
Congress will hold caste survey in Telangana
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తాను ప్రకటించిన కుల గణన ఫలితాలకు సంబంధించిన వివాదంలో చిక్కుకుంది. రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ తన సామాజిక న్యాయ ఎజెండాలో భాగంగా కుల గణనకు హామీ ఇచ్చింది. ఆ తరువాత దీనిని ఆయన భారత న్యాయ యాత్ర సందర్భంగా మెజారిటీ హిందూత్వ రాజకీయాలకు విరుగుడుగా ఉపయోగించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కుల గణన చేపడతామని, కుల సాధికారత ఆధారంగా సామాజిక న్యాయానికి కట్టుబడే విధానాన్ని అమలు చేస్తామని 2023 ఎన్నికల ప్రచారంలో కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ వాగ్ధానం రాష్ట్రంలో పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడంలోను, సానుకూల వాతావరణాన్ని సృష్టించడంలోను ప్రముఖ పాత్ర పోషించిందని, తద్వారా 2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీపై తమ విజయానికి మార్గం సుగమం చేసిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రహించింది.
సామాజిక న్యాయం ప్రాతిపదికగా రూపొందించబడిన కాంగ్రెస్ జాతీయ అజెండాలో భాగంగా కుల గణనను ప్రతిపాదించినందున, తెలంగాణ కుల గణన అనుభవాన్ని, దానిని నిర్వహించిన తీరును పరిగణనలోకి తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్, కమిషనర్ ఆఫ్ సెన్సస్ కార్యాలయం ద్వారా మాత్రమే జనాభా గణన జరుగుతుందనే సాంకేతిక కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను కుల గణనకు బదులుగా కుల ‘సర్వే’ అనే పేరుతో నిర్వహించింది. సర్వే నమూనా ఆధారంగా జరుగుతుందని, జనాభా గణన యావత్ జనాభాను పరిగణనలోకి తీసుకుంటుందనే విషయాల మధ్యగల తేడాను ఇక్కడ గమనించడం అవసరం. తెలంగాణలో కుల ప్రాతిపదికన యావత్ జనాభాను లెక్కించడం జరిగింది.
తెలంగాణలో జనాభా సర్వేను నిర్వహించటంలో చాలా కాలయాపన జరిగిందనే భావన ప్రజల్లో నెలకొంది. అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం తర్వాత జనాభా సర్వే ప్రక్రియ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి అవసరమైన ప్రచారం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది. ఈ ప్రక్రియలో భాగమైన వివిధ స్థాయిలలో దశలలో ఉండవలసిన పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రతిపక్ష పార్టీలైన బిఆర్ఎస్, బిజెపి, వామపక్షాలు, పౌర సంఘాలు, వెనకబడిన కులాలకు చెందిన సంస్థలు తీవ్రమైన సందేహాలను, ప్రశ్నలను లేవనెత్తాయి. వీటికి సమాధానంగా కాంగ్రెస్ పార్టీ నుండి సరియైన ప్రతిస్పందన లేకపోవడంతో ఈ భయాలు మరింతగా పెరిగాయి.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ప్రభుత్వంలో పదవులు ప్రధానంగా ఆధిపత్య రెడ్డి కులం నియంత్రణలో ఉండటం వల్ల ఈ ఆందోళనలు అతిశయోక్తిగా అనిపించవు. జాతీయ, ప్రాంతీయ, స్థానిక – ఒక్కమాటలో చెప్పాలంటే అన్ని స్థాయిల్లో రాజకీయ పార్టీల నాయకత్వం రైతు కులాల ఆధిపత్యంలో ఉన్నందున సహజంగానే వారికి కుల గణన పట్ల విముఖత ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే కుల జనాభా గణన తర్కం వెంటనే కాకపోయినా దీర్ఘకాలంలో వారి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను, అలాగే వారి సామాజిక ఆధిపత్యాన్ని ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో ఎన్నికల గతిశీలతను నడిపించేది కులాల జనాభా గణితం అని అందరికీ తెలుసు.
కుల గణన సర్వేను నిర్లక్ష్యంగా నిర్వహించారని, సమాచారం లేక డేటా ప్రామాణికత సందేహాస్పదంగా ఉందని వెనుకబడిన తరగతుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో బిసి జనాభా నిష్పత్తిని 46.25 శాతంగా అంచనా వేయడం అనేది వారు ఆశించిన 50 శాతం కంటే చాలా తక్కువగా ఉందని ఈ సంఘాలు వాదిస్తున్నాయి.
