
భారత దేశంలో ఫాసిజం ఎదుగుదల కమ్యూనిస్టులకు కేవలం అర్ధం చేసుకోవాల్సిన ఎకడమిక్ వ్యవహారం మాత్రమే కాదు. అది ఒక తక్షణ రాజకీయ కర్తవ్యం. 20వ శతాబ్దంలో కన్పించే ఫాసిజం ప్రత్యేకత లేమిటి? రెండవ ప్రపంచయుద్ధం తర్వాత పెట్టుబడిదారీ విధానపు పద్ధతుల్లో వచ్చిన మార్పులేమిటి? 21వ శతాబ్దం ఫాసిజం మాటేమిటి? ప్రత్యేకించి ఇండియాలో పెరుగుతున్న ఫాసిజం సంగతేమిటి? దీన్ని ప్రతిఘటించేందుకు శక్తివంతమైన వ్యూహన్ని రూపొందించుకోవటం ఎలా? ఈ ప్రశ్నలకు సంబంధించి భారతీయ కమ్యూనిస్టులు ఎంతో కొంతమేరకు ఉమ్మడి అవగాహనకు రావాల్సిన ఒక చారిత్రక సందర్భంలో ప్రస్తుతం మనం ఉన్నాము.
20వ శతాబ్దపు ఫాసిజానికి, నేటి సమకాలీన ఫాసిజానికి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ఇటలీ, జర్మనీలలో ఫాసిస్టు శక్తులు తలెత్తినప్పుడు, కమ్యూనిస్టులు ఆ పరిణామాన్ని అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఒక పక్క కొమిన్‌టర్న్(కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్)మరి కొన్ని కమ్యూనిస్టు పార్టీలు, మరో పక్క గ్రాంసీ, తొగ్లియాటి, క్లారా జెట్కిన్, బోర్డిగా, తాలైమర్లాంటి మార్క్సిస్టు మేధావులు ఫాసిజాన్ని అర్ధం చేసుకోవడం ప్రారంభించారు. దాన్ని ప్రతిఘటించేందుకు పలు వ్యూహాలను తయారు చేశారు.
ఫాసిజంపై మొదటి ముఖ్యమైన కృషి ఇటాలియన్ కమ్యూనిస్టులు చేశారన్నది మన కందరికి తెలుసు. 1921లో కొమిన్‌టర్న్ మూడవ మహాసభలో ఫాసిజం చర్చకు వచ్చింది. కమ్యూనిస్టుల స్మీయాత్మక ధోరణులను పరిగణనలోకి తీసుకుంటూనే, యూరప్‌లో ముఖ్యంగా జర్మనీ, ఇటలీల్లో తగ్గిపోయిన విప్లవకర పరిస్థితులను గుర్తించింది. ఇందుకు శ్రామికులలో ఎక్కువ భాగం సోషల్ డెమోక్రసీ వైపు, సంస్కరణ వాదం వైపు నడిపే భావజాల ప్రభావంలో ఉండటం ఒక బలమైన కారణం. అందుకే లెనిన్ శ్రామిక శక్తిని కేంద్రీకరించే ఉద్దేశ్యంతో ‘ప్రజల వద్దకు’ అనే నినాదాన్ని ఇచ్చారు. బూర్జువా శక్తుల మితవాద దాడిని నిరోధించడం, శ్రామికవర్గ ఆక్రమణకై సిద్ధం చేయడం దీని ఉద్దేశ్యం. కానీ కొమిన్‌టర్న్ 4వ మహసభ నుంచి, లెనిన్ ప్రతిపాదించిన ఈ వ్యూహం సరిగ్గా అమలు కాలేదు. అతివాద, మితవాద ధోరణులు ఇందుకు కారణం. లెనిన్ తీసుకున్న ఈ ‘లైను’ సారాంశం ఏమిటంటే శ్రామిక వర్గాలను సమీకరించి ఒక ‘యునైటెడ్ ఫ్రంట్’ను ఏర్పాటు చేయడం. ఇందులో సోషల్ డెమోక్రటిక్ లేదా ఇతర బూర్జువా యూనియన్ల సభ్యులను, మధ్య తరగతి వర్గాలను, శ్రామిక రైతు జనాభాను చేర్చడం, అలాగే ఆయా ప్రత్యేక సమస్యలపై, సోషల్, డెమోక్రట్లతో, ఫాసిస్టు వ్యతిరేక బూర్జువా శక్తులతో, పెటీ బూర్జువా పార్టీలతో ‘సంఘటన’ కట్టడం.
కానీ కొమిన్స్టర్న్ 5వ మహసభలో అతివాద వామపక్ష ధోరణి ప్రబలితే, 1928లో జరిగిన 6వ మహాసభలో అది మరీ ముదిరి ఫాసిజం కంటే సోషల్ డెమోక్రట్లే మనకు ముఖ్య శత్రువు అనేంత దాకా వెళ్ళింది. దీనికి ప్రతిచర్యగా శ్రామిక వర్గ ఉద్యమం తీవ్రంగా అణచివేయబడింది. బూర్జువా ప్రజాస్వామ్యమే లేకుండా చేయబడింది. 1934 నుంచి కొమిన్స్టర్న్ ‘పాపులర్ ఫ్రంట్’ పేరుతో మితవాద ధోరణి వైపు ప్రయాణించింది.
