
1980 దశకం చివరిలో భారత దేశం నయా-ఉదారవాద విధానాలు చేపట్టడం, అదే సమయంలో రామ జన్మభూమి విముక్తి కోసం ఉద్యమం తలెత్తడం (నేను దీన్ని సమాజాన్ని మతతత్వం గావించడం అంటాను).. రెండూ ఒకే సారి జరగడం కేవలం యాదృచ్ఛికం కాదు. రాజీవ్ గాంధీ ఈ రెంటికీ ప్రోత్సాహం ఇచ్చారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు – షాబానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును తిరగదోడడం, బాబ్రీమసీదు తాళాలు పగలగొట్టి అయోధ్య లోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి శిలాన్యాస్‌కు అనుమత్విడం పెద్ద తప్పిదాలు. ఈ తప్పిదాలకు గాను కాంగ్రెస్ పార్టీ నేటికీ మూల్యం చెల్లిస్తూ ఉంది. దీనికి తోడు ఇదే కాలంలో అస్తిత్వ రాజకీయాలు ముఖ్యంగా కుల అస్తిత్వం (మండలైజేషన్) కూడా ముందుకు వచ్చింది. ఈ విషయంలో కూడా రాజీవ్ గాంధీ సందిగ్ధత ప్రదర్శించారు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం కలిగించింది, ముఖ్యంగా ఉత్తరాది హిందీ ప్రాంతాల్లో.
ఈ శక్తులన్నిటినీ భారతీయ జనతా పార్టీ తెలివిగా ఉపయోగించుకుని లాభపడింది. దాంతో 1990 దశకం చివర మరీ ముఖ్యంగా 2002 గుజరాత్ అల్లర్లతరువాత దాని బలం బాగా పెరిగింది. అది తన పూర్వ అవతారం అయిన జనసంఘ్ దగ్గరినుండీ బహిరంగ మార్కెట్ ఆర్థిక వ్యవస్థను, పెట్టుబడిదారీ విధానాన్నీ సమర్ధిస్తోంది.
బిజెపి హిందూత్వ అస్తిత్వ రాజకీయాలను అనుసరిస్తున్న విషయం రహస్యవిషయమేమీ కాదు. అది ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతు
లకు రాజ్యాంగ పరమైన రిజర్వేషన్లకూ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కులం కార్డును చాలా వ్యూహాత్మంగా ఉపయోగించుకుంది.
గత వంద సంవత్సరాల చరిత్రను, ముఖ్యంగా 20వ శాతాబ్దం తొలినాళ్ల నుండి జరిగిన చరిత్రను గనక పరిశీలిస్తే.. ఆర్థిక సంక్షోభం లేక మాంద్యం ఎప్పుడు వచ్చినా ప్రపంచ రాజకీయాలు (ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో) మితవాదం వైపు మొగ్గు చూపాయి. 1930వ దశకంలో వచ్చిన మహా మాంద్యం (ఇది 1929 అక్టోబర్ స్టాక్ మార్కెట్ పతనంతో ప్రారంభమైంది) యూరప్‌లోనూ ఇతర చోట్లా ఫానిజం తలెత్తడానికి దారితీసింది.
అదే విధంగా 2007-08 ద్రవ్య సంక్షోభం ప్రపంచ వ్యాపితంగా రాజకీయాలు మితవాదం వైపు మొగ్గడానికి కారణమైంది. టైమ్ పత్రిక భారత ప్రధాని నరేంద్ర మోడీని “భారత దేశ విచ్ఛిన్న సేనాని” అని (2019, మే 20) కథనాన్ని ప్రచురించింది. ఎందుకంటే ఆయన “దేశభక్తులు, దేశవ్యతిరేకులు” అన్న విచ్ఛిన్నకర నినాదంతో భారత దేశ సామాజిక జీవనాన్ని మత ప్రాతిపదికగా మధ్యకంటా నిలువునా చీల్చేశారు. కానీ మన్మోహన్ సింగ్ 15 ఏళ్ల కాలంలో (పివి నరసింహారావు కింద ఆర్థిక మంత్రిగా అయిదేళ్లు, దేశ ప్రధాన మంత్రిగా పదేళ్లు) దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిన తీరును గమనిస్తే ఆయన కూడా భారత ప్రజలను నిలువునా చీల్చిన వ్యక్తిగానే చరిత్రలో నిలిచిపోతారు.
