
ప్రిన్స్టన్: గత దశాబ్ధి కాలంగా పండితులు డోనాల్డ్ ట్రంప్ ఉద్ధాన, పాలనను అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వారు పాప్యులిజం, ఫాసిజం, వంటి అనేక చారిత్రక పోలికలను కలిగిన పేర్లను మళ్లీ మళ్లీ ప్రతిపాదించడానికి తంటాలు పడ్డారు. ఈ ప్రయత్నంలో కొందరు మరీ వింత పోకడలు(మార్టిన్ లూథర్ 1517 కాలపు డోనాల్డ్ ట్రంప్)పోయారు. ఇప్పుడు స్వయంగా ట్రంపే తన గురించి సోషల్ మీడియాలో రాసుకుంటూ ఒక సూచన చేశాడు. ‘చట్టాతిక్రమణకు పాల్పడని దేశ సంరక్షకుడు‘ ఈ ఉల్లేఖన నెపోలియన్ దని అందరికీ తెలిసిందే. కానీ దాన్ని నెపోలియన్ నోటికందించింది మాత్రం బహుశా బాల్జాక్ అయి ఉంటాడు.
నెపోలియన్ సీజరిజానికి ఒక ప్రముఖ ఉదాహరణగా కనపడతాడు. సీజరిజం అనేది ఏకవ్యక్తి పాలనా విధానాన్ని వర్ణిస్తూ, దానికి ఆమోదాన్ని తెచ్చేందుకు పంతొమ్మిదవ శతాబ్ధంలో కనుగొనబడిన ఒక ప్రత్యేకమైన పదం. మనం కనిపెట్టాలని అనుకున్న పదం అదేనా? కొన్ని కొట్టొచ్చే పోలికలు ఈ రెండింటి మధ్యా ఉన్నప్పటికీ సీజరిజానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ట్రంప్ లో లేకుండా పోయాయి.
మొదట పోలికలను చూద్దాం. అధికారాన్ని చేజిక్కించుకోకముందే ఆధునిక ప్రజాబాహుళ్య రాజకీయాలకు ప్రచారం కీలకమని నెపోలియన్ ట్రంప్ లానే తన అంతర్దృష్టితో తెలుసుకున్నాడు. తన సైన్య విజయాలను, వెల్లువలాగా ప్రచురించిన తన స్వీయ ప్రచార కరపత్రాలను, చిత్రాలను, జర్నల్ ఆఫ్ బోనపార్టే, విక్టోరియస్ మ్యాన్ వంటి పేర్లతో వార్తాపత్రికలనూ తానే స్వయంగా సంపాదకత్వం వహించి, నిర్వహించాడు.
సీజర్ ప్రస్తావనలు: ఆయన ప్రాచీనతకు మహోన్నత రూపం సాధారణమే అయినప్పటికీ 1800లో మాత్రమే సీజర్, క్రాంవెల్, మాంక్, బోనపార్టీల మధ్య ఒక సామ్యాన్ని సమగ్రంగా నెలకొల్పుతూ ఒక సంపుటి ప్రజలకు అనుగ్రహించబడింది. దీన్ని నెపోలియన్ సోదరుడు, ఇంటీరియర్ మినిస్టర్ అయిన లూసియన్ రచించాడు.
ఈ సామ్యాన్ని చెప్పేవారు సీజర్ ను గొప్ప ప్రజాధరణ కలిగిన నాయకుడని, ‘ప్రజల ఇష్టాన్ని మరలించేవా‘డని నొక్కివొక్కాణించారు. నెపోలియన్ మేనల్లుడు లూయిస్ 1848లో అధ్యక్షుడయ్యాడు. 1851లో తిరుగుబాటు ద్వారా తన అధికారాన్ని నిలబెట్టుకున్నాడు. చివరకు తనకు తాను నెపోలియన్ -3 బిరుదుతో కిరీటధారణ చేసుకున్నాడు- ఆస్తిపరులకు మాత్రమే ఓటుహక్కు ఉండాలనే సంప్రదాయవాదులను వ్యతిరేకించి, మగవారందరికీ ఓటుహక్కును తిరిగి ఇవ్వడంతో నెపోలియన్ పొందిన ఖ్యాతిని తానూ సొంతం చేసుకోగలిగాడు.
కానీ నెపోలియనిక్ ప్రజాస్వామ్యానికి పరిమితులు ఉండేవి. నెపోలియన్ లిద్దరూ ప్రచారం మీద మాత్రమే ఆధారపడిన వారు కాదు. పోలీసు, విమర్శలను సెన్సార్ చేయడం, ప్రతిపక్షాన్ని నోరుమూయించటంలాంటివి కూడా ఉపయోగించేవారు. ప్రజాభిప్రాయ సేకరణలను చేసేటప్పుడు వారు ఏమిచేయబోతున్నారన్న విషయం మీద అమితమైన ప్రజా మద్దతును ప్రదర్శించడమే ముఖ్యోద్దేశంగా ఉండేది. తీవ్రమైన రాజకీయ అనిశ్చితి, ప్రతిఘటనలు ఎదురైనప్పుడు మాత్రమే వారు రాజకీయ వ్యవస్థను సరళీకరించే పనికి పూనుకునేవారు. ఎల్బా నుండీ తిరిగి వచ్చిన తర్వాత నెపోలియన్- 1, తన చివరి సంవత్సరాలలో నెపోలియన్ -3 ఈ రకమైన పనులు చేశారు.
