
మార్క్స్ ఓ సాంస్కృతిక రచయిత అన్న కోణంలో పరిశోధన సాగించిన స్టాన్లీ ఎడ్గర్ హైమన్ కమ్యూనిస్టు ప్రణాళిక ఓ అసామాన్యమైన వాక్చాతుర్యం అని వ్యాఖ్యానిస్తారు. అయితే కేవలం కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడిన 130 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ గ్రంధాన్ని పాఠకులు చదువుతున్నారంటే అది కేవలం దానిలో ఉన్న వాక్చాతుర్యం కోసం మాత్రమే కాదు. దానిలో ఉన్న సారాంశం కోసం చదువుతున్నారు. కమ్యూనిస్టు ప్రణాళిక ప్రతిపాదించిన చారిత్రక భౌతికవాద దృక్ఫధం, మానవ చరిత్ర పురోగమనంలో పెట్టుబడిదారీ వ్యవస్థ బడా వ్యాపారులు, సంపద కేంద్రీకరణ, పదే పదే పునరావవృతమవుతున్న సంక్షోభాలుతో కూడిన ఓ దశ మాత్రమేననీ, ఈ పెట్టుబడిదారీ సంక్షోభమే నూతన ప్రపంచ నిర్మాణానికి తలుపులు తెరుస్తుందన్న విశ్లేషణ కోసం చదువుతున్నారు. కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్ ఏంగెల్స్‌లు చేసిన ఈ విశ్లేషణే నేటికీ ఈ గ్రంధం పట్ల ప్రపంచ వ్యాప్తమైన ఆసక్తికి కారణం. ‘‘ కమ్యూనిస్టు ప్రణాళిక గ్రంధం లాగా భవిష్యత్తు పరీక్షలకు నెగ్గిన గ్రంధాలు బహు అరుదు’’ అని బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు హెరాల్డ్ జె లాస్కీ వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు ప్రణాళికలోని చారిత్రక భౌతికవాద పద్ధతిని పాటించటం ద్వారా గత 130 ఏళ్ల ప్రపంచ పరిణామాణాలను విశ్లేషించి అర్థం చేసుకోవచ్చని మార్క్సిస్టులు అంటున్నారు.
కమ్యూనిస్టు ప్రణాళిక ఇచ్చే సందేశం కోసమే ఈ గ్రంధాన్ని నేటికీ చదువుతున్నా ఈ ప్రణాళిక రచనలో మార్క్స్ ఏంగెల్స్ ప్రయోగించిన శైలి కూడా ఈ గ్రంధం పట్ల తొలితరం పాఠకులను ఆకర్షించిన అంశాల్లో ఒకటని చెప్పటానికి సందేహించనవసరం లేదు. కమ్యూనిస్టు ప్రణాళిక రచనా శైలి గురించి ఇప్పటి వరకూ వెలుగు చూడని కోణాలను పాఠకుల ముందుంచే ప్రయత్నమే ఇది.
ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు డిక్‌ష్ణరీ ప్రకారం ప్రణాళిక (మానిఫెస్టో) అంటే ‘‘ఒక రాజ్యం కానీ, రాజు గానీ, కొందరు వ్యక్తుల సమూహం కానీ లేదా ఒక వ్యక్తి కానీ ప్రజాహితం లేదా ప్రజల కోసం చేసే ప్రకటన’’. ఈ నిర్వచనాన్ని గమనించినప్పుడు కమ్యూనిస్టు ప్రణాళిక కూడా డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ప్రకటనను (అమెరికా స్వాతంత్య్ర ప్రకటన) పోలి ఉంటుంది. ‘మానవాళి కలిగి ఉన్న అభిప్రాయాలను గౌరవిస్తూ’ యావత్ ప్రపంచాన్నీ ఉద్దేశించి చేసిన ప్రకటన డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అయితే కమ్యూనిస్టు ప్రణాళిక ‘‘ ప్రపంచం ముందు కమ్యూనిస్టులు తమ అభిప్రాయాలను బాహాటంగా వెల్లడిచేయటానికి ఇది తగిన సమయం’’ అని చెప్తోంది.
అయితే ఈ రెండు ప్రకటనల శైలిలో ఉన్న వ్యత్యాసాలు ఆయా రచయిత సైద్ధాంతిక సామర్ధ్యం, లోతులు, ప్రాపంచిక దృక్ఫధాల మధ్య ఉన్న వ్యత్యాసాల్లోని తేడాలతో ముడిపడి ఉన్నాయి. డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ విప్లవ నినాదం కాదు. లోకజ్ఞానం (కామన్ సెన్స్) అన్న తన గ్రంధంలో థామస్ పైన్ విప్లవనినాదమిచ్చారు. వాద ప్రతివాదనలు కూడా కాదు. ఎందుకంటే డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ కొన్ని పూర్వమే స్థిరపడిన, స్థిరపర్చబడిన సత్యాలతో మొదలవుతుంది. కాలం నిరూపించిన సత్యాల గురించి వాదోపవాదనలు అక్కర్లేదు. యూరప్‌లోని ఛాన్సలరీస్లో (ఆస్థానాలు, దర్బారుల్లో) ఈ ప్రకటనను చదివి వినిపిస్తారని, తద్వారా తమ స్వాతంత్య్ర సాధన ప్రయత్నాలకు కొద్దిపాటి మద్దతు అయినా దక్కుతుందని ఆశతో చేసిన ప్రకటన అది. తర్వాతి కాలంలో ఈ ప్రకటనను, అందులోని భాషను, పద ప్రయోగాలను ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్లో తీవ్రమైన అభ్యంతరకరమైన పదాలు జెఫర్సన్ మాంటిసెల్లోలో నిలువెత్తున ఉన్న స్థంభాల్లాగా అలానే నిలిచిపోయాయి.