‘ద్రవ్య గుత్త పెట్టుబడి అత్యంత సామ్రాజ్యవాద, అత్యంత ఆభిజాత్యపు, అత్యంత తిరోగమనవాద అనాగరిక, నగ్న నియంతృత్వమే ఫాసిజం’ అన్నది దాని తీర్మానం. ఫలితంగా శ్రామిక వర్గాల ఐక్య సంఘటన వెనక్కుపోయి, సోషల్ డెమోక్రట్ల యూనియన్ల ఐక్య సంఘటన కట్టడం, వర్గాలకు, పార్టీలకు మద్య ఉన్న వ్యత్యాసం చెరిగిపోవడం, బూర్జువా ప్రజాస్వామ్య పునరుద్ధణ లక్ష్యంగా మారిపోవడం జరిగిపోయాయి. 1938 నాటికి కొమిన్‌టర్న్ తన ‘లైను’ను సరిదిద్దుకొని లెనిన్ మార్గం అంటే ‘శ్రామిక వర్గాల ఐక్య సంఘటన’ వైపు వచ్చేసింది. ఇదంతా మనకు తెలిసిన చరిత్ర. మరి నేటి సంగతేమిటన్నది అసలు ప్రశ్న, ఇది జీవన్మరణ సమస్యగా ముందు నిలబడింది.
కమ్యూనిస్టు పార్టీలు తలా ఒక రకంగా ఫాసిజాన్ని అర్ధం చేసుకుంటున్నాయి. అర్ధం చేసుకోవటంలోనే ఇన్ని తేడాలు ఉంటే, ఇక ఆచరణ ఎంత బలంగా ఉంటుందనేది ఎవరి ఊహకైనా అందే వ్యవహారమే. కొన్ని పార్టీలు ప్రస్తుత రాజ్యాన్ని ‘ఫాసిస్టు’గా వ్యవహరిస్తుంటే మరి కొన్ని 1935నాటి కొమిస్టర్న్ అవగాహననే తిరిగి వల్లె వేస్తున్నాయి. మరికొన్ని పార్టీలు పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య హక్కులు రద్దయి, ప్రత్యేక చట్టాలు వచ్చి, కాన్సన్ ట్రేషన్ క్యాంపులు కన్పడితే తప్ప ఫాసిజం అనలేమంటున్నాయి. కొన్ని పార్టీలు, కొన్ని పార్టీలలో ఆఫిషియల్ లైను పై పోరాడే గ్రూపులు, ఫాసిజం వచ్చిందని నమ్ముతూనే, ప్రతిఘటనా వ్యూహాలకు సంబంధించి ‘పాపులర్ ఫ్రంట్’ సరిహద్దులు దాటి ముందుకు వెళ్ళటం లేదు. నయా ఉదారవాద కాలంలో, 1970ల తర్వాత బూర్జువా రాజ్య స్వభావంలో వచ్చిన మార్పులు, ప్రగతి – వ్యతిరేక మితవాద శక్తుల ఉద్యమాలు, వాటి స్వభావం గురించి పెద్దగా ఆలోచించని కొన్ని పార్టీలు మనకు కనపడుతున్నాయి.
కొద్ది, గొప్ప అంచనాల తేడాల వరకే అయితే ఎంతో, కొంత సర్దుబాటుకు అవకాశం వుంటుంది. అవగాహనలో తేడాలు ఎంత భారీగా ఉన్నాయంటే ఐక్య కార్యచరణ కుదరనంత భారీగా. అసలు తమ రాజకీయ విధానాలను, వర్గ విశ్లేషణను, రాజకీయ, ఆర్ధిక పరిస్థితులపై విశ్లేషణను పునఃసమీక్షకు పెట్టకుండా ఒక్కతాటి పైకి రాలేనంత భారీగా. తమ మిత్రవర్గాలేవో, శత్రు వర్గాలేవో కూడా ఇంకా తేల్చుకునే దశలోనే ఉండేంత భారీగా ఉన్నాయి.
