాకు ఏకైక కారణం.
రెండు అవకాశాలతో 50 ఏళ్ళ గడువు ఇచ్చినప్పటికీ పరిస్థితిలో ఏ మార్పూ లేనప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరగకపోగా మరింత పెరిగినప్పుడు మళ్ళీ ఏ ప్రాతిపదికన బీజేపీ ఇప్పుడు డీలిమిటేషన్ చేయాలనుకుంటుంది? ఇందిరాగాంధీ, వాజ్‌పేయి అప్పుడు ఎందుకు డీలిమిటేషన్ చేయలేదు? ఆ పరిస్థితుల్లో చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్న ఒకే ఒక్క కారణంతోనే కదా, మరి ఇప్పటికీ అదే పరిస్థితి ఉన్నప్పుడు (పరిస్థితి ఇంకా దిగజారింది. ఉత్తర జనాభా హద్దులేకుండా పెరిగింది) ఆ కారణం చెక్కుచెదరకుండా అలానే ఉన్నప్పుడు ఇప్పుడు బీజేపీ డీలిమిటేషన్ ఎలా చేస్తుంది? ఈ రాష్ట్రాలు అన్యాయమైపోయినా పర్వాలేదు , బీజేపీ ప్రాబల్యం ఉన్న ఉత్తరాది సీట్ల పెంపు తద్వారా తమ రాజకీయ లబ్ది అదే దానికి ముఖ్యం అన్న విషయం ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతోంది కదా.
దౌర్జన్యంగా చేస్తున్న ఈ డీలిమిటేషన్ అనే పాశవిక చర్యని తీవ్రంగా వ్యతిరేకించి , ప్రతిఘటించి బీజేపీని దక్షిణాదినుంచి తరిమికొట్టాల్సిన అవసరం ప్రతిఒక్క దక్షిణభారత పౌరుడికీ ఉంది.
ఫెడరల్ వ్యవస్థ ధ్వంసం
భారతదేశ అస్థిత్వమైన ఫెడరల్ వ్యవస్థను బీజేపీ క్రమంగా ద్వంసం చేస్తూ ఏకకేంద్ర పాలన (యునిటరీ రూల్) ని తీసుకొచ్చే కుట్రకు మోడీ ప్రభుత్వం ఏనాడో తెరతీసింది. లోకల్ టాక్స్ విధానం తీసేసి జిఎస్టి పెట్టి సౌత్ ఇండియా సంపదంతా కొల్లగొడుతున్నా మనం చూస్తూ కూర్చున్నాం. కేంద్రానికి చెల్లించే ప్రతీ వంద రూపాయలకుగానూ దక్షిణాది రాష్ట్రాలకు తిరిగివచ్చేది 20, 30 రూ మాత్రమే. తమిళనాడు రాష్ట్రం వంద రూపాయలు చెల్లిస్తే దానికి వచ్చేది 30. అదే బీహార్ విషయానికొస్తే 100 కు దానికొచ్చేది 922 రూపాయలు . ఇంత వ్యత్యాసమా ఏంటీ అన్యాయం? అత్యధిక పన్నుల వసూలు దక్షిణాదిరాష్ట్రాల నుంచే , ఈ కేటాయింపులు మోడీ ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంతో చేస్తోంది. ఉత్తరాదిరాష్ట్రాలు అడ్డూ ఆపూ లేకుండా జనాభాని పెంచుకుంటూ పోతే , ఆ భారం దక్షిణ భారతీయులు మోస్తున్నారు . బీజేపీ మోయిస్తొంది. ఈ అన్యాయం చాలదన్నట్టు ఇప్పుడు ఈ డీలిమిటేషన్ బాంబు వేసేందుకు సిద్ధంగా ఉంది.
డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది 5 రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతమున్న 129 సీట్లలో సుమారు 26 సీట్లు తగ్గుతాయి. ‘స్టాలిన్ అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు తమిళనాడు ఒక్క సీటు కూడా కోల్పోదు ‘ అని అమిత్‌షా చేసిన ప్రకటన ఎంత బూటకమంటే , ఇప్పుడున్న పార్లమెంట్ భవనం కెపాసిటీ 888. 1971 ప్రకారం ప్రతీ 10 లక్షల మందికి ఒక ఎంపీ చొప్పున విభజిస్తే 1400 పైగా సీట్లు పెంచాల్సింటుంది అది కుదరనిపని కాబట్టి 20 లక్షలకు ఒక ఎంపీ అనుకున్నా సంఖ్య 700 . 17, 18 లక్షలకు ఒక ఎంపీ చొప్పున 850 పైగా పెంచితే దక్షిణాది రాష్ట్రాల సీట్లలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు పైగా ఒకటో రెండో సీట్లు పెరగొచ్చు కానీ ఉత్తరాదిన భారీగా వందల్లో పెరుగుతాయి. అంటే అది తగ్గడం కాదా అప్పడు సౌత్ ప్రాతినిధ్యం ఘోరంగా తగ్గిపోదా వీళ్ళు చెప్పే కాకమ్మ కబుర్లు , కల్లబొల్లి మాటలు నమ్మడానికి ప్రజలు అంత అమాయకులా?
స్టాలిన్ వాదనకు గట్టి మద్దతు
రాష్ట్రాల అధికారాలు తగ్గించి తమపై ఢిల్లీ ఇష్టానుసారం పెత్తనం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్టాలిన్ చేస్తున్న తిరుగుబాటుకు మద్దతుగా తమిళనాడు పార్టీలన్నీ ఏకతాటిపైకొచ్చాయి. ఇదే బాటలో కర్నాటక, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏకమై డిలిమిటేషన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దీన్ని నిరసిస్తూ సీట్ల పెంపు జనాభా ఆధారంగా జరిగితే దక్షిణ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి కాబట్టి డీలిమిటేషన్ దామాషా పద్దతిలో (ఇప్పుడున్న సీట్ల నిష్పత్తితోనే ) జరగాలని రేవంత్ రెడ్డి సూచించారు. దామాషా పద్ధతిలో జరినా కూడా ఉత్తరాదిరాష్ట్రాలు ఎంతో కొంత లాభపడతాయి కానీ దేశ రాజకీయాల్ని శాసించే పట్టు సౌత్ మీద పెత్తనం లక్షంగా పెట్టుకున్న బీజేపీ ఈ పద్ధతి ఒప్పుకునే ప్రసక్తే ఉండదు.
ఇంత జరుగుతున్న , దక్షిణాది రాష్ట్రాలు కోపంతో రగిలిపోతున్నా కూటమిగా బీజేపితో కలిసి ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని వెలగబెడుతున్న ముఖ్యమంతి చంద్రబాబునాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ కనీసం ఖండించే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. ప్రజల్ని గాలికొదిలేసి వీళ్ళ రాజకీయ స్వార్థాలతో , కుల గజ్జితో కొట్టుకుని చస్తూ రాష్టాన్ని మరో బీహార్‌గా తయారుచుస్తున్నారు. వైసీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా బిజేపీ చేస్తున్న ఈ అన్యాయాన్ని వ్యతిరేకించడంలేదు.
రాష్ట్ర విభజన ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ కి రెండు తెలుగు రాష్ట్రాలకూ అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల సంఖ్య (ప్రాతినిధ్యం) పెంచాల్సి ఉంది. అవి పెంచకపోగా డీలిమిటేషన్‌తో మరింత తగ్గిస్తుంటే అడిగే నాధుడే లేడు. ప్రతీ విషయంలో బీజేపీకి తలొగ్గుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ని అంధకారంలోకి తోస్తున్న ఆంధ్రా స్వార్థ నాయకులను ప్రజలు ఎప్పటికీ క్షమించరు.