కమ్యూనిస్టు ప్రణాళిక దీనికి భిన్నమైనది. యూరోపియన్ పాలకవర్గం చేస్తున్న దాడులను తిప్పికొడుతూ ప్రపంచ కార్మిక వర్గాన్ని కార్యోన్ముఖులను చేసేందుకు ఇచ్చిన పిలుపే కమ్యూనిస్టు ప్రణాళిక. కమ్యూనిస్టు ప్రణాళికలో చరిత్ర ఉంది. వాద ప్రతివాదాలు ఉన్నాయి. పెట్టుబడిదారీ విధానపు ప్రయాణం గురించిన రేఖాచిత్రమూ ఉంది. అందుకే కమ్యూనిస్టు ప్రణాళికలోని వాక్యాలు నిక్కచ్చిగానూ, వైవిధ్యంతోనూ, స్పష్టతతోనూ, సజీవంగానూ, అనేక ఉపమానాలతో కూడుకుని ఉంది. రెండిరటిలోనూ ఉన్న ప్రకటన, భాష, భావం రీత్యా చూసుకున్నప్పుడు కమ్యూనిస్టు ప్రణాళిక సాంప్రదాయ శైలిలో ఉంటే డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ప్రకటన నియో క్లాసికల్ శైలిలో ఉంది. బూర్జువాలతో పోరాడుతున్న కార్మికులతో చేతులు కలపటానికి కులీనస్వామ్యం ప్రయత్నం చేసినప్పుడల్లా ఆయా పోరాటాల సందర్భంగా చర్చలకో వ్యూహరచనకో కులీనుల ఇళ్లను సందర్శించిన కార్మికులు ఆయా ఇళ్లల్లో వేళ్లాడుతున్న జమీందారీ చిహ్నాలు, ఆయుధాలు చూసినప్పుడు ‘‘ గౌరవాన్ని గుండెల మీద పెట్టుకుని ఆయుధాలు భుజాలకు తగిలించుకున్న’’ అనే హైన్ వాక్యాలు గుర్తొస్తాయి. ఎందుకంటే భూస్వామ్య రాచరికవర్గం తమ ఆధిపత్యాన్ని నిలిపి ఉంచటానికి దోహదం చేసిన ఈ చిహ్నాలకు ఎంతగానో రుణపడి ఉంది. మార్క్స్ ఏంగెల్స్‌లు కార్మికులను బూర్జువా వర్గానికి సమాధులు తవ్వే వారని సంబోధించినప్పుడు ఆ భాష మట్టి వాసనలతో కూడుకుని ఉంది.
కమ్యూనిస్టు ప్రణాళిక ఎన్నో సందర్భాల్లో ఉపమానాల ప్రస్తావన ఉన్నా కొన్ని ఉపమానాలు మాత్రం పదేపదే పునరావృతమయ్యాయి. పదే పదే పునరావృతమైన అంశాల్లో ఒకటి పెట్టుబడిదారీ వ్యవస్థలోని అంతర్గత వైరుధ్యాల గురించిన అంశం. పెట్టుబడిదారీ వ్యవస్థ తన ప్రయోజనాల కోసం నిరంతరం ఉత్పత్తి శక్తుల సామర్ధ్యాన్ని పెంచుకుంటూ పోతుంది. దాంతో ఆస్తి సంబంధాలు తీవ్రమైన పరస్పర వైరుధ్యంలోకి ప్రవేశిస్తాయి. మధ్యయుగాల్లో చిన్న చిన్న కార్ఖానా దశలో జరిగే ఉత్పత్తి సంబంధాలకూ భూస్వామ్య సమాజపు ఆస్తి సంబంధాలకు మధ్య వైరుధ్యం నెలకొన్నట్టుగానే పెట్టుబడిదారీ వ్యవస్థలోని ఉత్పత్తి శక్తులు అభివృద్ధికి, ఆస్తి సంబంధాల్లో ఉన్న స్థితిస్థాపకత (యధాతథ స్థితి) తీవ్రమైన వైరుధ్యం నెలకొంటుంది. భూస్వామ్య వ్యవస్థలో ఉత్పత్తి సంబంధాలను స్వేఛ్చా వాణిజ్యంతో బూర్జువా ఉత్పత్తి సంబంధాలు ఆక్రమించాయి. ఈ వాక్యాలు చదివినప్పుడు సమీకృతాభివృద్ధి పర్యవసానంగా ఎదిగే ఉత్పత్తి శక్తుల ఎదుగుదలకు ఓ దశలో అదే వ్యవస్థలోని ఆస్తి సంబంధాలు ఆటంకంగా మారుతున్న దృశ్యం, ఉత్పత్తి శక్తులు ఈ సంకెళ్లను ఛేధించుకుని నూతన సమాజం దిశగా పురోగమిస్తున్న దృశ్యం కళ్లముందు కనిపిస్తుంది. అభివృద్ధి ఎక్కడా ఆగిపోలేదు. భూస్వామ్య సమాజంలోని ఆస్తి సంబంధాలు పెరుగుతున్న ఉత్పత్తి శక్తుల శక్తి సామర్ధ్యాల ముందు మోకరిల్లాలి. మోకరిల్లాయి. అదేవిధంగా బూర్జువా సమాజంలోని ఉత్పత్తి సంబంధాలు, ఆస్తి సంబంధాలు కూడా ఆ సమాజంలోని ఉత్పత్తి శక్తులు సృష్టించే సంపదను ఇముడ్చుకోలేవు. ఉత్పత్తి శక్తులు, వాణిజ్యాల ఎదుగుదలను పాతకాలపు ఆస్తి నమూనాల చట్రంలో ఇమిడ్చి కుదింపచేయటం అన్ని వేళలా సాధ్యం కాదు. ఈ వైరుధ్యం ఎప్పుడో ఒకప్పుడు బద్దలు కావల్సిందే అన్న అర్థంలో వాక్యాలు చదివినప్పుడు సమాజ మార్పు, పురోగమనం, నూతన వ్యవస్థ దిశగా ప్రయాణం లీలగానైనా గోచరిస్తుంది (పే.116).