సిపిఐ, సిపియంలను సోషల్ డెమోక్రటిక్ పార్టీలుగా అభివర్ణిస్తూ, వాటి వైఫల్యాల పునాదులపైనే ఫాసిజం పెరిగిందనే కమ్యూనిస్టు పార్టీలు, సంస్థలు నేడు ఉన్నాయి. శ్రామిక వర్గాన్ని ఒక అజేయ రాజకీయ శక్తిగా మార్చకుండా, ఆర్థిక పోరాటాలకు కుదించి, పెటీ బూర్జువా వర్గాన్ని ఫాసిస్టుశక్తులకు బలి చేశారని, ఇప్పటికీ ప్రతిఘటన అంటే ప్రగతిశీల జాతీయవాదంగా మాత్రమే చూస్తున్నారని ఈ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇలా ఆక్షేపించే పార్టీలలో ఎక్కువభాగం భారతదేశాన్ని అర్ధ భూస్వామ్య, అర్ధ వలస లేదా నయావలస సమాజంగా చిత్రిస్తున్నాయి. ఒకటి, రెండు పార్టీల అలా భారతదేశాన్ని చూడనివి కూడా ఉన్నాయి. పీపుల్స్ వార్, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, లిబరేషన్, రెడ్ స్టార్ వంటివి ఫాసిజంను ఒక భూస్వామ్య ధోరణికి సంకేతంగా చూస్తున్నాయి. ఫాసిజం అంటే వీటి దృష్ఠిలో సామ్రాజ్యవాద పెట్టుబడికి సేవ చేసే లక్ష్యంతో ఉన్న దళారీ పెట్టుబడిదారీ వర్గపు ఆకస్మిక ప్రతిస్పందన. ఈ మూడింటి మద్య తేడాలు కూడా బాగానే ఉన్నాయి. న్యూడెమోక్రసీ దృష్ఠిలో ఫాసిజం ఇంకారాలేదు. కానీ దేశం ఫాసిజం ప్రమాదం అంచున వుంది. ఫాసిజంను ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే పాలకవర్గాల ఉగ్రవాద పద్ధతిగా, సంకుచిత, జాతీయ భావనలతో ప్రజలు తమ వెనుక వచ్చేట్లుగా పాలకవర్గాలు చూసుకునే పద్దతిగా వర్ణిస్తుంటారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు సంస్థలైనప్పటికీ, 2024 ఎన్నికలలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాల్సి రావడంతో ఫాసిజం కాస్త వాయిదా పడిందని భావిస్తోంది.
ఇక సిపిఐ(ఎంఎల్)రెడ్ స్టార్ భారతదేశాన్ని నయా వలస దేశంగా, ఇప్పుడు నయా ఫాసిజంను ఎదుర్కొవాల్సిన కర్తవ్యం మన మీద ఉందనీ వాదిస్తోంది. ఫాసింజంను బూర్జువా రాజ్యంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా ఏర్పడే స్థితిగా వర్ణిస్తుంది. రాజకీయ సంక్షోభాలు అనేక రకాలుగా ఏర్పడవచ్చు కదా! అనే సందేహం కలుగుతుంది. బోనపార్టిజం, మిలటరీ నియంతృత్వం, ఇలా ఏవైనా కావచ్చుకదా! అది ఫాసిజం మాత్రమే కావాలని లేదుగా, దానికి వారి సమాధానం ఏమంటే, నయా ఉదారవాద దశలో ఇది నయా ఫాసిజమనీ సంప్రదాయ ఫాసిజానికి భిన్నమనీ చెప్తారు. పెట్టుబడి అంతర్జాతీయను సంతరించుకొన్న నేపథ్యంలో నయాఫాసిజం కూడా అంతర్జాతీయతను అలవర్చకున్నదన్నది వీరి భావనగా తోస్తోంది. వీరి ప్రకారం ఆర్ఎస్ఎస్ అమెరికన్ సామ్రాజ్యవాద ఏజెంటు. నయా-ఉదారవాద కార్పోరెటీకరణ నిరాటంకంగా సాగుతున్న భారత దేశంలో ఒక హిందూ మత రాజ్యాన్ని స్థాపించడం, హిందూ జాతీయవాదంను ప్రతిష్ఠించడం అనే పని సాగుతుందని విశ్వసిస్తోంది.
న్యూడెమోక్రసీగానీ, రెడ్ స్టార్గానీ, ఆ మాట కొస్తే పీపుల్స్ వార్గానీ ఫాసిజం పెరుగుదలకు సంబంధించిన మౌలిక వైరుధ్యం పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్ధిక సంక్షోభంలో ఉంటుందనే సంగతిని విస్మరించాయని చాలామంది విమర్శకులు ఆరోపిస్తున్నారు.
సగటు లాభపు రేటు దీర్ఘకాలంలో పడిపోతున్న ధోరణి నుంచే ఈ సంక్షోభం పుట్టుకొస్తుంది. ‘సగటులాభం రేటు’ గురించి పెట్టుబడి అన్ని రంగాలలోకి ధారాళంగా ప్రవహించినపుడు మాత్రమే మాట్లాడగలం, ఆఖరుకు వ్యవసాయరంగం కూడా! అప్పుడు కూడా సంక్షోభం రెండు రకాలుగా రావచ్చు. ఒకటి, భూయాజమాన్యంపై గుత్తాధిపత్యం కలిగిన సందర్భాలలో వ్యవసాయంలోకి ప్రవహించే పెట్టుబడిని నియంత్రించినప్పుడు. దీంతో నిరపేక్ష కిరాయి ఒక పెట్టుబడి కిరాయి రూపంలో వున్నప్పుడూ, రెండు భూమి జాతీయం చేయబడి, వ్యవసాయంలోకి పెట్టుబడి సాగినప్పుడు. నిరపేక్షకిరాయి రద్దయి, తారతమ్య అద్దె మిగిలినప్పుడు, ఈ రెండు సందర్భాలలోనూ నిరాటంకంగా ప్రధాన ఉత్పత్తి విధానంగా మారనప్పుడు మాత్రమే సంభవిస్తుంది. అటువంటప్పుడు దీనిని అర్ధవలస – అర్ధ భూస్వామ్య చట్రంలోకి ఎలా తేగలమన్నదే ప్రశ్న.
