
ప్రస్తుతం మనం నూతన ఆవిష్కరణల నుంచి చాల పెడగా ఉండిపోయాం. జనాన్ని ఎలా పక్కదారి పట్టించాలా అనే మార్గంలోనే మన పెట్టుబడి నడిచిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు జనాన్ని రెచ్చగొట్టే సరుకు మన దగ్గర ఉన్నంతకాలం ఇంకా నూతన ఆవిష్కరణల అవసరం మనకెందుకు చెప్పండి?
ప్రతిభావంతుడైన ఒక ఐఐటీ పట్టభద్రుడు 2020లో వినూత్నమైన ఆవిష్కరణ చేపట్టాడు. లేదు, లేదు మీరు ఊహిస్తున్నట్టుగా అది మరో “ఫుడ్ డెలివరీ” యాప్నో లేదా గోవులకు సంబంధించిన “ఊబర్” యాప్ వంటిదో కాదు. రైలు టికెట్ల రిజర్వేషన్లకు వాడే ఐఆర్సీటీసీ యాప్‌ను మరింత వేగంగా ప్రయాణికులు వికెట్ రిజర్వ్ చేసుకునేందుకు తోడ్పడేలా తీర్చిదిద్దాడు. ప్రయాణాల రద్దీ రోజుల్లో ఎవరన్నా “తత్కాల్” టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించి ఉంటే అది ఎంత బ్రహ్మ ప్రళయంగా ఉంటుందో అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఈ కుర్రవాడి సాంకేతిక మెళుకువ పరిజ్ఞానానికి మెచ్చుకోవాల్సింది పోయి భారతీయ రైల్వే విభాగం అతని మీద దావా వేసింది. మీరు చదువుతున్నది నిజం, ఐఆర్సీటీసీ ఆ కుర్రాడి మీద కేసు వేసి అరెస్టు చేయించింది. అప్పట్లో రైల్వే మంత్రిత్వ శాఖా మంత్రిగా పీయూష్ గోయల్ ఉన్నారు. విచిత్రం చూశారా, ప్రస్తుతం పరిశ్రమల- సరఫరాల శాఖామంత్రిగా ఉన్న అదే పీయూష్ గోయల్ మన యువ పారిశ్రామికవేత్తల దృష్టంతా “ఫుడ్ డెలివరీయాప్”లు తయారు చేసి నిరుద్యోగ యువతీయువకులను “కారు చౌక శ్రామికులుగా” మార్చేస్తున్నారని తిట్టిపోస్తున్నారు. ఈ దృష్టి ఐఆర్సీటీసీ యాప్‌ని ప్రయాణీకుల ఆకాంక్షలు, అవసరాలకు తగినట్టుగా ఐఐటీ కుర్రాడు మెరుగుపరిచినప్పుడు ఎందుకు లేకుండా పోయిందో మరి?
“మన యువతీ, యువకులు కేవలం “డెలవరీ” సిబ్బందిగా మిగిలిపోవాలా” అని సదరు మంత్రి నిరుద్యోగం పట్ల ఎంతో ఆపేక్షతో ప్రశ్నిస్తున్నట్టు పైకి కనిపిస్తుంది. అక్కర్లేదు, మన దగ్గర శ్రామికులు కారు చౌకగా తమ శ్రమను అమ్ముకోవాల్సిన పనిలేదు. అది జరగాలంటే స్టార్టప్ కంపెనీలు, ఫ్లాట్‌ఫామ్ యాప్‌లు మొదలు ఏ కంపెనీ, ఏ పరిశ్రమ కూడా మన యువతీ యువకుల శ్రమను కారు చౌకగా దోచుకోకుండా పటిష్టమైన కార్మిక చట్టాలు రూపొందించాలి. కానీ ఈ ప్రభుత్వం ఆ పని మాత్రం చెయ్యదు. పై పెచ్చు అంతర్జాతీయ, బహుళజాతి కంపెనీలను మన దేశంలో పెట్టుబడులు పెట్టమని అడగడానికి ఈ కారు చౌకగా లభించే శ్రామికులనే ఎరగా చూపుతున్నారు. “మా దేశంలో నైపుణ్యం గల శ్రామికులు ఉన్నారు. వ్యాపారం చేసుకోవడానికి అద్భుతమైన అనుకూల వాతావరణం ఉంది. కాబట్టి పెట్టుబడులు పెట్టండి అని ధీమాగా అడగడానికి బదులు మా దగ్గర లేబర్ చాలా చీప్‌గా దొరుకుతుంది, చట్టాల గురించి పెద్ద పట్టింపులు ఉండవు కాబట్టి వచ్చి పెట్టుబడులు పెట్టండి” అని దేబిరించుకుంటున్నారు.