ఈ రచనలో మనకు పదేపదే కనిపించే మరో అంశం బూర్జువా వ్యవస్థను నగ్నంగా చిత్రీకరించడం. ‘‘మతం మాటున దాక్కున్న బూర్జువా దోపిడీ ఆచరణలో ప్రజలను ప్రత్యక్షంగా, నిస్సిగ్గుగా, నగ్నంగా దోపిడీ చేస్తుంది. తన దోపిడీని చలామణీ చేసుకోవడానికి మతం, రాజకీయ రంగాల్లో అనేక భ్రాంతులను కలుగచేస్తుంది బూర్జువా వ్యవస్థ. (92)’’. భూస్వామ్య వ్యవస్థ నిర్మించిన అన్ని రకాల పితృస్వామిక, భూస్వామ్య, స్థబ్దతతో కూడిన సంబంధాలను బద్దలు కొట్టేంత వరకూ పెట్టుబడిదారీ వ్యవస్థ విప్లవాత్మక పాత్ర పోషించింది. ఈ క్రమంలో పెట్టుబడిదారీ వ్యవస్థ మనిషికి తన నిజమైన స్థితిని, సంబంధాలను, సామాజిక వాస్తవాన్ని పరిచయం చేస్తుంది. మతం మత్తులో విహరిస్తున్న మనిషిని భూమ్మీద నిలబెడుతుంది. అన్ని రంగాల్లోనూ ఇది వాస్తవికంగా జరుగుతున్న పరిణామమే. ‘‘సాటి మనిషిని తమపై పెత్తనం చేసే పెత్తందారులతో బంధించిన అన్ని రకాల మార్మిక సంబంధాలను బద్దలు కొట్టి మనిషికి మనిషికీ మధ్య కేవలం నగ్నమైన నగదు సంబంధం, స్వార్థం తప్ప మరేమీ మిగలని, మిగల్చని వ్యవస్థను బూర్జువా సమాజం ముందుకు తెస్తుంది(91-92). అప్పటి వరకూ నోరెళ్లబెట్టుకుని ఆశ్చర్యంతో చూసే వృత్తులు, హోదాల్లోని డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. కుటుంబ సంబంధాల్లోని భావోద్వేగాలను తొలగించి కుటుంబ సంబంధాలు కేవలం ఆర్థిక సంబంధాలేనని బూర్జువా వ్యవస్థ రుజువు చేసింది (91-92). పెట్టుబడి శక్తి ముందు లొంగిపోయిన కార్మిక శక్తి లేశమాత్రమైనా జాతీయతను నిలుపుకోలేని దుస్థితికి చేరుకుంటుంది.
కార్మికవర్గం విషయంలో కమ్యూనిస్టు మానిఫెస్టో రెండు రకాలైన ఉపమానాలను పదేపదే ఉపయోగించింది. కార్మికవర్గం సమాజంలో అట్టగుడు వర్గం, పునాది వర్గం అన్నది మొదటి ఉపమానం. మధ్యతరగతిలోని దిగువ శ్రేణి, దుకాణదారులు, వృత్తిదార్లు క్రమేణా కార్మికవర్గంలో చేరిపోతారు.(పేజీ 96). పెటీ బూర్జువా వర్గం తన స్థానాన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నా బూర్జువా వర్గం సృష్టించే పోటీ వాతావరణంలో ఈ వర్గానికి చెందిన సభ్యులు మాత్రం పదేపదే వర్గాంతరం చెంది కార్మికవర్గంలో చేరిపోతూ ఉంటారు (115). ఈ విశ్లేషణ అంతా వెరసి కార్మికవర్గం మొత్తం బూర్జువా వ్యవస్థపై తిరుగుబాటు చేస్తుంది. ‘‘ప్రస్తుత సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న కార్మికవర్గం మిగిలిన సమాజంలో ఉన్న మిగిలిన వర్గాలు దోపిడీకి వ్యతిరేకంగా సాగే ప్రయత్నంలో దిగబడకుండా ఈ దోపిడీకి వ్యతిరేకంగా తిరగబడే స్థితిలో ఉండదు. (101). అనివార్య స్థితిలో పరిశ్రమలను విస్తరిస్తున్న బూర్జువా వర్గం అదేరకమైన అనివార్య స్థితిలో విశాల కార్మికవర్గాన్ని విప్లవ సమీకరణలో భాగస్వాములను చేస్తుంది. తద్వారా బూర్జువా వ్యవస్థ మౌలిక పునాదినే ఛేదిస్తంది. ఈ బలమైన పునాది తొలగిపోయిన పక్షంలో బూర్జువావర్గం తన ఉన్నత స్థానం నుండి ఎకా ఎకిన చారిత్రక నేపథ్యం సృష్టించిన సమాధిలోకి చేరుతుంది. ‘‘బూర్జువా వర్గం పతనం, కార్మికవర్గం విజయం చారిత్రక అనివార్యతలు’’(102).
