
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో జమిలీ ఎన్నికలు జరపడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. మాజీ రాష్ట్రపతి కోవింద్ గారి నాయకత్వంలో ఒక కమిటీ వేసి, ఆ రిపోర్టు కూడా తెప్పించుకుంది. లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టబడి, సెలక్టు కమిటీ పరిశీలనలో ఉంది. ఈ రూపంలో బిల్లు ఉన్నత న్యాయ స్థానం ముందు నిలబడదని ఇటీవల సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ పేర్కొన్నారు. ఫెడరల్ వ్యవస్థకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగకరంగా నిలిచే ఈ బిల్లును దేశంలోని అనేక రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు వ్యతిరేకిస్తున్నా, దీన్ని ఎలాగైనా ఆమోదింప చేసి, అమలు లోనికి తేవాలని కృత నిశ్చయంతో మోదీ ప్రభుత్వం ఉంది.
మన దేశంలో అసంబ్లీలకు, పార్లమెంటుకు ఒకే సారి ఎన్నికలు జరగాలని రాజ్యాంగంలో లేకపోయినా మొదటి సారి జరిగిన 1952 ఎన్నికలతో మొదలై 1957,1962,1967 వరకు ఎన్నికలు జమిలీగానే జరిగాయి. మన రాజ్యాంగంలో ఐదేళ్ళకు ఒక సారి ఎన్నికలు జరగాలని ఉంది గానీ, ఎన్నికైన ప్రభుత్వం ఐదేళ్లు ఖచ్చితంగా అధికారంలో ఉండాలని ఎక్కడా పేర్కొనలేదు. ఆయా సభల ఆమోదం ఉన్నంత వరకు మాత్రమే ప్రజాస్వామ్యబద్దంగా అధికారంలో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అధికరణకనుగుణంగా రద్దు చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
1967 ఎన్నికలలో ఏడు రాష్ట్రాలలో మొదటిసారి కాంగ్రసేతర ప్రభుత్వాల ఏర్పాటు, కాంగ్రస్ పార్టీలో అంతర్గత విభేదాల మూలంగా 1971 లో పార్లమెంటు ముందస్తు ఎన్నికలు, 1977లో కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు, 1980 దశకం నాటికి అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఏర్పడడం వంటి కారణాలతో దేశమంతా ఒకే పార్టీ అనే రాజకీయ రూపం మారిపోయింది. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, జార్ఘండ్, ఒరిస్సా, జమ్ము కాశ్మీర్, హర్యానా, బెంగాల్, కర్ణాటక, డిల్లీ, గోవా, ఈశాన్య రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే వరుసగా అధికారంలోనికి వస్తూ వచ్చాయి. నేడు మెజారటీ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే ప్రధాన రాజకీయ శక్తిగా ఉన్నాయి.
ఈ నేపద్యంలో జమిలీకై ప్రభుత్వం చేస్తున్న మూడు ప్రధాన వాదనలను పరిశీలించాలి. మొదటిది ఎన్నికల ఖర్చు తగ్గుతుందని. మన దేశంలో ఎన్నికల ఖర్చు రెండు రకాలుగా ఉంటోంది. ఒకటి ప్రభుత్వం పెట్టేది, రెండోది రాజకీయ పార్టీలు గానీ, పోటీ చేసే అభ్యర్ధులు గానీ పెట్టేది. 2024లో జరిగిన ఎన్నికలలో 98 కోట్ల మంది ఓటర్లు, ఖర్చు సుమారు పది వేల కోట్ల రూపాయలని ఎన్నికల కమీషన్ పేర్కొంది. అంటే ఒక్కో ఓటరుకు ఐదేళ్ళకు వంద, సాలుకు ఇరవై రూపాయల ఖర్చు. జమిలీ ఎన్నికల ద్వారా ఏటా ఐదు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని కోవింద్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వార్షిక బడ్జెట్ సుమారు 90 లక్షల కోట్ల రూపాయలు. అంటే ప్రతి ఏటా ఎన్నికలు జరిగినా ఖర్చు మొత్తం బడ్జట్ లో 0.0005 శాతం, అంటే వంద రూపాయలలో ఐదు పైసలు. ఇంత స్వల్ప మొత్తాన్ని ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం ఖర్చు పెట్టలేదనడం సముచితం కాదు. గత సంవత్సరం కార్పొరేట్ల 1.7 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు ఋణాలను మోదీ ప్రభుత్వం మాఫీ చేసింది. దానితో పోలిస్తే ఈ ఖర్చు అసలు లెక్కే కాదు. అయినా ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి ఎన్నికలను డబ్బుతో కొలవడం సహేతుకం కూడా కాదు.