భావజాలాల ప్రమేయం లేకుండా విస్తృతంగా వెల్లడైన ప్రజాభిప్రాయం లేవనెత్తిన సందేహాలు, ఆందోళనలు, ఆరోపణల చెల్లుబాటును అర్థం చేసుకోవడానికి కుల సర్వేను అస్పష్టంగా మార్చిన గోప్యత ముసుగును తొలగించాలి. అందుకోసం కుల సర్వే భావనను, అమలును, ప్రాసెసింగ్‌ను పరిశీలించడం అవసరం. కుల సర్వే వంటి అపారమైన ప్రజా ప్రయోజన సమస్యపై అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రభుత్వం ఒక సంవత్సరానికి పైగా చేసిన కాలయాపన ఈ అనుమానాలకు అవకాశం ఇచ్చినట్లు కనిపిస్తోంది.
సర్వే ఆపరేషన్‌లో ప్రభుత్వంలోని తగిన విభాగానికి బాధ్యతను అప్పగించడంతో ప్రారంభమయ్యే అనేక దశలు ఉంటాయి. ప్రస్తుత సందర్భంలో దీనిని చేపట్టే బాధ్యతను ప్రణాళిక శాఖకు ఇచ్చారు. ప్రశ్నాపత్రం రూపొందించడానికి తగిన నైపుణ్యం కలిగిన ఏజెన్సీలు, వ్యక్తులు, ఎవరెవరు దీనిలో నిమగ్నమై ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. ఫీల్డ్ ఎన్యూమరేటర్లుగా నియమించబడిన సిబ్బందిపైన, వారికి శిక్షణ ఇచ్చేందుకు కేటాయించిన నిపుణులు ఎవరు అనే వాటిపై స్పష్టత లేదు. ప్రశ్నాపత్రం షెడ్యూల్ల ఖచ్చితత్వాన్ని, ఫీల్డ్ సిబ్బంది సంసిద్ధతను ధృవీకరించడానికి ఏదైనా మార్గదర్శక (పైలట్) అధ్యయనం జరిగిందా లేదా అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. అంతేకాకుండా, వివిధ స్థాయిలలో సేకరించిన సమాచారం లేక డేటా ప్రామాణికతను ధృవీకరించడం, వివిధ సందర్భాలలో, వివిధ ప్రయోజనాల కోసం ప్రభుత్వం దగ్గర ఇప్పటికే అందుబాటులోవున్న డేటాతో పోల్చినప్పుడు ఈ డేటా ఎలా ఉందో చూచి, తేడా(మార్జిన్) సమస్యను పరిష్కరించడం అవసరం. మొత్తం క్రుత్యం(ఎక్సర్ సైజ్) కార్యనిర్వహణ విధానంపై ఎటువంటి సమాచారం లేదు. ముఖ్యంగా డేటా ప్రాసెసింగ్ లో భాగమైన పరిమాణీకరణ, సహసంబంధం, పట్టికలకు సంబంధించిన మొత్తం ప్రక్రియ గురించి ఎటువంటి సమాచారం లేదు. పైన పేర్కొన్న వివరాలలో దేనినీ బహిర్గతం చేయకపోవటంతో మొత్తం క్రుత్యంపై అనేక రకాల ఊహాగానాలు, అనుమానాలు ఏర్పడేందుకు తగినంత అవకాశం ఏర్పడింది.
టిఆర్ఎస్ ప్రభుత్వం తన మొదటి పదవీకాలంలో 2014 ఆగస్టు 19వ తేదీనాడు సామూహిక సంప్రదింపు కార్యక్రమం ద్వారా తగినంత ప్రచారం చేశాక సమగ్ర కుటుంబ(ఇంటెన్సివ్ హౌస్‌హోల్డ్) సర్వే అని పిలువబడే రాష్ట్రవ్యాప్త జనాభా సర్వేను ఒకే రోజులో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వేను రాష్ట్ర ప్రణాళికా శాఖ నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల సేవలను ఉపయోగించి, క్యాబినెట్ ఆమోదంగానీ, శాసనసభ అనుమతిగానీ లేకుండా నిర్వహించింది. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఈ సర్వే డేటా సాధారణ సమాచారాన్నితప్ప కులంపై ఎటువంటి సమగ్ర వివరాలను అందించదు. దానికి చట్టపరమైన విలువ లేదా విశ్వసనీయత లేదు. అయినప్పటికీ, ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ విధానాలను రూపొందించడానికి, తన ఎన్నికల ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించారని చాలామంది భావిస్తున్నారు. వర్తమాన వివాదంలో ప్రస్తుత సర్వే డేటా విశ్వసనీయతను ప్రశ్నించడానికి బిఆర్ఎస్ ఈ డేటాను తరచుగా ఉదహరించటం హాస్యాస్పదంగా ఉంది. సమగ్ర కుటుంబ సర్వే లో సేకరించిన డేటా వివరాలను పేర్కొనటం పెరుగుతున్నప్పటికీ, టిఆర్ ఎస్ గానీ, అధికార కాంగ్రెస్ పార్టీ గానీ ప్రజల పరిశీలన కోసం వివరణాత్మక డేటాను విడుదల చేయడం సముచితమని భావించటం లేదు.