కార్మికవర్గాన్ని మార్క్స్ సైన్యంతో పోలుస్తారు. ‘‘గుంపులుగా ఉన్న కార్మికులు క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా ఫ్యాక్టరీల్లో జమకూడతారు. పారిశ్రామిక సైన్యంలా ఈ కార్మికులు దొంతర్లతో కూడిన అధికార వ్యవస్థ కనుసన్నల్లో పని చేస్తూ ఉంటారు.(96). పరిశ్రమల్లో కార్మికులను సైన్యంలా మల్చి పని చేయించుకుంటున్న పారిశ్రామిక వర్గం భవిష్యత్తులో తనకు సమాధులు తవ్వే శతృవులను తయారు చేసుకుంటుంది. తద్వారా ఆధునిక సమాజం రెండు వైరి శిబిరాలుగా చీలిపోయి ఉంటుంది. బూర్జువా వర్గం, కార్మికవర్గం అన్న వైరి శిబిరాలుగా విడిపోతుంది. ఈ రెండు వర్గాల మధ్య జరిగే పోరాటం దాదాపుగా అంతర్యుద్ధంలా ఉంటుంది. కాలక్రమంలో ఈ అంతర్యుద్ధం పూర్తి స్థాయి విప్లవంగా బద్దలవుతుంది. విశాల కార్మికవర్గాన్ని సమీకరించటంలోనే కమ్యూనిస్టుల విజయం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ విషయమేమిటంటే భూస్వామ్య కులీన వర్గాలకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో బూర్జువా వర్గం శాశ్వత శతృ వర్గాన్ని తయారు చేసుకుంటుంది. అటువంటి శతృవర్గాన్ని కార్మికవర్గం రూపంలో సాయుధులను చేస్తుంది.
యుద్ధ చిత్రణకు సంబంధించిన వివరణ కూడా మనకు కమ్యూనిస్టు ప్రణాళికలో కనిపిస్తుంది. పెట్టుబడిదారీ వర్గం నిరంతరం యుద్ధంలో మునిగి తెలుతుందనీ, తొలుత భూస్వామ్యపు కులీన వర్గంపై యుద్ధం చేస్తుందనీ, తర్వాత పారిశ్రామిక పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భావానికి అవరోధంగా ఉన్న తోటి వర్గ మిత్రులపై యుద్ధం చేస్తుందనీ, తర్వాత విదేశీ పెట్టుబడిదారీ వర్గంతో యుద్ధం చేస్తుందని మార్క్స్ ఏంగెల్స్‌లు ప్రణాళికలో ప్రస్తావిస్తారు. అంతేకాదు. పెట్టుబడిదారీ పూర్వపు ఉత్పత్తి సంబంధాలు కొనసాగుతున్న దేశాలతో పెట్టుబడిదారీ దేశాలు శాశ్వతమైన యుద్ధాన్ని ప్రకటిస్తాయని కూడా వివరిస్తారు. విదేశీ మార్కెట్ల వెతుకులాటలో ‘‘కారుచౌకగా తయారయ్యే సరుకులే చైనా గోడలను సైతం తునాతునకలు చేయగలిగిన మందుగుండు సామాగ్రి.ఈ సరుకులే విదేశీయులను ఈసడిరచుకునే ఆదిమ తెగలను సైతం లొంగదీసుకుంటాయి. నాగరికత అని చెప్పబడే ధోరణులను ఆయా సమాజల నడిబొడ్డుకు తీసుకెళ్తాయి.’’ ఇక్కడ మార్క్స్ ఏంగెల్స్‌లు బ్రిటిష్ సామ్రాజ్యం తమ వ్యాపారస్తులకు నల్లమందు అమ్ముకునేందుకు అవకాశాలు కల్పించాలని ఒత్తిడి తెస్తూ చైనాతో సాగించిన యుద్దాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ యుద్ధాల అనంతరం నల్లమందు మోసుకెళ్లే బ్రిటిష్ ఓడలు చైనా రేవు పట్టణాల్లో లంగరు వేయటం చైనా సమాజాన్ని నల్లమందు మార్కెట్‌గా మార్చుకోవటం చారిత్రక సత్యాలే. పాశ్చ్యాత్య దేశాల పెట్టుడిదారీ వ్యవస్థ మొత్తం ప్రపంచంపై మార్కెట్ల కోసం సాగించే యుద్ధానికి శాంతియుత స్వేఛ్చా వాణిజ్యమని పేరు పెట్టిందని ఎగతాళి చేస్తారు మార్క్స్.