మరొక సంగతేమిటంటే ఒక వేళ దళారీ బూర్జువా వర్గమే రాజ్యాధికారాన్ని కలిగివుంటే, ఫాసిస్టు మితవాద సామాజిక ఉద్యమాలకు చోటునివ్వదు. ఎందుకంటే పెట్టీ బూర్జువా వర్గం ఒక వర్గంగా జాతీయ ఉద్యమాల వైపు ఆకర్షించబడుతూ వుంటుంది. అది ప్రగతి శీలమైన సరే, తిరోగమన ప్రవాహమైన సరే, అంతే కానీ ఫాసిజం వైపు మాత్రం వెళ్ళదు. పెటీ బూర్జువా వర్గం ఒక అర్ధ భూస్వామ్య, అర్ధవలస నిర్మాణాలలో పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభం ప్రభావానికి గురయ్యే సమస్య ఉద్భవించదు. అయితే అది జాతీయ అణివివేత ప్రభావానికి గురికావచ్చు. అర్ధ భూస్వామ్య, అర్ధవలస లేదా నయా, వలస దేశాలు సామ్రాజ్యవాద సంక్షోభాలకు గురి అయ్యే అవకాశం వుంది. అది ‘సగటు లాభపు రేటు’ సంక్షోభంగా మందుకురావు, వస్తే వాణిజ్య పరాధీనతలో తీవ్రత పెరగడం, అసమాన మారకం, దోపిడీ పన్నుల విధానం, అద్దె, వడ్డీ వంటి వాటిపై వస్తాయి.
పెటీ బూర్జువా ప్రతిస్పందన ఒక మితవాద, ఫాసిస్టు సామాజిక ఉద్యమంగా రూపుదాల్చిందంటే, అది పెట్టుబడి సంచయం ప్రభావం మూలంగానే, పెట్టుబడిదారీ విధానంలోని దోపిడీ, సంక్షోభం ఫలితంగానే సంభవిస్తుంది. ఫాసిస్టు సంస్థలు, వాటి భావజాలం వలసలలో, అర్ధ భూస్వామ్య, అర్ధవలస దేశాల్లో లేదా నయావలసలో ఉండవని ఎక్కడా అనలేం. కానీ ఫాసిస్టు మితవాద సామాజిక ఉద్యమాల రూపంలో ఉండటం గానీ, అధికారాన్ని కైవసం చేసు కోవటం గానీ జరగదు.
న్యూడెమోక్రసీ గానీ, రెడ్ స్టార్ కానీ ఫాసిజంను ప్రజాపోరాటాల నేపథ్యంలో సోషలిస్టు విప్లవం వైపు శ్రామిక వర్గ ఉద్యమం సాగుకుండా, బూర్జువా పాలక వర్గం చేసే ముందస్తు దాడిగా పొరపడుతున్నాయన్న విమర్శ కూడా వుంది. నిజానికి ఈ భ్రమలు చాలా మంది కమ్యూనిస్టులకు ఉంటాయి. కానీ ఆంటోనియో గ్రాంసీ, క్లారాజెట్కిన్లు చాలా కాలం క్రితమే దీన్ని స్పష్టం చేశారనీ, ఈ మధ్యకాలంలో నికోస్ పులస్ కూడా దీనిపై వివరణ ఇచ్చారని చెప్తుంటారు. ఫాసిస్టు దాడి లేదా ఆక్రమణ, శ్రామికవర్గ దాడికి ప్రతి స్పందన అంతకన్నాకాదు. నిజానికి ఫాసిజం ఉధృతికి కారణమైన రాజకీయ సంక్షోభం శ్రామికవర్గ దాడి పూర్తిగా సమసిపోయాక, దాని నిర్ణయాత్మక ఓటమి తర్వాత సంభవిస్తుందని చెపుతుంటారు. 1924లో గ్రాంసీ, విప్లవ శ్రామిక ఉద్యమం చురుకుగా, వీధుల్లో ఉన్నప్పుడు, ఫాసిజం నేరుగా దానితో తలపడలేదనీ, దానికి బదులుగా ఉద్యమం తనలోని బలహీనతల కారణంగా వైఫల్యం చెందాకే, కార్మికులపై జలపాతంలా దుమికిందనీ అది కూడా వారేదో చేస్తున్నారని కాదనీ, వారు శ్రామికులైనందుకే అని పేర్కొన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఫాసిజం పెరగటానికి కావాల్సిన రాజకీయ కూడలి, ఒక వలస దేశంలో వచ్చే అవకాశం లేదనీ, ఒకవేళ ఉంటే కేవలం సంస్థలుగా, కొద్దిపాటి పునాదితో, ఒక భావజాల పరంపరగా కొనసాగవచ్చునేమోకానీ, అధికారం చేపట్టే అవకాశం లేదనీ, పీపుల్స్ వార్ కూడా ఈ విమర్శకు అతీతమైనది కాదని అంటున్నారు. ఈ బలహీనతను అధిగమించేందుకే అది ఇండియాలోని ఫాసిజంను ‘బ్రాహ్మణ హిందూత్వఫాసిజం’ గా పిలుస్తుందన్న విమర్శ కూడా వుంది. అందువల్లే ఎమర్జెన్సీని కూడా ఫాసిజంగా వీరు పొరబడ్డారన్న చర్చవుంది.