ఇప్పుడు బిఆర్ఎస్ రంగంలోకి దిగి సమగ్ర కుటుంబ సర్వేని ‘అధికారికం’ అని పేర్కొనడంతో పాటు, బిసీల సంఖ్య 46.25 సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన సంఖ్య కంటే 5 పాయింట్లు తక్కువగా ఉందని ప్రకటించి వివాదాన్ని ఎగదోస్తోంది. అలాగే అగ్ర కులాల సంఖ్యను ఉన్నదానికంటే పెంచటం జరిగిందని కూడా బిఆర్ఎస్ పేర్కొంది.
విమర్శలు పెరుగుతున్నందున, దిద్దుబాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వేలో గతంలో లెక్కకు రాని పౌరుల గణనను నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ మొత్తం క్రుత్యం(ఆపరేషన్) పైన, దానిలో పాల్గొన్న వారి సామర్థ్యం గురించి లేవనెత్తిన ప్రాథమిక సందేహాలను తీర్చలేదు. అలాగే భయాలకు పోగొట్టే ప్రయత్నం చేయలేదు.
రాష్ట్రంలో ప్రజాభిప్రాయం, రాజకీయ అభిప్రాయం వ్యతిరేకంగా మారినందున, పరిస్థితిని సాధారణీకరించవలసిన అవసరం ఉంది. ఇందులో ఉన్న నైపుణ్యం, క్షేత్రస్థాయి పని నిర్వహణలో అనుసరించిన పద్ధతి, డేటా గణన, లోపాల మార్జిన్ లకు సంబంధించిన సమాచారాన్ని పారదర్శకంగాను, బహిరంగంగాను ప్రజలకు అందించటమే అందుకోసం మిగిలి ఉన్న ఏకైక మార్గం. ఈ ప్రక్రియలో ఏవైనా లోపాలు జరిగివుంటే వాటిని బహిరంగంగా అంగీకరించాలి. జనాభా గణన అనేది అత్యంత సంక్లిష్టమైనదని, అందుకు కావలసిన సన్నద్దతకు చాలా సమయం పడుతుందని, అందుకోసం భారీ సంఖ్యలో సిబ్బంది అవసరం ఉంటుందని, అనేక ఇతర విషయాలు ఇందులో ఇమిడి ఉంటాయని మనకు తెలుసు. ఇంతటి మహత్తర కార్యక్రమంలో ఏవైనా తప్పులు జరిగితే, వాటిని అంగీకరించడానికి వెనుకాడడంలో అర్థం లేదు. తప్పులను నిజాయితీగా అంగీకరించడం, అవి ఎక్కడ, ఎలా జరిగాయో గుర్తించడం వల్ల ప్రజల విశ్వాసాన్ని పొందడంతో పాటు వాటిని సరిదిద్దడం సులభం అవుతుంది. ఈ విషయంలో ఏదైనా జాప్యం జరిగితే పాలనకు జరగబోయే నష్టాన్ని సరిదిద్దడం అనవసరంగా కష్టతరం అవుతుంది.
ఇతర రాష్ట్రాల్లో కూడా కుల గణన కోసం ఇలాంటి డిమాండ్లు వెలువడుతున్నందున, వివిధ సమస్యలు, లోపాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర అనుభవం భవిష్యత్తులో ఇతర సందర్భాలలో పాఠాలు నేర్చుకోవటానికి, సమస్యలను పరిష్కరించటానికి ఉపయోగకరంగా ఉంటుంది.
– శ్రీనివాసులు కర్లి
(సీనియర్ ఫెలో, ఐసిఎస్ఎస్ఆర్, న్యూఢిల్లీ
ప్రొఫెసర్ (రిటైర్డ్), పొలిటికల్ సైన్స్ విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్)
అనువాదం: నెల్లూరు నరసింహారావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.