
తాను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వడం మూలంగానే పోలీసులు తనను ఇరికించడానికి ప్రయత్నించారని ముంబై ట్రైన్ బాంబు దాడి కేసులో తాజాగా విడుదలైన సాజిద్ అన్సారీ అన్నారు. “మా ఇంటి నుంచి ఏవో కొన్ని ఎలిక్ట్రికల్ వస్తువులను తీసుకొని, బాంబులను తయారు చేయడంలో నేను సిద్ధహస్తుడనని నిరూపించడానికి పోలీసులు ప్రయత్నించార”ని తెలియజేశారు.
న్యూఢిల్లీ: 21 జూలై నాడు ముంబై బాంబు పేలుళ్ల కేసులో 12 మందిని నిర్దోషులుగా బాంబే హైకోర్టు తేల్చింది. వారు జైలు నుంచి విడుదలయ్యారు. అందులో ఐదుగురికి మరణదండన, ఏడుగురికి జీవితఖైదు శిక్షను గతంలో ఖరారు చేశారు. కానీ ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం మొత్తం 12 మంది నిందితులను విడుదల చేసింది. నిందితులందరి తప్పును నిరూపించడంలో మహారాష్ట్ర ఏటీఎస్ విఫలమైందని కోర్టు ఈ సందర్భంగా తెలియజేసింది.
2006 జూలై 11న ముంబైలోని వివిధ ప్రాంతాలలోని లోకల్ ట్రైన్లలో ఏకకాలంలో బాంబుదాడులు జరిగాయి. ఈ ఆరోపణలలో ఈ 12 మంది గత 19 సంవత్సరాల నుంచి జైలు గొడల వెనుక ఉన్నారు. 2015లో ఒక స్పెషల్ కోర్టులో ఈ 12 మందికి వ్యతిరేకంగా ఆరోపణలు నిరూపించబడ్డాయి. దీంతో వాళ్లను దోషులుగా నిర్ణయించారు. మరోవైపు, సరైన ఆధారాలు లభించకపోవడం వల్ల వాహిద్ షేక్ అనే నిందితుడిని విడుదల చేస్తున్నట్టుగా అదే సందర్భంలో కోర్టు తెలియజేసింది.
2015 నాటి మకొకా కోర్టు తీర్పును సవాలు చేస్తూ, ఈ మొత్తం 12 మంది నిందితుల విడుదల కోసం ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం వేయబడింది. ఈ నేపథ్యంలో జూలై 21 నాడు జస్టీస్ అనిల్ కిలోర్, జస్టీస్ శ్యాం చండక్ ప్రత్యేక బెంచ్ తీర్పును వెలువరిస్తూ, 12 మంది నిందితులను విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది.
మీరా రోడ్ నివాసి 48 సంవత్సరాల సాజిద్ అన్సారీ ఇందులో ఒకరుగా ఉన్నారు. ఈయనను 2006లో అదుపులోకి తీసుకున్నారు. ది వైర్ హిందీతో సాజిద్ మాట్లాడుతూ, “నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వడం వల్ల ఏటీఎస్ నన్ను నిందితుడిలా నిర్ధారించింది. ఇందులో భాగంగానే నన్ను అదుపులోకి తీసుకున్నారు” అని తెలియజేశారు.
తాను గత పద్దెనిమిదున్నర సంవత్సరాల నుంచి జైలు గోడల వెనుక ఉన్నానని సాజిద్ అన్నారు. ఈ క్రమంలోనే తమ తల్లి, ఇద్దరు తోబుట్టువులు చనిపోయారు. పోలీసులు సాజిద్‌ను అదుపులోకి తీసుకున్నప్పుడు ఆయన భార్య గర్భవతిగా ఉంది. ఎటువంటి సమయంలో తన భార్యకు, తన పిల్లలకు అన్నింటికంటే ఎక్కువ అవసరం ఉందో, అప్పుడే తనను జైలుకు పంపించారని సాజిద్ వాపోయారు. సాజిద్ జైలుకు వెళ్లిన మూడు నెలల తర్వాత ఆయన భార్య ఒక కూతురుకు జన్మనిచ్చింది.
