
సుప్రీం కోర్టుకు అప్పీలు చేసే విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం పాటిస్తున్న ద్వంద్వ వైఖరి తేటతెల్లమవుతోంది.
న్యూఢిల్లీ: పది రోజుల వ్యవధిలో ముంబయిలో కీలకమైన కేసుల్లో కోర్టు రెండు తీర్పులను వెలువరించింది. ఇందులో మొదటి కేసు, 2011 జూలై 11న రైలు బాంబు దాడులకు సంబంధించింది. ఈ కేసులో చిత్రహింసలను ఎదుర్కొన్న ముద్దాయిలు 19 ఏళ్ల తర్వాత నిర్దోషులుగా విడుదలయ్యారు.
ఈ బాంబు పేలుళ్లల్లో 189మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆరోపణలు రుజువు చేయటంలో ప్రాసిక్యుషన్ ఘోరంగా విఫలమైందని ముంబయి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా అభిశంసించింది. ఈ తీర్పు 2025 జూలై 21న వచ్చింది.
రెండోది, మాలెగాం బాంబు పేలుళ్లకు సంబంధించిన కేసు. ఈ కేసులో కనీసం ఆరుగురు చనిపోగా 100 మంది వరకు గాయపడ్డారు. ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేసింది. ఈ కేసులో కూడా ముద్దాయిలు అందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు.
“ముద్దాయిలపై తీవ్రమైన అనుమానాలున్నాయి. అయినా ఆరోపణలను నిరూపించటానికి కావల్సినన్ని సాక్ష్యాధారాలు సేకరించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైంద”ని కోర్టు వ్యాఖ్యానించింది. అవసరం లేని ఉపా సెక్షన్లు, తీవ్రమైన దర్యాపు లోపాలు, కీలకమైన సాక్ష్యాధారాలు లేకపోవటం, నిర్ధారణలేని ఫోరెన్సిక్ నివేదికలు వల్ల ముద్దాయిలను నిర్దోషులుగా పరిగణిస్తున్నట్లు ఎన్ఐఏ కోర్టు ప్రకటించింది.
దర్యాప్తులో లోపాలు..
ఈ రెండు తీర్పులూ ప్రభుత్వ నేర దర్యాప్తులో జరిగిన లోపాలను ఎత్తిచూపుతున్నాయి. ఈ రెండు తీర్పులపై సుప్రీంకోర్టును ఆశ్రయించటంలో రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలు తేటతెల్లమవుతున్నాయి.
‘‘2011 జూలై 11 రైలు బాంబు పేలుళ్ల కేసు తీర్పు పట్ల విస్మయం చెందుతున్నాను. కోర్టు తీర్పును పూర్తి అధ్యయనం చేస్తాను. న్యాయవాదులతో చర్చించాను. ఈ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నాము’’ అని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు.
ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే మహారాష్ట్ర ప్రభుత్వం రైలు బాంబు పేలుళ్లపై మహారాష్ట్ర హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ అప్పీలును స్వీకరిస్తూ ఈ తీర్పులో ఉన్న వ్యాఖ్యలు ప్రామాణికం కాదని వ్యాఖ్యానించింది.
కానీ, మాలెగాం బాంబు పేలుళ్లపై ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసే విషయంపై నోరు మెదపటం లేదు.
మాలెగాం బాంబు పేలుళ్లలో కూడా ప్రభుత్వ దర్యాప్తుపై న్యాయస్థానం తీవ్రమైన వ్యాఖ్యలుచేసింది. నేరారోపణకు అవసరమైన రీతిలో ప్రభుత్వం కృషి చేయలేదు. ఈ తీర్పుపై స్పందిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ‘కాషాయదళాలు ఉగ్రవాదులు కాదు. కారు. కాలేరు’ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఉగ్రవాద దాడుల్లో నష్టపోయిన కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాల్సి ఉంది. కానీ ముద్దాయిల విడుదల పట్ల రాజకీయ ప్రయోజనాల కోణంలో మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ‘దేశభక్తులైన కాషాయ దళాలను శివసేన ఎల్లప్పుడూ సమర్ధిస్తూ వచ్చింది. వారిని అక్రమ కేసుల్లో ఇరికించారు’ అన్నారు.
కానీ ఈ కేసులో అప్పీలు విషయంలో మాత్రం ప్రభుత్వం నుంచి స్పందన లేదు. సాధారణంగా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు, ప్రాసెక్యుషన్ విఫలం కారణంగా కేసు ఓడిపోతే ప్రభుత్వాలు అప్పీలు చేస్తాయి. కానీ మాలెగాం కేసులో ప్రభుత్వం అప్పీలు చేసేందుకు సిద్ధంకాలేదు.
ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించటానికి సరిగ్గా ఒక రోజు ముందు పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ‘ఏ హిందువూ ఉగ్రవాది కాదని చెప్పటానికి గర్విస్తున్నాను’ అని ప్రకటించారు.
మాలెగాం బాంబు పేలుడు కేసులో ముద్దాయిలుగా ఉన్న హిందూత్వ సంస్థ అభినవ భారత్కు చెందినవారి గురించి ప్రస్తావిస్తూ, రాజ్యసభలో అమిత్ షా ‘కాంగ్రెస్ హిందూ టెర్రర్ అనే అపోహలను ప్రచారం చేసేందుకు ప్రయత్నించింది. కానీ హిందువులు ఎవ్వరూ ఉగ్రవాదులు కాబోరని చెప్పటానికి గర్విస్తున్నాను’ అని ప్రకటించారు.
ఓటుబ్యాంకు రాజకీయల కోసం కాంగ్రెస్ సృష్టించిన కట్టు కథే కాషాయ ఉగ్రవాదమనే భావన అన్నారు.
అప్పీలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించేందుకు ముందుకు రాలేదు. దీంతో ఈ బాంబు పేలుళ్లల్లో నష్టపోయిన వారి కుటుంబాలకు చెందిన వ్యక్తులు స్పందించారు. తామే ఈ తప్పుడు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్తామని ప్రకటించారు.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.