
ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation- WHO) 2025 సంవత్సరానికి గాను “ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనక భవిష్యత్తులు” అనే నినాదాన్ని ఇచ్చింది. ఇందులో భాగంగా మాతా శిశు మరణాలను నివారించాలని, తల్లీ పిల్లల దీర్ఘకాలిక ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశ ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది. ఈ ఆలోచన ఉన్నతమైనదే కాక అత్యవసరమైనది కూడా. కానీ ఈ ఉన్నత ఆదర్శాలను అమలు చేయడానికి ఉన్న అడ్డంకులను నిజాయితీగా గుర్తించలేకపోతే, గతంలో ఇచ్చిన అనేక పిలుపుల్లాగానే ఇది కూడా ఆచరణలో ఫలితాలను సాధించలేదు.
ప్రపంచ జనాభాలో ఆరవ వంతు ఉన్న భారతదేశం తల్లీ పిల్లల ఆరోగ్యంలో తీవ్రమైన అసమానతలను ఎదుర్కొంటోంది. దశాబ్దాల తరబడి విధానపరమైన వాగ్దానాలు ఎన్ని చేసినా, జనాభాలో అనేకమందికి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కూడా అందుబాటులో లేదు. దీనికి కారణమేమిటంటే ప్రజారోగ్యంలో దీర్ఘకాలిక నిధుల కోత, శిక్షణ పొందిన సిబ్బంది కొరత, పెరుగుతున్న వైద్య ఖర్చులు, మరీ ముఖ్యంగా మానవ జీవితం కంటే కంపెనీల లాభాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యవస్థ ఉండడం.
ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయం..
భారతదేశంలో ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయం జిడిపిలో కేవలం 1.2 శాతం మాత్రమే. ప్రపంచ సగటు 6.5 శాతం కంటే ఇది చాలా తక్కువని చెప్పుకోవాలి. అధిక ఆదాయ దేశాలు ఖర్చు చేసే 8.4 శాతంలో ఇది ఏడవ వంతు అవుతుంది. మన పొరుగునే ఉన్న పేద దేశం నేపాల్ కూడా ప్రజారోగ్యంపై 2.2% ఖర్చు పెడుతుంది. పెద్ద ఎత్తున వ్యాధులు, విస్తారమైన గ్రామీణ జనాభా ఉన్న మన దేశానికి, ఇది ఏ మూలకూ సరిపోదు. ఈ నిర్లక్ష్యం వల్ల మహిళలు, పిల్లలు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా అట్టడుగు, గ్రామీణ సమాజాలలో ఉన్నవారు దీని ఫలితాన్ని అనుభవిస్తున్నారు.
జాతీయ ఆరోగ్య మిషన్లో తల్లీ పిల్లల ఆరోగ్య సేవలకు ప్రాధాన్యతనిచ్చే ‘పునరుత్పత్తి, ప్రసూతి, నవజాత, శిశు- కౌమార ఆరోగ్యం(RMNCH + A)’ పథకం గురించి ప్రకటనలు ఎక్కువ, దానికి కేటాయించే నిధులు తక్కువగా ఉన్నాయి. దీంతో అది అమలుకు నోచుకోవడం లేదు. నేషనల్ హెల్త్ ప్రొఫైల్(2023) నివేదిక భారతదేశంలో దాదాపు 30% ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వైద్యులు లేకుండా పనిచేస్తున్నాయని, 60% కేంద్రాలలో మహిళా ఆరోగ్య కార్యకర్త లేరని వెల్లడించింది.
ప్రతి పదివేల మంది జనాభాకి కనీసం 44.5 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉండాలని WHO సిఫార్సు చేస్తుంది. కానీ, భారతదేశంలో 21 మంది మాత్రమే ఉన్నారు. దేశం మొత్తం మీద ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30,00,000 ఆరోగ్య సిబ్బంది కొరత ఉందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. శిక్షణ పొందిన మంత్రసానుల(ANM) విషయానికి వస్తే, ఈ కొరత ఆందోళనకరంగా ఉంది. ఈ కొరతలు కేవలం కాగితాలపై కనబడే అంకెలు కావు. ఇవి ప్రజల జీవితాలలో విషాదకరమైన ఫలితాలకు దారితీస్తాయి. నివారించగల వ్యాధుల కారణంగా తల్లులు, నవజాత శిశువులు చనిపోవడమో లేక జీవితకాల ఆరోగ్య సమస్యలకు గురికావడమో జరుగుతుంది.