బలవంతంగా హిందీ
భారత రాజ్యాంగం ఫెడరల్ వ్యవస్థను ఆధారం చేసుకుని ఉందన్న విషయాన్ని బిజేపీ మర్చిపోతోంది. అందుకే తమ భాషని కూడా ప్రజల మీద బలవంతంగా రుద్దుతూ , దాన్ని అంగీకరించని వాళ్ళకు హక్కుగా రావాల్సిన నిధులు నిలిపివేస్తామనేంత అంహంకారాన్ని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మీ పెత్తనాన్ని ప్రజలు ఎల్లకాలం సహిస్తారనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. మన ఉనికి , ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే తమిళనాడు హిందీని తిరస్కరించినట్టు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా హిందీని తిరస్కరించాలి. నేర్చుకోవాలనుకునేవారు నేర్చుకుంటారు బలవంతంగా రుద్దడాన్ని 3 లాంగ్వేజ్ పాలసీని కచ్చితంగా వ్యతిరేకించాలి. దీని వల్ల విద్యార్థులపై మూడో భాష అనే భారం తగ్గుతుంది.
తమిళనాడు ప్రజలు వద్దు మొర్రో అంటున్నా హిందీ భాషని బలవంతంగా ఎందుకు రుద్దుతున్నారు. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలను నాశనం చేస్తూ బీజేపీ ఎదుగుతున్నట్టే ప్రాంతీయ భాషల్ని నాశనం చేస్తూ హిందీని ఆకాశానికెత్తుతున్నారు. బీహార్‌లో హిందీని అధికార భాషగా ప్రకటించినప్పుడు ఆ రాష్ట్రంలో 90% మందికి అసలు హిందీ భాష రాదు. ఇప్పుడు హిందీ బెల్ట్ అని చెప్పుకునే రాష్ట్రాల్లో ఒకప్పటి స్థానిక భాషలన్నింటినీ చంపి అది బతుకుతోంది.
హిందీ భాషకు సొంత లిపి కూడా లేదు. మరాఠీ, సంసృతం లాంటి వందలాది భాషలు ఉపయోగించే దేవనాగరి లిపిలోనే హిందీ రాస్తారు తప్ప దీనికంటూ ప్రత్యేక స్క్రిప్ట్ లేదు. కానీ దక్షిణాది రాష్ట్రాల భాషలైన నాలుగు ద్రావిడ భాషలకూ ప్రత్యేక లిపి వుంది. ఆ లిపి ఆ భాషలకు మాత్రమే సొంతం.
అతి ప్రాచీన తమిళ సాహిత్యం
హిందీ భాష భారతదేశంలోకి రాక ముందే ఈ దేశంలో తమిళ సాహిత్యం వుంది. దైవ భాష అని చెప్పుకునే సంస్కృతం పుట్టడానికి వేయి సంవత్సరాల ముందే తమిళ భాష ప్రాచుర్యంలో వుంది. మీ హిందీ మీకు గొప్పదయినట్టే ఎవరి మాతృ భాష వాళ్లకు గొప్పదే. హిందీ పెత్తనాన్ని మొదటి నుంచీ వ్యతిరేకించలేని తెలుగు, కన్నడ రాష్ట్రాలు భాషా పరంగా చాలానే నష్టపోయాయి భాషలో మార్పులు. అచ్చ తెలుగు పదాలు మాయమై 50% పైగా సంస్కృత పదాలు మన భాషలో వచ్చి కూర్చున్నాయి. కానీ తమిళ భాషలో ఇప్పటికీ స్వచ్ఛమైన తమిళ ప్రాచీన పదాలు సజీవంగా ఉన్నాయి. పరభాషా వాసన తమిళానికి అంటకుండా హిందీతో వందేళ్లుగా పోరాటం చేస్తూ వాళ్ళ భాషను కాపాడుకుంటూ వస్తున్న తమిళ ప్రజల్ని కచ్చితంగా అభినందించాల్సిందే. మాతృ భాషను అభిమానిచడం మనం వారి నుంచి నేర్చుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ వాళ్ళ భాష మీద దాడి చేస్తే ఆ పెత్తనాన్ని వ్యతిరేకించకుండా ఎలా ఉంటారు!
