
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మెయిటీ-కుకి జాతుల మధ్య చెలరేగిన హింస గడిచిన రెండేళ్లుగా నిత్యం నిరసనలు, అల్లర్లు, హత్యలతో అట్టుడుకుతుంది. ప్రశాంతంగా ఉండే మణిపూర్ ఉన్నట్టుండి అల్లర్లు చెలరేగి, మారణహోమం జరగడంతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మెయిటీ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించడాన్ని నిరసిస్తూ కుకీ, నాగా తెగల వారు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. వీరిని ఎదుర్కొనేందుకు మెయిటీలు ప్రతిదాడులు ప్రారంభించారు. ఈ అల్లర్లలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అధికారికంగా లెక్కలు లేవు. కానీ, వందలాది మంది మరణించారు, వేలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులై, భద్రతాదళాల మధ్య ఏర్పాటు చేసిన ఆశ్రమాల్లో ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
రాజ్యాంగబద్దంగా పాలన చేయాల్సిన ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ మెయిటీ తెగ పక్షపాతిగా వ్యవహరించడం వల్ల, జాతుల మధ్య చెలరేగిన హింసతో పరస్పర ఘర్షణలు, మరణాహోమాలకు దారితీశాయి. దేశంలో ఒక రాష్ట్రం జాతి వివక్షతో ఇలా తగలబడుతున్నా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడకపోవడం, అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించకపోవడం అత్యంత విచారకరం. ఇంతకాలం బీరెన్ సింగ్ ను ముఖ్యమంత్రిగా కొనసాగించడంతో ప్రధాని మోడీ అల్లర్లకు మరింత ఆజ్యం పోశారు. ఇంతటి ఘోరకలి మరో విపక్ష పార్టీ పాలిత రాష్ట్రంలో జరిగివుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకునేదా? శాంతి భద్రతలు క్షీణించాయన్న నెపంతో రాష్ట్రపతి పాలన విధించి, ఆ రాష్ట్రాన్ని కేంద్రం తన అధీనంలోకి తెచ్చుకోగలిగే అయాచిత అవకాశాన్ని మోడీ జారవిడుచుకునేవాడా?
అల్లర్లను ప్రేరేపించిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ జాతుల మధ్య ఘర్షణలను ప్రేరేపించినట్లు లీకైన ఆడియోలోని గొంతుకు అయన గొంతుకు 93 శాతం సారూప్యత ఉందని ట్రూత్ ల్యాబ్స్ గత వారమే నివేదిక ఇచ్చింది. ఆడియో లీక్ అంశంపై కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యుమన్ రైట్స్ ట్రస్ట్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఇప్పటికీ విచారణ జరుగుతోంది. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే అనూహ్యంగా బీరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే చాలా కాలంగా, ఆయన పాలన పట్ల బీజేపీ ఎమ్మెల్యేలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అల్లర్లను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలలో తీవ్ర ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి.గతేడాది అక్టోబర్‌లో 19 నే సొంత పార్టీ ఎమ్మెల్యేలు బీరెన్‌సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ, ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో అసెంబ్లీ స్పీకర్ తోక్చోమ్ సత్యబ్రత సింగ్, మంత్రులు తొంగం విశ్వజిత్ సింగ్, యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ కూడా ఉన్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఎస్టీ రిజర్వేషన్ల కోసం అల్లర్లు
1949 అక్టోబర్ 15 న భారత్‌లో అంతర్భాగమైన మణిపూర్, కొన్ని దశాబ్దాల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగి, అనేక పోరాటాల ఫలితంగా 1972 జనవరి 21 న రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రంలో 30 వరకూ వివిధ కులాలు, షెడ్యూల్డ్ తెగలు ఉన్నా ప్రధానంగా మూడు తెగలు మెయిటీ,నాగా,కుకీ తెగలు రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్నారు.మణిపూర్‌లో 16 జిల్లాలు ఉన్నాయి. వాటిలో కొన్ని లోయ ప్రాంతం జిల్లాలుగా, మరికొన్ని కొండ ప్రాంతం జిల్లాలుగా విభజించారు. రాష్ట్రంలో ఉన్న 90 శాతం కొండ (హిల్ ఏరియా) ప్రాంతాల్లో నాగాలు, కుకీ తెగలకు చెందినవారు 35 శాతం ప్రజలు నివసిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 2,855,794 మంది ఉన్నారు. అందులో పురుషులు 1,438,586, మహిళలు 1,417,208 ఉన్నారు. 60 మంది ఎమ్మెల్యేలున్న రాష్ట్ర శాసనసభలో 40 మంది మెయిటీ కమ్యూనిటీ చెందినవారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో 20 మంది ఎమ్మెల్యేలు ఇతర కుకీ,జోమీ,నాగ వంటి ఇతర షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.
జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న మెయిటీలు గిరిజన తెగలైన నాగా, కుకీల కంటే విద్య,ఉద్యోగ, వ్యాపార,రాజకీయ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. జనాభాలో మెయిటీ కమ్యూనిటీ 64 శాతం పైగా ఉంది కానీ, కేవలం 10 శాతం భూమిలో మాత్రమే నివసిస్తున్నారు. ఇక మిగిలిన కొండ ప్రాంతాల్లో కుకీ, నాగాలతో పాటు మిజో, జోమీ, హమర్ తదితర 30 కు పైగా ఆదివాసీ తెగలున్నాయి. రాష్ట్రంలో మొత్తం 16 జిల్లాలుండగా ఐదు జిల్లాల్లో మైతేయీ తెగవారు అధికంగా ఉన్నారు. మైతేయీలు లోయ ప్రాంతంలో తప్ప రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడం, నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. వారికి ఆదివాసీ రిజర్వేషన్లు లేకపోవడంతో కొండ ప్రాంతాల్లో భూములు కొనే సౌలభ్యం లేదు. అయితే కొండ ప్రాంతాల వారు మాత్రం తాము నివసించే ప్రాంతాలతో పాటు లోయలోని భూములను కొనవచ్చు. దీంతో తమను కూడా షెడ్యూల్డ్ తెగలుగా పరిగణించి రిజర్వేషన్లు ఇవ్వాలని మైతేయీలు కోరుతున్నారు. మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుంచి పెద్ద ఎత్తున చట్టవిరుద్ధంగా ఇక్కడికి వస్తున్నారని, వారు ఎస్టీ హోదాను కోరుతున్నారని మెయిటీలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి 1948 కన్నా ముందు మైతేయీలను గిరిజనులుగా పరిగణించేవారు. ఆ తర్వాత హోదా తొలగించడంతో సమస్యలు వచ్చాయి. తాము రిజర్వేషన్లు కొత్తగా అడగడం లేదని, గతంలో ఉన్నవాటిని తిరిగి ప్రవేశపెట్టాలని మాత్రమే కోరుతున్నామని మెయిటీ నాయకులు చెబుతున్నారు.
మెయిటీ తెగకు షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కల్పించాలనే డిమాండ్ చాలా ఏళ్ల నుంచి బలంగా ఉంది. 2012 నుండి షెడ్యూల్డ్ తెగల డిమాండ్ కమిటీ ఆఫ్ మణిపూర్ (ఎస్టీడీసీఎం) నేతృత్వంలో ఉన్న మెయిటీలకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ ఆధారంగా మణిపూర్ హైకోర్టు 2023 మార్చి 27 న మెయిటీ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చే అంశాన్ని నాలుగు వారాల్లోగా ప్రభుత్వం పరిశీలించి, కేంద్రానికి పంపాలని హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్రంలో హింసకాండ చెలరేగింది. మెయిటీ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని కుకీ,నాగా తెగల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లు విద్య,ఉద్యోగ, రాజకీయ అవకాశాలను జనాభాలో అత్యధికంగా ఉన్న మెయిటీలు అన్యాయంగా ఉపయోగించుకుంటారని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మెయిటీలో కొన్ని సమూహాలకు షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) హోదా ఉంది.