అనారోగ్యంపై పేదరిక ప్రభావం..
పేదరికం కూడా మాతా శిశు అనారోగ్యానికి మరో ప్రధాన కారణం. అల్ఫాదాయ కుటుంబాలకు చెందిన మహిళలు తరచుగా వైద్య ఖర్చులు, తగిన రవాణా సదుపాయం లేకపోవడం, ఆరోగ్య కేంద్రాలు దూరంగా ఉండడం వంటి కారణాల వల్ల ప్రసవానికి ముందు, ప్రసవం తరువాత పొందవలసిన ఆరోగ్య సేవలను పొందడంలేదు. గ్రామీణ భారతదేశంలోని గర్భిణీ స్త్రీల అవసరాలను తీర్చడానికి కేవలం ఆరోగ్య బీమాపై ఆధారపడిన ఆసుపత్రి సేవలు మాత్రమే సరిపోవు. తమ నివాస ప్రాంతలకు సమీపంలో, నిరంతరం అందుబాటులో ఉండే వ్యాధి నివారణ సేవలు కూడా అవసరం. కానీ ఆయుష్మాన్ భారత్ పథకంలో ఇటువంటి సేవలు అందుబాటులో లేవు.
భారతదేశంలో 60% పైగా ప్రసూతి మరణాలు పేద కుటుంబాలలో సంభవిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. జననీ సురక్ష యోజన వంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ, ప్రసూతి ఆరోగ్య సేవల పరిధి, నాణ్యత వంటి విషయాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు ప్రసవానికి ముందు కనీసం నాలుగు సార్లు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి తగిన వైద్య సహాయం పొందాలి. కానీ NFHS-5 ప్రకారం దాదాపు 24% గర్భిణీ స్త్రీలు ఈ సేవలు పొందలేదు.
గణాంకాలను చూసినప్పుడు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు మొత్తంగా మెరుగుపడ్డాయి. కానీ శక్తికి మించిన భారాన్ని మోస్తున్న ఆసుపత్రులు, ఆసుపత్రుల్లో తప్పని అనధికారిక చెల్లింపులు, పేలవమైన ఫాలో అప్ సేవలు వంటి సమస్యలను ఈ గణాంకాలు వెల్లడి చెయ్యవు. పేద మహిళలకు ఆరోగ్య సేవలు ఇప్పటికీ భరించలేనంత భారంగానే ఉన్నాయి. మొత్తం ఆరోగ్య వ్యయంలో ఇప్పటికీ దాదాపు 50% సొంతంగానే(Out of pocket spending) చెల్లించక తప్పడం లేదు. సమీప ఆరోగ్య కేంద్రం 20 కిలోమీటర్ల దూరంలో ఉండి, తీరా అంత దూరం వెళ్ళాక అక్కడ అవసరమైన సిబ్బంది, సదుపాయాలు లేకపోతే ఆర్భాటపు ఆరోగ్య పథకాల వల్ల వారికి కలిగే ప్రయోజనం ఏమిటి?
ఉద్యోగాలు చేసే వారికి శిక్షగా మాతృత్వం..
పట్టణ భారతదేశంలో పనులు, ఉద్యోగాలు చేసే తల్లులు మరో విధమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉపాధి కలిగిన వారిలో 90% వరకూ మహిళలు ఇంటి పనులు, భవన నిర్మాణం, వ్యవసాయం, ఫ్యాక్టరీలు వంటి చోట్ల అసంఘటిత కార్మికులుగా ఉన్నారు. వీరు ప్రసూతి ప్రయోజనాలు, చెల్లింపుతో కూడిన సెలవులు, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నారు. వీరికి ప్రసవం అనేది సామాజిక బాధ్యతగా కాకుండా వ్యక్తిగత భారంగా పరిగణించబడుతుంది. శిశు సంరక్షణా కేంద్రాలు, బిడ్డలకు పాలు తాగించడానికి విరామాలు వంటి సదుపాయాలు లేనందున, అనేకమంది మహిళలు జీవనోపాధి, పిల్లల సంరక్షణలో ఏదో ఒకటి ఎంచుకోవలసిన పరిస్థితి ఎదుర్కుంటున్నారు. ఈ సున్నితమైన సమస్యలపై రాజ్యం మౌనం వహించడం అంటే మాతృత్వాన్ని ఒక శిక్షగా మార్చడమే.
