
1980 దశకం రెండో ద్వితీయార్థంలో భారతదేశ రాజకీయ చిత్రపటానికి నాలుగు ప్రకంపనాలు తాకాయి. ఈ నాలుగు ప్రకంపనాల కారణంగా ఉన్నత కులాల ఓటుబ్యాంకు కాంగ్రెస్, జనతాదళ్‌ల నుంచి దూరమయ్యింది. ఇలా జరగటానికి ఉన్న భూమిక ఏంటి? కేంద్ర ప్రభుత్వం అనుసరించిన పారిశ్రామిక విధానాలతో తెర మీదకు వచ్చిన మధ్యతరగతి(నయా సంపన్న వర్గం) ఎదుర్కొంటున్న సంక్షోభం, ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి పడుతున్న పాట్లు, ఆ సంక్షోభానికి నేపథ్యం ఏమిటి ? ఈ సంక్షోభానికి కారణం ఏమిటి ? అప్పటివరకు నయాకులీన వర్గాన్ని తయారు చేసిన ప్రభుత్వ నిర్ధేశిత ఆర్థిక విధానాలు ఎదుర్కొంటున్న సంక్షోభమే దానికి కారణం.
1978లో దిగుమతులపై ఉన్న ఆంక్షల తొలగింపు, 1980- 81లో పారిశ్రామిక అనుమతుల విధానాన్ని ఎత్తివేయటం(లైసెన్స్ రాజ్)పై పరిణామాలకు తక్షణ నేపథ్యంగా ఉన్నాయి. అయితే 1985లో రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాక సరళీకరణ విధానాలు మరింత వేగవంతం అయ్యాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1985 ఫిబ్రవరిలో తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టబడింది. అప్పటివరకు ఏ పారిశ్రామిక ఉత్పత్తి జరగాలన్నా ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి. బడ్జెట్ ప్రవేశపెట్టిన కొన్ని నెలల తర్వాత ఆధునిక పరిశ్రమలకు సంబంధించిన అనేక నియంత్రణలను రద్దు చేశారు. పారిశ్రామిక ఉత్పత్తిని ఆధునికరించడానికి కావలసిన యంత్ర పరికరాల దిగుమతి పై సుంకాలు గణనీయంగా తగ్గించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఈ సుంకాలు మరింతగా తగ్గాయి.
ఆర్థిక వ్యవస్థ వేగాన్ని అడ్డుకొనే రకరకాల నియంత్రణలు, పరిమితులు లైసెన్సుల నుంచి బయటపడటం, వినిమయ రంగంలోకి ఆధునిక పరిశ్రమల ప్రవేశం ఫాసిస్టు లక్షణాలు అభివృద్ధి కావడానికి అవసరమైన భూమికను సిద్ధం చేశాయి. అప్పటివరకు అధిగించలేనివిగా కనిపించిన సమగ్ర దిగుమతి నియంత్రణలు, నిరంతరం కొరత ఎదుర్కొంటున్న మార్కెట్లు, యజమాని ఆధీనంలో పని చేసే చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఇసుక తిమ్మెరల్లాగా కనుమరుగయ్యాయి. దేశీయ పారిశ్రామిక వర్గానికి ఈ పరిణామాలు తెచ్చి పెట్టిన షాక్ దాదాపు 1930 దశకంలో జర్మనీలో అతి పెద్ద కంపెనీగా ఉన్న మిటల్స్టాండ్ కంపెనీకి మహామాంద్యం తెచ్చి పెట్టిన షాక్‌తో పోల్చవచ్చు.
మధ్య తరహా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న దశ నుంచి ఆధునిక మార్కెట్ ఆర్థిక వ్యవస్థలుగా పరిణామం చెందే దేశాలు ప్రయాణించిన పారిశ్రామికీకరణ దశకు, 1980 దశకాల్లో భారతదేశ పారిశ్రామికరణ దశకు పెద్దగా వ్యత్యాసం ఏమీ లేదు. ఈ దశలో సహజంగానే పారిశ్రామిక రంగం బహుళ యాజమాన్యంతో నిండి పోయింది. బహుముఖ ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు శిఖరాగ్రంలో ఉంటే చిన్న మధ్యతరహా పరిశ్రమల పరిమాణం రీత్యా ఉత్పత్తి వాణిజ్యంలో ఒక మోస్తరుగానే ఉన్నా వ్యాప్తి రీత్యా విస్తారంగా ఉండేవి.