అదే సందర్భంలో 2024 ఎన్నికలలో లక్ష కోట్ల రూపాయలకు పైగా వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఖర్చు పెట్టారని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ నివేదించింది. అంటే ప్రభుత్వ ఖర్చుకు పది రెట్లకు పైగా పార్టీలు ఖర్చు పెట్టాయి. ఒక్కో పార్లమెంటు అభ్యర్ధి కనీసంగా వంద నుండి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. డబ్బలు ఏరులై పారుస్తూ, ఈ ఖర్చు వారి రాజకీయ వ్యాపారానికి పెట్టుబడిగా చూస్తున్నారు. ఎన్నికలలో పోటీ చేయడం ఎంత కష్టంగా మారిందంటే, దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖర్చు భరించలేక తాను పార్లమెంటుకు పోటీ చేయడం లేదని ప్రకటించారు.
ఎన్నికల ఖర్చు ప్రభుత్వానికి నామమాత్రమే గానీ, అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు మాత్రం భారీగానే ఉంటోంది. వాస్తవంగా ఎన్నికల సందర్భంలో పార్టీల ప్రచారం, ఇతరత్రా అనేక మందికి ఉపాధి లభిస్తుంది. లేబర్ డిమాండు అధికంగా ఉంటుంది. ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఇది ఒక రకంగా సంపద పునః పంపిణీ కింద లెక్క. అలాంటప్పుడు ఇలాంటి ఖర్చు పట్ల సామాన్యులకెందుకు బాధ. ఇంకో రకంగా చూస్తే, ఎన్నికల ముందు ప్రభుత్వాలు ధరలను సాధారణంగా పెంచవు. సరికదా ప్రజలకు సంక్షేమ పథకాలు కూడా ప్రకటిస్తాయి. 2024 ఎన్నికల ముందు మోదీ ప్రభుత్వం పెట్రోల్ ధరను, గ్యాస్ బండ ధరను రెండు వందల రూపాయలు తగ్గించింది. అందువల్ల ఎలా చూసినా తరచూ ఎన్నికల వలన ప్రజలకు లాభమే కానీ నష్టమేమీకాదు.
ఇక రెండో వాదన ఎన్నికల నియమావళి ప్రజలకు ఇబ్బంది కలగజేస్తోందనేది. వాస్తవంగా ఈ సమయంలో కూడా సాధారణ ప్రజలకు అసౌకర్యం ఏమీ ఏర్పడదు. వారి రోజువారీ జీవితం యథాతథంగానే సాగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఇబ్బంది అధికార పార్టీలకే. ఎందువల్లనంటే ఎన్నికల ముందు ప్రజలపై భారాలు వేస్తే ఓడిపోతామనే భయంతో ధరలు పెంచడం, సౌకర్యాలను కుదించడం వంటి చర్యలు చేపట్టరు. భారాలకు భిన్నంగా సంక్షేమ చర్యలు సైతం చేబడతారు. ఇటీవల జరిగిన డిల్లీ రాష్ట్ర ఎన్నికలలో బిజెపి అనేక సంక్షేమ పథకాలను ప్రకటించడం చూశాం. మన దేశంలో పేదరికం ఎంతగా పెరిగిందంటే, ప్రజలు నిరంతరం ప్రభుత్వాల నుండి ఎంతోకొంత ఉపశమనం ఆశిస్తూనే ఉంటారు. అలా చేయని పార్టీలను ఓడిస్తూ కూడా ఉంటారు. ప్రజల పట్ల పార్టీలకు ఉన్న భాద్యతలు ఎన్నికల సందర్భంలోనే బాగా ముందుకు వస్తాయి. దీనివల్ల కూడా ప్రజలకు లాభమే కదా! వాస్తవంగా ప్రతి ఏటా దేశంలో ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటేనే ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి.
మూడో వాదన ఎన్నికైన ప్రజాప్రతినిధులు తరచూ ఎన్నికల వలన అభివృద్ధిపై దృష్టి పెట్టలేకపోతున్నారన్నది. వాస్తవంగా ప్రజా ప్రతినిధులు వారు గెలిచిన మరునాటి నుండే వచ్చే ఎన్నికలలో ఎలా గెలవాలన్నదే ఆలోచిస్తూ ఉంటారు. ప్రజలను మంచి చేసుకుంటూ ఉంటారు. అందువల్ల ఎన్నికలు జరుగుతూ ఉంటేనే అభివృద్ధి చర్యలు చేబడతారు అన్నది తెలుస్తోంది.
అలాగే జమిలీ ఎన్నికల ప్రతిపాదనలో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా జతచేశారు. మన దేశంలో ప్రజల ప్రాధాన్యతలు వేర్వేరు స్థాయి ఎన్నికలలో వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు స్థానిక సంస్థల ఎన్నికలలో వీధి లైట్లు, మంచి నీటి సరఫరా, పౌర సేవలు వంటివి ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇక్కడ దేశ సమస్యలు, ఆయా దేశ నాయకుల ఛరిస్మా వంటివి పని చేయవు. అలాగే అసంబ్లీ ఎన్నికలలో కూడా ఆ రాష్ట్రాలలోని శాంతి భద్రతలు, విద్య, వైద్యం, సంక్షేమం వంటి స్థానిక సమస్యలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. పార్లమెంటు ఎన్నికలలో ఒక పార్టీ గెలిచి, వెంటనే జరిగిన అసంబ్లీ ఎన్నికలలో మరో పార్టీ మహారాష్ట్ర, హర్యానా, కర్నాటక, కేరళ, గతంలో డిల్లీ వంటి రాష్ట్రాలలో గెలవడం దీనికి నిదర్శనం.
