
ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక, సామ్యవాదం పట్ల సానుకూలత పెరుగుతోంది. ఈ మధ్య అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనాలతో సహా 28 దేశాల్లో ఓ సర్వే జరిగింది. ఈ సర్వేలో ప్రస్తుతం ఉన్న రూపంలో పెట్టుబడిదారీ వ్యవస్థ వలన ప్రపంచానికి ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు. జూన 2021లో జరిగిన సర్వే ప్రకారం అమెరికాలో 36 శాతం మంది ప్రజానీకం పెట్టుబడిదారీ వ్యవస్థ పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ విధమైన అభిప్రాయం కలిగిన వారిలో యువకులు ఎక్కువగా ఉన్నారు. పద్దెనిమిదేళ్ల నుండి 24 ఏళ్ల మధ్య ఉన్న వారిలో పెట్టుబడిదారీ వ్యవస్థను ఈసడిరచుకుంటున్న వారు 54 శాతం మంది ఉంటే 18 ` 34 ఏళ్ల మధ్య ఉన్న వారిని పరిశీలిస్తే ఇటువంటి అభిప్రాయం కలిగిన వారు 46 శాతంగా ఉన్నారు. అదేసమయంలో అన్ని వయస్సున్న గ్రూపుల్లో 41 శాతం మంది సామ్యవాదం పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. 18`24 సంవత్సరాల మధ్యనున్న వాళ్లల్లో సామ్యవాదం పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్న వారు 52 శాతం వరకూ ఉన్నారు. 25`35 సంవత్సరాల వయస్సున్న వారిలో యాభైశాతం మంది సామ్యవాద వ్యవస్థలను స్వాగతిస్తున్నారు. అక్టోబరు 2021లో జరిగిన ఓ సర్వే ప్రకారం 53 శాతం మంది అమెరికన్ వాసులు బడా పెట్టుబడిదారీ సంస్థల పట్ల విముఖతతో ఉన్నారు. ఈ సర్వే ప్రకారం డెమొక్రటిక్ పార్టీ శ్రేణుల్లో 2010 నాటికి 55 శాతం మంది సామ్యవాద సిద్ధాంతాల పట్ల సానుకూలంగా ఉంటే 2021 నాటికి ఈ మోతాదు 65 శాతానికి పెరిగింది.
అమెరికాయేతర పెట్టుబడిదారీ దేశాల్లో కూడా పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. ఆగస్టు 2021లో కెనడాలో జరిగిన ఓ సర్వే ప్రకారం కెనడాలో మెజారిటీ ప్రజలు (53 శాతం మంది) ‘‘ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేయాల్సిన అవసరం ఉంద’’ని అభిప్రాయపడితే 35 శాతం మంది ‘‘పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి వైదొలగాల’’ని అభిప్రాయపడ్డారు. షుమారు 25 శాతం మంది ఇటువంటి అభిప్రాయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. సాధారణ ప్రజల్లోనూ ప్రత్యేకించి యువతలోనూ పెట్టుబడిదారీ వ్యవస్థ పట్ల వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉన్నట్లు ఈ సర్వే వెల్లడిస్తోంది. 18`34 సంవత్సరాల మధ్య ఉన్న మహిళల్లో 49 శాతం ఈ వ్యతిరేకతతో ఉంటే ఇదే వయో తరగతికి చెందిన పురుషుల్లో 43 శాతం మంది ఇటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఈ దేశాల్లో ఏదో ఒక పార్టీకి ఓటు వేయటంపై ఉన్న వ్యతిరేకతతో పోలిస్తే పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఓటు వేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. మరింత స్పష్టంగా చెప్పాలంటే లిబరల్ పార్టీకి ఓటు వేయటం పట్ల 20 శాతం మంది వ్యతిరేకతతో ఉంటే, 21 శాతం మంది కన్సర్వేటివ్ పార్టీలకు ఓటు వేయటానికి సిద్ధంగా లేరు. మధ్యతరహా సోషల్ డెమొక్రటిక్ పార్టీగా ఉన్న ఎన్డీపీ పట్ల 11 శాతం మంది వ్యతిరేకతతో ఉన్నారు. కానీ స్థూలంగా 35 శాతం మంది కెనడావాసులు పెట్టుబడిదారీ వ్యవస్థ పట్ల విముఖతతో ఉన్నారు. ఈ అంశంలో ఉత్తర అమెరికా దేశాలకూ ఐరోపా దేశాలకూ మధ్య పెద్దగా వ్యత్యాసాలు లేవు. 2016 నాటి వివరాలు పరిశీలిస్తే 47 శాతం మంది బ్రిటిషర్లు, 39 శాతం మంది జర్మన్లు పెట్టుబడిదారీ వ్యవస్థ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అంతేకాదు. 36 శాతం మంది బ్రిటిషర్లు, 45 శాతం మంది జర్మన్లు సోషలిజం పట్ల సుముఖతతో ఉన్నారు. (అమెరికాలో 2016 నాటికి పెట్టుబడిదారీ వ్యవస్థ పట్ల విముఖత కలిగిన వారు 27 శాతం ఉంటే సోషలిజం పట్ల సుముఖత వ్యక్తం చేసిన వారు 29 శాతం మంది).