సంస్థల లాభాల కోసం ఆరోగ్య వ్యవస్థలు..
ప్రపంచవ్యాప్తంగా కూడా, మాతా శిశు మరణాలు నివారించగల విషాదంగా ఉన్నాయి. గతంతో పోల్చితే కొంత పురోగతి సాధించినప్పటికీ, నివారించగల గర్భధారణ, ప్రసవ సంబంధిత కారణాల వల్ల ప్రపంచంలో ఇప్పటికీ ప్రతి ఏడు సెకన్లకు ఒక తల్లి లేదా శిశువు మరణిస్తున్నారని WHO తెలియజేసింది. ఈ మరణాలలో దాదాపు 90% అల్ప- మధ్య ఆదాయ దేశాలలో సంభవిస్తున్నాయి. రుణభారం, అంతర్జాతీయ రుణ సంస్థల కఠినమైన ఆంక్షలు ఎదుర్కొంటున్న ఈ దేశాలలో ఆరోగ్య వ్యవస్థలు ప్రజల అవసరాలకోసం కాక బహుళజాతి సంస్థల లాభాల కోసం పనిచేస్తున్నాయి. అటువంటి దేశాలలో ఎవరు జీవించాలి, ఎవరు మరణించాలి అనేది మార్కెట్ నిర్ణయిస్తుంది.
విషాదాలన్నిటికీ ఒకే కారణం..
ప్రపంచమంతటా కనిపించే ఈ విడి విడి విషాదాలన్నింటికీ దండలో దారంలా ఉన్నది ఒకటే కారణం. అందేంటంటే ఆరోగ్య వ్యవస్థలపై పెట్టుబడిదారీ విధాన ఆధిపత్యం. ప్రజారోగ్య వ్యవస్థలు దీర్ఘకాలంపాటు నిధుల కొరతతో మూలుగుతుంటే ప్రైవేట్ ఆసుపత్రులు ప్రైవేట్ పెట్టుబడులతో పాటుగా ప్రభుత్వ పథకాల నుంచి అందే నిధులతో వృద్ధి చెందుతున్నాయి.
ఆయుష్మాన్ భారత్ వంటి బీమా పథకాలు గేమ్ చేంజర్లుగా అభివర్ణించబడుతున్నాయి. కానీ, అనేక సందర్భాలలో ఇవి రోగుల కంటే ప్రైవేట్ ఆసుపత్రులకే ఎక్కువ ప్రయోజనం చేకూర్చుతున్నాయి. తల్లీ పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని WHO తన సభ్య దేశాలను కోరినప్పటికీ ఆరోగ్యాన్ని ఒక మార్కెట్ సరుకుగా పరిగణించే వైద్య వ్యవస్థల నుంచి అంతిమంగా ఫార్మాస్యూటికల్ దిగ్గజాలు, హాస్పిటల్ చైన్లు, బీమా కంపెనీలే లాభం పొందుతాయి. నిత్యావసర ఔషధాల ధరలు విలాస వస్తువుల లాగా మార్కెట్ శక్తులు, పేటెంట్ గుత్తాధిపత్య సంస్థలు నిర్ణయిస్తాయి. ఆరోగ్య సంరక్షణ రంగంలో నూతనంగా వెలుగు చూస్తున్న డిజిటల్ ఆవిష్కరణలు ఆశాజనకంగా ఉన్నాయి. అయినప్పటికీ ఇవి కూడా కార్పొరేట్ లాభాల వేటలో మరో ఆయుధంగా మారుతున్నాయి.
