
బెల్గాం ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన బస్ కండక్టర్ మరాఠీ మాట్లాడలేదని ఓ యువకుడు తన ముగ్గురు మరాఠా మిత్రులను పిలిపించి ఆ కండక్టర్‌ను చితకబాదాడు. దీనికి ప్రతీకారంగా కొందరు కర్ణాటక యువకులు ఘటనతో సంబంధం లేని ఒక మరాఠా బస్సు డ్రైవర్ ముఖానికి నల్లరంగు పులిమారు.
కర్ణాటక బస్ కండక్టర్ మాట్లాడేటప్పుడు మరాఠీ గురించి తప్పుగా మాట్లాడి ఉండవచ్చు, అందుకే దాడి జరిగిందని కాసేపు అనుకుందాం. మరి కర్ణాటక బస్సులో ప్రయాణం చేయని మిగతా ముగ్గురు యువకులకు ఈ సంఘటనతో ఏంటి సంబంధం? మహారాష్ట్ర బస్సు డ్రైవర్ ముఖాన నల్ల రంగు పులిమిన కర్ణాటక యువకులకు ఏంటి సంబంధం? అన్నిటికి మించి దాడికి గురైన మహారాష్ట్ర బస్సు డ్రైవర్ ఏ తప్పు చేసినట్టు? ఎందుకు శిక్షించబడ్డాడు? జరిగిన ఈ అంశాన్ని కేవలం కొందరు యువకుల అతి ప్రవర్తనగా కొట్టిపారేయలేం. ప్రస్తుతం దేశంలో రాజకీయ లబ్ధి కోసం నెలకొల్పబడుతున్న విద్వేష వాతావరణం ఈ ఘటనలకు కారణం కాదని కూడా చెప్పలేం. మనందరికీ భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి మహారాష్ట్ర బస్సు డ్రైవర్‌కు జరిగిన అనుభవం జరుగదని కూడా భావించలేం.
భాష విషయంలో ఒక కండక్టర్‌తో జరిగిన చిన్నపాటి గొడవ ఇరు రాష్ట్రాలు తమ బస్సు సర్వీసులను తమ రాష్ట్ర సరిహద్దుల వరకే పరిమితం చేయాల్సిన దుస్థితికి దారితీసింది. ఇది ఇంతటితో ఆగతుందా? తమిళనాడులో భాషపై జరుగుతున్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. కేంద్ర మంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి మధ్య వాగ్వాదాలు జరగుతున్నాయి. సాంఘిక మాధ్యమాల్లో పరస్పర ఆరోపణలు నెటిజన్ల మధ్య అగ్గిరాజేస్తున్నాయి. ఇరు పక్షాల రాజకీయ నాయకులు దీనికి కావల్సినంత ఆజ్యం పోస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే ‘ఇండియా హేట్ ల్యాబ్’ అనే సంస్థ భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న ద్వేషపు ప్రసంగాలపై ఒక రిపోర్టును విడుదల చేసింది. గత పదేళ్ళ కాలంలో ఎక్కువగా ద్వేషపూరిత ప్రసంగాల ధోరణి పెరిగిందని గణాంకాలతో సహా ప్రచురించింది. మహా కుంభమేళాలో పారిశుద్ధ్యం సరిగా లేదని ప్రస్తావిస్తే దైవ దూషణగా చిత్రీకరించే ఏకపక్ష మీడియా ఇలాంటి గంభీరమైన అంశాలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లడంలో విఫలమవుతోంది. ఇది చాలా విచారకరం.
చిలుకూరి బాలాజి టెంపుల్ ప్రధాన అర్చకుడిపై అదే మతానికి చెందిన మితిమీరిన మితవాద రామరాజ్యం వీర రాఘవరెడ్డి బృందం దాడి చేయడం కూడా ఇలాంటి అస్తిత్వవాదంలోకే వస్తుంది. వెజిటేరియన్ మాత్రమే తీసుకోవాలని కొందరు హుంకరిస్తున్న వేళ మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు ‘నేను బీఫ్ తింటాను, నా ఆహార అలవాట్లపై మాట్లాడే హక్కు మీకు లేదు’ అంటూ సొంత పార్టీ నాయకులపై విరుచుకుపడ్డట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. భాషా దురభిమానాలు, భక్తి దురభిమానాలు, ప్రాంతీయ దురభిమానాలు దేశంలో మరింత పెరిగిపోతాయని ఈ సంఘటనలన్నీ హెచ్చరిస్తున్నాయి. కేవలం మత విద్వేషంతో ప్రజలను ఏకీకృతం చేసి పబ్బం గడుపుకుందామని భావించిన వారికి మొదటిగా ఎదురైన సమస్య ఈ దేశంలో వేళ్లూనుకుని ఉన్న సామాజిక అంతరాలకు కారణమైన ‘కుల వ్యవస్థ దాని పర్యవసానాలు’ మెల్లి మెల్లిగా బయటపడుతుండడం. దీన్ని ఎదుర్కోవడానికి పురాణాలు ఇతిహాసాలలోని అనేక పేర్లను ప్రస్తావిస్తూ వ్యాసుడు, వాల్మీకీ, విదురుడు వంటి వారు ఫలానా ఫలానా కులమని కులాన్ని బట్టి కాదు గుణాన్ని బట్టి వర్ణ విభేదాలు ఉంటాయని నచ్చజెప్ప చూసే ప్రయత్నాలు సాంఘిక మాధ్యమాల్లో ఊపందుకున్నాయి. ఇదే సందర్భంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మేఘాలయలలో చోటుచేసుకుంటున్న ఘటనలు బయటపడుతున్నాయి. ద్వేషం ద్వారా జరిగే ఐక్యత దేశీయులను కాకుండా ద్వేషీయులను మాత్రమే ఏకం చేయగలదు.
