
వర్తమానంలో బాగా వినిపిస్తున్న పేరు క్రిప్టో కరెన్సీ. దీని సంపాదన కోసం అనుసరిస్తున్న మార్గం కృత్రిమ నాణేలు(బిట్‌కాయిన్) ట్రేడింగ్. ప్రపంచవ్యాప్తంగా నల్లధనంపై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఉధృతమవుతున్న నేపథ్యంలో బిట్‌కాయిన్ తయారీ ఊపందుకుంది. కొన్ని వేలకోట్ల రూపాయల విలువైన కాయిన్లు వివిధ అనధికారిక ఆన్లైన్ ట్రేడింగ్ ఫ్లాట్‌ఫాంల ద్వారా అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు రెండు సంవత్సరాల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక విధానాన్ని రూపొందిస్తానని కూడా ప్రకటించింది. ఆ మధ్య కల్కి సినిమా దర్శకుడు నాగా అశ్విన్ చలనచిత్ర ప్రముఖుడు అమితాబ్ బచ్చన్‌తో చేసిన ఇంటర్వ్యూలో ఇటువంటి అనధికారిక ట్రేడిరగ్ ఫ్లాట్‌ఫాంకు సంబంధించిన చర్చ కూడా జరిగింది.
మరోవైపున ప్రపంచ బిట్‌కాయిన్ మార్కెట్‌ను శాసిస్తున్న ఎలన్‌మస్క్ అమెరికా ప్రభుత్వ నిర్వహణలో కీలక పాత్రధారి కావటంతో బిట్‌కాయిన్ లావాదేవీలపై బైడన్ ప్రభుత్వం విధించిన నియంత్రణలు రద్దు చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరింత క్రియాశీలకంగా మారుతోన్న బిట్‌కాయిన్ మైనర్లకు(కృత్రిమ నాణేలు రూపొందించడానికి సంబంధించిన సాఫ్ట్వేర్ తయారీదారులు) ఉత్తరకొరియాకు చెందిన హ్యాకర్లు పెద్ద షాక్ ఇచ్చారు.
ఆన్లైన్లో తయారయ్యే ఈ కృత్రిమ నాణేలన్నిటిని భద్రపరిచేందుకు సాధారణ బ్యాంకులలో లాకర్లమాదిరిగా ఇంటర్నెట్లో కొన్ని వెబ్సైట్లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫాంలు వాల్ట్లను ఏర్పాటు చేస్తాయి. ఆ వాల్ట్లను చేరుకోవటానికి రకరకాల పాస్వర్డ్లు, డిజిటల్ కోడింగ్‌లాంటి అత్యంత సంక్లిష్టమైన రక్షణా వలయాలను ఏర్పాటు చేస్తారు. వీటిని ఛేదించి ఆ వాల్ట్‌లలో భద్రంగా ఉన్న బిట్కాయిన్లను తస్కరించేందుకు చేయితిరిగిన హ్యాకర్లు ప్రపంచమంతా పనిచేస్తున్నారు. తాజాగా వచ్చిన వార్తల ప్రకారం 2024 సంవత్సరంలో రెండువేల కోట్ల బిట్కాయిన్లను ఉత్తరకొరియాకు చెందిన హ్యాంకర్లు చాకచక్యంగా తస్కరించారన్న వార్తలు క్రిప్టో మార్కెట్‌ను బెంబేలెత్తించాయి.
అయితే, ఒకే హ్యాంకింగ్లో దాదాపు 1500 కోట్ల డాలర్లు చోరికి గురైనట్లు క్రిప్టో కరెన్సీ ఎక్సెంజ్ బైబిట్ను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ సొమ్మును కోల్డ్ వ్యాలెట్(ట్రేడింగ్‌లో లేని బిట్కాయిన్లను దాచే డిజిటల్ వాల్ట్‌ను కోల్డ్ వ్యాలెట్ అంటారు). అటువంటి కోల్డ్ వ్యాలెట్ నుంచి 1500 కోట్ల విలువైన బిట్కాయిన్లు చోరికి గురైయ్యాయని బైబిట్ సీఈవో బెన్ఝౌ తెలిపారు. గత సంవత్సరం జరిగిన చోరికంటే ఇది రెట్టింపని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చోరికి కారణం ఉత్తరకొరియాకు చెందిన హ్యాకర్లేనని అమెరికా నిఘాసంస్థ ఎఫ్‌బీఐ ఓ బహిరంగ ప్రకటనలో తెలిపింది. ఉత్తరకొరియా రూపొందించిన ట్రేడర్ ట్రైటర్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసిన సాఫ్ట్‌వేర్‌తో ఈ చోరీ జరిగిందని ఎఫ్‌బీఐ ధృవీకరించింది. ఈ విధంగా చోరీ చేసిన నాణేలను వేరువేరు ఫ్లాట్‌ఫాంల ద్వారా వేలాది అడ్రస్‌ల ద్వారా రూపురేఖలు మార్చి పంపిణీ చేసినట్టు ఎఫ్‌బీఐ ఓ అంచనాకు వచ్చింది.
ఇంగ్లాండ్ నుంచి వెలువడే ద ఇండిపెండెంట్ పత్రిక కథనం ప్రకారం ఉత్తర కొరియా 2017లో వన్నాక్రై సాఫ్ట్‌వేర్‌తో 150 దేశాలలోని 2 లక్షల కంప్యూటర్లపై దాడి చేసింది, ఈ దాడి బాధితులలో ఇంగ్లాండుకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ కూడా ఉంది. ఎలిప్ట్టిక్ ట్రేడింగ్ ఫ్లాట్‌ఫాం తన బ్లాగ్‌లో ఉత్తరకొరియాకు చెందిన లాజరస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రిప్టో వ్యాపారంపై పెద్ద ఎత్తున్న పరిశోధనలు సాగిస్తుంది. దీంతో బిట్‌కాయిన్ మైనర్లు క్రిప్టో కరెన్సీ వ్యాపారులు తమ లావాదేవీలు నిర్వహించడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్లు, కాయిన్లను దాచుకోవడానికి ఉపయోగించే వాల్ట్లను జాగ్రత్తగా పరిశీలించి బలహీనమైన రక్షణ వలయాలున్న వాల్ట్లపై దాడి చేసి అందులోని సొమ్మును స్వాహా చేస్తున్నట్టుగా పేర్కొంది.
– ద వైర్ తెలుగు స్టాఫ్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.