
ప్రకాశం జిల్లాలో ప్రతిపాదిత ఐడోసోల్ సౌర విద్యుత్ ప్రాజెక్టు ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. గతంలో ఈ ప్రాజెక్టును “బోగస్ కంపెనీ”గా టీడీపీ విమర్శించిందని, అధికారంలోకి వచ్చాక వేల ఎకరాల సారవంతమైన భూములను బలవంతంగా సేకరించడానికి సిద్ధమవుతోందని రైతులు అంటున్నారు. మరోవైపు, వైసీపీ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు బీజం పడినప్పటికీ, ప్రస్తుత నిరసనలపై ఆ పార్టీ మౌనం వహించడం అనేక రాజకీయ వ్యూహాలు, ప్రశ్నలకు తావిస్తోంది. కరేడు గ్రామంలో రైతులు “భూమి ఇవ్వం, ప్రాణం ఇస్తాం” అంటూ చేపట్టిన నిరసనలతో ఈ వివాదం రోజురోజుకూ ముదురుతోంది.
2022లో వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ, 2025లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం దీనిని వేగంగా ముందుకు తీసుకువెళ్లడం మొదలుపెట్టింది. జూన్ 2025లో ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం భూసేకరణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
ఐడోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హైదరాబాద్‌కి చెందిన ప్రైవేట్ కంపెనీ. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో పలు ప్రాజెక్ట్‌లను దక్కించుకున్న , శిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీకి ఈ సంస్థ అనుబంధమైనది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ 4,200 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1,500 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర విద్యుత్ అవసరాల ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.
కంపెనీ మీద విమర్శలు..
అయితే, గతంలో ఇలాంటి భారీ స్థాయి ప్రాజెక్టులను ఏర్పాటు చేయడంలో ఈ కంపెనీకి ఎటువంటి అనుభవం లేదనే విమర్శలు వినిపిస్తోన్నాయి. పైగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు, సామాజిక ప్రభావాల అధ్యయనాలు, ఆర్థిక ప్రయోజనాలపై సరైన వివరాలు ఇప్పటివరకు ప్రభుత్వం బయటపెట్టలేదు. ఇదంతా ప్రాజెక్టుపై పలు అనుమానాలు పెంచుతోంది. మొదట 4,855 ఎకరాల భూమిని లక్ష్యంగా పెట్టుకున్నా, తర్వాత ఇది 8,500 ఎకరాలకు పెరిగింది. ఈ భూముల్లో చాలా భాగం సంవత్సరానికి మూడుసార్లు పంటలిచ్చేవే ఉన్నాయి. దీంతో ఈ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచే రైతులు తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు.
తమ మూడు పంటల భూములను బలవంతంగా తీసుకుంటున్నారని ఎస్సీ, బీసీ, ఇతర పేద వర్గాల రైతులు ఆరోపిస్తోన్నారు. ప్రభుత్వానికి నిజంగా భూమి అవసరమైతే పంటలు లేని ప్రాంతాల్లో భూమి తీసుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. 2025 జూన్ 29న వేల మంది రైతులు ఉలవపాడు దగ్గర జాతీయ రహదారి 16ను దిగ్బంధించారు.”భూమి ఇవ్వం, ప్రాణం ఇస్తాం” అంటూ నినాదాలతో హోరెత్తించారు. మహిళలు, పిల్లలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసు అరెస్టులతో ఉద్రిక్తత పెరిగింది. కానుకూరు ఉప కలెక్టర్ జోక్యం చేసుకుని భూసేకరణను తాత్కాలికంగా ఆపుతూ, రైతులతో చర్చకు సిద్ధమయ్యారు.
రైతులెందుకు వ్యతిరేకిస్తున్నారు?
ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను రైతులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. భూసేకరణ చట్టబద్ధంగా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. గ్రామసభ అనుమతి లేకుండా భూమిని తీసుకుంటే అది చట్టానికి వ్యతిరేకం. 2013లో వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం, పేదల భూమిని తీసుకునే ముందు గ్రామస్థాయి చర్చలు జరగాలి. కానీ కరేడు వ్యవహారంలో అలాంటిదేమీ జరగలేదని రైతులు చెబుతున్నారు. ప్రాజెక్టుకు భూమి అవసరమైతే పొడి భూములు, పాడుబడిన భూములు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఎందుకు బలవంతంగా మూడు పంటలు పండుతున్న భూములనే తీసుకోవాని చూస్తోందని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు చేపట్టబోయే ఐడోసోల్ కంపెనీకి దేశంలో ఇంతకు ముందు ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు చేసిన అనుభవం లేదని అలాంటి కంపెనీకి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఇలాంటి మూడు పంటలు పండే భూములు ఇవ్వడానికి రెడీ అవుతోందని రైతులు అడుగుతున్నారు. గతంలో ఇదే ప్రాజెక్ట్‌పై విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎలా ఆ కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్ట్ మొదలైందే కానీ భూసేకరణ జరగలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చి అదే ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. గతంలో టీడీపీ ఐడోసోల్ సంస్థపై విమర్శలు చేసింది. ఇప్పుడు అదే టీడీపీ అదే సంస్థతో ప్రాజెక్టు నిర్వహిస్తోంది. ఇది రాజకీయ అస్పష్టతకే నిదర్శనమనే విమర్శలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి.
వైసీపీ పాత్ర- ప్రాజెక్టు ప్రారంభం..
ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ను సీపీఎం, ఆప్, కాంగ్రెస్, రైతు సంఘాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. భూసేకరణ వివరాలు, పరిహారం, పునరావాస ప్రణాళిక గురించి పూర్తిగా చెప్పకుండా ఎలా భూసేకరణకు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. రైతులు ఇంత తీవ్ర స్థాయిలో ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ, ఆందోళన చేస్తున్నారు. అయినా ప్రాజెక్ట్‌పైన కానీ రైతుల పట్ల కానీ ప్రతిపక్ష వైసీపీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు.
గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో, ఇండోసాల్(అనుబంధ సంస్థ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్)తో ఈ ప్రాజెక్ట్ కోసం ఒప్పందాలు చేసుకుంది. 2023 మార్చిలో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఇండోసాల్తో అవగాహన ఒప్పందాలు(ఎంఓయూఎస్) కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల ద్వారా, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం ఇండోసాల్కు సుమారు 25,000 ఎకరాల భూమిని కేటాయించడానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు, ఆమోదాలు జరిగాయి. ఇందులో భాగంగా ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 7200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుల కేటాయిస్తూ జీవో నెం 19ను 2022 సెప్టెంబర్ 12నన జారీ చేసింది. దీంతో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈ ప్రాజెక్ట ను వ్యతిరేకించింది. ఒక బోగస్ కంపెనీకి ఎలా అన్ని వేల ఎకరాలు కట్టబెడతారని అప్పుడు రైతులకు అనుకూలంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే తాజాగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు అదే ప్రాజెక్ట్ కు అనుమతులు ఇచ్చి భూ సేకరణకు నోటీఫికేషన్లు కూడా జారీ చేసింది.
ప్రస్తుత టీడీపీ పాత్ర – వివాదాస్పద భూసేకరణ..
ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం 2025 జూన్‌లో భూసేకరణ నోటిఫికేషన్లను జారీ చేసింది. దీంతో కరేడుతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో భూసేకరణ కోసం ప్రణాళికలు రచించబడ్డాయి. వేల ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూములను సేకరించడానికి నిర్దిష్టంగా ప్రభుత్వం అనుమతించింది. ఇందులో భాగంగా 72, 73, 74, 75, 76 నెంబర్ల గెజిట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
ఇదిలాఉంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇండోసాల్ను “బోగస్ కంపెనీ” అని విమర్శించిన టీడీపీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తుండటం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో, రైతులు తమ జీవనోపాధిని కోల్పోతామని ఆందోళన చెందుతూ, భూసేకరణ నోటిఫికేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా భూసేకరణ చట్టాల అమలు, పారదర్శకతపై తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే వచ్చిన నిరసనల నేపథ్యంలో ప్రస్తుతం భూసేకరణ తాత్కాలికంగా నిలిపివేశారు. మరో వైపు రైతులు న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.
ఈ వ్యవహారం కేవలం కరేడు రైతుల భూమికే పరిమితం కాదు. ఇది దేశవ్యాప్తంగా అభివృద్ధి పేరుతో భూములపై జరుగుతోన్న అన్యాయానికి ఉదాహరణ. పచ్చని భూములను ‘గ్రీన్ ఎనర్జీ’ పేరుతో తీసుకోవడం సరైనది కాదు. ప్రభుత్వం రైతులతో చర్చలు జరపకుండా ముందుకు వెళ్తే, ఈ ప్రాజెక్టు వెలుగుకు కాకుండా చీకటికి మారుపేరు అవుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.