
సామాజికంగా వంచిత కులాలు, జాతులకు చెందిన జనాభా వివరాలు, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులకు సబంధించిన వివరాలు లేకుండా సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం సాధించలేము. ఈరకమైన సమాచార లోపం ప్రభుత్వాలు తీసుకునే చర్యలను ప్రభావితం చేస్తుంది.
సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వ సాధన నుండి అణగారినవర్గాలు ఇంతకాలమూ దోపిడీకి గురయ్యాయి. అభ్యున్నతికి నోచుకోలేదు.
ఉన్న సమాచారాన్ని ప్రజోపయోగానికి అందుబాటులో ఉంచకపోవటం, పాలకులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఓటుబ్యాంకు కాపాడుకునేందుకు, పెంచుకునేందుకు వీలుగా ఉపయోగించుకోవటమే సమాచార అణచివేత. ప్రభుత్వ విధాన ప్రకటనల్లో అసంపూర్ణమైన సంక్షేమ చర్యలతో ఈ సమాచార అణచివేతను సార్వత్రికం చేసేశారు. పైగా సంక్షేమ ఖర్చును తగ్గించుకోవాలన్న వాదన ముందుకు తీసుకురావడానికి ఈ మరుగునపెట్టి సమాచారాన్ని వినియోగించుకుంటూ వచ్చారు.
సమాచార అణచివేత – ప్రత్యక్ష పరోక్ష దోపిడీ
స్థూలంగా చెప్పాలంటే సమాచార అణచివేత ప్రత్యక్ష పరోక్ష దోపిడీకి కావల్సిన విధి విధానాలను రూపొందించేందుకు పాలకులకు వెసులుబాటు కల్పిస్తుంది. దురదృష్టం ఏమిటంటే సార్వత్రిక సంక్షేమం, సార్వత్రిక విముక్తి కోసం రూపొందించిన రాజ్యాంగం అమల్లో ఉండగానే ఇలా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సమగ్ర సంక్షేమాన్ని సాధించటం కోసం రాహుల్ గాంధీ కులగణన డిమాండ్ ముందుకు తెచ్చారు. ఒక సామాజిక తరగతికి సంబంధించిన సమాచారాన్ని తొక్కిపెట్టడటం అంటే ప్రభుత్వం రూపొందించే సామాజిక ఆర్థిక రాజకీయ విధానాల్లో సదరు సామాజిక తరగతికి భౌతికంగా తావు లేకుండా చేయటమే.
సమాచారాన్ని తొక్కిపెట్టడం వల్ల ఆయా సామాజిక తరగతులు భౌతికంగా ఎలా వెలివేతకు గురవుతాయో చూద్దాం. కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న మీడియాకు అణగారిన సామాజిక తరగతుల గొంతుకలు వినిపించవు. మెరుగైన వసతులు కలిగిన ప్రైవేటు విద్యాలయాల్లో చదువుకున్న వారికి ఇస్తున్నంత ప్రాధాన్యత అరకొర సదుపాయాలతో నడిచే ప్రభుత్వ బళ్లలో చదువుకున్న వారికి దక్కదు.
రాజకీయాల్లో కులం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందనటంలో సందేహం లేదు. కానీ పార్టీలు కులాలకు ఇస్తున్న పాత్ర సామాజికంగా జరిగిన అన్యాయాలను అర్థవంతంగా పరిష్కరించేందుకు మార్గంగా కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ పార్టీలు ఈ దిశగా అడుగులు వేసింది నామమాత్రమే. చివరిది ఆర్థికరంగంలో వెలి. మోసపూరితమైన అభివృద్ధి పథకాలతో ప్రభుత్వం అటు మధ్యతరగతి కళ్లు గప్పుతూ కార్పొరేట్ సంపన్న వర్గం ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తుంది. ఈ ప్రయత్నంలో సమాజంలో అణగారిన వర్గాలు, తరగతులకు సంక్షేమ పథకాల రూపంలో నాలుగు మెతుకులు విదిలిస్తుంది. పైగా ఈ నాలుగు మెతుకుల వల్ల దేశ ఖజానా దోపిడీ అవుతుందని గావుకేకలు పెడుతోంది. ఉచితాలపై ప్రధానమంత్రి ప్రకటనలు దీనికి ఉదాహరణలు.