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రెండేళ్ల తరువాత ఏర్పడ్డ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా లేదూ కమ్యూనిస్టు చైనాలో కూడా లేబర్ చాలా చీప్ అని అనేవాళ్లు. ఇప్పటికీ అనే వాళ్లు కూడా ఉన్నారు. కానీ అది ముప్ఫై ఏళ్ల క్రితం నాటి మాట. ఇవాళ చైనాలో అలాంటి పరిస్థితి లేదు. 1980 నాటికి భారతదేశంలో తలసరి ఆదాయం 266 అమెరికన్ డాలర్లు కాగా చైనాలో 194 డాలర్లుగా ఉండేది, 2020 నాటికి భారత్‌లో తలసరి ఆదాయం 1,357 డాలర్లు కాగా చైనాలో 4,450 డాలర్లుగాను 2022 నాటికి భారత్‌లో తలసరి ఆదాయం 2,388 డాలర్లు కాగా చైనాలో అది 12,720 డాలర్లకు పెరిగిందని ప్రపంచబ్యాంకు గణాంకాలు వివరిస్తున్నాయి.
మన స్టార్టప్ కంపెనీలు డీప్ టెక్నాలజీ, సెమీ- కండక్టర్లు, కృత్రిమ మేధ(ఏఐ)లో కృషి సాగించాలని సదరు మంత్రివర్యులు సెలవిస్తున్నారు.
సెమీ కండక్టర్ స్టార్టప్ కంపెనీ పెట్టిన ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్త కంపెనీ పెట్టడానికి తాను పడ్డ కష్టాలన్నింటినీ “రెడ్డిట్” సామాజిక మాధ్యమంలో ఏకరువు పెట్టాడు. పీయూష్ గోయల్‌కు ఒక బహిరంగ లేఖ రాస్తూ తన స్టార్టప్ కంపెనీ కొన్ని పన్ను రాయితీలకు అర్హత కలిగి ఉన్నా తన అప్లికేషన్‌ను సదరు మంత్రిత్వ విభాగం రెండేళ్ల పాటు పెండింగ్‌లో పెట్టుకుని చివరికి “మరికొన్ని అదనపు పత్రాలు అవసరం” అని “కొర్రీ” వేసి తప్పికొట్టిందని, ఇది జరిగిన కొద్ది గంటలలోపే ఒక ఏజెంట్ ఫోన్ చేసి “మీ పని కచ్చితంగా జరిగి తీరాలంటే సదరు పత్రాలు సమకూర్చడంలో మా సాయం తీసుకోండి” అని అడిగారని, అంటే లంచం ఇస్తే పని జరిగిపోతుందని పరోక్షంగా సూచించడని మీ విభాగంలో రూల్స్ ప్రకారం పని నడవదు అనడానికి నా అనుభవమే ఒక ఉదాహరణ” అని వాపోయాడు.
ఇదొక సమస్య అయితే, అసలు మన స్టార్టప్‌ల వ్యవస్థలోనే లొసుగులు ఉన్నాయి. ఉదాహరణకు డీప్ టెక్, ఆటో మొబైల్ రంగాలనే తీసుకుందాం, గత కొన్నేళ్లుగా కార్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కానీ వాటి పనితీరులో ఏ మాత్రం మెరుగుదల లేదు. మన దేశంలో నడిచే 60 శాతం కార్లు ఇంకా 10వ జనరేషన్ ఇంజన్లతోనే నడుస్తున్నాయనే విషయం తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి. కొత్త మోడళ్ల కార్లు రోడ్ల మీదకు వస్తున్నాయి. కానీ ఆ కార్ల ఇంజన్లు మాత్రం ఇంకా పాతకాలం నాటివే నడుస్తున్నాయి. మన నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు ఎటు పోయినట్లూ?