ఇక్కడ వైరుధ్యం నాటకీయమైనదైతే వర్గపోరాటం కమ్యూనిస్టు ప్రణాళికకు ప్రజాతంత్ర స్వభావాన్ని సమకూరుస్తుంది. ప్రత్యేకించి కమ్యూనిజం గురించి కమ్యూనిస్టుల గురించి ప్రత్యర్ధులు చేసే విమర్శలకు సమాధానాలు వివరణలు ఇచ్చే కమ్యూనిస్టు ప్రణాళిక రెండో భాగంలో ఈ ధోరణి కనిపిస్తుంది. ఈ భాగం ప్రధానంగా బూర్జువా వర్గ ప్రతినిధులతో జరిపిన సంవాదంలా కనిపిస్తుంది. ఈ భాగం చదువుతున్నపుడు పాఠకుడికి ఓ బహిరంగ సభలో ఉపన్యసిస్తున్న వక్తను గేలి చేస్తూ ఉక్రోషంగా విమర్శించే ఓ బృందం తారసపడితే వారికి సమాధానమివ్వటానికి ఉపన్యాసకుడు ప్రయత్నం చేసే దృశ్యం కళ్లముందు కనిపిస్తుంది. ఈ వక్తకున్న విషయ పరిజ్ఞానం, లోకజ్ఞానం, వెటకారం, ఆత్మవిశ్వాసంతో సభను ఆటంకపర్చటానికి వచ్చిన ముష్కరులపై విజయం సాధిస్తారు.
వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయాలన్న నినాదం వినపడగానే మీరు గంగవెర్రులెత్తుతారు. నిజానికి ఇప్పుడున్న సమాజంలో పదింట తొమ్మిదివంతుల మంది చేతుల్లో వ్యక్తిగత ఆస్తి అనేదే లేదు. … కానీ బూర్జువా ఆస్తులను రద్దు చేయటం గురించి మేము మాట్లాడుతున్నప్పుడు మీరు అర్ధం లేని అభ్యంతరాలు లేవనెత్తటం మానేయండి. బూర్జువా అర్థంలో స్వేఛ్చ, సంస్కృతి, చట్టం, న్యాయం అన్న సూత్రాలు వల్లె వేయకండి. స్వార్ధపూరితమైన తప్పుడు అవగాహనతోనే మీరు మొత్తం ప్రకృతి సూత్రాలను, హేతుబద్దతను, సామాజిక రూపాలను అదుపు చేయాలనుకుంటారు. ఇవన్నీ ప్రస్తుత ఉత్పత్తి విధానం నుండి పుట్టుకొచ్చాయే తప్ప శాశ్వతమైనవి కాదు. మీకు ముందున్న పాలకవర్గాలు కూడా ఇవే అభిప్రాయాలను కలిగి ఉన్నాయి.
పై వివరణలో ‘మీరు గంగవెర్రులెత్తుతున్నారు’ ‘మాతో పెట్టుకోవద్దు’ వంటి పదాలు సంవాద ధోరణిని సూచిస్తున్నాయి. ఓ దశలో ఉపన్యాసకుడు సభకు అంతరాయం కలిగించటానికి వచ్చిన వాళ్లకున్న పొరపాటు అవగాహనలు, గందరగోళాన్ని సభికుల దృష్టికి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నంలాగా కూడా కనిపిస్తుంది.
‘‘మీ కమ్యూనిస్టులు భార్యలను కూడా జాతీయం చేస్తారంటూ బూర్జువా వర్గం గగ్గోలు పెడుతుంది. బూర్జువావర్గం తమ సొంత భార్యలను కూడా ఉత్పత్తి సాధనంగానే చూస్తోంది. ఉత్పత్తి సాధనాలను జాతీయం చేయాలన్న నినాదం వినపడగానే బూర్జువా వర్గం దృష్టిలో భార్య కూడా ఉత్పత్తి సాధనమే కాబట్టి సహజంగానే జాతీయం చేయాలన్న ప్రతిపాదాన్ని మహిళలకు కూడా వర్తింప చేస్తూ మాట్లాడతారు. ఇక్కడ మహిళలను కేవలం ఉత్పత్తిసాధనాలు గా చూసే దృష్టి నుండి బయటపడటం, మహిళలను విముక్తి చేయటం అన్న ధ్యాసకూడా రాని వాళ్లు ఈ బూర్జువా వర్గం.’’
విమర్శనాత్మక వెటకారం మరో చోట పరాకాష్టకు చేరుకుంటుంది. అది యాంటీ క్లయిమాక్స్‌ను తలపిస్తుంది. కమ్యూనిస్టు ప్రణాళిక ఆరంభ వాక్యమే ‘‘యూరప్‌ను ఓ భూతం వెంటాడుతోంది. ఆ భూతం పేరు కమ్యూనిజం. ఈ భూతాన్ని తరిమికొట్టడానికి పాత కాలపు యూరప్‌లోని పాలక వర్గాలన్నీ … జార్ చక్రవర్తి, మెటర్నిక్, గిజోట్, జర్మనీ గూఢచారులు, ఫ్రెంచి రాడికల్స్ ఏకమయ్యారు.’’ రోమన్ చర్చి మొదలు రష్యాలోని ఆర్థడాక్స్ చర్చి, దాంతో మిత్రత్వం నెరుపుతున్న జార్ చక్రవర్తి, ఆస్ట్రియా రాచరికం, లూయీ ఫిలిప్ నాయకత్వంలోని బూర్జువా నియంతృత్వం, ఫ్రాన్స్‌లోని ఉదారవాద బూర్జువా మేధావులు, ప్రష్యా పోలీసు ఏజెంట్లు శైశవ దశలో ఉన్న కమ్యూనిజాన్ని చూసి భయకంపితులై దాన్ని పసికందుగా ఉన్నప్పుడే పీకనులమటానికి ఒక్కటవుతారు. వీళ్లకు తోడు రష్యా, ఆస్ట్రియా, ప్రష్యా చక్రవర్తులతో పాటు ఈ కూటమికి ఓ కొసన ప్రపంచ క్రైస్తవాధిపతి పోప్ నిలబడితే మరో కొసన ప్రష్యా పోలీసు ఏజెంట్లు నిలబడతారు. కమ్యూనిజం అనే భూతాన్ని వాళ్లే సృష్టించి ఇప్పుడు దాన్ని తుదముట్టించటానికి అడ్డగోలు ప్రయత్నం చేస్తున్న యూరోపియన్ పాలకవర్గం పట్ల రచయితకున్న జుగుప్సాకరమైన వెటకారం ఈ వర్ణనలో కనిపిస్తుంది.