సమాచారాన్ని తొక్కిపెట్టడంలో నైపుణ్యం సాధించిన పెత్తందారీ పాలకవర్గాలు కులగణనను, ఆ మాటకొస్తే శాస్త్రీయ విధాన రూపకల్పనకు అక్కరకొచ్చే ఏ సమాచారానికీ ప్రాధాన్యత ఇవ్వవు. వీళ్ల దృష్టిలో సామాజిక న్యాయం అంటే ఉపన్యాసాల్లో అలంకారప్రాయంగా ప్రస్తావించే అంశమే తప్ప ఆచరణాత్మక వ్యూహం కాదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన కేవలం లెక్కలు బహిర్గతం చేయటం ఒక్కటే కాదు. శాస్త్రీయమై సామాజిక న్యాయ సాధనకు రహదారి. అణచివేతకు గురైన వర్గాలను సశక్తులను చేసేందుకు సాధనం. దీంతోనే ఈ విప్లవాత్మక చర్యను నీరుగార్చటానికి ప్రతిపక్షాలు ఏవేవో కుంటిసాకులు చెప్తున్నాయి. కులగణనకు అనుసరించిన పద్ధతి, పరిధి, పరిమితి, సాంకేతిక సమస్యలు, తుది ఫలితాలపై అనుమానాలు రేకెత్తించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వం సమాధానాలు చెప్పింది. అవసరమైన చోట్ల సవరణలు కూడా చేసుకున్నది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనను వ్యతిరేకిస్తున్న వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవటం అవసరం. తెలంగాణ కులగణన జయప్రదంగా ముగిస్తే దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంటుందన్న భయంతో బిజెపి రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు విఫలం కావాలని ఆశించింది. తెలంగాణలో కులగణనను వ్యతిరేకించే బాధ్యతను తన ప్రాంతీయ మిత్రులు భారతీయ రాష్ట్ర సమితికి అప్పగించింది.
తెలంగాణ కులగణనను అడ్డుకోవడానికి బిజెపి, బిఆర్ఎస్ల ప్రయత్నం
దశాబ్దం క్రితమే తెలంగాణ రాష్ట్రంలో కులగణన పూర్తి చేశామని బిఆర్ఎస్ చెప్తోంది. దాదాపు నాలుగుకోట్ల మంది ఉన్న రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క రోజులో ఈ సర్వే పూర్తి చేశారు. అలా సేకరించిన సమాచారాన్ని బహిర్గతం చేయలేదు. సర్వే విధి విధానాలు తెలుసుకునేందుకు కూడా అవకాశం లేదు. ఈ సమాచారాన్ని తొక్కిపెట్టడానికి గల కారణాలు ఇపుడు బహిర్గతమే. తెలంగాణలో అణగారిన వర్గాలు, కులాలకు సంబంధించిన గణాంకాలను బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం సమాజానికి తెలియచెప్పాలనుకోవటం లేదు. ఇదే సమాచారాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి కులగణన ద్వారా దేశం ముందుంచింది.
ప్రతిపక్షాల విమర్శలు పక్కన పెడితే ఇటువంటి ప్రయత్నం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ముందుకు తెస్తోంది. కులగణన కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా సలహా సంప్రదింపులు సాగించింది. తెలంగాణ కాంగ్రెస్‌తో పాటు రాజకీయేతర నిపుణులు కూడా ఈ సంప్రదింపుల్లో భాగస్వాములయ్యారు. ఈ రచయిత కూడా అందులో ఓ భాగస్వామి. గణాంకాలకు సంబంధించిన వేర్వేరు కోణాల్లో చర్చలు జరిగాయి. ఈ సమాచారమంతా బహిరంగంగానే అందుబాటులో ఉంది. చివరకు అనుసరించే పద్దతి, ప్రశ్నలు ఏ భాషలో అడగాలి అన్న విషయాలు కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత ఈ సర్వే నిర్వహించారు.