ఆయన అనుసరించిన ఆర్థిక సరళీకరణ, కార్పొరెటైజేషన్ విధానాలు దేశంలో ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ (క్రోనీ క్యాపిటలిజం)
కు దారితీసింది. ఇదంతా ప్రపంచ బ్యాంకు ఆదేశాల ప్రకారం జరిగింది. ఈ విధానాల వల్ల దేశంలో ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగాయి. భారత- అమెరికా అణు ఒప్పం దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కుదుర్చుకోవా లని ఆయన భీష్మించుకున్నారు. భారతీయ వామపక్షాలు కూడా అంతే పట్టుదలతో సరిగ్గానే దాన్ని వ్యతిరేకించాయి. ఈ ఒప్పందం కుదరక పోతే తాను రాజీనామా చేస్తానని బెదిరించే వరకు మన్మోహన్ సింగ్ వెళ్లిన విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. దేశంలో నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థ ఏర్పడ్డంతోనే మన దేశ విదేశాంగ విధానాన్ని కూడా అమెరికా-ఇజ్రాయిల్-భారత్ యాక్సిస్‌కు అనుసంధానించడం జరిగింది. ఇస్లామోఫోబియాను పెంచి పోషించడం ఇందులో భాగమే.
భారత్ ఎదుర్కొంటున్న ప్రమాదాలు
నా ఉద్దేశంలో భారత దేశం కింది ప్రమాదాలనెదుర్కొంటున్నది:
- బిజెపి రానురాను మరింత వేగంగా హిందూ రాష్ట్ర సాధన రాజకీయాలవైపు నడవడంతో దేశంలో హిందూ అస్తిత్వ రాజకీయాలు పెరిగాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అనేది తానొక సాంస్కృతిక సంస్థ అనే ముసుగును పూర్తిగా తొలగించిన విషయాన్ని మనం గుర్తించ కుండా ఉండలేం. దాని సిద్ధాంతం ఏనాడూ భారత రాజ్యాంగాన్ని గానీ, భారత దేశ పతాకాన్ని గానీ అంగీకరించలేదు. బిజెపి-ఆర్ఎస్ఎస్ చెప్పుకుంటున్న గుజరాత్ ఆర్థిక నమూనా అనే మిధ్య బద్దలైపోయింది. కానీ బిజెపి పాలిస్తున్న అనేక రాష్ట్రాల్లో మాత్రం గుజరాత్ రాజకీయ నమూనాను అనుసరిస్తు న్నారు. 2002 మారణహోమం తరువాత నేను గుజరాత్‌లోని అనేక జిల్లాలు పర్యటించి నప్పుడు నాకు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు బయట ఒక పెద్ద హోర్డింగ్ కనిపించింది; “భారత దేశపు తొలి హిందూ రాజ్యానికి స్వాగతం” అని.
- ఈ సమస్య మీద కాంగ్రెస్ పార్టీలో సాఫ్ట్ హిందూత్వ వల్ల వచ్చిన గజిబిజి ఆలోచనలు అటుంచితే “లౌకిక శక్తుల ఐక్యత” అని గొంతుచించుకుని నినాదాలిచ్చే ప్రాంతీయ శక్తులు కూడా నోటి మాటలు మినహా ఏమీ చేయలేకపోయాయి. ఇటువంటి శక్తుల నాయకులు తమ పడవలు మునిగిపోయే సమయం వచ్చినప్పుడు ఎటువంటి తటపటాయింపులు లేకుండా బిజెపి పడవలోకి దూకేయం నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు. దురద్రుష్ట వశాత్తు బహుశా కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడితో తస్లీమా నస్రీన్ ను బెంగాల్ నుండి పంపివేయడం ద్వారా వామపక్షాలు కూడా తప్పుచేశాయని నేను అభిప్రాయ పడుతున్నాను. 2019 ఎన్నికల తరువాత మోడీ “లౌకిక వాదలు” పారిపోయి మొహం చాటువేసుకు న్నారు అని అన్న మాటలను తేలిగ్గా తీసుకోరాదు. దీని వెనుక పెద్ద ప్రమాదం దాగి వుంది.
- మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటి నుండీ అమలుపరుస్తూ వచ్చిన నయా-ఉదారవాద ఆర్థిక విధానాలను బిజెపి లేక ఎన్డీఏ ప్రభుత్వాలు (మోడీ, వాజ్పేయీలిద్దరి హయాంలోనూ) కొనసాగించడమే కాదు, కాంగ్రెసేతర, ఎన్డీఎ-బిజెపి యేతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు.
