
రెండువేల రూపాయల నోట్లు చలామణిలో లేవు కానీ, అవి చట్టబద్ధమైనవేనని రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
2024- 25 ఆర్థిక సంవత్సరంలో 1.12 లక్షల విలువైన 500 రూపాయల నకిలీ నోట్లను స్వాదీనం చేసుకున్నామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆర్థిక శాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయి సంఘానికి తెలియజేశారు.
ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం, 2024- 25 ఆర్థిక సంవత్సరానికి నకిలీ 500 నోట్ల చలామణి 37 శాతం పెరిగాయి. మార్కెట్లో అటువంటివి 1.18 లక్షల నోట్లు ఉన్నాయి. ఆర్బీఐ గవర్నర్ చెప్పినదానికంటే ఎక్కువగానే నకిలీ నోట్లు చలామణిలో ఉన్నాయని నివేదిక చెప్తోందని ఒక ఎంపీ గుర్తు చేశారు.
ది ట్రిబ్యూన్ పత్రిక ప్రచురించిన వార్తా కథనం ప్రకారం, బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం ముందు మల్హోత్రా విచారణకు హాజరు అయ్యారు. రెండువేల నోట్లు నేటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయాన్న విషయాన్ని ఆయన అంగీకరించారు.
కాకపోతే ఆ నోట్లు మార్కెట్లో ఎక్కువగా అందుబాటులో లేవన్న విషయాన్ని కూడా ఆర్బీఐ గవర్నర్ పార్లమెంటరీ కమిటీకి తెలిపారు.
2024- 25లో వంద రూపాయల నకిలీ నోట్లు 51,069 పట్టుబడ్డాయని, నకిలీ 200 నోట్లు 32600, నకిలీ 2000 నోట్లు 3508 పట్టుబడ్డాయని మల్హోత్రా పార్లమెంటరీ సంఘానికి నివేదించినట్లు ట్రిబ్యూన్ పత్రిక వెల్లడించింది. అన్ని రకాల నకిలీ నోట్ల విలువ ఆరు కోట్లు.
2023-24లో 2.23 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేయకుంటే 2024-25లో 2.18 లక్షల నకిలీ నోట్లు పట్టుబడ్డాయని మల్హోత్రా తెలిపారు.
సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆర్బీఐ ప్రకటనల్లో పరస్పర వైరుధ్యాల గురించి ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆర్బీఐ బ్యాంకింగ్ రంగాన్ని నియత్రించడం వంటి తన మౌలిక విధులకు పరిమితం అవ్వాలని, అన్ని రకాల చర్యల్లో జోక్యం చేసుకోవాలన్న ఆలోచనతో కోర్ సెక్టార్ కార్యక్రమాల్లో లోపాలు దొర్లుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ సూచించినట్లు తెలిసింది.
క్రిప్టో కరెన్సీ నియత్రణకు సంబంధించిన విషయాల గురించి కూడా పార్లమెంటరీ కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన అధికారిక విధానాన్ని ఇంకా బయటకి ప్రకటించలేదని ఆర్బీఐ కమిటీ దృష్టికి తెచ్చింది. కమిటీ తదుపరి సమావేశం జులై 23, 24వ తేదీన ఉంటుందని కమిటీ అధ్యక్షులు మహతబ్ తెలిపారు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.