స్థూలంగా చెప్పాలంటే ఆధునిక పెట్టుబడిదారీ దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ పట్ల విముఖతతో పాటు ఏదో ఒకరకమైన సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్న జనాభా శాతం గణనీయంగా ఉన్నది. ఈ అభిప్రాయాలు కలిగిన వారు ముందు ముందు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. మొదటిది పెట్టుబడిదారీ వ్యవస్థను అంతమొందించాలంటే వీరి బలం చాలదు అన్నది వాస్తవం. అదే సమయంలో ఈ ప్రజాబలం కేంద్రంగా సోషలిజం దిశగా ఓ మహోద్యమాన్ని నిర్మించటానికి కావల్సిన పునాదిని నిర్మించుకోవచ్చు. రెండో అంశం ఏమిటంటే సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్న వారిలో (ప్రత్యేకించి అమెరికాలో) అసలు సోషలిజం అంటే ఏమిటో కూడా తెలీని వారు గణనీయంగా ఉంటారనటంలో సందేహం లేదు. అదేవిధంగా పెట్టుబడిదారీ వ్యవస్థ లోతుపాతులు తెలిసిన వారు, అది ఏవిధంగా మానవాళికి నష్టదాయకమైనదో అవగాహన కలిగిన వారు కూడా తక్కువమందే ఉంటారు. మన్నికైన పర్యావరణంతో, సామాజిక సమన్యాయంతో కూడిన సోషలిస్టు ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థపై నికరమైన నిర్మొహమాటమైన విమర్శలు ఎక్కుపెట్టాలి. అంతే నికరంగా నిర్మొహమాటంగా శాస్త్రీయ సామ్యవాదాన్ని సమర్ధించాలి. 175 ఏళ్ల క్రితం మార్క్స్, ఏంగెల్స్లు రాసిన కమ్యూనిస్టు ప్రణాళికలో దీనికి సంబంధించిన కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కమ్యూనిస్టు ప్రణాళిక 175 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా కమ్యూనిస్టు ప్రణాళిక సాధించిన విజయాలను నెమరువేసుకునే ప్రయత్నమే ఈ వ్యాసం.
