
వాషింగ్టన్లో జరిగిన ఓ విలేకరుల సమావేశంలో యుఎస్ ఎయిడ్ భారతదేశంలో ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయటానికి నిధులు వెచ్చించిందనీ, భారతదేశంలోనే బోలెడు డబ్బుంది, మన దేశం ఎందుకు ఖర్చు పెట్టాలంటూ యుఎస్ ఎయిడ్ కార్యకలాపాలపై ట్రంప్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో దేశంలోని పార్లమెంట్లో ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ, 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటర్ల జాబితాల విషయంలో చెలరేగిన దుమారానికి, వివాదానికి కేంద్ర ఎన్నికల సంఘంకానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా సమాధానాలివ్వలేదు. ఇచ్చే ఉద్దేశ్యం కూడా వారికి లేదన్నది వేరే విషయం. ఈ నేపథ్యంలో గత సంవత్సరం ఓటర్లను చైతన్యవంతం చేయటానికి యుఎస్ ఎయిడ్ భారతదేశంలో 21 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టిందదన్నది వార్త. అసలు యుఎస్ ఎయిడ్ ఏమిటి, దాని పూర్వాపరాలు ఏమిటో సంక్షిప్తంగా తెలియచెప్పేందుకే ఈ వ్యాఖ్య.
యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. దీన్నే యుఎస్ఎయిడ్ అని పిలుస్తారు. అంతర్జాతీయ అభివృద్ధి కోసం అమెరికా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ ఇది. 1961లో జాన్ ఎఫ్ కెన్నడీ అధ్యక్షతన అమెరికా పార్లమెంట్ ఆమోదించిన విదేశీ సహాయక చట్టం (ఫారిన్ అసిస్టెన్స్ యాక్ట్) ద్వారా ఈ సంస్థ ఉనికిలోకి వచ్చింది. నిజానికి 1961లో ఇది చట్ట రూపం దాల్చినా రెండో ప్రపంచ యుద్ధం ముగింపు నాటికే దీనికి బీజాలు పడ్డాయి. 1945 నుండి 1949 వరకూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న జార్జి సి మార్షల్ రెండో ప్రపంచ యుద్ధంలో కకావికలమైన యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థల పునర్నిర్మాణానికి పెద్దఎత్తున ఆర్థికసహాయం అందించేందుకు కావల్సిన విస్తృత ప్రణాళికను రూపొందించారు. తర్వాతి కాలంలో దీన్నే మార్షల్ ప్రణాళిక అని పిలవసాగారు. అప్పటికే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత రూజ్వెల్ట్, చర్చిల్, స్టాలిన్ల మధ్య యాల్టాలో జరిగిన సమావేశం పర్యవసానంగా యూరోప్‌లో దాదాపు సగం భూభాగంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అప్పటికే రష్యా కీర్తిప్రతిష్టలు అంబరాన్ని చుంబించటం, వియత్నాం, కొరియా, క్యూబాల్లో విప్లవ జ్వాలలు చెలరేగటం, లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు ప్రభావవంతమైన స్థాయికి చేరుకోవడం, ఇండొనేషియాలో కమ్యూనిస్టు పార్టీ అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన తరుణం అది. అంతర్జాతీయ రాజకీయాల్లో కమ్యూనిజం పట్ల పెరుగుతున్న సానుకూలతకు అడ్డుకట్ట వేయటం కూడా మార్షల్ ప్రణాళికలో భాగమే. రెండో ప్రపంచ యుద్ధం ఆరంభానికి ముందు నాజీ జర్మనీలో ఆయుధ ఫ్యాక్టరీల ద్వారా పెద్దఎత్తున లాభాలు గడించిన అమెరికా పారిశ్రామికవర్గం రెండో ప్రపంచయుద్ధంలో కూడా యూరోపియన్ దేశాలకు చేసిన పలు సరఫరాల ద్వారా ఆ లాభాలను మరింతగా పెంచుకున్నది. పెరిగిన లాభాలను తిరిగి పెట్టుబడులుగా మల్చుకోవటంలో భాగంగా వచ్చిందే మార్షల్ ప్రణాళిక.