మరో చోట కొత్తగా పుట్టుకొస్తున్న పారిశ్రామిక బూర్జువా వర్గం తన లాభాపేక్ష కోసం చివరకు ఆకాశానికి దోట్లు వేసే మతభావనలు, వీరత్వం, ఆడంబరమైన భావోద్వేగాలను సైతం పక్కకు తోసేస్తారు అని గుర్తు చేస్తారు మార్క్స్. ఇక్కడ మద్యయుగాల సాంప్రదాయకపు భావోద్వేగాలు, వీరత్వం, మార్మికతల నుండి ప్రజలను బయటికి లాక్కొస్తున్న బూర్జువా సమాజ విలువలు గుర్తు చేస్తున్నారు రచయితలు. ఏమీ సాధించలేని పెటీ బూర్జువా వర్గం తమ అర్భకత్వాన్ని ఈ మధ్యయుగాల నాటి విలువల మాటున దాచిపెడుతుంది. అదే సమయంలో ఈ భావోద్వేగాలు, పెటీ బూర్జువా లక్షణాలన్నీ ఏకరువుపెడతూ వీటిలో ఒక్కటికూడా ఆధునిక ప్రపంచంలో నిలదొక్కుకోలేదని కూడా మార్క్స్ ఏంగెల్స్‌లు స్పష్టం చేస్తున్నారు. దాంతో పాటు మధ్యయుగాల భావజాలం, వర్తమాన సమాజపు భావజాలాలు వాస్తవాన్ని కప్పిపెడుతున్నాయని కూడా వివరిస్తున్నారు.
కులీన వర్గం గురించిన వ్యాఖ్యానాల్లో శైలి రీత్యా ప్రస్తావించుకోదగిన మరో సందర్భంలో మార్క్స్ ‘‘బయటికి ఎంతో వాగాడంబరంతో మాట్లాడినా ఆచరణలో (ఈ వర్గం) పారిశ్రామికీకరణ అందించిన బంగారపు యాపిల్ పళ్లు అందుకోవడానికి ప్రేమను తాకట్టు పెట్టారు. వెచ్చని ఉన్ని కోసం, బీటురుట్తో తయారు చేసిన చక్కెర, బంగాళాదుంపలతో తయారు చేసిన మద్యం వంటి వాటి కోసం గౌరవాన్ని తాకట్టు పెట్టారు’’ అని ఎగతాళి చేస్తారు. బంగారపు యాపిల్ పళ్ల గురించిన దేవలోకపు కథనాలు పక్కన పెట్టినా జర్మనీకి చెందిన భూ యజమానులు తమ మందల్లోని గొర్రెల నుండి ఉన్నిని, బీటురూట్ వేళ్ల నుండి చక్కెరను, బంగాళాదుంపల రసం నుండి మద్యాన్ని తయారు చేసి అమ్ముకునే క్రమంలో తమ కులీన తరగతి వీరికి గుర్తు రాదు. ప్రేమ, సత్యం, గౌరవం వంటి ఉన్నత పదాలకు బదులు వ్యాపారంలో వచ్చే కళ్లు మిరుమిట్లు గొలిపే లాభాలు, ఫలాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని విరుచుకుపడ్డారు. మనిషికి గుర్తింపు, ధీరత్వాన్ని తెచ్చి పెట్టే గౌరవానికి బదులు బంగాళాదుంపల రసంతో చేసే మద్యం అమ్మకాల ద్వారా వచ్చే గౌరవమే ఎక్కువ ప్రయోజనం అని భావించారు.