గత పాతికేళ్లుగా కమ్యూనిస్టు ప్రణాళిక గురించి చర్చలు విశ్లేషణలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మార్క్సిస్టు విశ్లేషకులు సమీర్ అమీన్, కార్వర్, ఫర్ర్, డేవిడ్ హార్వే, పాంటిక్, లీస్ వంటి వారు పలు వ్యాఖ్యానాలు ప్రచురించారు. అయితే ఈ వ్యాఖ్యానాలు కమ్యూనిస్టు ప్రణాళికలోని ఏదో ఒక అంశాన్ని తీసుకుని దానిపై వ్యాఖ్యానించటానికో, వివరించటానికో, విమర్శించటానికో పరిమితం అయ్యాయి. అది ఆత్మ రక్షణ ధోరణి. అప్పటికి ఆచరణాత్మక ధోరణి. కమ్యూనిస్టు ప్రణాళిక యొక్క రాజకీయ సైద్ధాంతిక విస్తృతి, తీవ్రత రీత్యా ఈ రచనపై సాగే ఏ విశ్లేషణ అయినా సమగ్రంగానే ఉండాలన్నది నా అభిప్రాయం. ఇప్పుడిప్పుడే మిలిటెంట్ రాజకీయ అవగాహనలు పెంపొందించుకుంటున్న వారికి ప్రత్యేకంగా యువతను చైతన్యవంతులను చేసే లక్ష్యం దిశగా ఈ విశ్లేషణలు ఉండాలని, ప్రణాళికలోని కీలకమైనన అంశాలను సమర్ధించటంతో పాటు సమకాలీన చర్చల్లో పాఠకుల రాజకీయ అవగాహన పెంపొందించే దిశగా ఉండాలని భావిస్తున్నాను. పెట్టుబడిదారీ వ్యవస్థ కింద చితికి పోతున్న తమతమ జీవితాలను చూస్తూ ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొన్ని ఘటనలు, భావనలు, ఆచరణ ఆధారంగా ఏర్పడే సద్యోజనిత చైతన్యమే తప్ప అది వర్గ చైతన్యం కాబోదు. అంటే స్వత: సిద్ధంగా పెట్టుబడిదారీ వ్యవస్థ రధ చక్రాల కింద నలిగిపోయే వారికి ఈ బరువుతో వచ్చే అవగాహనే ఇది. అనుభవం పాఠాలు నేర్పుతుందన్నది నిస్సందేహం. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థలో దైనందిన జీవన పోరాటంలో ఉన్న వారు పెట్టుబడిదారీ వ్యవస్థను అంతమొందించాల్సిన అవసరం, సామ్యవాదాన్ని స్థాపించుకోవాల్సిన అవసరం గురించిన పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అటువంటి వారికి కావల్సిన పరిజ్ఞానాన్ని అందించే గ్రంథమే కమ్యూనిస్టు ప్రణాళిక.
మార్క్సిజం కంటే కమ్యూనిస్టు ప్రణాళికకే ఎక్కువ ప్రజాదరణ ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది వాస్తవం. 1980 దశకం నుండి మార్క్సిజం మీద ప్రజల ఆసక్తి తగ్గుతూ ఉంటే మార్క్సిజంలో పునాది రచన అయిన కమ్యూనిస్టు ప్రణాళికకమ్యూనిస్టు ప్రణాళిక మీద ఆసక్తి పెరుగుతూ ఉంది. కేవలం 2008లో ప్రపంచ ద్రవ్య పెట్టుబడి సంక్షోభం సమయంలో మాత్రమే సమగ్ర సిద్ధాంతంగా మార్క్సిజం పట్ల కాస్తంత ఆసక్తి పెరిగింది.
కమ్యూనిస్టు ప్రణాళిక ప్రాధాన్యత పెరుగుతుందనటానికి ఓ చిన్న ఉదాహరణను చెప్పుకోవచ్చు. భారతదేశంలో మావోయిజం ప్రభావంతో పని చేస్తున్న అనేక బృందాలను అణచివేయటానికి రాజ్యం పెద్దఎత్తున దాడి చేస్తోంది. ఒక వ్యక్తి మావోయిస్టు అని ఎలా నిర్ధారణకు వస్తారు అన్న ప్రశ్నకు సమాధానంగా ఓ సీనియర్ పోలీసు అధికారి ఎవరిచేతిలోనైనా కమ్యూనిస్టు ప్రణాళిక కానీ మావో రాసిన రెడ్ బుక్ కానీ కనిపిస్తే అతను అనుమానితుడవుతాడు అని సమాధానం చెప్పారు. అటువంటి వాళ్లపై నిఘా పెడతాము. ఎక్కువసార్లు వారి నుండి మాకు కావల్సిన సాక్ష్యాధారాలు దొరుకుతాయని కూడా చెప్పారు.