మాతా శిశు ఆరోగ్యంపై WHO ప్రచారంలో ఎటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించడంలో అది విఫలమైంది. నివారించగల మరణాలతో తల్లీ బిడ్డలు చనిపోవడం అనేది ప్రమాదవశాత్తు జరుగుతున్నది కాదు. ఇది ప్రజల ప్రాణాలకంటే కంపెనీల లాభాలకు ప్రాధాన్యతనిచ్చే ఆర్థిక విదానాల ఫలితంగా చెప్పుకోవాలి. అటువంటి వ్యవస్థలో మాతా శిశు ఆరోగ్యం అనేది పదే పదే కనిపించే వార్తగానో, సంచలన ఫొటోగానో, కుబేరులు తమ దాతృత్వాన్ని నిరూపించుకునే అవకాశంగానో మారుతుంది. కానీ ఎప్పటికీ అదొక స్థిరమైన జాతీయ ప్రాధాన్యత కాదు.
డిమాండ్లు- అమలుకై పోరాటం..
‘ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనకమైన భవిష్యత్తుల’ గురించి ప్రభుత్వాలు నిజంగా చిత్తశుద్ధితో ఉంటే అవగాహనా ప్రచారాలు, నామమాత్రపు పథకాలు ఎంత మాత్రమూ సరిపోవు. వాస్తవం ఏమిటంటే సంక్షోభంలో కూరుకుపోయిన పెట్టుబడిదారీ వ్యవస్థకు లాభాల రేటు పడిపోకుండా చూసుకోవడమే ప్రభుత్వాల కర్తవ్యం. దానికోసం విద్యా వైద్యం వంటి రంగాలను, సహజ వనరులను కూడా కార్పొరేట్లకు అప్పజెప్పి, ప్రజలకు మాత్రం నినాదాలు, వాగ్ధానాలు ఇచ్చి సరిపెడుతున్నాయి.
ప్రభుత్వాల ప్రచార ఆర్భాటాలకు మోసపోకుండా మనం ఈ క్రింది డిమాండ్లను లేవనెత్తాలి. వాటి అమలుకై స్థిరంగా పోరాడాలి.
జీడీపీలో ప్రజారోగ్య వ్యయం తక్షణం మూడు రెట్లు పెంచాలి. ప్రజారోగ్య మౌలిక సదుపాయాలకు, ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి సంరక్షణలకు తగిన నిధులను కేటాయించాలి. ANM, నర్సులు, క్షేత్ర స్థాయి ఆరోగ్య సిబ్బందిని తగిన సంఖ్యలో నియమించి, వారికి న్యాయమైన వేతనాలు చెల్లించాలి. వేతనంతో కూడిన ప్రసూతి సెలవు, పని ప్రదేశాలలో శిశు సంరక్షణకు తగిన సదుపాయాలతో సహా ప్రసూతి హక్కులు అందరికీ కల్పించాలి. అన్నింటికంటే మించి లాభాలతో నడిచే ఆరోగ్య వ్యవస్థల స్థానంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యవస్థలను నిర్మించాలి.
ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాల నుంచి కేవలం నినాదాలు కాకుండా నిజమైన విధానాలను డిమాండ్ చేద్దాం. ప్రతి తల్లి మరణం ఒక రాజకీయ వైఫల్యమని, ప్రతి శిశువు మరణం పాలకుల తలక్రిందుల ప్రాధాన్యతలపై నిశ్శబ్ద నేరారోపణ అని ఎలుగెత్తి నినదిద్దాం. ‘ఆశాజనకమైన భవిష్యతులు’ నిజంగా సాధించాలంటే, ఆరోగ్యం అనేది కొందరికే అందుబాటులో ఉండే ఖరీదైన సరుకుగా, ఒక లాభదాయకమైన వ్యాపారంగా కాక, ప్రజలందరి హక్కుగా ఉన్న సమాజం కోసం మనం పోరాడాలి. దీని అర్థం పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించి, ప్రజల జీవితాలకూ, ఆరోగ్యానికీ ప్రధాన ప్రాధాన్యత లభించే సోషలిజమనే ‘ఆశాజనక భవిష్యత్తు’ నిర్మించుకునే ప్రయత్నంలో భాగం కావడమే.
డాక్టర్ ఎస్ సురేష్
ప్రోగ్రెసివ్ డాక్టర్స్ లీగ్
9392605395
(ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.