పద్దెనిమిదున్నర సంవత్సరాల వరకు తన కూతురును కలవలేకపోయానని సాజిద్ తెలియజేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం, ఈ దీర్ఘ కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే బయటకు వచ్చే అవకాశం ఆయనకు లభించింది. కానీ అది కూడా కొన్ని గంటలు మాత్రమే. అందులో ఒకసారి తన మాతృవియోగ సమయంలో, రెండోసారి తన సోదరి అంతిమయాత్రలో భాగమవడం కోసం.
ఈ క్రమంలో కుటుంబ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ఎక్కువగా ప్రభావితమైంది. “నాకు ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు నా కుటుంబాన్ని చూసుకున్నారు. కానీ ఒక సమయంలో, కేవలం ఒక సోదరుడు మాత్రమే సంపాదించే వాడు. ఇంకో సోదరుడు పూర్తిగా నా కేసులో నిమగ్నమైయ్యాడు” అని చెప్పుకొచ్చారు.
“నేనెప్పుడైతే జైలులో ఉన్నానో నా కుటుంబ పాలనపోషణ భారం పూర్తిగా నా అన్నదమ్ముల మీద పడింది” అని తెలియజేశారు.
తనకు వ్యతిరేకంగా పోలీసులకు ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదని సాజిద్ అన్నారు. ఈ పూర్తి కేసును తప్పుల తడకగా సాజిద్ అభివర్ణించారు. ఇంకా అన్నారుగా, తనను ఇరికించాలని పోలీసులు ప్రయత్నించారు. ఎందుకంటే తను ఒక ఎలక్ట్రీకల్ ఇంజనీర్‌నని చెప్పారు. “పోలీసులు నా ఇంటి నుంచి ఏవో కొన్ని ఎలక్ట్రికల్ వస్తువులను తీసుకొని, బాంబులను తయారు చేయడంలో నేను సిద్ధహస్తుడనని నిరూపించడానికి ప్రయత్నించార”ని సాజిద్ తెలియజేశారు.
సాజిద్ ప్రకారం, న్యాయం ఆధారంగానే కోర్టు తీర్పు ఇచ్చింది.
విడుదలైన నిందితులకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తనకు న్యాయవ్యవస్ధ మీద పూర్తిగా నమ్మకం ఉందని సాజిద్ అన్నారు. ఎలా అయితే హైకోర్టు నిందితులందరికి ఉపశమనాన్ని కలిగించిందో, అలానే సుప్రీంకోర్టు కూడా న్యాయం, వాస్తవాల ఆధారంగా తీర్పును వెలువరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జైలులో ఉంటూనే న్యాయవిద్యను సాజిద్ అధ్యయనం చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆయన లా చివరి సంవత్సరం విద్యార్థిగా ఉన్నారు.
పోలీసు చర్యలను, ప్రభుత్వ విధానం మీద సాజిద్ పలుప్రశ్నలను లేవనెత్తారు. పరిపాలనా వ్యవస్థ ప్రతిరోజు ఈ విధంగా నిర్దోషులను, అమాయకులను లక్ష్యం చేసుకుంటుందని అన్నారు. అసలు దోషులను దాచడమే దీని వెనుక కారణమని తెలియజేశారు.
“నేను ముస్లిం అవ్వడం మూలంగానే నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. అంతేకాకుండా ముస్లింల మీద ప్రభుత్వ ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది. మమ్మల్ని జైలులో, లేదా ఇంట్రాగేషన్ సమయంలో వివిధ రకాల ముస్లిం, ఇస్లాం వ్యతిరేక తిట్లతో పిలవడం జరిగేది, చాలా టార్చర్ చేసేవారు. కానీ నాకు భారతన్యాయవ్యవస్థ మీద ఎప్పుడు చెక్కుచెదరని అచంచల నమ్మకం ఉండేది. ఇప్పుటికి నాకు నమ్మకం ఉంది” అన్నారు.
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.