ఈ కార్లు తయారు చేసేది చిన్నా చితకా కంపెనీలా, అంటే కాదు. నూతన పరిశోధనలకు ఆవిష్కరణలకు వెచ్చించేందుకు ఈ కంపెనీల దగ్గర సొమ్ము లేదా అంటే అదీ కారణం కాదు. ఇవాళ కార్ల కంపెనీలు పదేళ్ల క్రితం ఎలాంటి కార్లు తయారు చేసేవో పైపై మార్పులతో అవే కార్లను తయారు చేస్తున్నాయి. మధ్య తరగతి కొనగలిగే స్థోమతగల కార్లు పదేళ్లుగా అవే మారుతీ ఆల్టో, స్విఫ్ట్, టాటా కంపెనీలవే. మార్కెట్లోకి కొత్త కంపెనీ, కొత్త తరహా కారు రానే రాలేదు.
అదే చైనాలో 200 కార్ల తయారీ సంస్థలు ఉన్నాయి. అసంఖ్యాకమైన మోడళ్ల కార్లను తయారు చేస్తున్నాయి. 600 డాలర్లకు(సుమారు రూ 50,000) వచ్చే చౌక ఎలక్ట్రిక్ కార్లతో పాటు టెస్లా వంటి లగ్జరీ వాహన యజమానులు కూడా ఈర్ష్య పడేంత విలాసవంతమైన కార్లను చైనా తయారు చేస్తుంది. మన దేశంలో చౌకయిన ఎంజీ కంపెనీ కోమెట్ ఎలక్ట్రిక్ కారు ధర ఏడు లక్షల రూపాయలు, అంటే మన దేశంలో కార్ల కంపెనీలకు లాభాలు పోగేసుకోవాలనే రంది తప్పితే కొత్తకొత్త మోడళ్ల ఆవిష్కరణలకు తగిన పరిశోధనలు చేపట్టాలనే దృష్టే లేదు. ఒకవేళ చైనా కార్ల దిగుమతిని అనుమతిస్తే మన దేశవాళీ కార్ల దిక్కు చూసేవాళ్లు ఎవరన్నా ఉంటారా?
నూతన ఆవిష్కరణలతో చైనా ఎందుకు దూసుకుపోతుంది?
గత పదేళ్ల కాలంలో మన ప్రభుత్వం చైనా “యాప్”లను నిషేధిస్తూ, అదే చైనా నుంచి దీపావళి లైట్లు, పతంగుల నుంచి అనేక వస్తువులు దిగుమతి చేసుకుంటూ వచ్చింది. ప్రపంచ వస్తూత్పత్తికి చైనా కేంద్రంగా మారింది. అదే చైనా 2015లో మేడిన్ చైనా 2025 పేరిట రూపొందించుకున్న ప్రణాళికలో సెమీ కండక్టరు, కృత్రిమ మేధ(ఏఐ), ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, సౌర విద్యుత్ ఫలకాల వంటి రంగాలలో అగ్రగామిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందంటే నూతన సాంకేతిక పరిజ్ఞానంలో బలమైన పోటీదారుగా ఎదగాలని నిర్ణయించుకుంది.
2025 గిర్రున తిరిగి రానే వచ్చింది. పైన పేర్కొన్న ప్రతిరంగంలో ఇవాళ చైనా ప్రపంచ అగ్రగామిగా నిలిచింది. ప్రపంచ సౌర విద్యుత్ ఫలకాల తయారీలో 80 శాతం వాటా, లిథియం- ఐయాన్ బ్యాటరీల ఉత్పత్తిలో 75 శాతం వాటా, డ్రోన్ల తయారీలో 75 శాతం వాటాతో చైనా అగ్రగామిగా ఉన్నది. స్వంతంగా వాణిజ్య విమానాల తయారీలో ముందంజ వేసింది. చైనా సాధించిన ప్రగతిని గమనిస్తే మనమూ ఉన్నాం దేనికీ అనే పశ్చాత్తాపం కలగక మానదు. మార్కెట్లోకి వచ్చిన ఏ కొత్త సరుకునయినా సరే చైనా చౌకగా డూప్లికేట్ చేసి పారేస్తుంది. అనే పేరుని వదిలించుకుని, ఇవాళ ప్రపంచ అగ్రగామి సరుకులు అనేకం ఉత్పత్తి చేస్తున్నది.