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు చచ్చిపోతుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిస్సిగ్గుగా హిందీకి మద్ధతిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల పై బీజేపీ దౌర్జణ్యాన్ని, పెత్తనాన్ని సమర్ధించే ప్రతీ ఒక్కరూ దక్షిణ దేశద్రోహులే.
భిన్నమైన సంసృతి సంప్రదాయాలు, భిన్నమైన భాషలు , జీవనవిధానాలున్న ఈ దేశం ఒకటిగా ఉండడానికి సమాఖ్య వ్యవస్థ (ఫెడరల్ సిస్టమ్) ఒక్కటే కారణం. భాష సంస్కృతుల ప్రాతిపదికన రాష్ట్రాలుగా విభజించి వాటికి కొన్ని ప్రత్యేక అధికారాలు, హక్కులు కల్పించడం వల్లే అన్ని రాష్ట్రాలు కలిసి ఒక దేశంగా మనుగడ సాగించగలుగుతున్నాయి.
నాటి సైమన్ కమిషన్ అధ్యయనం, బొమై కేసు
బ్రిటీష్‌వాళ్ళు వాళ్ళ దేశంలో యునిటరీ ప్రభుత్వాన్ని (అధికారం మొత్తం కేంద్రం చేతిలోనే ఉంటుంది) నడుపుతున్నప్పటికీ భారతదేశానికి ఆ విధానం ఎంతమాత్రం సూట్ కాదనే విషయాన్ని 1934లో నియమించిన సైమన్ కమీషన్ అధ్యయనం ద్వారా రుజువు చేసారు. ఇంత భిన్నత్వంతో ఉన్న దేశంలో అధికారం ఏక కేంద్రంగా ఉంటే దేశ ఉనికికే ప్రమాదమని ప్రతీ ప్రాంతానికీ (రాష్ట్రానికీ) సమాన ప్రాధాన్యత అధికారం, హక్కులు ఉంటేనే పాలన సాధ్యమవుతుందని , కాబట్టి ఇండియా ఫెడరల్ కంట్రీగానే ఉండాలని బ్రిటీష్ గవర్నమెంట్ స్పష్టం చేసింది. కానీ దాన్ని అప్పటి కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. అధికారాలన్నీ కేంద్రం చేతిలోనే ఉండాలని దాని ఆధీనంలోనే రాష్ట్రాలు పనిచేయాలనేది కాంగ్రెస్ ఉద్దేశం. కానీ ఫెడరల్ వ్యవస్థని ఇంతగా వ్యతిరేకించిన కాంగ్రెస్ కు స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగంలో రాష్ట్రాలకు ప్రత్యేక గుర్తింపులు, అధికారాలు, బాధ్యతలు ఇస్తూ సమాఖ్య భావాలు పొందుపరచక తప్పలేదు. కానీ అప్పటి ఉత్తరాది నాయకులు చాలా తెలివిగా , కుట్రపూరితంగా రాజ్యాంగంలో ఎక్కడా ఫెడరల్ అనే మాట మచ్చుకైనా కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డారు. కానీ 1994 ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీం కోర్టు చాలా క్లియర్‌గా చెప్పింది భారతదేశం కచ్చితంగా సమాఖ్య దేశం, ఫెడరల్ కంట్రీ అని.
అమెరికాలాంటి ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం వ్యవహరించే తీరు ఏ రాష్ట్రానికైనా నచ్చకపోతే ఆ రాష్ట్రం విడిపోయి స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే స్వేచ్ఛ ఉంటుంది. కానీ మన దేశంలో రాష్ట్రాలకు ఆ హక్కు లేకుండా యునిటరీ పద్ధతిలో కేంద్రానికి అధనపు అధికారాలిచ్చారు. ఆ ధైర్యంతోనే బీజేపీ ఇప్పుడు ఈ భరితగింపుకు పాల్పడుతుందనుకోవచ్చు. కేంద్రానికీ రాష్ట్రలకు మద్య గొడవ వస్తే స్వతంత్రంగా పని చేసే న్యాయ వ్యవస్థ జోక్యం కల్పించుకుని సమస్య పరిష్కరించాలని రాజ్యాంగంలో రాశారు కానీ ప్రస్తుతం ఈ దేశంలో న్యాయ వ్యవస్థ నిజంగా స్వతంత్రగా పనిచేస్తుందా అనేది పెద్ద ప్రశ్న.
