
ప్రతిపక్షాలకు ఢిల్లీ ఎన్నికలు నేర్పుతున్న పాఠం
అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోని మార్మికతను ఢిల్లీ ఎన్నికల ఫలితాలు పటాపంచలు చేశాయి. ఆమ్ ఆద్మీ రాజకీయాలు రంగు వెలవటంతో చివరకు కరుడుకట్టిన లౌకికవాదులు కూడా ఊపిరితీసుకున్నారు. లౌకికపక్షాలు బిజెపి విజయానికి సంబరాలు చేసుకోవడం లేదు. కానీ మూడోసారి ముఖ్యమంత్రి అయితే కేజ్రీవాల్ తన మార్మికతతో లౌకిక రాజకీయాలకు చేసే నష్టం నివారించబడినందుకు కొంతలో కొంత తృప్తిగా ఉన్నారు. ఈ పరిస్థితి తెచ్చుకున్నది స్వయంగా కేజ్రీవాలే.
లౌకిక శక్తుల్లో అపనమ్మకం ఈ స్థాయిలో ఉండటానికి బలమైన కారణాలే ఉన్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మార్గదర్వకత్వంలో, పేరుగాంచిన కార్పొరేట్ శక్తుల మద్దతుతో దేశవ్యాప్తంగా ఇండియా ఎగనెస్ట్ కరప్షన్ ఉద్యమానికి తెరతీశారు. చివరకు తనను తాను బిజెపి వ్యతిరేకిగా చిత్రీకరించుకున్నారు.
లోక్‌పాల్ బిల్లు అవినీతి నిర్మూలను వజ్రాయుధం అని దేశాన్ని నమ్మించారు. అధికారానికి వచ్చిన తర్వాత నినాదాన్ని గాలికొదిలేశారు.
తాను నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటే మరోవైపున ఆమ్ ఆద్మీ మంత్రివర్గంలో సీనియర్ మంత్రులు ఏదో ఒక అవినీతి ఆరోపణల వలయంలో చిక్కుకుంటూనే ఉన్నారు.
సాదాసీదా వేషధారణతో చిన్నకారుతో ఢిల్లీలో తిరుగుతూ ఆమ్ ఆద్మీకి తానే ప్రతినిధిని అని చెప్పుకున్నారు. చివరకు శీష్మహల్లో తేలారు. కలుషిత రాజకీయాలకు దూరంగా ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఆమ్ ఆద్మీ పేరుతో అరచేతిలో స్వర్గం చూపించారు. తాను నిర్మించిన ఊహాస్వర్గాన్ని శీష్మహల్లో తానే సమాధి చేసుకున్నారు.
కేజ్రీవాల్ రాజకీయాల్లో అత్యంత దురదృష్టకరమైన అంశం ఏమింటే సైద్ధాంతిక శూన్యత. తన కుటుంబానికి ఆరెస్సెస్‌తో ఉన్న సంబంధాల గురించి గొప్పగా చెప్పుకుంటున్న వీడియోలు కూడా కొన్ని అందుబాటులో ఉన్నాయి. మోడీ చేసిన పొరపాట్ల గురించి తప్పుల గురించి ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భాగవత్‌కు లేఖ రాయడంతో ఆరెస్సెస్ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని నిరూపించుకున్నారు. ఆ లేఖలో ఎక్కడా ఆరెస్సెస్ ప్రపంచ దృక్ఫధం గురించి కానీ, మతోన్మాద రాజకీయాల గురించికానీ ఎక్కడా పల్లెత్తు ప్రశ్నించలేదు.