- 2007- 2008లో బెంగాల్ లోని సింగూ ర్లో టాటా నానో కార్ల ఫాక్టరీ, నందిగ్రామ్‌లో రసాయన ఫాక్టరీ పెట్టడం కోసం రైతుల భూములు కొనుగోలు చేయడానికి బుద్ధదేవ్ వామపక్ష ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఉపయోగించుకుని రైతులకు ఏదో అయిపోతు న్నదని మమతా బెనర్జీ భూమ్యాకాశాలను ఏకం చేసేంతంగా గగ్గోలు చేశారు. 1977లో పశ్చిమ బెంగాల్ భూసంస్కరణల (సవరణ) చట్టం ద్వారా రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం 11 లక్షల ఎకరాల భూమిని 14 లక్షల మంది రైతులకు పంచిపెట్టింది. ఈ భూములపై రైతులకు వారసత్వ హక్కులు లభించాయి. 1977 నుండి 30 ఏళ్లపాటు పాలించిన వామపక్ష ప్రభుత్వం ఈ భూసంస్కరణల ద్వారా సంపాదించుకున్న ప్రతిష్టను ఈ ఘటనలతో ఒక్కపెట్టున
పోగొట్టుకున్నది. దాంతో పశ్చిమ బెంగాల్లో వామపక్ష పతనం ప్రారంభమైంది. - కుల అస్తిత్వ రాజకీయాలు ఊపందు కున్నాయి. దేశంలో కుల లేక వర్గ రహిత సమాజాన్ని నిర్మిస్తానని ఎవరైనా ఊహా జనితమైన ఆలోచనలు చేయవచ్చు. 2019 మే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోడీ భారత దేశం కుల రాజకీయాలను తిరస్కరిం చింది, మండలైజేషన్ అంతమైపోయింది అని ప్రకటించడం నాకు నవ్వు పుట్టించింది. ఇంతకన్నా కపటత్వం ఇంకోటి ఉండదు. ఎందుకంటే అమిత్ షా గారి ఎన్నికల వ్యూహం అంతా కూడా దళితులను చీల్చడం, మరోవైపు ఓబిసిలను చూపించి దళితులను భయభ్రా తులకు గురిచేయడం మీదనే ఆధారపడి ఉంది. ఉత్తరాదిలో దళితులు, ముస్లింలు ఉమ్మడి శక్తిగా ముందుకు రావడం మనం చూస్తాం. వాస్తవమేమంటే, భారత దేశ ఎన్నికల ప్రజాస్వామ్యంలో కులం అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుందనే దాన్ని ఎవరూ నిరాకరించలేరు.
- బిజెపి లక్ష్యం అయిన “ఒకే ప్రజలు, ఒకే సంస్కృతి, ఒకే దేశం” అనేది “భారత దేశం అనే భావన” వెనుకనున్న భిన్నత్వం, బహుళత్వాలకు తీవ్రమైన ప్రమాదకారి. ఇది
రాజ్యాంగంలో పేర్కొన్న ఫెడరల్ వ్యవస్థకు కూడా పెద్ద సవాలు విసురుతుంది.
ఈ బహుముఖ సంక్షోభాల నుండి భారత దేశం ఎలా బయటపడుతుంది? దానికోసం నేను క్రింది భావాలు పంచుకుంటున్నాను:
- మితవాదంవైపు ఉండే రెండు రాజకీయ పార్టీలకు తావు ఉండకూడదు. కాంగ్రెస్ ఇటీవలి తన అవతారంలో (1980 నుండి) మితవా దానికి బీజాలు వేసిందనీ, లేక బిజెపి అనేది కాంగ్రెస్‌కు కార్బన్ కాపీ అనీ, లేక (తొలిసారి మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 2014-15లో అరుణ్ శౌరీ అభివర్ణించినట్లు) బిజెపి అంటే కాంగ్రెస్ + ఆవు అనే ప్రకటనలేవీ భారత దేశానికి మేలు చేయవు. కాంగ్రెస్ తిరిగి కోలుకునే అవకాశాలు తక్కువ.
