
తెలుగు వారికి ముఖ్యంగా తెలంగాణకు కాళోజీతో సహా దాశరథి, జయరాజ్ ఇద్దరూ ప్రజాకవులే. దాశరథి పేరు మీద అవార్డును అందుకున్న జయరాజ్‌తో పాటు దాశరథి కూడా అభినందనయోగ్యులు.
అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దాశరథి పేరు మీద ఎలానూ అవార్డులను ఇవ్వడం లేదు. కానీ, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రభుత్వేతర సంస్థ దాశరథి పేరు మీద థియేటర్‌ను నడిపిస్తుంది. అనేక యువకళాకారులను ప్రోత్సహిస్తూ లఘుచిత్రాల పోటీలను సంస్థ నిర్వహిస్తుంది. పోటీలలో ఎంపికైన చిత్రాలను ఆ థియేటర్లో ప్రదర్శిస్తున్నారు. సాహితీవేత్త, ఉద్యమకారులు దాశరథిని ప్రభుత్వం గుర్తించకపోయినా, ప్రభుత్వేతర సంస్థలు గుర్తుస్తున్నాయనేదానికి ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుంది.
అలానే, ఎల్బీ నగర్ వాసవీ కాలనీలోని వాసవి క్లబ్లో దాశరథి పేరున అవార్డులను ఇస్తున్నారు. ప్రతి ఏడాదీ ఈ అవార్డులను ప్రజాకళాకారులకు బహుకరిస్తున్నారు. శతజయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రజాకవి, సినీ రచయిత జయరాజ్‌ని ఈ సారి అవార్డు వరించింది.
“శిల నీవే! శిల్పీ నీవే! శిల్పము నీవే! సృష్ఠిలో/ నిన్ను నువ్వు మలుచుకుంటు నిలిచిపో చరితలో/ పుడమిలో అణువణువు నీదె పరవశించుట నేర్చుకో/ జీవితం ఇక మళ్లీరాదు సార్ధకం చేసుకో” అంటూ రాసిన పాటతో జీవితం విలువను తెలియజేసిన జయరాజ్ ఎవరికి తెలియకుండా ఉంటారు? ఆయనను ప్రత్యేకించి ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం ఉండదనే అనుకుంటాను.
ఈ మధ్య చిన్న సమస్యలనే ఎదుర్కోలేక, పరిష్కరించబడని సమస్య అనుకోని కొందరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వారికి ఈ పాట బుద్ధి చెప్తుందని భావించవచ్చు.
తాత్కాలిక సమస్యకు ఆత్మహత్యే పరిష్కారమనుకోని జీవితాన్ని ముగించాలనుకోవడం దారుణం. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు విలువైన జీవతాన్ని బలిచేసుకుంటున్నారు. చదువుకున్నవాళ్లు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆత్మహత్య వార్త విన్న ప్రతిసారీ ఈ గేయం అందరూ చదువుకోవాలి. అంతేకాదు, ఆత్మహత్యతో మరణించిన వారికి సంతాప సభలు నిర్వహించే పెద్దలు ఖచ్చితంగా ఆక్కడ ఈ గేయాన్ని చదవాలి. 24 చరణాలున్న గేయాన్ని 24 నిమిషాలు చదివించడం ఎక్కువ అనుకుంటే, కనీసం నలుగైదు చరణాలు పాడిస్తే సరిపోతుంది.
దాశరథి గురించి చాలామంది చాలా పుస్తకాలు, వ్యాసాలు, కవితలు రాశారు. ఆయన గురించి అందులో వివరించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో చిచ్చర పిడుగులా యువ కవి దాశరథి కనబడతారు.
గతంలో ఆవు పేడతో చేసిన పిడకను ఎండబెట్టి కాల్చేవారు. అది బొగ్గుగా మారిన తర్వాత పళ్లు తోముకోవడానికి వాడేవారు. ఈ బొగ్గునే జైల్లో ఖైదీలకు పోలీసులు ఇచ్చేవారు. నిజాం మీద నిప్పులు చెరిగిన దాశరథి ఆ బొగ్గునే ఆయుధంగా వాడుకున్నారు. ఆ బొగ్గుతో ఎప్పుడు పళ్లు తోముకున్నారో, ఎప్పుడు దాచుకున్నారో తెలియదు. కానీ, ఆ బొగ్గుతోనే దొరలతో కలిసి పాలిస్తున్న నిజాం రాచరిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దాశరథి తన కవితలతో నిప్పులు చెరిగారు.
దాశరథి కృష్ణమాచార్యులు భావకవిత్వం రచించిన తరువాత దశలో తెలంగాణ గడ్డలో పుట్టి కలాన్ని కత్తిగావాడుకుంటూ, బొగ్గును అస్త్రంగా చేసుకొని నిజాం అనే తిమరంతో సమరం చేశారు. నిజాం ముష్కర మూక నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి అహర్నిశలు పోరాడారు. ఆ బొగ్గుతోనే రక్తాక్షరాలను లిఖించి, తరువాత సువర్ణాక్షరాలతో “నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అంటూ అగ్నిధారను పారించారు.
“ఉలితో పాషాణంలో పీయూషాన్ని చిప్పిలజేసే శిల్పి లాంటి వాడు కావాలి కవి” అని రాసిన దాశరథి మాటలకు నిలువెత్తు నిదర్శనంగా జయరాజ్ నిలుస్తారు. కూలిపోని శిల్పాక్షరాలను “శిల్పీ నీవే శిల్పం నీవే శిల నీవే” అంటూ ప్రజాకవియై రచించారు. కనుక జయరాజ్‌కు దాశరథి అవార్డు ఇవ్వడం ఎంతో సముచితం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.