వివిధ మోతాదుల్లో ఉత్పాదక రంగంలో ఉండే పరిశ్రమలను పోల్చటడం కాస్తంత సమస్యాత్మకంగా ఉంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధిలో రాజ్యం జోక్యం లేకుండా ఉన్న చోట సహజంగానే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమల మధ్య పోటీ నెలకొంటుంది. దీంతో మొదలయ్యే సంబంధాలు కాలక్రమంలో ఆర్థికవ్యవస్థలో పెట్టుబడిదారీ సంబంధాలు స్థిరపడే సమయానికి, పరస్పర సమన్వయంతో కూడిన ఇచ్చిపుచ్చుకునే సంబంధాలుగా మారతాయి. విస్తృతమైన సాంకేతిక పరిజ్ఞానం, కనీస ఉత్పాదక సామర్థ్యం పెరగటంతో వినిమయదారులకు అవసరమైన సరుకులు ఉత్పత్తి చేసే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు భారీ మోతాదులో ఉత్పత్తి చేసే పరిశ్రమలకు కావాల్సిన ఉపకరణాలు అందించే స్థాయికి పడిపోతాయి. అంతిమంగా సరుకుల వినియోగదారులకి చేర్చేవి, విస్తారమైన ఉత్పాదక సామర్థ్యమూ కలిగిన పరిశ్రమలకు కావాల్సిన అనుబంధ ఉత్త్పత్తులు తయారు చేసే పరిశ్రమలుగా మిగిలిపోతాయి. కానీ దీనికి భిన్నంగా భారతదేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు భారీ సంఖ్యలో వినిమయ వస్తువులు ఉత్పత్తి చేసి వినియోగదారులకు చేర్చే పరిశ్రమలుగా ఉన్నాయి. 20వ శతాబ్ది చివరి వరకు బహుళ వినిమయ ఉత్పత్తులు తయారు చేసే భారీ లేదా గుత్త కంపెనీలతో పోటీపడ్డాయి.
ఈ విధంగా పెట్టుబడిదారీ విధానం అభివృద్ధికి అవరోధాలు సృష్టించడానికి కారణం ఒక్కటే. ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు ఒకే వర్గం చేతుల్లో కేంద్రీకృతమయి ఉండటమే. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి భారతదేశం వద్ద స్టెర్లింగ్ నిల్వలు గణనీయంగా ఉంన్నాయి. దీంతో 1957కు ముందు భారతదేశం అనుసరించిన విదేశీ వాణిజ్య విధానం సాపేక్షంగా పరిమితులు లేని విధానమే. అప్పటికి విదేశీ మారక ద్రవ్య వినియోగాన్ని అదుపులో పెట్టవలసిన అవసరం ప్రభుత్వానికి కనిపించలేదు. అందువల్లనే మొదటి పంచవర్ష ప్రణాళికలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటానికి కావలసిన మౌలిక వసతులు అభివృద్ది చేయటం, సామాజిక సేవలు అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడం వంటివి ప్రభుత్వ ప్రాధాన్యతలుగా మారాయి. పారిశ్రామిక అభివృద్ధిని ప్రయివేటు రంగానికి వదిలేశారు.
రెండో పంచవర్ష ప్రణాళిక కాలానికి ఆర్థిక పిడివాదం రంగ ప్రవేశం చేసింది. ఆర్థిక స్వావలంబన నినాదంతో భారీ పరిశ్రమల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ లక్ష్యం నెరవేరాలంటే దిగుమతుల నియంత్రణ అవసరం అయింది. ప్రత్యేకించి నిత్యవసరం కాని వస్తువుల దిగుమతిపై నియంత్రణ విధించడం అనివార్యమైంది. అయితే నిత్యావసరేతర సరుకుల దిగుమతులను అకస్మాత్తుగా నిలిపివేయడంతో పాటు 1957లో విదేశీ మారకద్రవ్య చెల్లింపుల సంక్షోభం తలెత్తింది. రెండో ప్రపంచ యుద్ధానంతర పరిస్థితులలో పెరిగిన స్టెర్లింగ్ నిల్వలు 1957 నాటికి కరిగిపోయాయన్న వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించింది. దీని కారణం 1957 వరకు అనుసరించిన ఉదారమైన దిగుమతి విధానాలు.