చైనా కమ్యూనిస్టు పార్టీ కొమిన్టాంగ్ను ఫాసిస్టుగా పిలిచిందనీ, జపనీస్ అర్ధ భూస్వామ్య సైన్యాధిపత్యాన్ని ఫాసిస్టుగా వర్ణించిందనీ, భారతదేశంలో మనం దళారీ బూర్జువా వర్గాన్ని ‘ఫాసిస్టు’ అంటే తప్పేంటన్నది మవోయిస్టుల ప్రశ్నగా కనబడుతోంది. ఫాసిజం అన్న పదాన్ని అంత అజాగ్రత్తగా వాడలేమన్నది మరోవాదన. అందువలన ‘దళారీ ఫాసిజం’ అనీ, ‘ఉద్యోగ స్వామ్యపు ఫాసిజం’ అనీ, ‘భూ యాజమాన్య ఫాసిజం’ అనీ మాట్లాడటం కుదరదు.
నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని కాంక్షిస్తూ, అర్ధ వలస అర్ధ భూస్వామ్య పటంలోకి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని ఇమడ్చలేక, బూర్జువా ప్రజాస్వామ్యాన్ని ఫాసిజం కంటే ముందు చూపించాల్సి ఉన్నందున నాన్ మార్క్సిస్ట్ నిర్వచనమైన ‘సవర్ణ ప్రజాస్వామ్యం’ ఈ దేశంలో ఉన్నట్లు, అది అవర్ణులకు చోటులేని వ్యవస్థ అన్నట్లు మాట్లాడుతున్నారనేది మవోయిస్టులపై మరొక విమర్శ.
భారతీయ ప్రత్యేకత అయిన ‘కులం’ సమాజంలోని వ్యక్తులను శాశ్వతంగా విడగొట్టిందని, కుల ప్రాతిపదికగా ఈ దేశంలో ఫాసిజంను చూడాలని వారు ప్రతిపాదిస్తున్నారు. బూర్జువా పార్లమెంటరీ వ్యవస్థ ఇంకా రద్దు కాలేదు కాబట్టి, ఫాసిజం ఇంకా పూర్తిగా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోలేదన్న భావన కూడా వీరిలో వుంది. అయితే మిగిలిపోయిన సామ్రాజ్యవాదం, ఉద్యోగస్వామ్య పెట్టుబడి, బ్రాహ్మణిజం, కుల భూస్వామ్యం ఫాసిజంకు పునాదిని తయారు చేస్తున్నాయని వీరు వాదిస్తున్నారు. ఇది పాక్షిక సత్యమేనని, ఈ దేశంలో పెట్టుబడిదారీ విధానం వెళ్ళూనుకున్నదని, ఇది సామ్రాజ్యవాదపు జూనియర్ భాగస్వామి అనీ, ఇండియాలో ‘కౌలు’ పెట్టుబడిదారీ లక్షణాన్ని సంతరించుకున్నదనీ, ఇన్నిరకాల, నానాజాతి సమితిని ఒక్కచోట చేర్చడం తప్పనీ వాదిస్తున్న వర్గం కూడా నేడు మన ముందుంది.
‘సవర్ణ ప్రజాస్వామ్యం’ లాంటి పదాలు అంబేద్కరిజం వైపు దాని నుంచి అస్థిత్వ రాజకీయాలవైపు తీసుకెళతాయేగానీ, వర్గ విశ్లేషణకు దారితీయవనీ మరి కొందరి వాదన. ఉదారవాద వైరస్ సోకిన వారే వర్గ విశ్లేషణ లేని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడగలరు. ప్రతి దేశానికీ ఏదో ఒక ప్రత్యేకత, ఒక చోట జాతి, మరోచోట మతంలాంటివి ఉంటూనే ఉంటాయని, ఆదర్శ ప్రజాస్వామ్యాలు ఉండవనీ వీరు అంటున్నారు. కులం- వర్గం వేరువేరు భిన్నరూపాలనీ, వాటి మధ్య ఎప్పుడూ ఏకత్వం లేదనే మావోయిస్టుల వాదనను అంగీకరించటం లేదు. చారిత్రక భౌతికవాద దృష్టికోణం కులంను, వర్గంను అర్ధం చేసుకోవడంలో తప్పక ఉండి తీరాలి. వీటిలో ఏది ముఖ్యమైనది? అన్న ప్రశ్న వదిలేస్తే, బ్రాహ్మణ వాదాన్ని ‘ఒక అమూర్త భావన’గా స్వీకరిస్తే అది చారిత్రిక దృక్పథాన్ని వదిలివేయడం అవుతుంది. ఇది ఆచరణలో ఫాసిస్టులపై ప్రతిఘటనా పోరాటాలను నిర్మించడంలో ఇబ్బందిని తీసుకువస్తుంది.
