
పెను ఉత్పాతమై రగిలే కాలం..
ఆకు పచ్చని పైరులలో
ఆనంద పంటలు పూయించే
ఘర్మ జల ఊటలం మేం!
మా జీవితాల సార్థకత విలువ ఎంత?
మాకు దొరికింది సమాధానం
అది నాడు ఆర్యభట్టుడు కనుగొన్నదే!!
పరిష్కార సూచకంగా
ఆ నాడు మూడు నలుపు రంగు చట్టాల
తుపాన్ల హెచ్చరికను పాలకులు చేస్తే..
అన్ని ట్రాక్టర్లూ చుట్టూ మోహరించి
ఆంక్షలను ధిక్కరించి
అవమానాలు భరించి
దుర్మార్గపు ఆరోపణలు ధీరంగా తిప్పికొట్టి
రాబోయిన తుపాన్లను ఐక్యతతో ఎదుర్కొని
అందరికీ ప్రశాంతతను చవి చూపించాం
ఇప్పుడు మళ్లీ ఇంకో రూపంలో
భారీ దండయాత్రకై
ప్రమాద హెచ్చరిక జెండా జారీ అయింది
హే.. వాన్స్!
ఈ దేశం తనను తాను అమ్ముకునేందుకు సిద్ధంగా లేదు
దేశమంటే ఏంటో మొన్ననే చెప్పారు కదా
పాద నమస్కారాలు, మస్కాలతో
దేవుడు లేని ఆలయంలో
మా ఉత్త మంత్రి చెప్పిన గురజాడ మాటలు..
“మట్టి కాదు, మనుషులని!”
మరి మేం మట్టి మనుషులం
మా మాటగా చెప్తున్నాం
విను వాన్స్!
మమ్మల్ని మేం అమ్ముకునేందుకు ససేమిరా!
మా పాలకులు పాతకులుగా మారి
మాకే ద్రోహం తలపెడితే..
నిను ఎదుర్కునే ప్రయత్నంలో
మమ్మల్ని ద్రోహులుగా చిత్రీకరిస్తే
మేం వెరువం.. అస్సలు జడువం..
నీ టారిఫ్‌ల పెంపు కోసం
మా పెద్దాయనను తారీఫ్ చేసి లొంగదీసుకున్నా
ఆయన తనకు తానుగా ముందస్తుగా బేషరతుగా లొంగిపోయినా
మండుటెండల్లో అగ్నిపూలు పూచేందుకు సిద్ధంగా ఉన్నాయ్
ఇన్నాళ్ళూ వాటికి నీరు, ఎరువు దట్టంగా అందించి ఉంచాం
మా స్పూర్తి ముందు నీ బలమెంత?
మా ఐక్యత ముందు నీ బలగమెంత?
ఇక బరిలోకి దూకబోతున్నాం
ఈ సారి నాలుగు, ఎనిమిది కాదు..
పది దిక్కుల నుంచి మాకు మద్దతు ఉంది
పచ్చని బయళ్లలో గెలుపు పూలు
అరుణ వర్ణంతో మెరువనున్నాయ్
మా మద్దతు ధర గ్యారంటీ చట్టం
ఈ దరి పోరాటపు బై ప్రొడక్ట్‌గా రానుంది
కాచుకో
మేం పండించిన అన్నం తింటున్న
మా పౌరులు అందరూ మా వైపే ఉన్నారు
గో బ్యాక్ వాన్స్
మళ్ళీ ఇక ఎన్నటికీ రాకు
సమీర
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.