- ప్రాంతీయ పార్టీల్లో అనేకం ఎదో విధంగా అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండడమే పరమావధిగా పనిచేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో మాయావతికి చెందిన బహుజన సమాజ్ పార్టీ, అఖిలేశ్ యాదవ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ, లేక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, తెలంగా ణాలో కె. చంద్రశేఖరరావుకు చెందిన తెలంగాణా రాష్ట్ర సమితి టిఆర్ఎస్ (నేడు -బిఆర్ఎస్), ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడుకు చెందిన తెలుగుదేశం పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒడిషాలో బిజూ జనతా దళ్, బీహార్‌లో నితిష్ కుమార్‌కు చెందిన జనతా దళ్ (యు), లలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్… లేక ఇంకా ఎక్కడైనా గానీ ఇటువంటి పార్టీలేవీ కూడా సామాన్య ప్రజలకు మేలు చేకూర్చే ప్రత్యామ్నాయ ఆర్థికాభివృద్ధి నమూనాను అందించలేవు. కార్పొరేటైజేషన్, లేక నయా-ఉదారవాద ఆర్థిక ఎజెండాకు వ్యతిరేకంగా నిలబడాలన్న కోర్కె కూడా వీటిలో దేనికీ లేదు. చివరికి లౌకిక భారత దేశాన్ని రక్షించే విషయంలో కూడా ఈ పార్టీలు ముందుకొస్తాయన్న భరోసా లేదు. ఎందుకంటే ఇటీవల జమ్మూ-కాశ్మీర్లో 370, 35ఎ అధికరణాలను రద్దు చేసే విషయంలో ఈ పార్టీలు (ఆర్ జెడి మినహా) వ్యవహరించిన తీరు ఎలా ఉందో మనం చూశాం.
- స్వాతంత్య్ర వచ్చిన వెంటనే జరిగినట్లు నేడు దేశంలోని రాజకీయ పార్టీలన్నిటితో కలిపి ఒక “జాతీయ ప్రభుత్వాన్ని” ఏర్పాటు చేయాలన్న ఊహే వ్యర్ధమైనది. భారత దేశంలో నేడు జవహర్ లాల్ నెహ్రూ, వల్లభ భాయ్ పటేల్ వంటి రాజకీయవేత్తలు లేరు. ఈనాటి రాజకీయ నాయకులు స్వార్ధపరులు, నిపుణులు కారు.
- కాంగ్రెస్, బిజెపిలు రెంటికీ సమ దూరంలో ఉండే “తృతీయ ప్రత్యామ్నాయం” అనేది ప్రతిష్ట కోల్పోయింది.
- ఆర్థికాభివృద్ధికి సంబంధించిన రెండు స్పష్టమైన ప్రత్యామ్నాయ మార్గాలు కలిగిన రెండు రాజకీయ కూటములవైపు భారత రాజకీయాలు పయనించాలి. ఒకటి, మితవాద మధ్యేవాద కూటమి, రెండోది వామపక్ష మద్యేవాద కూటమి. పైన చెప్పిన రాజకీయ పరిస్థితులను బట్టి వామపక్షాల నాయకత్వం లోని ప్రత్యామ్నాయం తప్ప నేను మరోటి
ఆలోచించలేను. వామపక్షాలు తమ నాగేటి చాలులో తామే దున్నుకోడానికి సిద్ధపడాలి. దీర్ఘకాలిక ఫలాలు ఆశించాలి. (అంతేకాని హ్రస్వదృష్టితో కూడిన తక్షణ ప్రయోజనాలకోసం అవకాశవాద పార్టీల తోనూ, లేక సైద్ధాంతి కంగా మితవాద శక్తులతోనూ పొత్తులు, అవగాహనలకు రాకూడదు). బాధాకరమైన విషయం ఏమిటంటే 80శాతం కన్నా ఎక్కువ మంది ప్రజలు పేదరికంలో నివసిస్తున్న చోట, వ్యవసాయ సంక్షోభం రైతుల ప్రాణాలు తీస్తున్న చోట, నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరిన చోట, వైద్యం విద్య సదుపాయాలు కునారిల్లిపోతున్న చోట, మొత్తం ఆర్థిక వ్యవస్థ బదాబదలైపోయిన చోట… అలాంటి దేశంలో కూడా వామపక్షాల బలం క్రమంగా తగ్గిపోతున్నది.
ప్రస్తుత వామపక్షాలు వ్యక్తుల అహాలను పక్కన బెట్టి ఒకే ఒక గొడుగు కిందకు రావాలి. ఇంకా చెప్పాలంటే కార్మికులు, రైతులు, రాజ్యాంగం మొదలైన అంశాలను ఇముడ్చుకున్న ఒకే పేరు కిందకి రావాలి.