మండల్ కమీషన్ నివేదిక ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 (A) ప్రకారం 1992 నుండి మెయిటీలు వెనుకబడిన తరగతులు (ఓబీసీ) రిజర్వేషన్లు పొందుతున్నారు. ఇంతవరకూ ఓబీసీలుగా ఉన్న మెయిటీలకు మళ్లీ ఎస్టీ రిజర్వేషన్లు కల్పిస్తే, తీవ్రంగా నష్టపోయేది కుకీ,నాగ,జోమీ తెగలేనని ఆందోళన చెందుతున్నారు. షెడ్యూల్ తెగలకు మతం లేదు. మత మార్పిడి అనేది వారికి వర్తించదు. నిజానికి ఒక్కో తెగది ఒక్కో మతం అనేంతగా వారి సంప్రదాయాలు, కట్టుబాట్లు, క్రతువులున్నా ఆదివాసీ తెగలను హిందూ మతం పరిధిలోకి తేవాలని సంఘపరివార్ నేతృత్వంలో ఇప్పటికే వనవాసీ కళ్యాణాశ్రమాలు, వనవాసీ పరిషత్తులతో ఆ పనిని ముమ్మురం చేస్తూనే ఉన్నది. ఎక్కడైతే గిరిజన సమూహం క్రైస్తవంతో ఉంటుందో, ఇస్లాంతో ఉంటుందో అక్కడ సంఘ పరివారం మత చిచ్చు పెడుతోంది. మారణకాండలకు ఆజ్యం పోస్తుంది. ఒడిశాలో రెండు షెడ్యూల్ తెగల మధ్య మత చిచ్చు రేపి హత్యాకాండకు తెరతీసిన సంఘపరివారం మణిపూర్ లోనూ అదే వ్యూహం అమలు చేస్తున్నది. అది కంధమాల్ మొదలు, ఇప్పుడు మండుతున్న మణిపూర్ వరకు.
పాలనా వైఫల్యంతోనే మణిపూర్ మంటలు
మణిపూర్‌లో 3 మే 2023న చెలరేగిన హింసాకాండ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించినప్పటికీ అల్లర్లు, హింస తగ్గడంలేదు. మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లు, హింస ప్రభావం ఈశాన్య భారతంలోని ఇతర రాష్ట్రాలపైనా పడుతోంది. ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న మెయిటీ, కుకీ, నాగా ప్రజలు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయం గుప్పిట్లో బతుకుతున్నారు. గత కొన్నేండ్లుగా నాగా, కుకీలపై ఆధిపత్యం కోసం గిరిజనులను వారు పుట్టిన గడ్డపైనే శరణార్థులుగా మార్చే కుట్రలకు పాలక బీజేపీ ప్రభుత్వం పథకాలు రచిస్తుంది.జనాభాలో 60 శాతంగా ఉండి, మైదాన ప్రాంతానికి చెందిన మెయిటీలను బీజేపీ తన ప్రధాన ఓటుబ్యాంకుగా పరిగణించడం హింసకు ప్రధాన కారణం. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కూడా మెయిటీల పక్షపాతిగా వ్యవహరిస్తుండడంతో మెయిటీలపై కుకీ,నాగా తెగలు పగ పెంచుకుంటున్నారు. మెయిటీలు గిరిజనులు నివసించే కొండ ప్రాంతాలను అటవీ పరిరక్షణ చట్టాల పేరిట, ఇతరత్రా మతపరమైన చర్యలతోనూ నాగా, కుకీలను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తుండటం విధ్వంసానికి మరో కారణంగా భావించవచ్చు. ఇప్పటికే మెయిటీలకు శాసనసభలో అధిక ప్రాతినిధ్యం ఉంది, వారికి ఎస్టీ రిజర్వేషన్ హోదా పొందితే తమ విద్య, ఉద్యోగ,ఉపాధి, రాజకీయ అవకాశాలు దెబ్బతింటాయన్న స్థానిక ఆదివాసీ తెగలైన కుకీ,నాగలు ఆందోళన చెందుతున్నారు.
ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ -1958 మళ్ళీ విధింపు
మణిపూర్‌లోని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో, హింసాత్మక తిరుగుబాటు, అల్లర్లు చెలరేగడంతో కేంద్రం సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం -1958 తిరిగి విధించింది. ఇంఫాల్ లోయలోని అస్సాం సరిహద్దులో ఉన్న జిరిబామ్, సెక్మై, లామ్సాంగ్, లామ్లై, మోయిరాంగ్, లీమాఖోంగ్ ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. కేంద్రం ఈ చట్టాన్ని గతంలో ఏప్రిల్ 2022 లో ఎత్తివేసింది. మైతీలు అధికంగా ఉన్న లోయ ప్రాంతంలోని ఆఫ్సాను విధించడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక అధికారాలు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
భద్రతా దళాలకు విస్తృత అధికారాలను కల్పిస్తున్న సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టంపై మణిపూర్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాన్ని తొలగించాలని ఈశాన్య రాష్ట్రల్లో తీవ్రమైన నిరసనలు జరిగాయి. మైతీ తెగకు చెందిన ఇరోమ్ షర్మిలా చాను 16 సంవత్సరాలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎట్టకేలకు, కేంద్రం దాన్ని సవరించినప్పటికీ, ఇప్పుడు మళ్లీ దాన్ని లోయ ప్రాంతాల్లో విధిండంపై ఆందోళనలు చెలరేగుతున్నాయి. భద్రతా దళాలకు విస్తృత అధికారాలను కల్పిస్తున్న ఈ చట్టంపై మణిపూర్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లర్లను తగ్గించడంలో, ఆఫ్సా తిరిగి విధించడాన్ని అడ్డుకోవడంలో మంత్రులు, శాసనసభ సభ్యులు విఫలమయ్యారని నిరసనకారులు ఆందోళన నిర్వహించారు.
