
పోలవరం ప్రాజెక్టులో 423 కోట్లతో గతంలో నిర్మించిన డయాఫ్రంవాల్ ఎందుకు ధ్వంసం అయిందనే కారణాలను విశ్లేషించి, లోతైన పరిశీలన చేసి నిర్ధారించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. గోదావరి వరదలకు నష్టపోయిన డయాఫ్రంవాల్ వైఫల్య మూలాలను తేల్చకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో డయాఫ్రం వాల్‌కు శంకుస్థాపన చేశారు.
ప్రతిపాదనల దశ నుంచే పోలవరం ప్రాజెక్ట్ వివాదాలాకు చిరునామాగా మారింది. ఎంతో మంది పర్యావరణవేత్తలు ఈ ప్రాజెక్టు ఆచరణ రీత్యా మన్నికైనది కాదని అభ్యంతరాలు చెప్పారు. కానీ ప్రభుత్వాలు చెవికెక్కించుకోలేదు. 2004కు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం అనే తన పెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా పోలవరం ప్రాజెక్ట్‌ను ముందుకు తెచ్చారు. తర్వాత అధికారానికి వచ్చిన వైఎస్ రాజశేఖ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని అప్పటి యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా గెల్చుకున్న సీట్లలో మూడో వంతు సీట్లను రాజశేఖరెడ్డి అందించారు. కాంగ్రెస్‌కు దేశ రాజకీయాల్లో పూర్వ వైభవాన్ని తేవడానికి కారణం ఆంధ్రప్రదేశ్‌లో గెలుపే కావడంతో, రాజశేఖరెడ్డి ఒత్తిడికి యూపీఏ తలొగ్గక తప్పలేదు. చివరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రూపంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి పోలవరం, రాజధాని నిధుల బాధ్యత మాదే అంటూ బీజేపీ, కాంగ్రెస్‌లు భరోసా ఇచ్చిన తర్వాతనే రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. ఆ వాగ్దానాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలంటే 2014 ఎన్నికల్లో మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని సమర్ధించక తప్పదని చంద్రబాబు అప్పట్లో దాన్ని సిద్ధాంతీకరించారు. ఈ విధంగా చూసుకున్నప్పుడు దేశంలో వామపక్షాలు తప్ప అన్ని ప్రధాన స్రవంతి పార్టీలు పోలవరానికి వరాలు ఇచ్చుకుంటూనే వచ్చాయి. కానీ పర్యావరణ వేత్తల, ప్రఖ్యాత ప్రపంచ, దేశీయ ఇంజనీరింగ్ నిపుణుల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవడానికి ఏ పార్టీ ఏ ప్రభుత్వమూ సిద్ధం కాలేదు. ఫలితంగా మన్నిక లేని డిజైన్ల ఆధారంగా ప్రాజెక్ట్ నిర్మాణం మొదలైంది. దాని ఫలితాలు, పర్యవసానాలు మొదటి డయాఫ్రం వాల్ కూలడంలో మనకు కనిపిస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్డీఎస్ఏ అన్నట్లు, భౌగోళిక అంతర్గత పరీక్షలు, భూసాంకేతిక పరీక్షలు చేయకుండానే, ఆ ప్రాజెక్టు కుప్పకూలడానికి కారణమైన ఏ తీవ్రమైన తప్పులైతే కేసీఆర్ చేశారో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో, డయాఫ్రం వాల్ కూలడానికి కారణమైన, 95 మీటర్ల సాండ్ బెడ్‌ను నిశితంగా పరిశీలించకుండానే రెండో డయాఫ్రం వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం, 360 మీటర్లు నిర్మించడమూలాంటి మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తున్నారు.
2014 నుంచి 2022 వరకు బీజేపీ, బీ(టీ)ఆర్ఎస్ పవిత్ర పొత్తుకు లొంగిన మోడీ, కాలేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ను గుడ్డిగా సమర్ధించారు. అంతేకాకుండా, కేంద్ర మంత్రులు కాలేశ్వరంను, కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తుతూ కీర్తించారు. నేడు చంద్రబాబు, నితీష్ భుజస్కందాలపై బతుకుతున్న కేంద్ర మోడీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు పట్ల అదే వైఖరిని అవలంబిస్తుంది.