నెపోలియన్‌ను ఆధునిక ‘మీడియా చక్రవర్తి‘గా పిలుస్తారు. నెపోలియన్ లిద్దరూ అసాధ్యమయిన తమ (అనేక తిరుగుబాట్లు విఫలమయిన తర్వాత 1848లో నెపోలియన్-3 ఎన్నిక, అసంభవంగాతోచే ట్రంప్ ఎన్నికతో చిత్రమైన పోలిక ఉంది) ఉద్ధానాలను ప్రచారం చేసుకోవడంపై ఆధారపడ్డారు. కానీ వారు కూడా ప్రజలను మంత్రముగ్ధులను చేయడం కోసం ఆకర్షణీయమయినవెన్నో సాధించాలని కోరుకున్నారు. నెపోలియన్ బోనపార్టే దీనినే ‘మనవంటి నూతన ప్రభుత్వము తనను తాను సుస్థిర పరుచుకొనేందుకుగానూ, ప్రజలను అబ్బురపరచేదిగా, ఆశ్చర్యపరిచేదిగా ఉండాల్సిన అవసరం ఉందని, అలా ఉండలేకపోతే అది కుప్పకూలుతుంతుంది‘ అని అంటాడు.
దీనికిగానూ నెపోలియన్ బోనపార్టే అనుసరించే పద్ధతులు సైనికపరమైనవిగా ఉండేవి. సైన్యంతో తనకున్న సంబంధాలను పెద్దఎత్తున ప్రదర్శించేందుకు ఆయన ప్రయత్నించేవాడు. ‘సైనికులను తనతో సమానమైన వారిలాగా చూసుకోవడం, వారంతా తనకు సుపరిచయస్తులే అన్న ధోరణిలో ఉద్దేశపూర్వకంగా ఉద్వేగంగా పలకరించడం‘ వంటివి చేసేవాడని చరిత్రకారుడు డేవిడ్ బెల్ రాశాడు. సైనిక ప్రాభవంతో పాటుగా, నెపోలియన్ పారిస్‌ను అద్భుతమయిన భవనాలతో అలంకరించాడు. ఆయన ఇంజినీర్లు నీటి పారుదలనూ, మురుగు నీటి పారుదలనూ మెరుగుపరిచారు.
నెపోలియన్-3 కూడా పట్టణీకరణకు సంబంధించిన ఆకర్షణీయ విన్యాసాలను అనుసరించాడు. సీన్ నదిని అతను తీర్చిదిద్దిన పద్ధతి, జార్జెస్-యూజీన్ హస్మన్ చేత నిర్మితమైన ప్రఖ్యాతి గాంచిన సుందర వీధులలో ఆశ్చర్యగొలిపే ప్రకృతి దృశ్యాలు – తిరుగుబాటు సందర్భాలలో వెనువెంటనే సైన్యాన్ని మోహరించడానికి తగినంత విశాలంగా ఉండేవి. ఈ విధంగా నగరాన్ని సంపన్నుల కేంద్రంగా మలచడం కోసం అన్నింటికన్నా ముందుగా శ్రామికులను, పేదలను నగరం మధ్యనుండి ఒక క్రమపద్ధతిలో వేరే చోట్లకు తరలించేవారు.
ట్రంప్‌కు కూడా ఒక ఆర్కిటెశ్చరల్ ఎజెండా ఉంది. అంతగా గుర్తింపు పొందని తన తొలి ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులలో ‘అందమైన ఫెడరల్ సివిక్ ఆర్కిటెక్చర్ ను ప్రోత్సహించడం‘ ద్వారా ఫెడరల్ భవన నిర్మాణ పద్ధతులను క్లాసికల్ శైలిలోకి తిరిగి మళ్ళించాలనే పిలుపు ఉంది(కాక్రీట్పై అందమైన చెక్కుడు పనితీరు, ప్లాస్టిక్‌తో చుట్టిన పాలనురగ వంటి స్తంబాలతో మెక్ మాన్షన్ భవనాల పద్ధతిలోకి భవన నిర్మాణ శైలి మారనున్నదా అని ఒక విమర్శకుడు ఊహిస్తున్నాడు). అదేవిధంగా కెనడా, గ్రీన్‌లాండ్‌లను అమెరికాలో కలుపుతానని ట్రంప్ చతురతతో అనడం పంతొమ్మిదవ శతాబ్దం నాటి సామ్రాజ్యవాద చీకటి రోజులను గుర్తుకు తెస్తుంది. ఆ రోజులలో సామ్రాజ్య ప్రాభావాన్ని ప్రాదేశిక విస్తరణతో సమానంగా చూసేవారు.