ఈ కసరత్తు పూర్తి చేసిన తర్వాత 2024 నవంబరు 5న రాహుల్ గాంధీ హైదరాద్‌లో జరిగిన చారిత్రక సభలో కులగణన నిర్ణయాన్ని వెల్లడించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కులగణన చేపట్టడానికి 2024 అక్టోబరులో జీఓ నెంబర్ 18ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇంటింటికీ తిరిగి 57 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రాన్ని పూర్తి చేయాలన్నది ఈ జీఓ నిర్దేశం. కర్ణాటక, బీహార్లలో జరిగిన ఇటువంటి సర్వేలను పరిశీలించి అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేకు తుదిరూపునిచ్చింది. మొత్తం 75 కోణాలకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించారు.
కుల గణన సర్వే లక్ష్యాలు నిర్దేశించుకుని ఈ లక్ష్యాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులేసింది. కులగణన లక్ష్యం ఏమిటన్నది జీఓలోనే స్పష్టంగా ప్రస్తావించబడింది. ‘రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వెనకబడిన కులాలకు చెందిన ప్రజానీకానికి సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి, రాజకీయ రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించే లక్ష్యంతో కులగణన చేపడుతు’న్నట్లు సర్వే జీఓ స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికా విభాగం నిర్వహించిన సర్వేలో మూడు ముఖ్యమైన భాగాలున్నాయి. కుటుంబాల జాబితా, ప్రశ్నావళి, సర్వేకర్తలకు సూచనలు, మార్గదర్శకాలు. ఈ మూడూ కలిపితేనే సర్వేకు సంబంధించిన విధి విధానాలు. ఏ సర్వే నిర్వహణకు అయినా ఆ సర్వే కోసం రూపొందించిన విధి విధానాలే ప్రామాణికం. ఈ విధి విధానాలు సర్వే కోసం రూపొందించాల్సిన సాంకేతికత విషయంలో అప్రమత్తత, ఆశించే ఫలితాల విషయంలో స్పష్టతతో ఉండాలి. సర్వే పూర్తి చేయటం కోసం దాదాపు లక్ష మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు రంగంలోకి దిగారు. రాష్ట్రాన్ని 94,261 ఎన్యూమరేషన్ బ్లాకులుగా విభజించారు. ఒక్కోక్క ఎన్యూమరేషన్ బ్లాకులో 150 కుటుంబాలుంటాయి. ఒక్కోక్కొ బ్లాకుకు ఒక ఎన్యూమరేటర్, పది బ్లాకులకు ఒక సూపర్వైజర్ చొప్పున పని చేశారు. తద్వారా సాధ్యమైనంత మేర పైన ప్రస్తావించిన జీఓలో చెప్పిన లక్ష్యాన్ని నెరేవర్చటానికి రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా పని చేసింది.