2020లో ఈశాన్య ఢిల్లీలో జరిగిన మతోన్మాద కలహాలు కేజ్రీవాల్ దివాళాకోరుతనాన్ని పూర్తిగా బట్టబయలు చేశాయి. ఢిల్లీ మంటల్లో మాడిపోతుంటే మౌనప్రేక్షకుడై కూర్చున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో జరుగుతున్న నిరసనల విషయంలోనూ, వివాదాస్పద వ్యవసాయక చట్టాల విషయంలోనూ కేజ్రీవాల్ స్పందన వివాదాస్పంగా మారింది. సహచర లౌకికవాద మిత్రులైన ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్ వంటి వాళ్ల పట్ల ఆయనకున్న విముఖత గురించీ, అవినీతి వ్యతిరేక ఉద్యమ శ్రేణులు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఓటర్లుగానూ, లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఓటర్లుగానూ వ్యవహరించిన తీరు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రేమ్ శంకర్ ఝా, రవిష్ కుమార్, కొండూరి వీరయ్యల వ్యాసాల లింకులు ఇక్కడ చూడొచ్చు.
బిజెపికీ, ఆమ్ ఆద్మీ పార్టీకి పోలైన ఓట్లలో తేడా రెండు శాతమే కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ రంగం నుండి మాయమైందని వాదించటం సరికాదన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కేజ్రీవాల్ రాజకీయాలు నచ్చకపోయినా గణనీయమైన సంఖ్యలో బిజెపిని వ్యతిరేకించే ఓటర్లు అందరూ కాంగ్రెస్ పాత్ర పరిమితం కాబట్టి కేజ్రీవాల్‌కు ఓటు వేశారు. ముస్లింలు, దళితులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఈ మార్పును మనం చూడొచ్చు. ఈ రెండు సామాజిక తరగతుల్లో రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్‌పట్ల ఆసక్తి పెరుగుతున్నా ఢిల్లీలో బిజెపిని ఓడించటానికి ఆమ్ ఆద్మీకి ఓటేశారు. ఆమ్ ఆద్మీ రాజకీయాల పట్ల విశ్వాసం ఉన్న వాళ్లు కేవలం 25 శాతం కంటే ఎక్కువమంది లేరు అని చెప్పటం అతిశయోక్తి కాబోదు. ఈశాన్య ఢిల్లీ అల్లర్ల విషయంలో మనసును గాయపెట్టుకున్న ముస్లింలు కూడా ఆమ్ ఆద్మీకి ఓటేశారు.
కాబట్టి పోలైన ఓట్ల ప్రాతిపదికన ఆమ్ ఆద్మీ శక్తి సామర్ధ్యాలను కొలవటం సరికాదు. అధికారం, ప్రభుత్వ ఖర్చుతో వచ్చే ప్రచార పటాటోపం లేకుండా పార్టీని కాపాడుకోవటం ఎంత కష్టమో కేజ్రీవాల్‌కు త్వరలో తెలిసివస్తుంది. ఈ ఫలితాలు అటు పంజాబ్‌పైనా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణపైనా ప్రభావం చూపనున్నాయి.
ఆరెస్సెస్, బిజెపిలపై తన విమర్శల దాడి ఎక్కుపెడితే మోషాలు చూస్తూ ఊరుకోరు. అలాగని ఇప్పటిలాగే ఆకుకు అందకుండా పోకకు చెందకుండా మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్ష శిబిరంలో తేలిపోతారు. కాంగ్రెస్ వలన ఏదో జరిగిందని పదేపదే ఆరోపించటానికి కూడా అవకాశం ఉండదు. కాంగ్రెస్ వల్లనే ఓడిపోయాను అని చెప్తే ఇండియా కూటమిలో ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు.
2015లో కూడా కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేస్తూ ఒంటరిగా పోటీ చేసి ఢిల్లీలో బిజెపిని, కాంగ్రెస్‌ను తుడిచిపెట్టేశారు. అప్పట్లో కాంగ్రెస్‌కు తొమ్మిది శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. 2020లో కూడా అదే మోతాదులో విజయ ఢంకా మోగించారు. 2020లో కాంగ్రెస్ నాలుగున్నర శాతం ఓట్లకు పరిమితం అయ్యింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అదనంగా రెండు శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది కానీ ఆమ్ ఆద్మీ కోల్పోయిన ఓటింగ్ పది శాతం. ఈ పరిస్థితుల్లో తమ ఓటమికి కాంగ్రెసే కారణమని చెప్పబూనటం దురదృష్టకరం. పైగా తన పలుకుబడి తగ్గిపోతోంది అని గుర్తించి కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమైతే పరిస్థితులు వేరేలా ఉండేవి.