జమిలీ ఎన్నికలలో కేంద్ర రాజకీయాలు ముందుకు వచ్చి, ఆచరణలో ప్రజల ఈ స్థానిక ఆకాంక్షలను ప్రతిబింబించవు. అందువల్ల జమిలీ ఎన్నికల వలన మొట్టమొదట నష్టపోయేది ప్రాంతీయ పార్టీలే. దీనివల్ల అధికార కేంద్రీకరణ జరిగి ఫెడరలిజానికి విఘాతం కలుగుతుంది. నియంతృత్వానికి దారితీస్తుంది. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం.
వీటికితోడు, దీనికి అవసరమైన రాజ్యాంగ సవరణలుచేసే అంత బలం నేడు మోదీ ప్రభుత్వానికి ఉందా అన్నది ప్రధాన అంశం. రాజ్యాంగ సవరణలు జరగాలంటే పార్లమెంటు ఉభయ సభలలో 2/3 వంతు మంది సభ్యుల ఆమోదం కావాలి. అలాగే సగం రాష్ట్రాలలో సవరణలు అదే రెండొంతుల మెజారిటీతో ఆమోదం పొందాలి. మన లోకసభ 543 సభ్యులలో 362 మంది సభ్యుల ఆమోదం అవసరం. కానీ ఎన్డీయే కూటమి బలం 293. అంటే 69 తక్కువ. అలాగే రాజ్య సభలో 245 సభ్యులో ఎన్డీయే బలం 125 మాత్రమే. రాజ్యాంగ సవరణకు ఇంకా 39 మంది సభ్యలు అవసరం.ఈ మద్దతు ప్రభుత్వం ఎలా సంపాదిస్తుంది అన్నది ప్రశ్న. ప్రాంతీయ పార్టీలను ప్రలోభపెట్టో, లేదా కొన్ని పార్టీలలో చీలికలు తెచ్చో అవసరమైన బలం సాధిస్తే, అంతకంటే రాజ్యాంగ విద్రోహం మరొకటి ఉండదు.
వీటన్నింటికీ మించి అసలు ఒకే సారి ఎన్నికలు జరపగలిగే అంత యంత్రాంగం ఎన్నికల కమిషన్ వద్ద ఉందా అన్నది పెద్ద ప్రశ్న. ఇటీవల వివిధ రాష్ట్రాలకు అనేక దశలలో ఎన్నికలు జరిపినప్పుడు ఒక సమాచారహక్కు ప్రశ్నకు సమాధానమిస్తూ, తమ వద్ద ఒకే సారి ఎన్నికలు జరపగలిగేంత పాలనాపర యంత్రాంగం , సెక్యూరిటీ, లాజిస్టిక్స్ వంటివి లేవని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఒక్క రాష్ట్రంలోనే జరపలేని వారు ఇక దేశమంతా ఒకే సారి ఎలా జరపగలరు?
ఇన్ని అంశాలు, ఆటంకాలు ఉన్నా ఎందుకు మోదీ ప్రభుత్వం దీని అమలుకు అంత ఆరాటపడుతోందీ అంటే, వారనుకున్నంత స్పీడుగా నయా ఉదారవాద ఆర్ధిక విధానాల అమలుకు తరచూ ఎన్నికలు అవరోధంగా నిలుస్తున్నాయి. గత నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేటికీ చేయలేకపోయారు. కార్పొరేట్ అనుకూల విధానాలు వారనుకున్న స్థాయిలో జరగడం లేదు. మతోన్మాదం పేరున ప్రజలను ఎంత రెచ్చగొట్టినా ఎన్నికలలో వారి ఆశించినంత ఫలితాలు రాలేదు. దీనితో ఇప్పుడు మరో కొత్త బాట పట్టారు.
అందువల్ల ఏ రకంగా చూసినా ఈ జమిలీ వెనుక కార్పొరేట్, రాజకీయ ప్రయోజనాలే తప్ప, సామాన్యుల ప్రయోజనాలు ఇసుమంత కూడా కానరావు. ప్రభుత్వం ఇస్తున్న ఒకే దేశం- ఒకే ఎన్నిక వంటి ఆకర్షణీయ నినాదం మాటున ఉన్న అసలు లక్ష్యాలను, ప్రమాదాన్ని ప్రజలు చైతన్యంతో అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది.
– ఎ. అజ శర్మ,
ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.