ఇటువంటి యాంటీ క్లయిమాక్స్ కథనాలు ఎన్ని ప్రస్తావించినా ఆచరణలో ముగింపుకు వచ్చేసరికి ‘‘పారిశ్రామిక రంగం విస్తరించటంతో కార్మికవర్గం సంఖ్య రీత్యా గణనీయంగా విస్తరిస్తోంది. బలం పెంచుకుంటుంది. పెద్ద సంఖ్యలో కేంద్రీకృతమవుతుంది. అంతకంతకూ తన శక్తిని తాను గుర్తించుకోగలుగుతుంది’’ అని గుర్తు చేస్తారు. వివిధ వర్గాల్లో వచ్చే మార్పుల గురించి మార్క్స్ చేసిన ప్రస్తావనలు, విశ్లేషణల్లో కార్మికవర్గం తన శక్తి గురించి తాను తెలుసుకోవటం ఈ పరిణామాలకు కీలకమైన ముగింపు అని మార్క్స్ వ్యాఖ్యానిస్తారు. ఇక్కడ క్లయిమాక్స్ ఏమిటంటే శ్రమ శక్తి వినియోగంలో నిరంతరం పరస్పరం పోటీపడే రెండు ధోరణులు, పోటీతత్వం, నిర్మాణం ఒకదానితో ఒకటి తోడుగా సాగుతున్నా ఈ రెండిటిలో నిర్మాణం కీలకమైనదిగా మార్క్స్ భావిస్తారు. ‘‘కార్మికులందరినీ ఓ వర్గంగా నిర్మాణం చేయటం తర్వాత ఈ వర్గాన్ని ఓ రాజకీయ పార్టీగా తీర్చి దిద్దటం అనే ప్రయత్నాలు ఉపాధి కోసం కార్మికులు పోటీ పడుతూ ఉండటంతో పదేపదే ఎదురుదెబ్బలకు గురవుతున్నాయి. అయితే ఒకసారి పడిపోయి తిరిగి లేచేటప్పుడు ఈ వర్గం మరింత శక్తివంతంగా మారుతుంది.ఈ వివరణ ఇస్తున్నప్పుడు మార్క్స్ ప్రయోగించిన పద బంధాలు గమనిస్తే కార్మికవర్గం శక్తి పుంజుకోవటం నిరంతరం జరిగే ప్రక్రియ అన్న అర్థాన్నిస్తుంది. ఈ విధంగా కార్మికవర్గం గురించి మాట్లాడిన అంశాలు, బూర్జువా, కులీన వర్గాల గురించి మాట్లాడిన అంశాలు ఆయా వర్గాల పురోగమన తిరోగమన ధోరణులను ప్రతిఫలించేవిగా ఉన్నాయి.
కమ్యూనిస్టు ప్రణాళికలో అనేక చోట్ల మార్క్స్ ప్రయోగించిన పరస్పర విరుద్ధ భావనలు వెంటవెంటనే వివరించిన తీరు సందర్భోచితంగానే కాక మనోరంజకంగా కూడా ఉంటుంది. అటువంటి సందర్భాలు మచ్చుకు కొన్ని పరిశీలిద్దాం. ‘‘బూర్జువా సమాజంలో అహర్నిశలూ పని చేసేవాడికి అంతిమంగా ఏమీ దక్కదు. అన్నీ దక్కించుకునేవాడు పని చేయడు’’ అని ఓ చోట ప్రస్తావిస్తే ‘‘ఏ దశలోనైనా పాలకవర్గ భావాలే సార్వత్రిక భావాలుగా చలామణి అవుతాయి’’ అని మరోచోట ప్రస్తావిస్తారు. మరో సందర్భంలో ‘‘పార్సన్ భూస్వామితో చెట్టాపట్టాలేసుకుని నడుస్తూ క్లరికల్ సోషలిజం, ఫ్యూడల్ సోషలిజం… క్రిస్టియన్ సోషలిజం వంటి భావనలు పూజారులు కులీన వర్గపు భారాన్ని కొంతైనా తగ్గించటానికి చేసే వ్యవర్థ ప్రయత్నాలే తప్ప మరోటి కాదు.’’ అంటారు. మరోచోట కమ్యూనిజం కార్మికులకు మాతృదేశం లేకుండా చేస్తుందన్న ఆరోపణలకు సమాధానంగా మార్క్స్ ఏంగెల్స్‌లు ‘‘కార్మికులకు సొంత దేశమంటూ ఏమీ లేదు. వాళ్ల దగ్గర లేని దేన్నైనా ఎవరూ తీసుకోలేరు’’ అని స్పష్టం చేస్తారు.
ఇటువంటి వాక్యాలన్నీ సుదీర్ఘ వివరణలతో కూడిన పేరాగ్రాఫ్‌లకు ముగింపు వాక్యాలుగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. శతాబ్దాల తరబడి బూర్జువా వర్గం సాధిస్తున్న సాగిస్తున్న పురోగతి గురించి సమగ్రంగా వివరించిన తర్వాత అంతిమంగా బూర్జువా వర్గం రాజకీయంగా పైచేయి సాధించింది అంటారు.ఈ చివరి వాక్యం ఆ పేరాగ్రాఫ్‌లో వివరించిన ప్రతి సందర్భానికీ దర్పం పట్టేదిగా ఉంటుంది. ఈ వివరణకు ముక్తాయింపుగా మార్క్స్ ఏంగెల్స్‌లు ‘‘ కార్యనిర్వాహకర వర్గం అంటే మరేమీ కాదు. మొత్తం బూర్జువా వర్గానికి సంబంధించిన కార్యకలాపాలు చక్కబెట్టే మేనేజింగ్ కమిటీయే’’ అంటారు.