ఎన్నో రాష్ట్రాల వ్యతిరేకత
దక్షిణ రాష్ట్రాలే కాదు , ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు కూడా డీలిమిటేషన్‌ని వ్యతిరేకిస్తున్నాయి. వారికి కూడా నష్టం జరుగుతుంది. అయినా బీజేపీ తన మొండివైఖరి విడనాడకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితులు తీవ్రంగా పరిణమించే వాతావరణం కనిపిస్తోంది. కేంద్రం రాష్ట్రాల మధ్య ఎలాంటి చిచ్చు రగిలినా తమ అధికారానికి డోకాలేదని బీజేపీ భావిస్తే దానికి మూల్యం చెల్లించాల్సింది మాత్రం ఈ దేశమే అవుతుంది.
ఫెయిలయితే బహుమతులు?
ఒక పరీక్ష పెట్టిన నిర్వాహకులే (కేంద్రం) అందులో నిర్లక్ష్యంగా , బాధ్యతారహితంగా వ్యవహరించి పరీక్ష ఫెయిల్ అయిన వాళ్ళకు బహుమతులు ఇస్తూ , క్రమశిక్షణతో కష్టపడి పరీక్ష పాసైన వారిని శిక్షిస్తే లక్ష్యాన్ని చేరుకున్న ప్రజలు కచ్చితంగా ఎదురుతిరుగుతారు న్యాయాన్ని పొందలేని తిరుగుబాట్లు విధ్వంసానికి దారి తీసిన సంఘటనలు చరిత్రలో ఎన్నో . స్టాలిన్ మాటలు చూస్తే ఆ విధ్వంసం వైపు అప్పుడే అడుగులు కూడా పడుతున్నాయనిపిస్తుంది. డీలిమిటేషన్లో మనకు కూడా న్యాయం జరగాలంటే ఒక్కొక్కరూ 16 మంది పిల్లల్ని కనాలి అని స్టాలిన్ అన్నప్పుడు అదేదో వెటకారంగా అన్న మాటలుగా అనిపించినా ఆయన చాలా సభల్లో మన కష్టం మన సంపద మనకే ఉండాలంటే జనాభాని పెంచాలని పదే పదే చెప్పడం చూస్తుంటే మనం ఎటు వెళుతున్నాం. మరోపక్క చంద్రబాబునాయుడు తన స్వార్థం కోసం జనాభాని పెంచమంటున్నాడు. ఇప్పటికే చైనాను మించిపోయి మొదటిస్థానాన్ని ఆక్రమించుకుంటున్నాం ఇంకా ఎక్కడికి పోవాలి? దీనికి పరిష్కారం ఏంటి?
వినాశనం తప్పదనుకున్నప్పుడు ఎవడో ఉత్తరాదివాడొచ్చి మనని నాశనం చేయడం ఏంటి జనాభా పెంపుతో మనల్ని మనమే నాశనం చేసుకుందాం అనే ధోరణి వస్తే ఈ దేశంలోని ప్రతి రాష్ట్రం బీహార్ అవుతుంది. ఆ రాష్ట్రాల్ని పోషించడానికి అప్పుడూ దక్షిణాది రాష్ట్రాలుండవు. ఫెయిల్ అయిన వారు పాసయ్యేలా చిత్తశుద్ధితో కార్యక్రమాలు చేపట్టకుండా పాస్ అయిన వారిని శిక్షించి ఫెయిల్ అవ్వడమే మంచిదనే భావన కలిగించే బీజేపీ స్వార్థ పాలకులు భారతదేశ చరిత్రహీనులుగా మిగిలిపోక తప్పదు.
వనజ చే
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.