ప్రపంచ బ్యాంకు యూరోపియన్ దేశాల్లో పునర్నిర్మాణం నుంచి తన దృష్టిని వర్ధమాన దేశాల్లో ఆర్థిక విధానాల రూపకల్పన వైపు మళ్లించడానికంటే ముందే ఈ సంక్షోభం ముంచుకొచ్చింది. అప్పటికి ఇంకా అమెరికాలో జాన్ కెనడి నాయకత్వంలో ఉదారవాద ఆర్థిక విధానాలు(నేడు మనం చర్చించుకుంటున్న అర్థంలో) ప్రారంభం కాలేదు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ముందు విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల సంక్షోభాన్ని నివారించడానికి ఉన్న ఏకైక మార్గం అనివార్యమైతే తప్ప దిగుమతులపై పూర్తిస్థాయి నిషేధం విధించటం. ఇందులో భాగంగానే అన్ని రకాల వినిమయ సరుకుల దిగుమతులపై ఆంక్షలు విధించబడ్డాయి. దీంతో వివిధ ఆర్థిక తరగతుల అవసరాలు తీర్చడానికి కావలసిన వినిమయ సరుకులు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే దేశీయంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు విస్తృతంగా దేశమంతటా వ్యాపించి ఆర్థిక రంగంలో ప్రధానమైన పాత్రను పోషించటం మొదలైంది. ఈ మార్పులు దేశంలో మధ్యంతర దొంతర్లలలో ఉండే ఒక నూతన పారిశ్రామిక తరగతిని సృష్టించడానికి దారి తీశాయి.
అప్పటికి తేయాకు, వస్త్రోత్పత్తులు, జూట్ మరికొన్ని తేలికపాటి ఉత్పత్తులు మినహా భారతదేశం నుంచి అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి అయ్యే చెప్పుకోదగ్గ సరుకులు ఏమీ లేవు. విదేశీ చెల్లింపుల సంక్షోభాన్ని ప్రభుత్వం కంటే ఏడాది ముందే వ్యాపార వర్గం గుర్తించింది. దాంతో వీలైనన్ని దిగుమతి లైసెన్సులు చేతిలో పెట్టుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. ప్రభుత్వం ఆంక్షలు సడలించిన తర్వాత ఈ లైసెన్సులు వేగంగా చేతులు మారాయి. లైసెన్సులు సంపాదించడానికి మూలధర కంటే వెయ్యి నుంచి 1200 రేట్లు ధరలు చెల్లించడం అన్నది అప్పటివరకు దేశ ఆర్థిక వ్యవస్థలో కనీవినీ ఎరుగని విషయం.
దిగుమతి లైసెన్స్ చేతిలో పెట్టుకున్న వాళ్ళకు రాత్రికిరాత్రి అపారమైన లాభాలు దండుకునే అవకాశాలు వచ్చాయి. భవిష్యత్తులో దిగుమతుల ద్వారా అవసరాలు తీర్చుకోవడానికి ఉన్న అవకాశాలు కుదించుకుపోయాయి. దీంతో ఈ సరుకులు, ఉత్పాదక ఉపకరణాలు సమకూర్చుకోవడానికి దేశీయంగానే ఆయా పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వర్గం చొరవ చూపించింది. ఈ పరిస్థితుల్లో ఎక్కువగా సెకండ్‌హ్యాండ్ ఉపకరణాలు దిగుమతి అయ్యాయి. మరికొన్ని రంగాలలో కాలం చెల్లిన యంత్రసామాగ్రి దిగుమతి అయింది. ఈ దిగుమతులకు బదులుగా ఆయా పరిశ్రమలలో దిగుమతి దారులు(లైసెన్స్ ఉన్న వాళ్ళు) వాటాదారులు అయ్యారు(ఈక్విటీ కొనుగోలు రూపంలో). ఈ విధంగా అప్పటివరకు దేశంలో ఉన్న వాణిజ్య పెట్టుబడి, పారిశ్రామిక పెట్టుబడిగా మారింది. తద్వారా చిన్న మధ్యతరగతి పారిశ్రామిక వర్గం ఆవిర్భవించింది.