సమచారం తొక్కిపెట్టే సాంప్రదాయనికి స్వస్తి పలకవచ్చని చెప్పిన తెలంగాణ కులగణన 2024 నవంబరు 6న మొదలు పెట్టి వరుసగా మూడు రోజుల పాటు ముందు ప్రతి బ్లాకులోనూ ఉన్న ఇళ్లను గుర్తించటం, వాటికి సీరియల్ నంబర్లు కేటాయించటం జరిగింది. నవంబరు 9 నుంచి జన కులగణన జరిగింది. యాబై రోజుల పాటు జరిగిన ఈ సర్వే డిసెంబరు 25న ముగిసింది. ఈ సర్వేలో మొత్తం 1,12,15,134 కుటుంబాలను లెక్కించారు. ఇందులో గ్రామీణ తెలంగాణలో 66,99,602 కుటుంబాలు ఉంటే, పట్టణ తెలంగాణలో 45,15,532 కుటుంబలున్నాయి. సర్వేలో కవర్ కాని కుటుంబాలు కేవలం 3,56,323 కుటుంబాలు. ప్రధానంగా ఈ కుటుంబాలన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నవే. అంటే మొత్తం తెలంగాణ జనాభాలో 96.6 శాతం ఈ సర్వేలో స్వఛ్చందంగా పాలుపంచుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 3,54,77,554 మంది పౌరులు ఈ సర్వేలో పాల్గొన్నారు. కులం గురించిన సమాచారంతో పాటు ప్రశ్నావళిలోని అన్ని వివరాలు సర్వే బృందంతో పంచుకున్నారు. ఈ సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం రాష్ట్రంలో దళితులు 17.4 శాతం మంది, గిరిజనులు 10.4 శాతం మంది, వెనకబడిన కులాలు 46.2 శాతం మంది, ముస్లింలు 12.5 శాతం మంది, అగ్రకులాలు 15.7 శాతం మంది ఉన్నారు.
ఈ సమాచారాన్ని గతంలో ఏ ప్రభుత్వమూ వెల్లడించలేదన్న వాస్తవం ఈ వివరాలు పరిశీలిస్తే వెల్లడవుతుంది. ఉదాహరణకు 2018లో జరిగిన స్థానిక ఎన్నికల్లో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం బిసి తరగతుల జనాభాను తగ్గించి చూపించింది. భౌతికంగా, అవగాహన పరంగా, ఆచరణపరంగా వివిధ సామాజిక తరగతులకు చెందిన స్థూలమైన సమాచారాన్ని సైతం తొక్కిపెట్టిన సందర్భాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. తెలంగాణలో సామాజిక న్యాయ సాధనలో జరిగిన పొరపాట్లు, లోపాలు గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లోపాలు, పొరపాట్లు సరిదిద్దటానికి ఎన్నో చర్యలు ప్రతిపాదించింది. ఈ దిశలో మొదటి నిర్ణయం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం. ఈ కుల జనగణనలో లెక్కలోకి రాని కుటుంబాలు తిరిగి సర్వేలో పాల్గొనేందుకు ఫిబ్రవరి 16 నుంచి 28 వరకూ మరో అవకాశాన్నివ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. 2011 జనగణనలో బీసీ గణన జరగలేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తాజాగా చేపట్టిన కులజన గణన ప్రభుత్వాలు రూపొందించే వివిధ సామాజిక ఆర్థిక పథకాలకు, కార్యక్రమాలకు ప్రామాణిక పునాదిగా ఉంటుంది.
కేవలం యాభై రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం వలన రాష్ట్రంలో కుల సమీకరణలు, గణనలు ఎలా ఉన్నాయో లోకానికి తేటతెల్లమైంది. కులగణనను వ్యతిరేకిస్తున్న బిఆర్ఎస్ కానీ, జాతీయ స్థాయిలో బిజెపి కానీ ఇంకా ఎంత కాలం ఈ సమాచారాన్ని తొక్కిపెట్టడడం ద్వారా సామాజికంగా అణగారిన వర్గాలను అణగదొక్కి ఉంచాలనుకుంటున్నాయి అన్నది ఇప్పుడు దేశం ముందున్న ప్రశ్న. ఈ సమచారాన్ని అణగదొక్కటం అనేది ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల ఫలితమే. ఈ నిర్ణయాలను ఇంతవరకూ ఎవ్వరూ సవాలు చేయలేదు. ఈ వైపరీత్యాన్ని ఎదిరించి నిలవవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన రుజువు చేస్తుంది.
కోట నీలిమ
అనువాదం : కొండూరి వీరయ్య
(రచయిత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సనత్ నగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీర్ఘకాలం జర్నలిస్టుగా పని చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా పని చేస్తున్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.