కులం, లింగభేదం, సామాజిక అణిచివేతలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మిస్తే సరిపోదు. ఈ ఉద్యమాలకు వర్గపోరాట మార్గాన్ని నిర్దేశించడం చేయవలసి వుంటుంది. అస్థిత్వరాజకీయాలవైపు, రాజ్యాంగ సంరక్షణా వాదంవైపు, సంస్కరణ వాదం వైపు కొట్టుకొని పోకుండా ఉండటం ముఖ్యం. శ్రామిక వర్గ మార్గాన్ని వీడకపోవడం ముఖ్యం. అంబేద్కర్ ప్రతిపాదించే సిద్ధాంతానికి ఉన్న ఫెబియన్ సోషలిజం, వ్యావహారిక సత్తావాదం పరిమితులను అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే మార్క్సిస్టు మౌలిక భావనలకు దూరమయి, రకరకాల ఇజాలలో కొట్టుకుపోయే ప్రమాదముందని చెపుతుంటారు.
నేటి కమ్యూనిస్టు పార్టీలలో పరిమాణం రీత్యా, విస్తృతి రీత్యా అతిపెద్ద పార్టీగా ఉన్న సిపియం ఫాసిజంపై 1935లో కొమిన్‌టర్న్ 7వ మహసభ నిర్వచనంపై ఏకీభావం కన్పరుస్తోంది. ప్రకాశ్ కారత్ 2016లో ఇండియాన్ ఎక్స్‌ప్రెస్‌కు రాసిన వ్యాసం ప్రకారం “ఇండియాలో ఫాసిజం ఇప్పటికైతే రాలేదు, నేడు భారతదేశంను ఊపేస్తున్న ప్రమాదం నియంతృత్వమే తప్ప ఫాసిజం కాదు. హిందూత్వ మార్గంలో సమాజాన్ని, రాజకీయవ్యవస్థను వ్యవస్థీకరించే ఒక నిశ్చిత ప్రయత్నం ఉన్నప్పటికీ, ఫాసిస్టు పాలన వచ్చే పరిస్థితులు కూడా లేవు.”
కానీ ప్రతి ఆర్ధిక సంక్షోభం ఫాసిజానికి దారితీయాలని లేదు. ఆర్ధిక సంక్షోభాలు ఫాసిజానికి కానీ ఇతర అసాధారణ బూర్జువా పాలనా రూపాలకు కానీ ఎప్పుడు దారి తీస్తాయంటే, ఎక్కడైతే వర్గపోరాటం నిర్దిష్ట కూడలిలో రాజకీయ సంక్షోభాలు ఉద్భవిస్తాయో అక్కడ వచ్చే అవకాశంవుంది. శ్రామిక వర్గ ఆక్రమణ పూర్తిగా ఓడింపబడి, బూర్జువా పాలన పవర్ బ్లాక్‌లోని రాజకీయ సంక్షోభంపై ఇంకా ఆధారపడి ఉప్పప్పుడు, పవర్ బ్లాక్‌ను బూర్జువా ప్రజాస్వామ్యన్ని రద్దు చేయకుండా నెలకొల్పలేమని భావించే రాజకీయ సంక్షోభం ఫాసిస్టు పాలనకు తెరలేపుతుంది.
2017 అక్టోబరులో ఆసియన్ ఏజ్‌కు బాబ్రీమసీదు విధ్వంసం జరిగి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా రాసిన వ్యాసంలో సీతారాం ఏచూరి, బాబ్రీవిధ్వంసం ఈ దేశంలో ఫాసిజం ప్రారంభంగా అభివర్ణించారు. ఒకే పార్టీలో రెండు మార్గాలు ఉండటం తప్పేమీ కాదు. కానీ అంతిమంగా పార్టీ ఏ మార్గాన్ని ఎంచుకుందో అదే పార్టీ అఫిషియల్ లైన్ అవుతుంది. మైనారిటీ లైన్‌ను ఎంచుకున్నవారు తగిన స్థలాల్లో తమ వాదన విన్పిస్తూనే ఉంటారు. వీటి ఫలితంగా 22వ కాంగ్రెస్ డాక్యుమెంట్లో రాజకీయ మార్గంపై మరికొంత స్పష్టత వచ్చింది.
తన పొలిటికల్ లైన్లో(vi)వ అంశంలో ‘ప్రజా ఉద్యమాలకు కావాల్సిన ఉమ్మడి వేదికలను అన్ని స్థాయిలలో ఏర్పాటు చేయాలనీ, ప్రజావ్యతిరేక విధానాలపట్ల ప్రతిఘటనను తీవ్రతరం చేయాలనీ, క్రూర ఆర్ధిక విధానాల దాడికి వ్యతిరేకంగా, ప్రజాసమస్యలపై ఉమ్మడి కార్యాచరణ ఉండాలని’ రాసుకున్నారు.