క్రమంగా అమెరికా సహాయం రూపంలో పలు దేశాలకు ఈ పెట్టుబడి తరలించేందుకు మార్గాలు అవసరం అయ్యాయి. అటువంటి మార్గాన్వేషణలో మార్షల్ ప్రణాళిక ఓ ప్రయోగం. ఈ ప్రయోగం విజయవంతం కావటంతో 1949 నాటికి అద్యక్షుడిగా ఉన్న ట్రూమన్ నాయకత్వంలో ఈ ప్రయోగానికి శాశ్వత రూపం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆ విధంగా అంతర్జాతీయ సహాయక సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. అప్పటికే వలసపాలనలో ఆర్థిక వ్యవస్థలు పిప్పి చేసుకున్న తర్వాత స్వాతంత్య్రం పొందిన వర్ధమాన దేశాలు కూడా అభివృద్ధి నిధుల కోసం ఎదురుచూడటం మొదలైంది. ఈ క్రమంలోనే 1949లో అమెరికా రెండు లక్ష్యాలతో వ్యూహాన్ని ప్రతిపాదించింది. వర్ధమాన దేశాల్లో పేదరికాన్ని తగ్గించటం ద్వారా అమెరికా పెట్టుబడి, సరుకులు, సేవలకు మార్కెట్లు అభివృద్ధి చేసుకోవటం మొదటి లక్ష్యం అయితే పెట్టుబడిదారీ దేశాల సహాయంతో వర్ధమాన దేశాలు అభివృద్ధి అవుతాయన్న విశ్వాసాన్ని కల్పించటం ద్వారా ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న కమ్యూనిజం సిద్ధాంత ప్రభావాన్ని నిలువరించటం రెండో లక్ష్యం.
ఈ లక్ష్యాలకు అనుగుణంగా 1950 నుండి 60 వరకూ వివిధ దేశాల్లో నిర్మాణంలో ఉన్న భారీ ప్రాజెక్టులు, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే సామర్ధ్యం ఉన్న ప్రాజెక్టులకు సాంకేతిక సహకారం అందించేందుకు వీలుగా ఓ ప్రణాళికను రూపొందించుకున్నది అమెరికా. ఈ కాలంలోనే తొలి ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లి భారతదేశంలో చమురు, ఇంధన వనరులు వెలికి తీత, ప్రభుత్వ రంగంలో ఉక్కు కర్మాగారాల నిర్మాణానికి సహాయం చేయమని కోరటం, అమెరికా తిరస్కరించటం, తర్వాత రష్యాను ప్రాధేయపడితే రష్యా శాస్త్రవేత్తలు భారతదేశంలో పర్యటించి చమురు గనులు, బొగ్గుబావులు ఉన్న ప్రాంతాలను గుర్తించటం, వాటిని వెలికి తీసేందుకు కావాల్సిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటం భారతదేశాన్ని స్వయంప్రతిపత్తి కలిగిన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దటంలో కీలక పాత్ర పోషించిన ఘట్టాలు. రష్యా జోక్యానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలోనే భిలాయి, రూర్కీ ఉక్కు కర్మాగారాలకు కావల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని యూరోపియన్ దేశాల ద్వారా సరఫరా చేసింది అమెరికా.
దేశీయ అనుభవాలు అలా ఉంచితే 1950 – 60 దశకంలో అమెరికా విదేశీ సహయం విషయంలో అనుసరించిన వ్యూహం కాలక్రమంలో పరస్పర భద్రతా సహకారాన్ని అందించుకునే ఏజెన్సీలు, ఇతర దేశాల్లో చేపట్టే చర్యలకు సంబంధించిన పరిపాలన విభాగం (ఇందులో ఆయా దేశాల ప్రభుత్వాలను కూల్చేందుకు సాగిన కుట్రలు రూపకల్పన, వాటి పర్యవేక్షణ కూడా ఉన్నాయి. ఈ కాలంలోనే హైతీలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాధినేతలను సాయుధ దళాలతో హతం చేయటం, విప్లవానంతరం పురిటినొప్పులతో ఉన్న క్యూబాకు దిశా నిర్దేశం చేస్తూ తాను కమ్యూనిస్టునని ప్రకటించుకున్న కాస్ట్రోను హతం చేయటానికి కుట్రలు, కుతంత్రాలు పన్నటం, చెగువేరాను పాశవికంగా హత్య చేయటం వంటి చర్యలు కూడా ఉన్నాయి). మూడో విభాగం అంతర్జాతీయ సహకారాన్ని సమన్వయం చేసే విభాగం. ఈ విధానాలు, చర్యలు, జోక్యాలు కాలక్రమంలో అమెరికా విదేశాంగ విధానంలో అంతర్భాగంగా, ముఖ్యమైన సాధనంగా మారాయి.