పదేళ్ల క్రితం తీసుకున్న మేడిన్ చైనా 2025 అనే నినాదాన్ని వాళ్లు సాకారం చేసుకున్నారు. అదే పదేళ్ల క్రితం మన ప్రభుత్వం ఇచ్చిన “మేకిన్ ఇండియా” పిలుపు ఇంకా నినాదంగానే మిగిలిపోయింది.
నూతన ఆవిష్కరణలకు తగిన పరిస్థితులు వాటంతట అవే సృష్టించబడవు. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అందుకు పూనుకోవాలి. భారతదేశంలో స్టార్టప్ నిధులలో కేవలం 5 శాతం డీప్ టెక్ రంగంలో పెట్టుబడులుగా పెడుతుందటే చైనా 35 శాతం పెట్టుబడులు పెట్టిందని అభిజిత్ కుమార్ బిజినెస్ స్టాండర్ట్ పత్రికలో(2023)లో వివరించాడు. 2024లో షై- టెక్ కంపెనీలకు చైనా 361 బిలియన్ డాలర్ల పన్ను రాయితీలు ఇచ్చిందని, 80.7 బిలియన్ డాలర్ల శాస్త్ర పరిశోధనల అభివృద్ధి కేటాయింపులకూ మినహాయింపు ఇచ్చిందనీ, ఒక్క 2024వ సంవత్సరంలోనే శాస్త్ర పరిశోధనల అభివృద్ధి రంగానికి చైనా 496 బిలియన్ డాలర్లు కేటాయించిందనీ, అదే భారతదేశం 2025 బడ్జెట్లో కేవలం 23.45 బిలియన్ డాలర్లు కేటాయించిందని తెలియజేస్తోంది. భారత దేశంలోని స్టార్టప్ కంపెనీలకు నిధుల కొరత పెద్ద సమస్యగా ఉంటే నియంత్రణలు మరింత అలివిమాలిన భారంగా తయారయ్యాయి. చైనాలో ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలకు వెన్నుదన్నుగా నిలబడడంతో పాటు, తనే అనేక కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంది.
ప్రభుత్వరంగం: స్టార్టప్ కంపెనీల శైశవదశ
వాణిజ్యానికి అనుకూలమైన వాతావరణం సృష్టించబడాలంటే మన దేశం నాణ్యమైన విద్య, వైద్యం, మౌళిక సౌకర్యాలను పెంపెందించడంతో పాటు కీలక రంగాలలో పెట్టుబడులు ఇబ్బడి మబ్బడిగా పెంచాలి. ఇక్కడే ప్రభుత్వరంగ పరిశ్రమల పాత్ర కీలకంగా మారుతుంది.
“నవరత్న” ప్రభుత్వ రంగ పరిశ్రమల గురించి మీరు ఇంతకు ముందు వినే ఉంటారు. ఇనుము నుంచి మందుల తయారీ వరకు ఈ పరిశ్రమలు అద్భుతమైన ప్రగతి సాధించాయి. ఈ కంపెనీలు ఇప్పటికీ తమ ఉద్యోగుల కోసం పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు, టౌన్‌షిప్‌లు సబ్సీడీ రేట్లకు నిర్వహిస్తున్నాయి.
కానీ ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమల మీద “పనికి మాలినవి” అని ముద్ర వేసి ప్రభుత్వ పెద్దల సన్నిహిత మిత్రులకు కారుచౌకగా కట్టబెట్టేస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలే మన దేశ ఆర్థిక వ్యవస్థను సజీవంగా నిలబెడుతున్నాయి. 2024- 25 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వానికి 74,000 కోట్ల రూపాయలు డివిడెంట్లుగా చెల్లించాయి. కోల్(బొగ్గు) ఇండియా కంపెనీ ఒక్కటే రూ 10,000 కోట్ల డివిడెండ్ చెల్లించింది. ప్రతి ప్రభుత్వ రంగ పరిశ్రమ పన్నులు చెల్లించగా మిగిలిన లాభాలలో 30 శాతం కానీ, ఆయా కంపెనీలు నికర విలువలో 4 శాతానికి కానీ తగ్గకుండా కేంద్ర ప్రభుత్వానికి డివిడెంట్ చెల్లించాలి.
కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి ప్రభుత్వ రంగ పరిశ్రమలు చెల్లించే డివిడెండ్లే పెద్ద ఆదాయ వనరు. కాబట్టి ఈ నవరత్న ప్రభుత్వరంగ పరిశ్రమలు మరింత అభివృద్ధి అయ్యేందుకు తోడ్పడడానికి బదులుగా, ఈ కంపెనీలను శతకోటీశ్వర స్నేహితులకు కట్టబెడుతున్నారు.
మన దేశానికి పారిశ్రామిక పునాదిగా నిలబడింది ఈ ప్రభుత్వరంగ పరిశ్రమలే. రక్షణ రంగం, ఇంధనరంగం, విద్యుత్ రంగం, మౌళిక సౌకర్యాలు కల్పనలో ప్రభుత్వ రంగ పరిశ్రమల చుట్టూ పట్టణాలు, నగరాలు అభివృద్ధి చెందాయి. ఇవాళ ఐటీ పరిశ్రమకు కేంద్రంగా పేరొందిన బెంగళూరు మహానగరంగా అభివృద్ధి చెందడానికి కూడా గతంలో అక్కడ నెలకొల్పిన ప్రభుత్వ రంగ పరిశ్రమలే కారణం. 1950వ దశకంలో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ, హిందూస్థాన్ మెషీన్ టూల్స్, భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ పేరిట బెంగళూరులో ఐదు ప్రభుత్వరంగ పరిశ్రమలను నెలకొల్పారు. ఈ పరిశ్రమల చుట్టూ క్రమంగా టౌన్‌షిప్‌లు, స్కూళ్లు నిర్మించారు. నగరం విస్తరించింది. ఈ పరిశ్రమలు లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించాయి. మన దేశంలో అనేక నగరాల విస్తరణ వెనుక ఉన్న కథ ఇదే.
హాలీవుడ్ సినిమా “గ్రావిటీ” తియ్యడానికి పెట్టిన ఖర్చుకున్నా తక్కువ ఖర్చుతో “మార్స్ ఆర్టిటర్ మిషన్” నిర్వహిస్తున్న “ఇస్రో” ప్రభుత్వరంగ పరిశ్రమకావడం మనకు గర్వకారణం కాదా.
ఈరోజుకీ చైనాలో ప్రభుత్వరంగ పరిశ్రమలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతర్జాతీయంగా అగ్రగామిగా ఉన్న ఫార్చ్యూన్- 500 కంపెనీలుగా నిలిచిన తొలి పది పరిశ్రమలలో 3 పరిశ్రమలు చైనా ప్రభుత్వ రంగ పరిశ్రమలే ఉన్నాయి. 2023 ఫార్చూన్- 500 జాబితాలో 135 చైనా పరిశ్రమలు నిలిస్తే అందులో 85 కంపెనీలు ఆదేశ ప్రభుత్వరంగ పరిశ్రమలే.
స్టార్టప్ కంపెనీలుగా పేపర్ లీక్‌లు, విద్వేషాలు..
పేపర్ లీక్‌లు, విద్వేషాలు రెచ్చగొట్టడమే మన దేశ స్టార్టప్ కంపెనీలుగా నిలిచాయి. సెమీ- కండక్టర్ల తయారీలో ప్రపంచం దూసుకుపోతుంటే మన దేశం పరీక్షా పత్రాల లీకేజీకి పేరు మోసింది. ఈ పనికి దేశంలోని రాజస్థాన్‌లో ఏకంగా ఒక కంపెనీయే వెలసిందని “సైనిక్ భాస్కర్” కథనం వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అనేక రిక్రుట్మెంట్ పరీక్షల ప్రశ్న పత్రాలను లీక్ చేసి అక్రమ మార్గం ద్వారా వందల మంది ఉద్యోగాలు చేజెక్కించుకున్నారని, అందులో 86 మంది ఇప్పటికే సస్పెండ్ అయ్యారని ఆ పత్రిక బయట పెట్టింది.
గత పదేళ్లుగా పేపర్ లీకేజీ ఒక పరిశ్రమగా వర్థిల్లింది. నీట్, యుజిసి నెట్ మొదలు ఎస్ఎస్సి, హెచ్ఎస్సి పేపర్ల వరకు “లీక్” కాని పరీక్ష ప్రశ్న పత్రమే లేదంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇది కూడా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమగా ప్రభుత్వం భావిస్తున్నట్టు ఉన్నది.