తర్వాత పదేళ్లలో దిగుమతి ద్వారా వచ్చే ఉత్పత్తుల స్థానంలో దేశీయంగా పారిశ్రామిక ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా దేశ పారిశ్రామిక అభివృద్ధి సగటున 9 శాతానికి చేరుకున్నది. 1957 నాటి సంక్షోభం సమసి పోయేలోపు కొత్తగా ఆవిర్భవించిన యాజమాన్య పారిశ్రామిక వర్గం ఆర్థిక వ్యవస్థపై తన పట్టును బిగించింది. రాజ్యాధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవటానికి సిద్ధమయ్యింది. ఇందిరా గాంధీ రాజభరణాలు రద్దు చేయడంతో పాటు 1969లో రాజకీయ పార్టీలకు కంపెనీలు చందాలు ఇచ్చే విధానాన్ని రద్దు చేశారు. దీంతో ఈ వర్గం రాజకీయ అధికారానికి మరింత దగ్గర అయ్యే మార్గాలు మెరుగయ్యాయి. అయితే రాజకీయ పార్టీలకు కంపెనీల ద్వారా వచ్చే చందాలను నిషేధించారు. కానీ ఎన్నికల కసరత్తు పూర్తి చేయటానికి ప్రత్యామ్నాయ వనరుల మార్గాలు రూపొందించుకోలేదు. కాంగ్రెస్‌తో సహా అప్పటివరకు ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికల భారాన్ని మోయాల్సి రావటంతో పార్టీలకు పెద్ద ఎత్తున నిధులు అవసరం అయ్యాయి. అది కూడా నగదు రూపంలో అవసరమయ్యాయి. రాజకీయ పార్టీల చేతుల్లో నగదు కొరతను పూరించడానికి కొత్తగా తెర మీదకు యాజమాన్య పారిశ్రామిక వర్గం ముందుకు వచ్చింది.
కాంగ్రెస్ పార్టీకి చందాలు ఇచ్చే బడా పారిశ్రామిక వర్గానికి అనుకూలమైన ప్రయోజనం కలిగించేలా ఆర్థిక విధానాలు రూపకల్పన దశదిశ మారటానికి పెద్దగా సమయం పట్టలేదు. వృత్తిపరమైన నైపుణ్యంతో నడిచే పరిశ్రమలు పెద్ద ఎత్తున నగదు రూపంలో రాజకీయ పార్టీలకు చందాలు ఇవ్వటానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇదే విషయాన్ని రాజకీయ పార్టీ నాయకత్వానికి తెలియజేసినప్పుడు ఆయా పార్టీల అధిష్టానం నుంచి ఏదో ఒక మార్గంలో నగదు సమకూర్చండి లేదంటే, అన్నదే సమాధానంగా మారింది. అప్పటి నుంచి ప్రభుత్వానికి బడా పారిశ్రామిక వర్గానికి మధ్య ఉన్న సంబంధాలు కటువుగా మారాయి. అప్పటివరకు లోపాయికారీగా కొనసాగిన సంబంధాలు తర్వాత కాలంలో తమ మధ్య పెరుగుతున్న వైషమ్యాన్ని బాహటంగానే ప్రదర్శించుకోనారంభించాయి.