ఇంకా చెప్పాలంటే, వాస్తవంగా వ్యాపారంలో వరుస వైఫల్యాలను పొందినప్పటికీ, తనను తాను ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఇమేజ్ ను అమ్ముకోవడం కోసం మన ఆమోదాన్ని కొల్లగొట్టడంలోనే ట్రంప్ నిజమైన ప్రతిభ ఉంది. మహత్వ కల్పనపై (FANTACY OF GRANDEUR) ఆధారపడి నెగ్గుకవచ్చిన నెపోలియన్ -3 తో ట్రంప్‌కు పోలిక ఉంది. కార్ల్ మార్క్స్ నెపోలియన్ -3 ను ‘అవకతవకల అత్తెసరుతన’మని(GROTESQUE MEDIOCRITY) అంటాడు. ఇబ్బందులను అధిగమించడానికిగాను ఇతను చేసిన కల్పనలకు(FANTASY) తగినంత ప్రజాధరణ లభించింది. దీనినే రాజకీయ శాస్త్రవేత్తలు ఆటో గోల్ఫ్( స్వీయ తిరుగుబాటు) అని పిలిచారు. అంటే చట్టబద్ధంగా అధికారస్థానానికి ఎన్నికై, అధికారంలో ఉండడానికి చట్టవిరుద్ధ మార్గాలను అవలంబించడమని అర్థం. 2021 జనవరి 6న ఓడిపోయి, తిరిగి అధికారంలోకి వచ్చిన ట్రంప్ తన రెండవ పాలనా కాలంలో ఇలాంటి విధానాలనే అవలంబించే అవకాశం ఉంది.
సీజర్ తో పోలిక అనేది ట్రంప్ విషయంలో లోప భూయిష్టమయినది. అతి ప్రాథమిక స్థాయిలోనే, ట్రంప్‌కు సాఫల్యాల కొరత ఉంది. గూఠే, నెపోలియన్ క్రియల ఉత్పాదకత ( PRODUCTIVITY OF DEEDS) ను కీర్తించాడంటే దాని అర్థం, ఆయన నెపోలియన్ యుద్ధ విజయాలను గురించి మాత్రమే మాట్లాడాడని కాదు. ఆయన పొగిడింది తనను తాను రూపొందించుకొని, ఫ్రెంచ్ రాజ్యాన్నీ న్యాయ వ్యవస్థనూ పునర్నిర్మించిన వ్యక్తిని.
నెపోలియన్లిద్దరూ పార్టీలకూ, వర్గాలకూ అతీతంగా గొప్ప ప్రజాదరణతో తమను తాము ప్రదర్శించుకున్నవారే కానీ ట్రంప్ మాత్రం ఆచరణలో ఒక తీవ్ర రిపబ్లికన్. సంపన్నులపై పన్నులను తగ్గించాలనే లక్ష్యంతో సాగుతున్న వ్యక్తి.
ఇక, అతని స్నేహితుడు ఎలాన్ మస్క్ అమెరికాను దాని భవిషత్తులోకి ఒంటిచేత్తో లాగడానికి బదులుగా ఉద్దేశపూర్వకంగానే నాశనం చేస్తున్నాడు. నెపోలియన్లు రాజ్యంపై అదుపును సాధించి, విప్లవకర తిరుగుబాట్లకు ముగింపు పలుకగా, ట్రంప్, అతని అనుచరులు మాత్రం కొన్ని పనులకు ‘అంతరాయ‘మనేది మంచిదనే ఆలోచనకు మంత్రముగ్ధులై ఉద్దేశపూర్వకంగానే గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.
చట్టానికి అతీతంగా ఉండడం అనే ట్రంప్ లెక్కలేని ప్రవర్తనకూ సీజరిస్ట్ ఆకాంక్షలకూ వాస్తవంగా సంబంధంలేదు. ఇది శషబిషలేవీ లేకుండా హింసను చట్టబద్ధం చేయడానికి రూపొందించిన నిరంకుశ వాక్చాతుర్యం తప్ప మరేదీ కాదు. ఎల్ సాల్వడార్ నిరంకుశ నాయకుడు నయీబ్ బుకెలే కూడా ట్రంప్ ఉపయోగించిన పదబంధాన్నే ఉపయోగించాడు. నార్వేజియన్ సామూహిక హంతకుడు అండర్స్ బ్రీవిక్ మ్యానిఫెస్టోలో కూడా ఇదే కనిపిస్తుంది. ఇస్లాం నుండి యూరప్‌ను రక్షించే పేరుతో, అతను 2011లో ఓస్లోలోనూ దానికి సమీపంలోని ద్వీపంలోనూ 77 మందిని చంపాడు. (అమెరికాను తిరిగి ఉన్నతంగా చేద్దాం, ఇప్పుడు నువ్వు కూడానా?) Et tu MAGA?
జాన్ వెర్నర్ ముల్లర్
(వ్యాసకర్త జాన్ వెర్నర్ ముల్లర్ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పాలిటిక్స్ ప్రొఫెసర్. ఇటీవల ప్రచురితమైన డెమోక్రసీ రూల్స్ అనే పుస్తకానికి రచయిత.)
అనువాదం : అవ్వారు నాగరాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.