
బీహార్‌లో ఎన్నికల సంఘం ప్రారంభించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సుప్రీంకోర్టులో కొందరు పిటిషనర్లు సవాలు చేశారు. 2003 ఓటర్ల జాబితా ఆధారంగా ధృవీకరణపత్రాలను అడగడం వల్ల కోట్లాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని పిటిషనర్లు తెలియజేశారు. అయితే, ఈ కేసును జూలై 10న సుప్రీంకోర్టు విచారించనుంది.
న్యూఢిల్లీ: బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణను నిర్వహించాలని ఎన్నికల సంఘం(ఈసీఐ) నిర్ణయించింది. ఈ ప్రక్రియను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైయ్యాయి. వీటి మీద వెంటనే పరిష్కరించడానికి సుప్రీంకోర్టు సోమవారం(జూలై 7) అంగీకరించింది.
ఈ పిటిషన్లను సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, గోపాల్ శంకర్ నారాయణన్, షాదన్ ఫరాసత్ దాఖలు చేశారు.
రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఎంపీ మనోజ్ ఝా, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), పీయూసీఎల్, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్, లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా ద్వారా ఈ పిటిషన్లు వేయబడ్డాయి.
లైవ్‌లా ప్రకారం, పిటీషన్లలో నిర్ణీత పత్రాలతో పాటు ఫారమ్‌ను సమర్పించని ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తామని ఈసీ తెలిపిందని పేర్కొనబడింది. అయితే గత 20 సంవత్సరాలుగా ఓటర్లు ఓటు వేస్తున్నారని, అయిప్పటికీ ఈ ప్రక్రియ వల్ల ఎనిమిది కోట్ల మందిలో నాలుగు కోట్ల మందిపై ప్రభావం పడుతుందని తెలియజేయబబడింది.
సంబంధిత పిటిషన్లను జస్టిస్ సుధాంషు ధులియా, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం జూలై 7న విచారించింది.
ఆధార్ లేదా ఓటరు గుర్తింపు కార్డులను చెల్లుబాటు అయ్యే పత్రాలుగా ఎన్నికల సంఘం గుర్తించలేదని, అందువల్ల ఇంత తక్కువ సమయంలో ప్రక్రియను పూర్తి చేయడం దాదాపు అసాధ్యమని న్యాయవాదులు పేర్కొన్నారు.
రిపోర్ట్ ప్రకారం, తమ పిటీషన్ల కాపీలను కేంద్ర ప్రభుత్వానికి, భారత ఎన్నికల సంఘానికి ఇతర సంబంధిత పార్టీలకు ముందుగానే సమర్పించాలని పిటిషనర్లను సుప్రీంకోర్టు కోరింది. పిటిషన్ల కాపీలను భారత అటార్నీ జనరల్‌కు కూడా సమర్పించాలని కోర్టు పేర్కొంది.
విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది సింఘ్వీ మాట్లాడారు. జూన్ 24న జారీ చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నోటిఫికేషన్ బీహార్‌లోని కోట్లాది మంది పేద, అణగారిన ఓటర్లకు సమస్యాత్మకంగా మారనుందని అన్నారు. నిర్ణయిచబడిన కఠినమైన గడువు వల్ల ఓటర్లు ఇబ్బంది పడతారని చెప్పుకొచ్చారు. ఆధార్, రేషన్ కార్డులు కాకుండా ప్రజల వద్ద లేని ఇతర ధృవీకరణ పత్రాలను అడుగుతున్నారని తెలియజేశారు. అయితే సామాన్య ప్రజల వద్ద ఆధార్, రేషన్ కార్డులే ధృవీకరణపత్రాలుగా ఉంటాయని అన్నారు.
ఈ విషయంలో ఎన్నికల సంఘానికి నోటీసు జారీ చేయాలని కపిల్ సిబల్ కోర్టును కోరారు. అంతేకాకుండా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను త్వరితగతిన అమలు చేయడం వెనుక గల కారణాన్ని కమిషన్ వివరించేలా చూడాలని అభ్యర్థించారు. ఎందుకంటే, ఈ ప్రక్రియ వల్ల బీహార్‌లోని కోట్లాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇంకా దీనిని బీహార్ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇతర రాష్ట్రాలలో వేరువేరుగా తరువాత ప్రకటిస్తున్నట్టుగా పేర్కొన్నది.
ఈ పిటిషన్లపై జూలై 10న ధర్మాసనం విచారించనుంది.
ఒక రోజు ముందు, ఒక వార్తాపత్రిక కాలమ్‌లో ఎన్నికల కమిషన్ ప్రకటన అనుమానాస్పదంగా ఉందని మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా రాశారు. ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాల్లో పౌరసత్వ తనిఖీపై ఆందోళనకరమైన వాతావరణం నెలకొని ఉన్నప్పుడు, స్థానిక సంస్థల స్థాయిలో “ప్రక్షాళన” పేరుతో ఓటర్ల పేర్లను తొలగించారని గుర్తుచేశారు.
“బీహార్‌లో 2003 ఓటర్ల జాబితానే ఎందుకు ప్రాతిపదికగా తీసుకున్నారు. ఆ తర్వాత కూడా ఓటర్ల జాబితాలను సవరించారు?” అని లావాసా అడిగారు.
2003 ఓటరు జాబితాను “పౌరసత్వ భావనతో సహా అర్హతకు ప్రామాణికమైన రుజువు”గా పరిగణించాలని ఎన్నికల సంఘం సూచనలలోని పేరా 11ని ఆయన ఉదహరించారు. దీని ఆధారంగా, 2003 వరకు నమోదు చేసుకున్న పేర్లను మాత్రమే ఎందుకు సాక్ష్యంగా పరిగణిస్తున్నారనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు?
మరీ ముఖ్యంగా, భారతదేశంలో ప్రభుత్వం జారీ చేసిన పౌరసత్వానికి సంబంధించిన అధికారిక పత్రం లేనప్పుడు, పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పరీక్ష నిర్వహించే హక్కు ఎన్నికల సంఘానికి ఉందాని లావాసా అడిగారు.
ఆయన వార్తాపత్రికలో “ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ డాక్యుమెంటరీ ఆధారాలు, భౌతిక ధృవీకరణ ఆధారంగా పేర్లను చేర్చుతోంది. అంతేకాకుండా, పౌరసత్వ చట్టం ప్రకారం పౌరసత్వానికి సంబంధించిన ఎటువంటి రుజువును అడగలేదు. తమ ఓటు హక్కును ప్రజలు కోల్పోయే ప్రమాదం ఉన్న పరిస్థితిలో ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను అవలంబించాలా? లేదా తాను ముందు పరీక్షించబడిన ప్రక్రియకు కట్టుబడి ఉండాలా అనేది చర్చనీయాంశం” అని రాశారు.
“గత జాబితాలో పేర్లు ఉన్న ఓటర్ల పరిస్థితి ఏంటి, వారికి ఓటరు కార్డులు కూడా జారీ చేయబడ్డాయి. కానీ, ఇప్పుడు చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకపోవడం వల్ల వారిని మినహాయించారు? ఇప్పుడు వారి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా లేదా న్యాయవ్యవస్థ తీసుకుంటుందా?” లావాసా ప్రశ్నించారు.
2018లో అశోక్ లావాసా ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్నికల ప్రచార నియమాలను ఉల్లంఘించారని ఆయన అనేకసార్లు అసహనాన్ని వ్యక్తం చేశారు.
అనువాదం: వంశీకృష్ణ చౌదరి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.