
కామ్రేడ్ వీఎస్గా అశేష జనవాహినితో పిలిపించుకున్న అచ్యుతానందన్ పూర్తి పేరు వెళిక్కాకతూ శంకరన్ అచ్యుతానందన్. 1970 దశకంలో కొల్లాం రైల్వే గ్రౌండ్స్‌లో ఒక సభ జరిగింది. ఆ సభలో నేను ఆయనను దగ్గరగా చూశాను.
అప్పట్లో ఆయన మంచి ఆరోగ్యవంతులు, దృఢమైన శరీర నిర్మాణం కలిగిన వారు. ఆయన ఉపన్యాసాలు ఆగ్రహంతో ఆవేశంతో నిండి ఉండేవి. నిలువెల్లా ఊగిపోతూ ఉపన్యాసం చేసేవారు. అప్పుడప్పుడు ఉపన్యాసంలో ప్రదర్శించిన ఆవేశానికి ఒళ్లంతా తడిచి ఆయన ధరించిన తెల్లని లాల్చి చెమటతో నిండి ఒంటికి అతుక్కుపోయేది. ఆయనను చూడగానే ఎక్కువమందికి గుర్తుకు వచ్చే జ్ఞాపకాలు ఇవి.
ఎమర్జెన్సీ తర్వాత పదవ అఖిలభారత మహాసభలకు ముందు జరిగిన మహాసభలలో నేను కొల్లం జిల్లా పార్టీ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాను. అప్పటినుంచి నాయకుడిగా వీఎస్‌ను సన్నిహితంగా పరిశీలించడానికి అవకాశం దొరికింది. తొలి రోజుల్లో ఆయన కఠినమైన క్రమశిక్షణ కలిగినవారిగా కనిపించేవారు. దగ్గరకెళ్ళి మాట్లాడాలంటే బెరుకుగా ఉండేది.
విమర్శలను స్వీకరించే ఆయన లక్షణం గురించి ఒక ఉదాహరణ మీ దృష్టికి తీసుకురావాలి. 1980లో పీకే నాయనార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వీఎస్ అచ్యుతానందన్ బాధ్య తలు చేపట్టారు.
1985లో కొచ్చిలో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభల్లో ఏంవీ రాఘవన్ ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ పత్రం మీద తీవ్రమైన చర్చలు జరిగాయి. ఈ రకంగా ఆ మహాసభ ప్రత్యేకత గుర్తింపు కలిగి ఉంది. ఈ మహాసభల్లోనే మరో ఆసక్తికరమైన చర్చ కూడా జరిగింది. కార్యకర్తలందరికీ పార్టీ నాయకత్వం అందుబాటులో ఉండి, వారి యోగక్షేమాల గురించి పట్టించుకోవాలనే చర్చ కూడా ఈ మహాసభల్లోనే జరిగింది.
మహాసభ జరిగిన కొన్ని రోజుల తర్వాత కొల్లం జిల్లా పార్టీ కార్యాలయంలో కూర్చుని దినపత్రికలు చదువుతున్నాం. అప్పుడే వీఎస్ ఆఫీసులోకి వచ్చారు. మాములుగా అయితే ఆయన నేరుగా జిల్లా కార్యదర్శి గదికి వెళ్ళాలి. ఎప్పుడూ పరిగెడుతూనే ఉండేవారు. కానీ ఆరోజు సాధారణ శైలికి భిన్నంగా వ్యవహరించారు. కార్యదర్శి గెయిడ్లో వెళ్ళటానికి ముందు అక్కడున్న కామ్రేడ్ యోగక్షేమాలు తెలుసుకుని కాసేపు పిచ్చాపాటీ మాట్లాడి వెళ్లారు.
ఎర్నాకులంలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో ప్రతినిధులుగా వచ్చి అక్కడ జరిగిన చర్చల్లో పాల్గొన్నవారు, ఈ మార్పును కూడా గమనించే ఉంటారు. ఆ మహాసభలు ఎంతటి తీవ్రమైన విమర్శలనయినా ఓ కమ్యూనిస్టు నేత ఎలా స్వీకరించగలరో తెలియచేసిన మహాసభలు అవి. ఆ గొప్ప నేత అచ్యుతానందన్.
2006– 2011 మధ్య కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నేను కేబినెట్ మంత్రిగా ఉన్నాను. కేవలం పాఠశాల విద్య మాత్రమే చదువుకున్నా, అది ముఖ్యమంత్రి బాధ్యతలు నెరవేర్చడంలో ఎన్నడూ అడ్డంకి కాలేదు. పరిపాలన దక్షత ఆయనకు అందివచ్చిన సామర్థ్యం.
అణచివేతకు, దోపిడీకి గురయ్యే వారి హక్కుల కోసం పాటుపాడటం ఆయన జీవితాంతం ఎంచుకుని నడిచిన దారి. ఆ విషయంలో ఆయనకు స్ఫూర్తి ఏకే గోపాలన్. వీఎస్ గొప్ప నిర్మాణ దక్షులు. 1958లో అవిభక్త కమ్యూనిస్టు పార్టీ మహాసభ అమృతసర్‌లో జరుగుతోంది. దేవికుళ్ళం నియోజకవర్గంలో ఉపఎన్నిక జరుగుతోంది. ఆ రోజుల్లో ఈ ఏంఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వం మనుగడ ఆ ఉపఎన్నికపై ఆధారపడి ఉంది. ఈ ఎన్నికల్లో వామపక్ష సంఘటన తరఫున వీఎస్ ఎన్నికల ప్రచారానికి బాధ్యత తీసుకున్నారు. ఆయన హోరాహోరీ సాగిన ఎన్నికల పోరాటంలో పార్టీ అభ్యర్థిని గెలిపించారు. నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని నిలబెట్టారు.
సమర్ధవంతమైన ముఖ్యమంత్రిగా, శిఖర సమానుడైన పార్టీ నేతగా, ప్రభావశాలి ప్రతిపక్ష నేతగా కేరళ ఆయన్ను గుర్తు పెట్టుకుంది. దర్జీ కుటుంబం నుంచి వచ్చిన అచ్యుతానందన్, పోరాటమే మార్గంగా నిలిచి జీవితంలో ఎన్నో శిఖరాలు అధిరోహించారు.
అనువాదం: కొండూరి వీరయ్య
(వ్యాస రచయిత సీపీఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి. ది హిందూ సౌజన్యంతో వ్యాసం ప్రచురితం.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.