
Reading Time: 3 minutes
శశిథరూర్ ఈ మధ్య మోడీని పొగడటం ఆయన పట్ల ముస్లిం ఓటుబ్యాంకులో సందేహాలు లేవనెత్తింది. పాలస్తీనా ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న హమస్ పట్ల థరూర్ వ్యాఖ్యలు ముస్లిం సమాజానికి రుచించేవిగా లేవు. ఒకప్పుడు తన కులానికి చెందిన నాయర్ సర్వీస్ సొసైటీ శశిథరూర్‌ను స్వాగతించింది. కానీ ప్రస్తుతం ఆ సంస్థతో ఆయనకు సన్నిహిత సంబంధాలు కొనసాగటం లేదు. కేరళలో శశిథరూర్ రాజకీయ వివాదలకు కేంద్రమవుతున్నారు.
గత నెలలో జరిగిన నిలంబుర్ అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో ఓ చర్చ మొదలైంది. 2026లో జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున శశిథరూర్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉంటారన్నదే ఆ చర్చ.
అయితే, కాలం గడిచే కొద్దీ ఆ ఆశ నీళ్లు లేని మేఘంగా మారింది.
నాలుగు దశాబ్దాల చరిత్రలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడిఎఫ్) వరుసగా రెండు సార్లు అధికారానికి దూరంగా లేదు. ఒకసారి యుడీఎఫ్, మరో సారి ఎల్డీఎఫ్ అన్న సాంప్రదాయాన్ని 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ అడ్డుకున్నది. వరుసగా రెండోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమిగా రికార్డు సృష్టించింది. వరుసగా ఒకే ముఖ్యమంత్రి రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేసిన చరిత్ర కూడా కేరళ రాజకీయాల్లో లేదు. పినరయి విజయన్ 2016లోనూ, 2021లోనూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేతగా రికార్డు సృష్టించారు. తొమ్మిదేళ్ల పాటు వరుసగా అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది.
కానీ గత నెల జరిగిన నిలంబూర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వ్యాఖ్యానం మారింది. కేవలం అసెంబ్లీ ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు విజయం సాధించటం కాంగ్రెస్ ఆత్మ విశ్వాసం పెంచటానికి ఉపయోగపడింది. ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సథీశన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించే నేతగా మారతారన్న చర్చ మొదలైంది.
అసంతృప్తితో నిండిన పొగడ్తలు..
దీనికి భిన్నంగా సొంత పార్టీలోనే శశిథరూర్ పలుకుబడి తగ్గిపోతోంది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తటం, పార్లమెంటరీ దౌత్యవేత్తల బృందంలో ఉత్సాహంగా పాల్గొనటం ఆయన్ను రాష్ట్ర రాజకీయాల నుంచి పార్టీ నుంచి దూరం చేసింది. క్షేత్రస్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా శశిథరూర్ వ్యాఖ్యలను దిగమింగుకోలేకపోతునన్నారు. పార్టీ కంటే దేశమే ముఖ్యమన్న మాటలు ఆయన పట్ల ఉన్న అసంతృప్తిని మరింతగా పెంచాయి.
ఒకప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా శశి థరూర్ ఉన్నారు. ఈ అభిప్రాయం ఆయనకు సొంతంగా కలిగింది కావచ్చు లేదా ఆయన అభిమానులు చర్చకు పెట్టింది కావచ్చు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే నిర్లక్ష్యానికి గురవుతున్నారన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల నుంచి తెరమరుగవుతారాన్న సందేహాన్ని లేవనెత్తుతోంది.
కానీ కేరళ కాంగ్రెస్ శాఖకు ఇదేమీ ఆశ్చర్యంగా అనిపించటం లేదు. పార్టీకి ఆయన ఉలిపి కట్టె వ్యవహార శైలి బాగా తెలుసు. 2022లో రాష్ట్రవ్యాప్తంగా ఒంటరిగా యాత్ర చేపట్టారు. రచయితలు, మతసంస్థల నాయకులు, సాంస్కృతిక ప్రముఖులు వంటి వారిని కలిశారు. ఈ యాత్ర గురించి కానీ దాని ఉద్దేశ్యం గురించి కానీ పార్టీతో సంప్రదించలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల నుంచి తప్పుకుని, 2026 అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న చర్చకు ఈ పర్యటన దారితీసింది. చివరకు ఈ ప్రయత్నాలను విడనాడి 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి బరిలోకి దిగారు. నాల్గోసారి గెలుపొందారు.