పరిజ్ఞానం పలు రకాలు అని విజ్ఞానశాస్త్ర తత్వవేత్త ఆండ్రూ సేయర్ చెప్తారు. ప్రపంచం గురించి కొన్ని ప్రతిపాదనలు చేయగలటం ఓ రకమైన పరిజ్ఞానం. అటువంటి ప్రతిపాదనలు సాధారణంగా తరచూ పరిశీలనాంశాలుగా ఉంటాయి. మరో రకమైన పరిజ్ఞానం ప్రపంచం గురించి విమర్శనాత్మక జ్ఞానాన్ని అందిస్తుంది. ‘‘మన పరిజ్ఞానం, మనం ప్రయోగించే భాష తరచూ మనం ప్రశ్నించటానికి, వాదించటానికి, ఘంటాపథంగా చెప్పటానికి, గౌరవించటానికి లేదా మన వ్యతిరేకతను పదిమందికీ పంచటానికి, సంబంధాలు ఏర్పర్చుకోవడానికి కావల్సిన సాధనాలను అందించే సామాజిక చర్య’’ అని ఆండ్రూ సేయర్ అంటారు. విమర్శ అవసరమే. ఎందుకంటే సమకాలీన ప్రపంచంలో దోపిడీ వ్యవస్థలను బలోపేతం చేసేవిగా ఉన్న నిర్మాణాల నడుమ ప్రజలకు కావల్సిన అవసరాలు సమకూరటం లేదు. అంతేకాదు. అటువంటి భావనలు ఆలోచనలు ప్రస్తుతమున్న ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చటానికి బదులు విప్లవాత్మకమైన కొత్త ప్రపంచాన్నే నిర్మించుకునేలా ప్రేరేపిస్తాయి. కమ్యూనిస్టు ప్రణాళిక ఇప్పుడిప్పుడే సమరశీల అవగాహన పెంపొందించుకుంటున్న యువతరానికి కావల్సిన రెండు రకాల విజ్ఞానాన్ని అందిస్తుంది.
కమ్యూనిస్టు ప్రణాళికలో అనేక ప్రతిపాదనలున్నాయి. (అన్ని రకాల స్థల కాల పరిస్థితులకూ వర్తించే ప్రతిపాదనలు ఇవి). కమ్యూనిస్టు ప్రణాళికలో కనిపించే అనేక కోరికలు, భావనలు మన రోజువారీ జీవితంలో వ్యక్తమయ్యేవే. అంతమాత్రాన ఆ ప్రతిపాదనలు ఓ కొలిక్కి వచ్చాయి కాబట్టి అవన్నీ మన రోజువారీ జీవితంలో చర్చనీయాంశాలు అయ్యాయని భావించటానికి వీల్లేదు. అదేసమయంలో కమ్యూనిస్టు ప్రణాళికలో ప్రస్తావించిన పరిణామ క్రమం అన్ని దేశాల్లోనూ అన్ని సమయాల్లోనూ ఒకేరీతిలో పురోగమిస్తుందని భావించటానికీ, నిర్ధారణకు రావటానికీ కూడా వీల్లేదు. కాజువల్ విషయాలు అంటే ఏమిటి? నిర్దిష్ట ఆధారాలతో విరుగుడు ప్రతిపాదించనంత కాలమూ ఇప్పుడున్న వ్యవస్థలోని కొన్ని ప్రత్యేక నిర్మాణాల కారణంగా ఉనికిలో ఉండే పరిస్థితులు కొన్ని అనివార్య పర్యవసానాలకు దారితీస్తాయి. ఇవే మనకు కాజువల్ విషయాలుగా వాదనలుగా వ్యవహారాలుగా అనివార్యతలుగా కనిపిస్తాయి. పెట్టుబడిదారీ సంబంధాల కారణంగా ప్రపంచీకరణ సాధ్యమైంది అని చెప్పుకున్నంత మాత్రాన నిజంగా ప్రపంచం అంతా ఒకే కుగ్రామంగా లేదా వసుధైక కుటుంబంగా మారిందని కాదు. లేదా అన్ని దేశాలూ ఈ ప్రపంచీకరణ పడవలో సమాన హోదాగల కుర్చీలేసుకుని కూర్చున్నారని కాదు. ప్రపంచీకరణ పట్ల తమదైన అవగాహనతో చేస్తున్న విమర్శలూ, విమర్శకులూ కూడా ఉన్నారు. కమ్యూనిస్టు ప్రణాళికలో పెట్టుబడిదారీ వ్యవస్థ గురించిన కొన్ని అభిప్రాయాలు, అవగాహనలూ కొన్ని సోషలిస్టు తరహా వాదనలపై సాగించిన విమర్శల నేపథ్యంలో ఏర్పడినవే కావటం ఆసక్తికరమైన అంశం.