పోలవరం ప్రాజెక్టును 2027కల్లా జాతికి అంకితం చేస్తానని చంద్రబాబు ఘంటాపథంగా ప్రకటించారు. అసాధ్యమని పోలవరంలోని అనేక విభాగాల్లో వైఫల్యాలు నిరూపిస్తున్నాయి. మొదట 18 నెలలు శ్రమించి నిర్మించిన డయాఫ్రం వాల్ ఒకే ఒక్క గోదావరి మహత్తరమైన వరద శక్తికి తునాతునకలైంది. చంద్రబాబు శంకుస్థాపనతో మొదలైన రెండో డయాఫ్రం వాల్ గోదావరి మహత్తర జలశక్తిని ఎదురొడ్డి నిలుస్తుందా? కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ఇంజనీర్లపై మోపిన డెడ్‌లైన్ ఉక్కు పాదాలు అవినీతి విచారణ కమిషన్ మెట్లుఎక్కించింది, డెడ్ లైన్లను పెట్టే చంద్రబాబు వీటిని మర్చిపోతున్నారా?
డయాఫ్రం వాల్ నిర్మించడం కొరకు, వర్షాకాలంలో ఎంత భారీ వరదలు వచ్చినా దాని సీపేజీని, లీకేజీని కాపర్ డ్యాంలతో ఆపి, వేగంగా పూర్తి చేయడానికి బట్రస్ డ్యాం నిర్మిస్తున్నారు. అయినా నిర్మిస్తున్న రెండో డయాఫ్రం వాల్ నిలుస్తుందా అనేది భూగోళమంత ప్రశ్న? వీటన్నింటికి సమాంతరంగా సాగుతున్న రెండో డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయితే, దానిపైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం పథకం.
పోలవరం ప్రాజెక్టు మొత్తంలో అతి ముఖ్యమైనది, అత్యంత సంక్లిష్టమైనది డయాఫ్రం వాల్. అసలు ఈ డయాఫ్రం వాల్ నిర్మాణం సజావుగా ఇప్పుడైనా పూర్తవుతుందా? పూర్తయినా 25- 35 లక్షల క్యూసెక్కుల మహత్తర వరదను తట్టుకుని నిలుస్తుందా? ఈ ప్రశ్నలకు ఆంధ్ర, కేంద్ర, అంతర్జాతీయ ప్రఖ్యాత జలనిపుణులు కూడా జవాబు చెప్పలేకపోతున్నారు. గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వీరి కళ్ళముందే గతంలో 423 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డయాఫ్రం వాల్ వరదకు మొత్తం 1396 మీటర్ల పొడవులో, 425 మీటర్లు ధ్వంసం అయింది. ఎందుకు ముక్కలైందో నిర్దిష్టంగా ఈరోజుకూ తేల్చలేదు. ఆంధ్రప్రదేశ్, కేంద్ర జలసంఘం ఇంజనీర్లు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ఇంజనీరింగ్ నిపుణులని కేంద్ర సీడబ్ల్యూసీ నియమించింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కంపనం పుట్టించింది.
డయాఫ్రం వాల్ నిర్మాణం అసలు ఎందుకు? నది గర్భంలో రాక్ బెడ్ కాకుండా ఇసుక బెడ్ 100 మీటర్ల వరకు ఉంది. ఇసుక బెడ్ పై ఇంత భారీ డ్యాం నిర్మాణం సాధ్యం కాదు. పైగా అత్యంత విపత్తుకు దారితీస్తుంది. డ్యాం పూర్తయి 194 టీఎంసీల నీళ్లను నిలువ చేస్తే, ఆ నీరంతా నది బెడ్ పై అంతులేని ఒత్తిడితో, మహాశక్తితో భూగర్భంలో ఉన్న ఇసుక రేణువుల మధ్య ఉన్న సందుల్లోంచి భారీ ఎత్తున ఖాళీ అయ్యి దిగువ నదిలోకి వెళ్ళిపోతుంది.
194 టీఎంసీల నీటి మట్టం, చాలా ఎత్తైన శిఖరం పై నుంచి దిగువకు కదులుతున్న ఓ మహాప్రళయ జలశక్తి లాంటిది. జలశక్తికి ఏ చిన్న సందు దొరికినా, అది భారీ గండిగా, లేదా భూగర్భంలో కాళేశ్వరం మేడిగడ్డలా ఓ పెద్ద కావిటి గుహ లాంటి రంధ్రంగా మారుతుంది. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ సంక్లిష్టంగా ఎందుకు మారింది? 1396 మీటర్ల నది రెండు గట్టుల మధ్య ఉన్న భూగర్భం అంతా వివిధ లోతుల్లో, వివిధ తేడాలతో 100 మీటర్ల వరకు ఇసుక బెడ్ ఉంది. ఇది ఒక భయంకర విపత్తుకు సంకేతం. ఏ క్షణమైనా పేలిపోయే భారీ జలబాంబు లాంటిది. ఇంత ప్రమాదకరమైన చోట చంద్రబాబు 2025 డిసెంబర్ కల్లా డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. జర్మన్ కంపెనీ బావర్ కొత్త డయాఫ్రం వాల్ 900 కోట్లతో నిర్మాణం చేపట్టింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో డయాఫ్రం వాలే అత్యంత కీలకమని చంద్రబాబు ఎందుకు పేర్కొన్నారు? ప్రపంచంలోనే అత్యున్నతమైన గొప్ప ఇంజనీర్లు, పోలవరం డయాఫ్రం వాల్‌ను పర్యవేక్షిస్తున్నారనీ చంద్రబాబు తెలియజేశారు. ఎందుకు ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్లు డయాఫ్రం వాల్‌ను పర్యవేక్షిస్తున్నారు? అన్ని ప్రాజెక్టులలా డయాఫ్రం వాల్‌ను ఈ ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్లు మన్నికగా చెక్కుచెదరకుండా కలకాలం నిలపగలరా? ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్లను కేంద్ర సీడబ్ల్యూసీ భారీ డబ్బులను చెల్లించి మరీ నిపుణులుగా ఎందుకు నియమించింది?