కనీస ఉమ్మడి కార్యక్రమం
గత కొన్ని దశాబ్దాలుగా వామపక్షాలు ఎన్నికలు ముగిసిన వెంటనే కనీస ఉమ్మడి కార్యక్రమం (సిఎంపి) గురించి మాట్లాడ్డం వింటున్నాను. కానీ ఇప్పుడు వివిడిగా ఉన్న వామపక్ష గ్రూపులన్నీ ఒక చోటకు వచ్చి తమ స్వంత కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిం చుకుని ప్రజల దగ్గరకు వెళ్లాల్సిన సమయం వచ్చిందని అనుకుంటున్నాను. ఈ కనీస ఉమ్మడి కార్యక్రమంలో వాపక్షాలు ప్రజా రాజకీయాల్లో కుల, మతాల స్థానం పట్ల తమ స్పష్టమైన అభిప్రాయాలు తెలియజేయాలి. సైద్ధాంతికంగా ఈ విషయంలో వామపక్షాల ఆలోచనలు ప్రజల ఆమోదం పొందడం అంత సులువేం కాదు. కేరళలో శమరిమల కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పుపై వామపక్ష వైఖరిని దేశం నలుమూలలకు తీసుకుపోవాలి. కులం-వర్గం సమస్యపై సామాన్యులకు అర్ధమయ్యే విధంగా తమ ఆలోచనలను వివరించ గలగాలి.
సామాన్య ప్రజల ఆర్థికాభివృద్ధికి సంబంధించి తన స్వంత విధానాన్ని వామపక్షం ప్రజల ముందుంచాలి. ప్రస్తుతం సామాజిక, ఆర్థిక విధానాలపై కార్పొరేట్లకున్న పట్టును తొలగించేందుకూ, క్రమంగా కనుమరుగవు తున్న ప్రభుత్వ రంగాన్ని కాపాడేందుకూ తమ వద్ద నున్న వ్యూహం ఏమిటో వామపక్షం ప్రజలకు వివరించాలి. నయా-ఉదారవాద మార్కెట్ ఆర్థికాభివృద్ధి మార్గం నుండి కొత్త మార్గానికి అంటే చిట్టచివరి పేద వాని వరకూ అందరికీ ప్రగతి ఫలాలు అందే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాలి.
వామపక్షం 1. ఉద్యోగాలు, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి విధానాలు చేపట్టాలి. 2. రైతుల ప్రయోజనాలను కాపాడే దీర్ఘకాలిక విధానాలు అనుసరించాలి 3. వ్యవసాయ, పారిశ్రామిక వస్తూత్పత్తి రంగాల్లో ఉత్పత్తిని పెంచే విధానాలు అవలంభించాలి. 4. వైద్యం, విద్యపైన (విద్యమీద జిడిపిలో 10 కన్నా తక్కువ కాకుండా) ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి. ఈ రంగాల్లో ప్రయివే టీకరణ ఆపడం మీద కాకుండా ప్రభుత్వం ఈ రంగాలపై ఖర్చు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ప్రభుతం “ప్రయివేటు రంగానికి” ఫెసిలిటేటర్‌గా ఉండకూడదు.
పెద్ద వైచిత్రి ఏమంటే, అహింసను ప్రబోదించిన బుద్ధ, మహావీర, మహాత్మా గాంధీల భూమి అయిన భారత దేశం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మారణా యుధాలు దిగుమతి చేసుకుంటోంది. యుద్ధ రహిత ప్రాంతంగా ప్రకటించబడిన జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతం ప్రపంచం లోనే అత్యంత సైనికీకరించబడిన ప్రాంతంగా మారింది. సైనిక వ్యవస్థమీద ఖర్చును దశలవారీగా తగ్గించే అవకాశం ఉందా? జాతీయవాద యుద్దనాదాలకు లోబడిపోవడం చాలా సులువు, కానీ అసలు సమస్య లోతుల్లోకి వెళ్లాలి, ఈ అంశంపై ప్రజల్లో చర్చ ప్రారంభించాలి.