కేరళలో కాంగ్రెస్ పార్టీ కంటే తనకు ఎక్కువ ప్రజాబలం ఉందని థరూర్ మొదటి నుంచి చెప్పుకునే ప్రయత్నం చేశారు. వరుసగా నాలుగు సార్లు గెలిచినా ఆయన క్షేత్ర స్థాయి పార్టీ నిర్మాణంలో ఇమడలేకపోయారు. ఢల్లీ నుంచి దిగుమతయిన నేతగానే మిగిలిపోయారు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించటమే సందర్భోచితంగా జరిగింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా పోటీ చేసిన థరూర్‌కు కాంగ్రెస్ భద్రమైన స్థానం నుంచి గెలిపించాలని ప్రయత్నించింది. తొలి ఎన్నికల్లోనే ఓడిపోతే ఆయన రాజకీయ జీవితం అక్కడే ఆగిపోయి ఉండేది.
భిన్నమైన నాయకత్వ శైలి..
థరూర్ రాజకీయ ప్రయాణం గమనిస్తే కేరళలో 1971లో వడగర నుంచి గెలిచిన కేపీ ఉన్నికృష్ణన్ శైలిని తలపిస్తోంది. కాకపోతే శశి థరూర్ కంటే భిన్నంగా ఉన్ని కృష్ణన్‌కు స్థానికంగా పట్టుంది. థరూర్ కేరళలోనూ, పార్టీలోనూ బయటి వ్యక్తిగానే మిగిలిపోయారు. నాలుగు సార్లు వరుసగా గెల్చినా తనకంటూ నికరమైన ఓటుబ్యాంకు, ప్రజా పునాదిని థరూర్ ఏర్పాటు చేసుకోలేకపోయారు.
2024లో బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్‌పై థరూర్ స్వల్ప మెజారిటీతో నెగ్గారు. ఈ గెలుపు తన వ్యక్తిగతమైన గెలుపుగా థరూర్ భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో పలువురు ఈ అంచనాతో విబేధిస్తున్నారు. పార్టీ పునాది కృషి లేకపోతే గెలిచే సమస్యే లేదన్నది స్థానిక కాంగ్రెస్ నేతల వాదన. రానున్న ఎన్నికల్లో తివరువనంతపురం నుండి సీపీఎం మద్దతుతో థరూర్ పోటీ చేసే అవకాశం లేకపోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. కొన్నేళ్ల ముందు ఈ ఆలోచనకే రాష్ట్ర రాజకీయాల్లో తావుండేది కాదు.
నిలంబూర్ ఉప ఎన్నికల్లో సథీశన్ కొత్త తరహా నాయకత్వ శైలితో ముందుకొచ్చారు. గతంలో పినరై విజయన్ సహచరుడుగా ఉన్న పీవీ అన్వర్‌ను ఎన్నికల వేల సథీశన్ బయటే నిలువరించగలిగాడు. అన్వర్‌ను బరిలోకి దించరాదన్న నిర్ణయాన్ని అయిష్టంగానే అయినా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అంగీకరించింది. యూడిఎఫ్ కూటమిలో కాంగ్రెస్ తర్వాత ముస్లిం లీగ్ అతి పెద్ద భాగస్వామి. నిలంబూర్ ఉప ఎన్నికల ప్రచారంలో థరూర్ పాల్గొనలేదు. తనకు ఆహ్వానం లేదని తర్వాత ప్రకటించారు. ఓ కాంగ్రెస్ ఎంపీ థరూర్ ప్రకటనపై స్పందిస్తూ ‘‘ఇది ఎవరింట్లో పెళ్లి? థరూర్‌కు ఆహ్వానం ఇవ్వడానికి’’ అని విమర్శించారు.