ఆంధ్ర, మోడీ కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఇంజనీర్లు మా వల్ల కాదని ఎందుకు చేతులెత్తేశారు? మొదటి డయాఫ్రం వాల్ 485 మీటర్లు కూలిన తర్వాత ఆంధ్ర, కేంద్ర సీడబ్ల్యూసీ ఇంజనీర్లు బిత్తర పోయారు. తీవ్ర గందరగోళం నెలకొంది. చంద్రబాబు, మోడీ రెండు ప్రభుత్వాలకు డయాఫ్రం వాల్ పెద్ద తలనొప్పిగా తయారైంది. సీడబ్ల్యూసీ సలహా మేరకు భారీ డబ్బు చెల్లించి కేంద్రం అంతర్జాతీయ నిపుణులను నియమించింది.
పీఓఈలో రిచర్డ్ డొన్నెల్లీ(కెనడా), సీన్ హించ్‌బెర్గర్(కెనడా), జియాన్ ఫ్రాంకో డీసిక్కో(యూఎస్ఏ), డేవిడ్ బీపాల్(యూఎస్ఏ) ఉన్నారు. ఈ అంతర్జాతీయ నిపుణులు డయాఫ్రం వాల్‌ను శాశ్వతంగా నిలిచే విధంగా నిర్మించగలరా అనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న?
100 మీటర్ల సాండ్ బెడ్ ఉన్న పోలవరం వద్ద భారీ డ్యాం నిర్మించడం సాధ్యం కాదని దశాబ్దాల క్రితమే అమెరికా ప్రపంచ ప్రఖ్యాత నిపుణులు ప్రకటించారు. దేశంలోనీ ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్లు కూడా ఇదే అన్నారు. అందుకే 423 కోట్లతో నిర్మించిన మొదటి డయాఫ్రం వాల్ ధ్వంసమైంది. ఇది సాండ్బెడ్ గర్భంలో ఉన్న డయాఫ్రం వాల్ మనుగడకు విరుద్ధమైన ప్రాకృతిక సంక్లిష్టతని వెల్లడిస్తుంది.
డయాఫ్రం వాల్ అనేది భూమి లోపల నిర్మించే ఒక కాంక్రీట్ గోడ. సాధారణంగా లోతైన తవ్వకాలు, పునాదులు, కటాఫ్ గోడలకు మద్దతు ఇవ్వడానికి దీనిని నిర్మిస్తారు. డయా ఫ్రం గోడలు నీటి సీపేజీ, లీకేజీ కానీయకుండా నిలుపుతుంది. ఒక కందకాన్ని తవ్వి స్లర్రీ ద్వారా స్థిరంగా ఉంచుతారు. తర్వాత రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్‌తో నింపుతారు. భూగర్భంలోని రాక్ బెడ్ నుంచి ఉపరితలం వరకు ఒక నిరంతర గోడను నిర్మిస్తారు. ఈ డయాఫ్రం గోడలు నీటిని లీకేజీ, సీపేజీ కాకుండా నిలుపుదల చేస్తూ అడ్డు గోడలుగా పనిచేస్తాయి. ప్రాజెక్టు పునాదులకు మద్దతు ఇస్తాయి. అది కూలిపోకుండా నిరోధిస్తుంది. భూమి ఉపరితలంపై ఉండే ప్రాజెక్టుకు డయాఫ్రం గోడలు అట్టడుగు పునాదిగా పనిచేస్తుంది. డయాఫ్రం వాల్ నిర్మాణం చాలా ఖరీదైనది. కీలక సాంకేతిక పరిజ్ఞానం గల భావర్ లాంటి కొన్ని జర్మనీ కంపెనీలు మాత్రమే నిర్మించగలవు.