మమతాలాగానే కేజ్రీవాల్ కూడా ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ స్థానాన్ని మరుగునపర్చవచ్చన్న నమ్మకంతో ఒంటరి పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పరాజయం కేవలం కేజ్రీవాల్ తప్పుడు అంచనాలవల్లనే. తాను నిఖార్సయిన నిజాయితీ పరుడిని అన్న ప్రచారం పట్టాలు దిగిపోయిందన్న వాస్తవాన్ని గుర్తించలేకపోయారు. తన ప్రతీకార వాంఛతో ఢిల్లీ ఓటర్లందరూ ముగ్ధులవుతారని భావించారు. బిజెపి మీదనే ప్రతీకారం అని ప్రకటించారు. తన గురించి తానే ప్రజాభిప్రాయసేకరణకు దిగినట్లయ్యింది. తిరుగులేని నిజాయితీ కారణంగా ప్రజలు తనను ఎన్నుకోవాలని కోరారు.
మద్యం కుంభకోణంపై వచ్చిన ఆరోపణలను కొంతమంది కాకపోతే కొంతమందైనా నమ్మారు. అనేకమంది నాయకులు జైల్లో ఉండటం ప్రజల మనోఫలకంపై ప్రతికూల ముద్ర వేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వ పథకాలను అడ్డుకోవటం, దానిపై కేజ్రీవాల్ వాగ్ధాడికి దిగటంతో మొత్తం రాజకీయం బజారుకెక్కింది. ప్రజలేమో కేజ్రీవాల్ వాగ్ధానాలు నెరవేర్చలేకపోయారని భావించారు. నగరంలో పౌరవసతులు మందగించాయి. సమస్యల కుప్పలు పెరిగాయి. అదనంగా శీష్‌మహల్ వివాదం వైరల్ అయ్యింది. యమునానది శుభ్రం చేయటంలో ఆయన వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది జనానికి. వీటన్నింటికి కప్పిపుచ్చుకోవడానికి ధార్మిక ప్రవచనాలకు, ప్రచారానికీ దిగారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో మౌనం పాటించటం ఆరెస్సెస్, బిజెపిలతో అంటకాగుతున్నాడన్న అనుమానానికి బలం చేకూర్చింది.ఇవన్నీ కలిసి ఆమ్ ఆద్మీ కోటకు బిజెపి బీటలు కొట్టింది.
ఓటర్ల జాబితాకు సంబంధించిన ఆరోపణలు వాస్తవమే అయినా విస్మయం కలిగిస్తాయి. భవిష్యత్ పోరాటాలకు తనను తాను సిద్ధం చేసుకోవాలంటే కేజ్రీవాల్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఓటమికంటే విశ్వాసం కోల్పోవటం కేజ్రీవాల్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సంక్షోభం. ఒకప్పుడు ఆయన్ను సమర్దించినవారే ఇప్పుడు అనుమానిస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు కేజ్రీవాల్ మద్దతుదారు ‘స్వఛ్చమైన పాలన నినాదంతో అధికారానికి వచ్చారు. కానీ ఆయన వ్యవహరించిన తీరు కుటిలత్వానికి కుటిలత్వమే సమాధానం అన్నతీరుతో వ్యవహరించారు.’’ అని అభిప్రాయపడ్డారు.
సారాంశం స్పష్టం. మనం మారటమా, జనం నుండి దూరం కావటమా…
రచయిత రాజకీయ వ్యాఖ్యాత.
– సంజయ్ కె ఝా
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.