మార్క్సిజంలో పరస్పర అనుబంధమైన, పరస్పరాధారితమైన నాలుగు అంశాలున్నాయి. గతితార్కిక చారిత్రక తత్వశాస్త్రం, చారిత్రక భౌతికవాదం, రాజకీయ అర్థశాస్త్రం, కమ్యూనిస్టు సమాజం గురించి వివరించే ప్రతిపాదనలు లేదా కమ్యూనిస్టు సమాజం గురించిన దృక్ఫధం. కమ్యూనిస్టు ప్రణాళిలో చివరి మూడు అంశాల గురించిన చర్చ ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటి అంశమైన గతితార్కిక చారిత్రక తత్వశాస్త్రం గురించిన ప్రస్తావనలు లేవు. కాకాపోతే కమ్యూనిస్టు ప్రణాళిక యావత్తూ ఈ తాత్విక దృక్ఫధం ఆధారంగా రూపొందినదే. కమ్యూనిస్టు ప్రణాళిక రాయటానికి మూడేళ్ల ముందే జర్మన్ ఐడియాలజీ అన్న గ్రంథంలో మార్క్స్, ఏంగెల్స్లు గతితార్కిక, చారిత్రక తత్వ శాస్త్ర పునాదులను ధృవీకరించారు.
చారిత్రక భౌతికవాదం నేపథ్యంలో మార్క్స్ ఏంగెల్స్లు తమ ప్రణాళికలో మార్క్సిస్టు సామాజిక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ వర్గం, సామాజిక ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి శక్తుల మధ్య ఉండే సంబంధం, వర్గపోరాటం, రాజ్యాధికారపు వర్గ స్వభావం వంటి అనేక అంశాలను చర్చిస్తారు. రాజకీయ అర్థశాస్త్ర భావనల్లో భాగంగా ప్రణాళిక పెట్టుబడిదారీ వ్యవస్థ, పెట్టుబడిదారీ ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క సంక్షుభిత స్వభావం గురించి చర్చిస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ స్వాధీనంలోకి వెళ్లిన కార్మికుల దుర్భర జీవనం, కార్మికులు సాగించే ఆర్థిక పోరాటాలను పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలా ప్రోత్సహిస్తుంది, ఎలా నీరుగారుస్తుంది అన్న అంశాలను కూడా ప్రణాళిక చర్చించింది. కమ్యూనిస్టు కార్యాచరణ గురించికూడా విస్తారమైన చర్చ మనం ప్రణాలికలో చూడొచ్చు. ఇందులో ముఖ్యంగా పెట్టుబడిదారీ దశ నుండి సమాజం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి, కమ్యూనిజం అంటే ఏమిటి, కమ్యూనిస్టు సమాజ నిర్మాణం, విప్లవం ఆవశ్యకత, రాజ్యాధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత కార్మికవర్గం చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన చర్యలు, పెట్టుబడిదారీ వ్యతిరేక విప్లవ సాధకుల్లో కార్మికవర్గం యొక్క ప్రత్యేకత, విలక్షణత వంటి అంశాలుపై మార్క్స్ ఏంగెల్స్ల అభిప్రాయాలను మనం చూడొచ్చు.
రాజు దాస్
యార్క్ యూనివర్శిటీ, టొరంటో
అనువాదం : కొండూరి వీరయ్య
(కమ్యూనిస్టు ప్రణాళిక వెలుగు చూసిన 175 సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకుని యార్క్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాజు దాస్ రాసిన ప్రత్యేక వ్యాసం లో ఒక భాగాన్ని ఈ రోజు రెడ్ బుక్ డే సందర్భంగా ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తోంది…. ది వైర్ తెలుగు సంపాదకులు )
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.