(మత) విద్వేషాలను రెచ్చగొట్టడం కూడా భారీ స్టార్టప్ కంపెనీగా తయారయ్యింది. విద్వేషపూరితమైన పాటలు రికార్డు చేసి సీడీలు, క్యాసెట్లుగా అమ్మడం పెద్ద పరిశ్రమగా తయారయ్యింది. ఈ పాటల క్యాసెట్లు వేసి మసీదుల ముందు వికృత నృత్యాలు చెయ్యడం కూడా గత పదేళ్లుగా నడుస్తున్న స్టార్టప్ కంపెనీగా చెప్పుకోవచ్చు. నవరాత్రి, శ్రీరామ నవమి, హోలీ, దీపావళి పండుగల సందర్భంగా ఈ విద్వేష వ్యాపారం మరింత జోరుగా సాగుతుంది. మన సామాజిక మాధ్యమాలలో కూడా ఈ సరుకుకి గిరాకీ పెరిగింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవార్డులు ఇచ్చినట్టే ప్రస్తుత ప్రభుత్వం సోషల్ మీడియా ప్రభావశీలుర(ఇన్ఫ్లుయన్సర్స్) పేరిట అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తుంది. మిగిలిన దేశాలు డీపీ- టెక్ రంగంలో దూసుకుపోతుంటే మనం డీప్- ఫేక్(భారీ కట్టుకథనాలు) రంగంలో అగ్రగామిగా నిలిచాం. ఇవాళ జనం పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగాయని ఆందోళన చెందడం లేదు. శాఖాహారం మంచిదా- మాంసాహారం మంచిదా అనే చర్చల్లో మనిగిపోయారు.
2025 కేంద్ర బడ్జెట్లో విద్యా పద్దును 1.28 ట్రిలియన్ డాలర్లుగా పెంచామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నది. కానీ ప్రభుత్వ బడులు వేల సంఖ్యలో మూతబడుతున్నాయి. మధ్యాహ్న భోజనంలో మాంసకృత్తుల పోషకాహారం అయిన కోడిగుడ్లు ఇవ్వడం మానేశారు, దళిత విద్యార్థుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. కృత్రిమ మేధ(ఏఐ)ను పాఠ్యాంశంగా చేర్చారు. కానీ న్యూరల్ నెట్వర్క్ గురించి బట్టీ పట్టమని చెబుతున్నారే తప్ప అవి ఎలా నిర్మించాలో అభ్యాసన చేయించడం లేదు.
ఇంజనీరింగ్ కాలేజీలు ఏటా 15 లక్షల మంది పట్టభద్రులను తయారు చేస్తున్నాయి. కానీ వీరిలో 10 శాతం మందికి కూడా ఉద్యోగాలు దక్కడం లేదు. కంటెంట్ తయారీదార్లకు, కోచింగ్ సెంటర్లలో పాఠాలు చెప్పేవారికి గిరాకీ పెరిగింది. మస్జీదుల ముందు డాన్స్‌లు చెయ్యడం, ఇన్‌స్టాలో రీల్స్ అప్లోడ్ చెయ్యడం “ట్రెండింగ్”గా నడుస్తుంది. స్టార్టప్‌ల అభివృద్ధి పట్ల మనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం జనం మీద పెట్టుబడులు పెట్టాలి. నాణ్యమైన విద్యా, వైద్య సౌకర్యాలు కల్పించాలి. మెరుగైన ఉద్యోగాలు కల్పించాలి. సామాజిక న్యాయంతో కూడిన సమాన అవకాశాలను పెంపొందించాలి.
కానీ మనం ప్రస్తుతానికి నూతన ఆవిష్కరణల అన్వేషణకు చాలా పెడగా ఉన్నాం. జనాన్ని ఏ మార్చడం మీదే మన దృష్టంతా ఉంది. ధరల పెరుగుదలవంటి సున్నితమైన అంశాల మీద కూడా ప్రజలు స్పందించలేనంతగా ప్రభుత్వం చిల్లర విషయాల మీద చిటికెలో విద్వేషాన్ని పెంపొందించగలిగే సత్తా కలిగి ఉన్నాక మనకు ఇంకా నూతన ఆవిష్కరణలతో పనేంటి అంటారా? అస్తు, శుభమస్తు.
కవితా కబీర్
అనువాదం: కె సత్యరంజన్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.