ప్రజల్లోని దురభిప్రాయాలపై పోరాటం
ప్రజల్లో అజ్ఞానం వల్లనూ, మరీ ముఖ్యంగా మీడియా సృష్టి వల్లనూ ఏర్పడిన దురభిప్రాయాలపై వామపక్షాలు తీవ్రంగా పోరాడాలి. ఒక ఉదాహరణ చెబుతాను: 2004 ఎన్నికల (14వ లోక్‌సభ ఎన్నికలు)
ఫలితాలు వెలువడిన వెంటనే ఏర్పడిన పరిస్థితిని తీసుకుందాం. వామపక్షాలు 59 స్థానాలు గెలుచుకోవడంతో కొత్త ప్రభుత్వం (యుపిఎ-1) ఏర్పాటులో వాపక్షాల ప్రభావం పెద్దగా ఉంటుందని స్పష్టమైంది. దాంతో మీడియా మొత్తం (ప్రింట్, ఎలక్ట్రానిక్) గొంతు చించుకుని “కమ్యూనిస్టు భూతం” గురించి అరవడం ప్రారంభించింది. కమ్యూనిజం అనేది హింసాత్మకమైన, ప్రజాస్వామ్య విరుద్ధ శక్తి అనే దురభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. కమ్యూనిస్టులు మతాన్నీ, భారత దేశ సంస్కృతినీ పట్టించుకోరని కూడా ఆరోపించారు. ఈ రంగాల్లో ప్రజల్లో ఉన్న దురభిప్రాయాలను పారద్రోలడానికి నిరంతరం పట్టుదలతో కూడిన కృష్టి చేయాలి.
ఫెడరల్ వ్యవస్థను మరింత వాస్తవం చేసేందుకు గాను అంతర్రాష్ట్ర మండలి స్ఫూర్తిని ముందకు తీసుకుపోవాలి. ఇటీవల కేంద్ర
ప్రభుత్వం జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రాన్ని చీల్చడం అనేది మన రాజ్యాంగంలో నిర్దేశించబడిన, అలాగే సర్కారియా కమిషన్ (1983-87) చెప్పిన కేంద్ర రాష్ట్ర సంబంధాలకు పెద్ద విఘాతం కల్గించింది. దాంతోపాటు ఇప్పుడు ఎన్డీఎ ప్రభుత్వం రాష్ట్రాలతో ఏమాత్రం సంప్రదించకుండానే రక్షణ ఖర్చులను అవి కూడా భరించేట్లు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
వామపక్షాలు మరింత విస్తృతమైన ప్రజానీకానికి సభ్యత్వం ఇవ్వాలి. ప్రజల పౌర హక్కులు, మహిళా విముక్తి, దళితలు ఆదివాసీలు మతపరమైన మైనారిటీల హక్కుల కోసం అనేక ప్రజా ఉద్యమాలు నడుస్తున్నాయి. కొత్త రాజకీయ కూటమి వ్యస్థాగత నిర్మాణంలో ఇటువంటి వారందరికీ అవకాశం కల్పించాలి.
వామపక్షాలు తమ కనీస ఉమ్మడి కార్యక్రమంలో మరో రకమైన ఘర్ వాపసీ విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఆదివాసీలు,
దళితులు, ఇతర పీడిత ప్రజల నిర్దిష్ట సంస్థుతులపై కేంద్రీకరితిక సింప్రదా యాలపై బ్రాహ్మణేతర కేంద్రీకరించాలి. అంటే ఈ సెక్షన్ ప్రజల ఆధ్యాత్మిక కార్యకలాపాలను “నిర్బ్రాహ్మి ణీకరించాలి”. ఇదంతా పూర్తిగా 365 రోజులు, రోజుకు 24 గంటలూ చేయాల్సిన పని. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అనుసరించే సాఫ్ట్ హిందూత్వ కార్యక్రమంలా ఉండకూడదు.
యుద్ధాలు నేల మీద చేయాలి, టివీ స్టేషన్లలో కాదు. అయితే నేటి వామపక్షానికి టీవీల్లో స్థానం ఇవ్వడం లేదనుకోండి. అందరికీ తెలిసిన భారత దేశం అనే భావన (భిన్నత్వం, బహుళత్వం) మీద జరుగుతున్న దాడికి వ్యతిరేకంగానూ, నయా-ఉదారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగానూ జరిగే పోరాటంలో తటపటాయింపులుండరాదు. అలాగే ఈ పోరాటంలో ముందొకటి తరువాత మరొకటి అనే ప్రాధాన్యాలు ఉండకూడదు. ఈ రెండు విషయాలూ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి కనుక రెంటికి వ్యతిరేకంగా ఏక కాలంలో పోరాడాలి.
ప్రొ॥ కెఎం శ్రీమాలి.
రచయిత ఢిల్లీ యూనివర్శిటీ చరిత్ర విభాగంలో మాజీ ప్రొఫెసర్
(అనువాదం: ఎస్. వెంకట్రావు)
2025 ఏప్రియల్. మార్క్సిస్టు నుండి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.