డయాఫ్రం వాల్ గోడలు నది భూగర్భంలోనీ సాండ్ బెడ్ లోపల జరిగే నీటి ప్రవాహాన్ని అరికట్టి, ప్రాజెక్టు పునాదులకు దృఢత్వాన్ని చేకూరుస్తుంది. ప్రాజెక్ట్ అడుగు భాగంలో రాక్ బెడ్ కాకుండా, కాలేశ్వరం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వలె సాండ్ బెడ్ ఉన్నప్పుడు, ప్రాజెక్టుకు ఎప్పుడైనా కొన్ని విపత్తులు సంభవించవచ్చు. మళ్లీ 194 టీఎంసీలు అనేది భారీ సామర్థ్యం. నదిలో నీటి ప్రవాహంతో పాటు, నది అడుగున భూగర్భంలోని సాండ్ బెడ్లో నీరు ఇసుకను, అనేక రకాల మట్టి పదార్థాలను, భారీ ఎత్తున కదిలిస్తూ, కదులుతూ ప్రవహిస్తూ ఉంటుంది. ప్రాజెక్టు పునాదుల క్రింద ఇసుక కూడా నిరంతరం నీటితో పాటు కదులుతూ ఉంటుంది. అలా నీటితోపాటు పునాదుల కింద ఇసుక కదలి కొట్టుకుపోయి, సీపేజీ, లీకేజీ సంభవించి, తెలంగాణలో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం వలె పెను విపత్తు సంభవించవచ్చు. కేసీఆర్ నిర్మించిన మేడిగడ్డ కాళేశ్వరం 16 టీఎంసీలే. కానీ 194 టీఎంసీల పోలవరంలో ఆ విపత్తు తీవ్రత చాలా ఎక్కువ.
“పదార్థ చైతన్యంతో పోలిస్తే మానవ చైతన్యం ఎల్లప్పుడూ వెనకబడి ఉంటుందనీ” ఒక జర్మన్ తత్వవేత్త అంటాడు. మొదటి డయాఫ్రం వాల్ కూలడానికి కారణమైన పోలవరం సాండ్ బెడ్ సంక్లిష్టతనీ, గోదారి మహత్తర వరద ఉధృతిని, 194 టీఎంసీల మహా జలశక్తికి ఎదురు నిలబడి కలకాలం రక్షించే డయాఫ్రం వాల్ బలహీనతని అర్థం చేసుకోవడంలో ఆంధ్ర, కేంద్ర ఇంజనీర్లు విఫలమైనందునే అంతర్జాతీయ నిపుణుల అవసరం వచ్చింది.
ప్రకృతి వైవిద్యమైన మహా జలశక్తి ముందు, మానవ శక్తి గాని, మనిషి నిర్మించిన అత్యాధునిక యాంత్రిక శక్తి గాని, ఎంత గొప్ప సాంకేతిక పరిజ్ఞానమైన దిగదుడుపేనని, గోదావరి మహా జల శక్తికి ఎదురొడ్డ లేక, ప్రపంచ ప్రఖ్యాత బావర్ కంపెనీ నిర్మించిన మొదటి డయాఫ్రం వాల్ తునాతునకలైపోయింది. దాన్ని బాగు చేయడానికి కానీ, పునరుద్ధరించడానికి కూడా వీలు లేనంత విధ్వంసమయ్యిందని, ఆ డయాఫ్రం వాల్‌ను వదిలేసి, దాని కంటే ఎగువన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభించినప్పుడే, పోలవరం ప్రాజెక్టును డయాఫ్రం వాల్ కకావికలం చేస్తుందని ఋజువైంది.
ప్రకృతి నియమాలను అర్థం చేసుకొననీ, ప్రకృతి నియమాలకు అనుగుణంగా నిర్మించని, ప్రకృతికి అనుగుణంగా లేని నిర్మాణాన్ని ప్రకృతి విధ్వంసం చేస్తుంది. భూగర్భంలో ఐదు అడుగులు కుంగిన, పునాది అడుగు నుంచి పై వరకు నిట్ట నిలువునా మూడు అడుగులు చీలిన కేసీఆర్ కాళేశ్వరం(మేడిగడ్డ)లో, 8మందిని బలి తీసుకొని, నేటికీ ఆరు శవాలు సొరంగంలోనే సమాధి అయిన సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీలో జరిగింది అదే. ఈ అంతర్జాతీయ నిపుణులు రెండో డయాఫ్రం వాల్‌ను మహత్తర జలశక్తి నుంచి బద్దలు చేయకుండా రక్షించగలరా? ప్రతి వర్షాకాలం ఓ మహా కఠిన పరీక్షే?
నైనాల గోవర్ధన్, నీటిపారుదల ప్రాజెక్టుల విశ్లేషకులు, 9701381799
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.