(vii)వ అంశంలో మతతత్వశక్తులకు వ్యతిరేకంగా ప్రజా ఐక్యతను నిర్మించాలని, ఇవి రాజకీయ, ఎన్నికల కూటములుగా ఉండనవసరం లేదని రాసుకున్నారు.
అయితే అదే సమయంలో ఇది ఎలక్షన్ల ఎత్తుగడకు సంబంధించి బిజెపికి వ్యతిరేకంగా భారత దేశ స్థాయిలో ఒక కూటమి అవసరం లేదని రాసుకున్నారు.
నాన్ కాంగ్రెస్, లౌకిక ప్రాంతీయ రాజకీయ పార్టీలను తమతో కలుపుకు వెళ్ళాలని కూడా అనుకున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఎంత గందరగోళానికి దారి తీసిందో కూడా చూశాం. బూర్జువా ప్రజాస్వామ్య ‘రూపం’ ఉనికిలో ఉండటం అంటే ఫాసిజం లేదని కాదు అని నేటి విమర్శకుల మాట్లాడుతుండడాన్ని మనం ఈ సందర్భంగా గమనంలో ఉంచుకోవాలి. నేడు ఫాసిస్టులు బాహ్యరూపాన్ని, బూర్జువా ప్రజాస్వామ్య నిర్మాణాన్ని ధ్వంసం చేయకుండానే ‘కరి మింగిన వెలగపండు’గా సారాన్ని లాగివేస్తున్నారు. ఈ విషయాన్ని పులన్జాస్, ఎల్లెవ్ మైక్సిన్స్వుడ్, డొమినికోలోసుర్డో లాంటి వారు చాలాసార్లు చెప్పారు.
కాంగ్రెస్, బిజెపిలు రెండూ నయా ఉదారవాద విధానాలే అనుసరిస్తున్నాయి కదా వాటి మధ్య తేడా ఎందుకు? అనే ప్రశ్న కూడా పార్టీ నుంచి వినిపిస్తోంది. బిజెపి వెనుక పెటీ బూర్జువా మితవాద సామాజిక ఉద్యమాన్ని ఎగద్రోసెందుకు కేడర్ బేస్డ్గా ఉన్న ఆర్ఎస్ఎస్ను దాని భావజాలాన్ని తక్కువ అంచనా వేయలేం. ఇది ఎన్నికలలో ఓడిపోతే, పోయేది కూడా కాదు. దీన్ని వీధుల్లో కూడా ఓడించాల్సి వుంటుంది. అయితే చట్టబద్ద పోరాటాలకే తనను తాను కుదించుకుంటూ, ఆర్ధిక డిమాండ్లకే తమ యూనియన్లను పరిమితం చేస్తూ సంస్కరణవాదంవైపు, అప్పుడప్పుడూ అంబేద్కరిజం వైపు ప్రయాణించే స్థితిలో ఉందన్న విమర్శ, సిపియం శ్రేణులకు రుచించటం లేదు.
సిపియంయల్ లిబరేషన్ మత పరమైన ఫాసిజం వుందని వాదిస్తున్నారు. ఫాసిజం అంటే 1935లో కొమిన్‌టర్న్ నిర్వచనాన్నే ఉదహరిస్తున్నారు. వీరితో పాటు మాస్ లైన్ పార్టీ కూడా పరిష్కారంగా పాపులర్ ఫ్రంట్ ఎన్నికల కూటమిని భావిస్తున్నారు. ఇది వెనుక బడ్డ పెట్టుబడిదారీ దేశంగా గుర్తిస్తూనే ప్రజాస్వామిక విప్లవం కావాలంటున్నారు. ఫాసిజం ఏ శక్తులతో ఎదుగుతుందో మనం ఇప్పటికే మాట్లాడుకొన్నాం.
అయితే ఆచరణ సంగతేమిటి? ప్రతిఘటన సంగతేమిటి?
ఫాసిజంపై ఇన్ని రకాల అవగాహనల మధ్య ఇంత గందరగోళాల మధ్య ఒక ఉమ్మడి ఐక్య పోరాటాలు నిర్మించడం అంత సులువేమీ కాదు పైగా ఎవరి ఎజెండాను వారు ప్రత్యేకంగా ముందుకు నెట్టుతూ ఇతరులు కలిసి రాలేదని నిందించే ఒక అలవాటు చాలా కాలంగా అన్ని కమ్యూనిస్టు పార్టీలలో కనపడే ఒక సాధారణ లక్షణం అయితే ఫాసిజంపై నిజంగా పోరాటం చేయగలిగిన ఒక భావజాలం అందుకు కావలసిన శ్రామిక సైన్యం ఈ పార్టీల వెనకనే ఉన్నాయనేది ఒక నగ్న సత్యం. అందువల్ల తమ విభేదాలను సాధ్యమైనంతమేర కుదించుకొని ఎంతో కొంత ఉమ్మడి అవగాహనకు రావడం తక్షణ కర్తవ్యం. అలా రాని పక్షంలో ఎవరో ఒకరు ముందు పడి ఈ పోరాటాలను ప్రారంభిస్తే, ఉధృతం చేయగలిగితే, వారి వెనక మిగతావారు ముఖ్యంగా ప్రజలు అనుసరించేట్లుగా ఉంటే ఆ మార్గం కూడా హర్షణీయమే. అయితే ఆ మార్గం ఏమిటి అన్నది ప్రశ్న.