మహాత్మా గాంధీ జాతిపిత ఎందుకయ్యాడంటే అస్తిత్వ వాదాన్ని బలపరచ లేదు కాబట్టి. సర్దార్ వల్లభాయి పటేల్ ఉక్కు మనిషి ఎందుకయ్యాడంటే అధికారం కోసం కాకుండా సిద్ధాంతానికి కట్టుబడాడు కాబట్టి. జవాహర్లాల్ నెహ్రూ దార్శనికుడు ఎందుకయ్యాడంటే రాజకీయాలకతీతంగా ప్రపంచ ఒత్తిళ్లకు తలొగ్గకుండా బహుళార్థ సాధక ప్రాజెక్ట్‌లకు కంకణబద్ధుడైనందువల్ల.
భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత 550కిపైగా సంస్థానాలు, మొగలు సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యంతో పాటు మరాఠా, పండిట్ల రాజ్యాలు భారత్‌లో విలీనమైయ్యాయి. స్వాతంత్రానికి ముందు అనేక రాజ్యాలలో ప్రజలు నానా బాధలు పడ్డారు. బానిస బతుకులను అనుభవించారు. నిర్ధాక్షిణ్యంగా దోపిడీకి గురయ్యారు. అంటరానితనం- అస్పృశ్యత రాజ్యమేలింది. ఆడదంటే ఒక ఆట వస్తువు అనే విషసంస్కృతి పశువులా చెలరేగింది. ఇలాంటి అనేక ఈతిబాధలను భరిస్తూనే ఇప్పుడున్న జనాభాలో కేవలం ఐదో వంతు ఉన్న నాటి ప్రజానీకం ఏ మాత్రం కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా లేని స్థితిలో గాంధీ నెహ్రూలకు స్వాతంత్య్ర సంగ్రామంలో ఎక్కడలేని తోడ్పాటునందించారు.
స్వాతంత్య్రం తర్వాత ఇలాంటి అమానుషమైన పరిస్థితులను ఆపడానికి జరిగిన పెద్ద కృషి ఏమీ లేదు. అయినప్పటికీ భారతీయులంతా ఒక్కటే అనే బాధ్యతోద్వేగం ప్రతి ఒక్కరిలోనూ పెరిగింది, కలిసి మెలిసి కొనసాగింపు ప్రారంభించారు. అందుకేనేమో 1947 నుండి భారత్ అర శతాబ్దానికి పైగానే ఏ రకమైన అస్తిత్వ పోరాటాలకు ఎవరూ ఆజ్యం పోయలేదు. మరి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇతిహాసాలను, చారిత్రక ఇతివృత్తాలను, తమదైన కోణంలో ప్రస్తుతించి, అభాండాలు- అకృత్యాలు ఎవరెవరికో అంటగట్టి విద్వేషాలు నూరిపోస్తున్నారు. స్వాతంత్య్ర సంగ్రామంతో ఏమాత్రం సంబంధం లేని సమూహాలు తమ రాజకీయ లబ్ధి కోసం మతపరమైన ఏకీకరణకు పదును పెట్టి దేశ ప్రజల్లో ఒకరంటే మరొకరికి ద్వేషం కలిగేలా సఫలీకృతులవుతున్నారు.
కొన్ని రోజుల క్రితం, పాత హిందీ సినిమా ‘అమర్ అక్బర్ అంటోనీ’ పోస్టర్‌ను ఉటంకిస్తూ తెలుగు కవి సిద్ధార్థ సుభాష్‌చంద్రబోస్ తన ఫేస్బుక్ వాల్‌పై ఇలా రాశారు. ‘సరిగ్గా 25, 30 ఏళ్ల క్రితం ఇరు మతాల పట్ల ప్రజలకున్న పరస్పర గౌరవాలు, వివిధ మతాలవారి పండుగల సందర్భంగా ఒకరికొకరు సహకరించుకునే తీరు ఒకరికి జబ్బు చేస్తే మరొకరు తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించి విభూతి పులిమినా, నెమలి పించాన్ని తలపై నిమిరినా, ఛాతి నుంచి నోసటిదాక చేతులాడిస్తూ ప్రార్థన చేసినా అందరూ అంగీకరించే వారు. దైవత్వం ఏదో ఒక రూపంలో తమకి నష్టం జరగకుండా చూస్తే చాలు అనుకునేవారు. ఇప్పుడా పరిస్థితులు లేవు.’ అని ప్రస్తావిస్తారు.
మరి ఇప్పుడు దేశంలో ఎలాంటి పరిస్థితులున్నాయి? ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరుగుతున్న పరిణామాలు భయపెడుతున్నాయి. సాధారణంగా డ్రైవర్లలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. ప్రయాణికులను తిరుమలకు తీసుకువెళ్ళే కార్లపై ఉర్దూలో రాసి ఉంటే వెంటనే ఆ స్టిక్కర్లను చింపివేయడమో లేదా అద్దాలను పగలగొట్టే సంఘటనలు జరుగుతున్నాయని వింటున్నాము. ఇది ఏ రకమైన ఉద్ధరణ? వెర్రితలలు వేస్తున్న ఇలాంటి చౌకబారు ఘటనల, కొందరి సంకుచిత ఆలోచనల అస్థిత్వవాదపు ఉగ్రరూపాన్ని అడ్డుకోకపోతే మహారాష్ట్ర బస్ డ్రైవర్‌కు జరిగిన అన్యాయం అందరికీ తప్పదేమో..!
– జీ తిరుపతయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.