అటువంటి వాక్యాలకు ముందు ఒక్కో సారి ‘ఒక్క మాటలో చెప్పాలంటే’ ‘క్లుప్తంగా చెప్పాలంటే’ అన్న పదాలతో మొదలవటం కూడా గమనించవచ్చు. ఉత్పత్తి సాధనాలను జాతీయం చేయాలన్న ప్రతిపాదనపై విరుచుకుపడే వారిని ఉద్దేశిస్తూ అసలు ఉత్పత్తి సాధనాల యాజమాన్యమే లేని వారు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాల్సిన అవసరం లేదనీ, వాళ్లు వ్యతిరేకిస్తున్నారు అంటే ఖచ్చితంగా అటువంటి పని వలన వారికి నష్టం జరుగుతుందని తెలిసే వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేస్తూ ఏ వాక్యం ఎవరిని ఉద్దేశించిందో స్పష్టంగా ప్రస్తావిస్తారు. ‘ఒక్కమాటగా చెప్పాలంటే మేము మీ ఆస్తులు లాగేసుకోనున్నామని మాపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. నిజానికి మేము చెప్పేది కూడా అదే.’ అని ఓ చోట ఉత్పత్తి సాధనాల జాతీయీకరణ విషయంలో బూర్జువా విమర్శలకు ముగింపు పలుకుతారు. మరో చోట బూర్జువా సోషలిజం అంటే నిరంతరం బూర్జువా వర్గ ఆధిపత్య సమాజం కొనసాగింపే తప్ప మరోటి కాదని చెప్తూ దానికోసం బూర్జువా సమాజం నిరంతరం సంస్కరణలకు లోనవుతుందని వివరిస్తూ ‘‘కార్మికవర్గం ప్రస్తుత సమాజం పరిధిలోనే ఉండాలి. బూర్జువా వర్గం పట్ల ఉన్న అన్ని రకాల వ్యతిరేకతలను పక్కనపెట్టాలి’’ అని చెప్తూనే ‘‘బూర్జువా వర్గం బూర్జువా వర్గమే… బూర్జువా సోషలిజం కార్మికవర్గానికి మేలు చేస్తుందా?’’ అని ప్రశ్నిస్తారు.
ఓచోట కమ్యూనిస్టులు తమ భావాలను బాహాటంగా వ్యక్తీకరించటానికి మొఖమాటపడరు అని హృద్యంగా చెప్పారు.
‘‘తమ లక్ష్యాలను దాచిపెట్టుకోవటం అంటే కమ్యూనిస్టులకు వెగటు కలుగుతుంది. ప్రస్తుత పరిస్థితులను బలవంతంగా మార్చటం ద్వారానే తమ అంతిమ లక్ష్యాన్ని చేరుకోగలమని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. కమ్యూనిస్టు విప్లవం గురించి విని పాలక వర్గాల వెన్నులో వణుకు పుట్టనీయండి. పోగొట్టుకోవడానికి కార్మికుల వద్ద ఏమీ లేదు. సంకెళ్లు తప్ప.కానీ జయించటానికో ప్రపంచం ఉంది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి’’ అని పిలుపునిస్తారు.
కార్మికవర్గానికి దక్కేదేమిటి, పోయేదేమిటో ఇంత తేలికపాటి పదాలతో గుండెలకు హత్తుకునేలా వివరించిన తర్వాత ‘‘కార్మిక వర్గానికి పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప’’ అన్న పదబంధం అర్థం పరిధి కేవలం ఆయా పదాలు విడివిడిగా అందించే అర్థానికి, పరిధికీ మించినవని చెప్పటానికి ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. పదాల వెనక ఉన్న ఉద్రేకం, ఉద్వేగం మధ్య వాక్య నిర్మాణాన్ని తరచూ మర్చిపోతుంటాము.
ఈ వ్యాసం ముగింపులో కమ్యూనిస్టు ప్రణాళికలోని మరో ముఖ్యమైన పేరగ్రాఫ్ గురించి చర్చించుకోవాలి. ‘‘ కమ్యూనిస్టులు బాహాటంగా ప్రపంచం ముందు తమ అభిప్రాయాలు, లక్ష్యాలు, ధోరణులు కమ్యూనిస్టు మానిఫెస్టో ద్వారా ప్రకటించి కమ్యూనిస్టుల గురించి జరుగుతున్న దుష్ప్రచారానికి ముగింపు పలకాలి.’’ అంటారు. తద్వారా ఆస్తుల జాతీయీకరణ మొదలు మహిళల జాతీయీకరణ వరకూ కమ్యూనిస్టుల గురించి, కమ్యూనిస్టుల హింసాత్మక చర్యల గురించి, గతకాలపు నాగరికతలు సాధించిన విజయాలను తుడిచిపెడతారన్న వాదనల గురించి, ప్రచారంలో ఉన్న కాకమ్మ కబుర్లను కొట్టిపారేస్తూ ఇదంతా కమ్యూనిజం అంటే గిట్టని వారు కమ్యూనిజాన్ని ఓ బూచిగా చూపించేందుకు చేస్తున్న ప్రయత్నమేనని స్పష్టం చేస్తారు. అదే సమయంలో కమ్యూనిస్టు ప్రణాళిక ప్రంపంచం ముందుంచే లక్ష్యాలు నిజంగానే బూర్జువా వర్గానికి వెన్నులో వణుకు పుట్టిస్తాయని కూడా చెప్తారు. బూర్జువావర్గం మాట్లాడే ‘సాంస్కృతిక పతనం’ కేవలం బూర్జువా వర్గపు సంస్కృతికి కాలం చెల్లుతుందన్న ఆందోళనే తప్ప మరోటి కాదు. బూర్జువా సంస్కృతి అంటే విశాల ప్రజానీకాన్ని యంత్రాల్లా పని చేయించటమే. అందుకే ఈ సంస్కృతిని రద్దు చేస్తారు అంటే బూర్జువా వర్గానికి ఆందోళన కలుగుతుంది.
ప్రొఫెసర్ పాల్ ఎన్ సీగెల్
అనువాదం : కొండూరి వీరయ్య
(లాంగ్ ఐలండ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ పాల్ ఎన్ సీగెల్ సైన్స్ అండ్ సొసైటీ, సంపుటి 46, సంచిక 2, 1982లో రాసిన వ్యాసం రెడ్ బుక్స్ డే సందర్భంగా తెలుగు పాఠకులకోసం…. ది వైర్ తెలుగు సంపాదకులు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.