మొట్టమొదటగా ఒక శ్రామిక వర్గ ఐక్య సంఘటనను నిర్మించటం ఇది పాపులర్ ఫ్రంట్ కంటే భిన్నమైనది. పాపులర్ ఫ్రంట్ అంటే అది సోషల్ డెమోక్రట్లను ఇతర నాన్ ఫాసిస్టు బూర్జువా పార్టీలను కలుపుకొని నిర్మించే పార్టీల ఐక్య సంఘటనగా చూసే అలవాటు ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది దానికి భిన్నమైన శ్రామిక వర్గ ఐక్యత ప్రాధాన్యత శ్రామిక వర్గ ఐక్యతకే ఇవ్వాల్సి ఉంటుంది దాని ఇరుసుగానే మనం మిగతా అన్ని ఉద్యమాలను నిర్మించవలసి ఉంటుంది. అన్ని రకాల ఆర్థికవాదాలను, ట్రేడ్ యూనియన్ల సిద్ధాంతాలను, అరాచక వాదాలను పక్కనపెట్టి, విప్లవాత్మక ప్రజాఉద్యమాలను కార్మిక వర్గ నాయకత్వంలో నిర్మించవలసిన అవసరం ఉంది. శ్రామిక వర్గాన్ని ఒక రాజకీయ వర్గంగా మార్చవలసిన అవసరం ఉంది. అలాగే ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో ప్రధానంగా పెట్టి బూర్జువా వర్గాలను ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించవలసి ఉంటుంది. ఎందుకంటే మితవాద సామాజిక ఉద్యమాలను నిర్మించి, అధికారంలో ఎంతో కొంత భాగం పంచుకొని, ఆ తర్వాత బడా పెట్టుబడి ముందు తీవ్రంగా నష్టపోయే వర్గం ఇదే. అందువలన ఈ పెటీ బూర్జువా సెక్షన్స్‌లో ఆయా నిర్దిష్ట సమస్యలపై మనం భావజాల రంగంలో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది.
అయితే నిర్వహించేటప్పుడు మనం ప్రధానంగా చూడవలసింది సంస్కరణ వాదం వైపు, రాజ్యాంగ సంరక్షణ వాదం వైపు కొట్టుకుపోకుండా పెంటీ బూర్జువా సెక్షన్‌ను సత్యం వైపు మళ్ళించటం ఓ పెద్ద బాధ్యత. అలాగే సాంస్కృతిక రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే పద్ధతిలో ఒక ఆర్గానిక్ ప్రజా పునాదిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. విప్లవాత్మక కమ్యూనిస్టు పని విధానాన్ని గ్రామీణ ప్రాంతంలో అవలంబించవలసి ఉంటుంది. ధనిక రైతులపై ఒక స్పష్టమైన అవగాహనతో బయటకు రావాల్సి ఉంటుంది. కుల వ్యతిరేక పోరాటాలను వర్గ పునాదిపై వర్గ దృక్పథంతో నిర్మించవలసి ఉంటుంది. అలాగే పితృస్వామ్య వ్యతిరేక ఉద్యమాలను కూడా నిర్మించాల్సి ఉంటుంది. నిజాయితీతో కూడిన లౌకికవాదంపై ఒక నిరంతర పోరాటం నిర్వహించవలసి ఉంటుంది. శాస్త్రీయ విజ్ఞానం కోసం హేతుబద్ధత కోసం ఒక ప్రజా ఉద్యమ ప్రచారాన్ని నిర్వహించవలసి ఉంటుంది.
పౌర ప్రజాస్వామ్య హక్కులకై నిరంతరం ఉద్యమాలను పార్టీలకతీతంగా నిర్మించవలసి ఉంటుంది. అలాగే అసంఘటిత రంగాన్ని ప్రధానంగా సమీకరించవలసి ఉంటుంది. వీటన్నిటికీ వర్గ దృక్పథమే గీటురాయిగా ఉండాలి. లేదంటే ఆ పోరాటాలన్నీ బూర్జువా పార్టీలకు ఉపయోగపడటమో లేదా అస్తిత్వ రాజకీయాల మధ్య చీలిక పీలికలై ఉనికిని కోల్పోవడమో జరిగే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఎలా రూపుదిద్దుకుంటాయో ఈ చారిత్రక బాధ్యతను ఆయా కమ్యూనిస్టు పార్టీలు ఎలా నిర్వహిస్తాయో చూడవలసి ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.