రాజకీయ పార్టీలకు నగదు రూపంలో చందాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న వాళ్లంతా అప్పుడప్పుడే తెర మీదకు వచ్చి స్థిరపడుతున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులు- వ్యాపారులు. ఈ వర్గం నిరంతరం అభద్రతతోనే తన ప్రయాణం కొనసాగించింది. మార్కెట్ పై ఈ వర్గానికి పూర్తిస్థాయి నియంత్రణ లేదు. సరసమైన వడ్డీ ధరలకు బ్యాంకు రుణాలు పొందే అవకాశాలు నామమాత్రం. విద్యుత్తు, నీటి సరఫరా, సమాచార రవాణా సాధనాలు వంటి వ్యాపారాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కోసం ఈ వర్గం పూర్తిగా ప్రభుత్వంపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇవన్నీ పొందటానికి లేదా వీటిలో కొన్నిటినైనా పొందటానికి ఈ వర్గం పాలక పార్టీలకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టచెప్పాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఏ రోజు ప్రభుత్వం రూపొందించే ఏ విధానం వలన ఎప్పటి వరకు తాను సాధికారికంగా చలామణి చేసుకుంటూ వచ్చిన రంగంలోకి ఏ ఆధునిక పరిశ్రమ ప్రవేశిస్తుందో తెలియని భయంతో నిరంతరం బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సరిగ్గా ఇదే సమయంలో ఇందిరాగాంధీ రాజకీయ పార్టీలకు కంపెనీల నుంచి వచ్చే అధికారిక చందాలను రద్దు చేయడం, అదే సమయంలో పార్టీల నిర్వహణ కోసం అవసరమైన ధనం ప్రత్యామ్నాయ మార్గంలో సమకూర్చుకోవాల్సిన రావడంతో ఈ వర్గానికి అదే మంచి అదనుగా కనిపించింది. రాజకీయ అధికారానికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నం చేసింది. ఫలితంగా బడా కార్పొరేటర్ వర్గానికి సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ కేవలం దశాబ్ది కాలంలో వారిని వదిలిపెట్టి చిన్న మధ్య తరహా పరిశ్రమల యజమానులకు దగ్గర అయింది.
1971-73 మధ్యకాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆమోదించిన అనేక చట్టాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అప్పటివరకు బడా కార్పొరేట్లతో ఉన్న సంబంధాలు తెగతెంపులయ్యాయి. భారత ఆర్థిక వ్యవస్థ అంతర్ముఖిగా మారింది. ఎమ్మార్టీపి చట్టం ప్రకారం ఏదైనా ఒక పెద్ద కంపెనీ 70 లక్షల డాలర్ల పైచిలుకు ఆస్తులు కలిగి, ఏదేని సరుకుల మార్కెట్లో మూడో వంతు సరఫరాను నియంత్రించే సామర్థ్యం కలిగి ఉంటే దాన్ని గుత్త పెట్టుబడిదారీ సంస్థగాను, ఆ కంపెనీ అనుసరించే వాణిజ్య వ్యవహారాలు ఇతరుల ప్రవేశానికి ఆటంకం కలిగించే విధానం నిర్వచించబడింది. పారిశ్రామిక లైసెన్స్ విధానం మౌలిక రంగాలైన గనులు, భారీ ఇంజనీరింగ్, రసాయనిక పరిశ్రమలు మినహా మిగిలిన పరిశ్రమలలో గుత్త పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టకూడదని ప్రకటించింది. ఈ రంగాలలో ప్రతిపాదిత పెట్టుబడులు గుత్త పెట్టుబడిదారీ విధానానికి దారితీయవని వాదించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టాన్ని సవరించడం ద్వారా నూటికి నూరు శాతం ఎగుమతి ఆధారిత పరిశ్రమల్లో తప్ప మిగిలిన పరిశ్రమలలో విదేశీ పెట్టుబడి ప్రవేశాన్ని నిషేధించింది. ఈ సవరించిన చట్టంలో ఓ ప్రమాదకరమైన క్లాజు ఉన్నది. ఆ క్లాజు ప్రకారం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు తాము వివిధ కంపెనీలకు ఇచ్చిన రుణాలలో 40 శాతం ఆ కంపెనీలో ఈక్విటీగా మార్చుకోవడానికి అనుమతిస్తుంది. కంపెనీల ప్రమోటర్లకు మొత్తం ఆయా కంపెనీల్లో మూడోవంతు కూడా లేని రోజులలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలలో యాజమాన్య వాటాను కలిగి ఉండేందుకు అవకాశం ఇచ్చే ఈ చట్ట సవరణలను చూసిన తర్వాత గుత్త పెట్టుబడిదారులు, బడా కంపెనీల యజమానులు బెంబేలెత్తారు. విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టంలోని కన్వర్షన్ క్లాజు(బదిలి క్లాజు) ద్వారా ప్రైవేట్ రంగ సంపద లేదా ఆస్తులలో నిర్దిష్ట వాటాను జాతీయం చేసుకునేందుకు నాటి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ చర్యలు భారీ పరిశ్రమల విస్తరణకు సంబంధించి అనేక భయాందోళనలకు దారితీశాయి. పైన ప్రస్తావించిన మూడు సంస్థల ద్వారా వివిధ ప్రైవేటు పరిశ్రమలలో పెట్టిన పెట్టుబడులలో గణనీయమైన వాటాను జాతీయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. వివిధ స్థాయిలలో ఆర్థిక వనరుల కొరత ఎదుర్కొంటున్న పరిశ్రమలకు కావలసిన పెట్టుబడి సమకూర్చటానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోవటం పారిశ్రామిక వర్గంలో ఆందోళనకు దారి తీసింది. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టంలో పొందుపరిచిన కన్వర్షన్ క్లాజు కారణంగా తరువాత దాదాపు దశాబ్ద కాలం పాటు భారీ పరిశ్రమల విస్తరణ స్తంభించిపోయింది.
చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం రక్షణ కల్పించే ఇటువంటి చర్యలు చాలా ఉన్నాయి. నానాటికి ఈ రంగం ఉత్పత్తి చేసే సరుకులు, వస్తువుల సంఖ్య మోతాదు మాత్రమే పెరుగుతూ వచ్చింది. 1972 నాటికి చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో మాత్రమే తయారయ్యే సరుకులు, వస్తువుల సంఖ్య 177గా ఉంటే 1983 నాటికి వీటి సంఖ్య 837 పెరిగింది. వినియోగదారీ ఉత్పత్తుల రంగంలో భారీ పరిశ్రమలు కాలు పెట్టడానికి కూడా వీల్లేనంత స్థాయికి ఈ రిజర్వేషన్లు చేరాయి. ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, ట్రాన్సిస్టర్ రేడియోలు మొదలు గ్రూహోపకరణాలు వంటి వినిమయ సరుకులన్నీ చిన్నమద్యతరహా పారిశ్రామిక రంగానికి మాత్రమే రిజర్వు చేయబడ్డాయి. ఈ విధంగా ఆర్థిక రంగంలో మధ్య దొంతరలలో ఉన్న ఈ చిన్నమధ్య తరహ పరిశ్రమలు 853000 యూనిట్లతో 5000 రకాల వినిమయ వస్తువులను తయారు చేస్తూ, దాదాపు కోటి మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నది. ప్రభుత్వ రంగంలో తయారయ్యే పరిశ్రమ ఉత్పత్తులతో కలుపుకుంటే మొత్తం 40% పారిశ్రామిక ఉత్పత్తులు ఈ నియంత్రిత రంగాలలోనే జరిగే స్థితి అప్పటి ఆర్థిక రంగ పరిస్థితి.
ఈ విధంగా చూసినప్పుడు 1984 నాటికి భారత పారిశ్రామిక చిత్రం మహామాంద్యం మొదలైన 1920 జర్మన్ పారిశ్రామిక చిత్రంతోనూ, 1960- 70 దశకాల నాటి ఇరాన్‌తోనూ పోల్చదగినదిగా ఉన్నది. 1980 దశకంలో భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామికీకరణ చెందిన ఆర్థిక వ్యవస్థగా పరిణామం చెందింది. గుత్తాధిపత్యం పట్ల అదేరకమైన వైముఖ్యత, పిడికెడు మంది ఆశ్రితులకు అన్ని వనరులు, సౌకర్యాలు సమకూర్చి పెట్టడం, భారీ పరిశ్రమల అభివృద్ధికి ఆటంకాలు కల్పించే నియంత్రణలు, లైసెన్స్ విధానాలు, విదేశీ వ్యాపార సంస్థల పట్ల అవసరానికి మించిన గుడ్డి వ్యతిరేకత, ఏది ఏమైనా మన కాళ్ళ మీద మనమే నిలబడాలనే మొండి పట్టుదల, చిన్న వ్యాపారులు, కార్ఖానాలు పరిశ్రమల పట్ల జాలి, కరుణ, వ్యవహారాలు చక్కబెట్టడానికి పార్టీ నేతలతో కూడిన మధ్యవర్తిత్వం ఇవన్నీ 1920 దశకం నాటి జర్మనీలోను 1970 దశకం నాటి ఇరాన్‌లోనూ మనకు కనిపిస్తాయి.