వివిధ విభాగాల ద్వారా అమలు జరుగుతున్న ఈ సహాయక కార్యక్రమాలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి మరింత సమర్థవంతంగా, విస్తృతంగా అమలు చేయాలన్న లక్ష్యంతో తెరమీదకు వచ్చిందే 1961 నాటి విదేశీ సహాయక చట్టం. ఆ చట్టాన్ని ఆమోదించుకున్న పర్యవసానంగా కెన్నడీ సంతకంతో కూడిన కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా యుఎస్ ఎయిడ్ రంగంలోకి వచ్చింది. అప్పటి వరకూ పరిమిత స్థాయిలో ఉన్న ఈ జోక్యం యుఎస్ ఎయిడ్ తెరమీదకు వచ్చిన తర్వాత పలు సామాజిక, సేవా రంగాలకు కూడా విస్తరించింది. అప్పటి వరకూ సాంకేతిక సహకారం, పెట్టుబడి సహకారానికి పరిమితం అయిన అమెరికా వర్ధమాన దేశాల్లో ఆహారం, పౌష్టికాహారం, ప్రకృతి విపత్తులు, కుటుంబ నియంత్రణ ప్రణాళికలు రూపొందించటం, ఆరోగ్య రంగం, విద్య, మానవనరుల అభివృద్ధి రంగాల్లో జోక్యం చేసుకోవటానికి సవివరమైన ప్రణాళికలు, వ్యూహాలు రూపొందించింది. ఈ కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకించి వర్ధమాన దేశాల్లో స్వఛ్చంద సంస్థలు తెరమీదకు రావటం, వాటికి ఆర్థిక సహాయం అందించేందుకు విదేశీ సంస్థలు ముందుకు రావటం గమనించవచ్చు. భారతదేశంలో విదేశీ చందాల నియంత్రణ చట్టం తొలిసారి 1976లో ఆమోదం పొందటాన్ని ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవచ్చు.
ఇదే సమయంలో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అరబ్బు దేశాల మధ్య యుద్ధాలు జరగటం, చమురు సంక్షోభం, వర్ధమాన దేశాల్లో విదేశీ మారక నిల్వలు సంక్షోభం మూకుమ్మడిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆవరించాయి. మరోవైపున అప్పుడప్పుడే చిన్నగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న వర్ధమాన దేశాలు, ప్రత్యేకించి ఆలీనోద్యమ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఈ సంక్షోభాల ముప్పేట దాడికి కకావికలమయ్యాయి. ఈ సమయంలోనే అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం విదేశీమారక సంక్షోభాన్ని నివారించటానికి తొలిసారి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుండి రుణం తీసుకున్న విషయాన్ని కూడా ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వర్ధమాన దేశాల కరెన్సీలు, ఆర్థిక వ్యవస్థలను స్థిరీకరించటం మంచి మార్కెట్ అవకాశంగా అమెరికా భావించింది. ఈ కర్తవ్యాన్ని యుఎస్ఎయిడ్ కు అప్పగించింది. నేరుగా అమెరికా రిజర్వు బ్యాంకో లేదా మరో సంస్థో ఈ పని చేస్తే అమెరికా జోక్యం, సామ్రాజ్యవాదం సమస్యలు ముందుకొస్తాయి. ఆయా సహాయాలు తీసుకుంటున్న దేశాల్లో కూడా అప్పటికే వియత్నాం యుద్ధం, కొరియా యుద్ధాలను చూసిన ప్రపంచంలో ఆ తరహా అమెరికా జోక్యానికి సిద్ధంగా లేని తరుణం అది. ఈ పరిస్థితుల్లో కీలకమైన ఈ చర్యలన్నీ యుఎస్ ఎయిడ్ ద్వారా వ్యవస్థాగత, సంస్థాగత ఆర్థిక సంస్కరణలకు తెరతీసింది అమెరికా.
వర్ధమాన దేశాల్లో ప్రత్యేకించి భారతదేశంలో ఈ కాలంలోనే ప్రణాళిక ఆధారిత ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా ‘స్వతంత్ర మేధావులు’ తెరమీదకు రావడాన్ని గమనించవచ్చు. ఇదేసమయంలో తమతమ ఆర్థిక వ్యవస్థలను స్వయంప్రతిపత్తితో నిర్వహించుకుంటున్న వర్ధమాన దేశాల్లో ఇవన్నీ రక్షణాత్మక విధానాలనీ, అభివృద్ధికి అవరోధంగా నిలిచే విధానాలనీ, ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి ప్రైవేటు రంగానికి పెద్ద పీట వేయాలన్న డిమాండ్లు, ‘స్వతంత్ర మేధావుల’ విశ్లేషణలూ వెలుగు చూడనారంభించాయి. యుఎస్ఎయిడ్ కూడా ఈ విధానాలను పెద్దఎత్తున చొప్పించటానికి ప్రయత్నించటమే కాక ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను ఈ విధానాల ప్రాతిపదికన పునర్నిర్మించేందుకు మార్గదర్శి పాత్ర పోషించనారంభించింది. ఈ కాలంలో వ్యవసాయ రంగాన్ని పునర్వవస్థీకరించటం, సంపన్న దేశాలకు కావల్సిన ఆహారధాన్యాలు, ప్రాథమిక సరుకులు వర్ధమాన దేశాల్లో ఉత్పత్తి అయ్యేలా చూడటం యుఎస్ ఎయిడ్ విధానాల్లో భాగంగా ఉంది. అప్పటికే ఆయా దేశాల్లో కుదేలైన ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కరువు నేపథ్యంలో పార్టీలు అధికారాలు కోల్పోవటం, ప్రభుత్వాలు కూలిపోవటం వంటివి జరిగాయి. దాంతో ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పలు వర్ధమాన దేశాలు యుఎస్ఎయిడ్ ప్రతిపాదించిన పరిష్కారమార్గాలను అక్కున చేర్చుకున్నాయి. ఆర్థిక విధానాల రూపకల్పనతో పాటే ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలు సార్వత్రిక విధానాలుగా పరిణామం చెందిన కాలంకూడా ఇదే కావటం గమనార్హం.
