
రాబోయే జనాభా లెక్కల్లో బెంగాల్ మూలాలున్న ముస్లింలు బెంగాలీని తమ మాతృభాషగా నమోదు చేసుకుంటారని ఆల్ బీటీసీ మైనారిటీ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు మైనుద్దీన్ అలీ అన్నారు. దీని మీద అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రతిస్పందించారు. వలస వచ్చిన ముస్లింలు ఎప్పుడూ బెంగాలీని తమ మాతృభాషగానే చెప్పుకుంటున్నారని, ఈ విధంగా బెదిరించడం కొత్తకాదని ఆయన పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: జనాభా లెక్కల్లో బెంగాలీని తమ మాతృభాషగా సూచించాలని రాష్ట్రంలోని మైనారిటీ కమ్యూనిటీలోని ఒక వర్గం డిమాండ్ చేసింది. ఈ విషయం మీద ఆయన స్పందిస్తూ, అస్సాంలో అస్సామీ అధికారిక భాషగా కొనసాగుతుందని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
అస్సాంలో బెంగాల్ సంతతికి చెందిన ముస్లింలు రాబోయే జనాభా లెక్కల్లో బెంగాలీని తమ మాతృభాషగా నమోదు చేస్తారని ఆల్ బీటీసీ మైనారిటీ స్టూడెంట్స్ యూనియన్(ఏబీఎంఎస్యూ) నేత అలీ అన్నారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో అస్సామీ మైనారిటీ భాషగా మారుతుందని పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో వివాదాస్పదంగా మారాయి. ఈ వాఖ్యల మీద శర్మ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
“ఈసారి జనాభా లెక్కల సమయంలో, మేము అస్సామీని మాతృభాషగా వ్రాయబోమని స్పష్టంగా చెబుతాము. ఇలా చేస్తే, అస్సామీ మైనారిటీ భాషగా మారుతుంది” అని అలీ అన్నారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, అస్సామీ చట్టబద్ధంగా అధికారిక భాషగా కొనసాగుతుందని శర్మ నొక్కి చెప్పారు. ఇటువంటి చర్యలు(అలీ తరహాలో) అస్సాంలో నివసిస్తున్న అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించడానికి సహాయపడతాయని అన్నారు.
“జనగణన సమయంలో మాట్లాడే భాష ముఖ్యమని చెప్పడం ద్వారా ఒక అపోహ వ్యాప్తి చెందుతోంది. మళ్లీ మైనారిటీలలో ఒక వర్గం అస్సామీ మాట్లాడబోమని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభిస్తోంది. మీరు ఇంట్లో బెంగాలీ మాట్లాడితే, అస్సామీ మాట్లాడుతున్నట్టుగా తప్పుడు సమాచారం ఎందుకు ఇస్తారు? జనాభా గణన సమయంలో తప్పుడు సమాచారం ఇవ్వడం నేరం” అని శర్మ అన్నారు.
ఇది కొత్త బెదిరింపు కాదని చెబుతూ అలీ వాదనలను శర్మ తోసిపుచ్చారు. బెంగాలీ మూలాలు కలిగిన ముస్లింలు ఎక్కువగా నివసించే నదీ తీర ప్రాంతాలను ముఖ్యమంత్రి ఉదాహరణగా చూపించారు. గత జనాభా లెక్కల్లో కూడా వారు బెంగాలీని తమ మాతృభాషగా ఎంచుకున్నారని అన్నారు.
వారిలో 30% మంది మాత్రమే అస్సామీని మాతృభాషగా రాశారని, వారిలో అస్సామీ మాట్లాడే స్వదేశీ ముస్లింలు(దేశి, గోరియా, మోరియా, జోల్హా) సంఖ్యలో అత్యధికంగా ఉన్నారని శర్మ అన్నారు.
“వలస వచ్చిన ముస్లింలు ఎప్పుడూ తమ మాతృభాష బెంగాలీగా రాస్తున్నారు. బెదిరింపులు కొత్తేమీ కాదు” అని శర్మ అన్నారు.
రాష్ట్రంలో జరుగుతోన్న తొలగింపు కార్యక్రమాలపై కూడా అలీ శర్మను విమర్శించారు.
ధుబ్రీ జిల్లాలోని బిలాషిపారాలో 3,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ స్థలాన్ని అస్సాం ప్రభుత్వం ప్రతిపాదించింది. బిలాషిపారాలోని 2,000 మందికి పైగా మియా ముస్లింల ఇళ్లను ధుబ్రీ జిల్లా యంత్రాంగం ఈ వారం ప్రారంభంలో కూల్చివేసింది .
అస్సాంలో తొలగింపు కార్యక్రమం కొనసాగుతుందని శర్మ చెప్పారు.
అనువాదం: వంశీకృష్ణ చౌదరి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.