ఉప ఎన్నిక విజయాన్ని యూడీఎఫ్ బృందం సమిష్టిగా సాధించిన విజయమని సథీశన్ అన్నారు. థరూర్ పార్లమెంట్లో ఎన్నడూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీతో సమన్వయం చేసుకోలేదు. ఒంటరిగానే వ్యవహరించేవాడు. పార్లమెంట్లో జరిగే నిరసనల్లోకానీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కానీ థరూర్ కలిసేవారు కాదు. ‘ఆయన అలంకారప్రాయమైనవాడు. నలుగురితో నడిచేవాడు కాదు’ అంటారు కవి, సామాజిక కార్యకర్త కాల్పట్ట నారాయణన్. ‘ఎన్నడన్నా రాహుల్ గాంధీని థరూర్ పొగడగా చూశామా? మోడీని పొగుడుతున్నారు చూడండి’ అన్నారు.
గాంధీ సిద్ధాంతాల అనుయాయి ఎంఎన్ కరస్సెరి ‘థరూర్ నమ్మదగిన వాడు కాదు. ఆయన పుస్తకం నేనెందుకు హిందువును అన్న రచన కూడా రెచ్చగొట్టేదిగా ఉంది. ఆయన భవిష్యత్తు దారెటో ఆ పుస్తకమే చెప్తోంది’ అన్నారు. అనేక మంది ఇతరుల్లాగానే థరూర్ కూడా సైద్ధాంతిక నిబద్ధత లేనివాడని ఆయన అభిప్రాయపడ్డారు.
యుడీఎఫ్ గెలిస్తే సథీశన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి సహజమైన ఛాయిస్. థరూర్ కంటే భిన్నంగా క్షేత్ర స్థాయి నుంచి ఎదిగి వచ్చిన నేత సథీశన్. రమేష్ చెన్నితల కూడా సథీశన్లాగానే క్షేత్ర స్థాయి నుంచి ఎదిగి వచ్చిన నేతగా ఉన్నారు. వీరిరువరికీ భిన్నంగా థరూర్ కృష్ణమీనన్లాగా బయటి వాడిగానే ఉండిపోయారు. కృష్ణమీనన్ తిరువనంతపురం నుంచి గెలిచినా ఆ నియోజకవర్గం ఆయన్ను సొంత మనిషిగా భావించలేదు. ‘ఆయన మాలో ఒకడే కానీ’ అన్నది కృష్ణ మీనన్ గురించిన అర్థోక్తి.
మునిగే పడవ థరూర్..
శశి థరూర్ ఈ మధ్య మోడీని పొగడటం ఆయన పట్ల ముస్లిం ఓటుబ్యాంకులో సందేహాలు లేవనెత్తింది. పాలస్తీనా ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న హమస్ పట్ల థరూర్ వ్యాఖ్యలు ముస్లిం సమాజానికి రుచించేవిగా లేవు. ఒకప్పుడు శశిథరూర్ కులానికి చెందిన నాయర్ సర్వీస్ సొసైటీ ఆయన్ను స్వాగతించినా ప్రస్తుతం అంత సన్నిహిత సంబంధాలు కొనసాగించటం లేదు. కేరళలో శశి థరూర్ రాజకీయ వివాదాలకు కేంద్రమవుతున్నారు.
థరూర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయటం వలన ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుందని కాంగ్రెస్ భావించిన రోజులు లేకపోలేదు. ఆ రోజులు పోయాయి. రాజకీయ పరిశీలకుడు కేటీ రామ్మోహన్ అభిప్రాయపడినట్లు ‘‘థరూర్ గౌరవం దెబ్బతిన్నది. స్వార్ధపరుడిగా గుర్తింపు పొందారు. ఆయన సేవలు కాంగ్రెస్‌కు అక్కర్లేదు. సొంతంగా పోటీ చేస్తే గెలుస్తాడో లేదో కూడా తెలీదు.’’
ప్రస్తుతానికి థరూర్ రాజకీయ భవిష్యత్తు కేరళతో కంటే ఢల్లీతోనే ముడిపడి ఉంది.
అనువాదం: కొండూరి వీరయ్య
(వ్యాస రచయిత కేరళలో సీనియర్ జర్నలిస్టు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.