క్రమంగా ఏదో ఒకటో అరో ప్రాజెక్టుల వారీగానో, అవసార్థమో సహాయం చేసే దశ నుండి యుఎస్ ఎయిడ్ ఆయా దేశాల నిర్దిష్ట ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక అభివృద్ధి వ్యూహాలను రూపొందించి ఆయా దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం అనే మందు గుళికలు అందించటం ప్రారంభించింది. బెర్లిన్ గోడ పతనం తర్వాత తూర్పు యూరప్ దేశాల్లో యుఎస్ ఎయిడ్ జోక్యం, నిధులు బాగా పెరిగాయి. ఆయా దేశాలకు నిర్దిష్ట పథకాలు, ప్యాకేజీల ద్వారా అమెరికా యుఎస్ ఎయిడ్ ద్వారా నిరంతర జోక్యానికి తలుపులు తెరిచింది. యుఎస్ ఎయిడ్ ప్రవేశం లేని దేశాల్లో స్వచ్చంద సంస్థల ద్వారా ఈ కృషి జరిగింది. ఈ స్వఛ్చంద సంస్థల్లో కొన్ని సేవారంగంలో ప్రవేశిస్తే మరికొన్ని స్వతంత్ర మేధో బృందాలుగా పౌరసమాజంలో ప్రవేశించాయి. మరికొన్ని హక్కుల ఉద్యమాల రూపంలో దర్శనమిస్తే ఇంకొన్ని పర్యావరణ పరిరక్షణ, అవగాహన కల్పించే బృందాలుగా కనిపిస్తున్నాయి. వీటిలో ఎవరి మూలాలు యుఎస్ ఎయిడ్‌తో ముడిపడి ఉన్నాయని గుర్తించటం పెద్ద బ్రహ్మ విద్యగా మారింది.
చివరకు వివిధ దేశాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకూ, ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కూడా యుఎస్ ఎయిడ్ వ్యూహాలు, ప్రణాళికలు, పథకాలు రూపొందించి అమలు చేయసాగింది. భారతదేశంలో ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు యుఎస్ ఎయిడ్ 21 మిలియన్ డాలర్ల మేర ఖర్చు పెడుతోందన్నది తాజా వార్త. ఈ ఖర్చుకు కేటాయింపులు రద్దు చేయాలంటూ ఎలాన్ మస్క్ నేతృత్వంలో పరిపాలన సామర్ధ్య మెరుగుదల విభాగం (డాడ్జ్) ప్రకటించటంతో ప్రస్తుతం యుఎస్ ఎయిడ్, భారతదేశంలో గత దశాబ్దంన్నర కాలంలో జరిగిన ఎన్నికల్లో ఓటర్ల టర్నవుట్ పెరగటం, ఈ పెరుగుదల నుండి ప్రత్యక్షంగా నేరుగా బిజెపి లాభపడటం వంటి విషయాలన్నీ చర్చనీయాంశం అవుతున్నాయి. అమెరికా ప్రజల పన్నుల చెల్లింపుల ద్వారా సేకరిస్తున్న నిధులను విదేశీ ప్రజల యోగ క్షేమాల కోసం ఎందుకు ఖర్చు పెట్టాలి అన్నది మస్క్ ముందుకు తెచ్చిన ప్రశ్న. మరి మన ప్రభుత్వాధినేతలు కూడా దేశ ప్రజల ధనాన్ని పన్ను రాయితీలు, రుణ మాఫీల ద్వారా పరిశ్రమాధిపతులకు కట్టబెట్టే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మస్క్ చొరవ నుండి ఏమైనా నేర్చుకుంటుందా? చూడాలి.
కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.