డబుల్ ఇంజన్ సర్కారున్నా ప్రధాని మోడీ మౌనం
‘డబుల్ ఇంజన్’ సర్కారుతోనే ప్రజలకు శాంతి సౌభాగ్యాలు, రాష్ట్రానికి బోలెడు అభివృద్ధి జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఊదరగొడుతున్న ప్రస్తుత తరుణంలో మణిపూర్ తగలబడుతోంది. గత ఏడాది మే నుంచి మణిపూర్ మంటల్లో కాలి బూడిదవుతుంటే, దేశ ప్రధాని కనీసం ఒకసారైనా ఆ రాష్ర్టాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. కానీ, అదే సమయంలో ఎన్నికల సభల కోసం మాత్రం మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో పలుమార్లు పర్యటించారు. అంటే మణిపూర్ ప్రజలు చచ్చినా పర్వాలేదు. కానీ, మాకు మాత్రం అధికారమే కావాలి అన్నట్టున్నది ప్రధాని వ్యవహరిస్తున్న తీరు. ప్రధాని మోడీ ప్రపంచమంతటా పర్యటిస్తున్నారు. ఎక్కడో ఉన్న రష్యా–ఉక్రెయిన్ శాంతి ప్రక్రియ కోసం ప్రయత్నాలు చేస్తున్న ప్రధాని దేశంలో రగులుతున్న మణిపూర్ మారణ హోమాన్ని తగ్గించేలా ఇరువర్గాల మధ్య సామరస్యంగా శాంతి చర్చలు జరుపకపోవడం దేనికి సంకేతం?
శాంతి చర్చలు, ఒప్పందాలతోనే సమస్యకు పరిష్కారం
మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడాలి. జాతి,మతం పేరుతో జరుగుతున్న విభజన రాజకీయాలకు తావులేకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి. మెయిటీలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించే అంశంపై కుకీ, నాగ, జోమీ తెగలకున్న అనుమానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నివృత్తి చేయాలి. మణిపూర్ సంక్షోభాన్ని మానవతా సమస్యగా పరిగణించి వాస్తవాలను ప్రజలకు తెలిసేలా కోర్టు పర్యవేక్షక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి.మణిపూర్ లోని వివాదాస్పద ప్రాంతాల్లో లైంగిక నేరాలకు పాల్పడిన వ్యక్తులను సాధారణ క్రిమినల్ చట్టం ప్రకారం విచారించాలని వర్మ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి.
మణిపూర్ అంతర్యుద్ధం మరో లెవెల్ కు వెళ్లకుండా ఆదిలోనే కేంద్రం అడ్డుకట్ట వేయాలి. మణిపుర్ లో ఆందోళన చేస్తున్న సాయుధ మిలిటెంట్లకు మయన్మార్ తో సన్నిహిత సంబంధాలున్నాయనే అనుమానాలు ఇటీవల బలపడుతున్నాయి. సాయుధ తిరుగుబాటుదార్లు రాకెట్ల ద్వారా ప్రయోగించే గ్రెనేడ్లు మణిపుర్ అల్లర్లను మరింత తీవ్రం చేస్తాయని కేంద్ర భద్రత బలాగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఆందోళనకారులపై పారామిలిటరీ బలగాల పోలీసు చర్యలు, అణచివేతలు, నిర్బంధాల ద్వారా కాకుండా శాంతియుత చర్చలు, పరస్పర శాంతి ఒప్పందాలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
డా.చెట్టుపల్లి మల్లిఖార్జున్
రాజకీయ విశ్లేషకులు,
“ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ తిరుగుబాట్లు-అంతర్గత భద్రతకు సవాళ్లు” అనే అంశంపై పీహెచ్డీ చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.