ఈ మధ్యతర పారిశ్రామిక వర్గాన్ని గుత్త పెట్టుబడి నుంచి ఎదురయ్యే ఊపుతాపుల నుంచి కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ వచ్చింది. గుత్త పెట్టుబడిదారీ సంస్థల వ్యాప్తిని, విదేశీ పెట్టుబడి ప్రవేశాన్ని అడ్డుకోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ చట్టాలను ఆమోదించింది. తన యోగక్షేమాలు ఈ మధ్యంతర పారిశ్రామిక తరగతితోనే ముడిపడి ఉన్నాయని విశ్వసించింది. యూరప్‌లో ఫాసిజం ఆవిర్భావానికి కారణమైన మూడవ పునాది దేశీయ హిందూత్వ శక్తుల వ్యూహంలో లేదు. ఈ మూడవ పునాదిని రాజీవ్ గాంధీ హయాంలో పాక్షికంగా అమలు చేసిన సరళీకరణ విధానాలు సమకూర్చి పెట్టాయి. ఈ సరళీకరణ పారిశ్రమిక రంగంలో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడి పెట్టడానికి మార్గాలు సులభతరం చేసింది. 1980- 84 మధ్యకాలంలో కేవలం 4.9 శాతంగా ఉన్న పారిశ్రామిక వస్తూత్పత్తి వృద్ధిరేటు 1985-90 మధ్యకాలంలో 10:40 శాతానికి పెరిగింది. గణనీయమైన వేగంతో పెరిగిన ఆదాయాలు, దాంతోపాటు పెరిగిన వినిమయ సరుకుల గిరాకీ రాజీవ్ గాంధీ ప్రభుత్వం అమలు చేసిన సరళీకరణ విధానాల తొలి ప్రభావం మధ్యంతరశ్రేణి పారిశ్రామిక వర్గంపై పడకుండా కొంతకాలం నిలువరించింది. అయితే దేశంలోని ఆర్థికవ్యవస్థను దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు శాసించిన ఈ మధ్యంతర శ్రేణి పారిశ్రామిక వర్గం ఎక్కువ కాలం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం లేకపోయింది.
రాజీవ్ గాంధీ అనుసరించిన విధానాలు భారత కరెన్సీ విలువను యధాతధంగా కొనసాగించినా దేశీయ ఆర్థికవ్యవస్థను అదుపు చేస్తున్న అన్ని రకాల నియంత్రణలు, పరిమితులు, లైసెన్సులను రద్దు చేశాయి. ఈ నియంత్రణలు భారతీయ పారిశ్రామికరంగాన్ని విదేశీ మార్కెట్‌కు దూరం చేసింది. పెరిగిన ఉత్పాదక సామర్థ్యంలో కొంత మాత్రమే విదేశీ మార్కెట్‌కి చేరుకున్నది. అమాంతం పెరిగిన వస్తు ఉత్పత్తి రంగ సామర్థ్యంలో పదింట తొమ్మిది శాతం భారతదేశంలో నానాటికీ పెరుగుతున్న మధ్య తరగతి ఆకాంక్షలను తీర్చడానికే సరిపోయింది. అదే సమయంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల విస్తరణను అడ్డుకున్నది. 1970 నుంచి 1973 మధ్యకాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా ఏర్పడిన నిరంతర కొరతతో కూడిన ఆర్థిక వ్యవస్థలో స్థిమితంగా నాలుగు రాళ్లు సంపాదించుకుంటూ వచ్చిన మధ్యంతర శ్రేణి పారిశ్రామిక వర్గం రాజీవ్ గాంధీ అనుసరించిన సరళీకరణ విధానాల ద్వారా ఆ వెసులుబాటును పెద్ద ఎత్తున కోల్పోయింది.
ఈ రంగానికి ఈ వర్గానికి తగిలిన ఎదురుదెబ్బల్లో ఇది మొదటిది మాత్రమే.
అనువాదం: కొండూరి వీరయ్య
(ప్రేమ్ శంకర్ ఝా రచించిన భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిన తీరు 1947 నుంచి 2025 వరకు అన్న గ్రంథంలో ఒక భాగాన్ని ఈ వ్యాసం రూపంలో అందిస్తున్నాము. ఈ భాగం తొలుత స్క్రోల్ ఇన్‌లో ప్రచురించబడింది. శీర్షిక ది వైర్ తెలుగు సంపాదకులది రచయితది కాదు- సంపాదకులు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.