
న్యూఢిల్లీ: భారత దేశంలో పెరుగుతున్న వాణిజ్య లోటును తీర్చడానికి రష్యా ముందుకు రావాలని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ బుధవారం(ఆగస్టు 20న) మాస్కోకు విజ్ఙప్తి చేశారు. అమెరికా సుంకాల హెచ్చరికలు జారిచేస్తున్నప్పటికీ, రాయితీపై భారత్‌కు ఇంధనం సరఫరాను కొనసాగిస్తామని మాస్కో హామీ ఇచ్చింది. అంతేకాకుండా, భారత్ చైనాలను కలిపి త్రైపాక్షిక చర్చలను త్వరలోనే నిర్వహించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
వాణిజ్యం, ఆర్దికం, శాస్రీయ సాంకేతికం, సాంస్కృతిక సహాకారంపై మాస్కోలో 26వ అంతర్-ప్రభుత్వ కమిషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సహా- అధ్యక్షత వహించడానికి జయశంకర్ మాస్కో వెళ్లారు. గడచిన నాలుగు సంవత్సరాలలో, 2024- 2025లో ద్వైపాక్షక వాణిజ్యం 2021లో 13 బిలియన్ డాలర్ల నుంచి 2024-25లో 68 బిలియన్ డాలర్లకు ఐదింతలు పెరిగింది. అయినా రష్యాతో భారత్ వాణిజ్య లోటు తొమ్మిదింతలు 58.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఈ సమస్యను మనం అత్యవసరమైనదిగా చూడాలని సమావేశం ప్రారంభంలో జయశంకర్ వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ యుధ్దానికి ముందు వరకు రష్యాతో భారతదేశ వాణిజ్యం చాలా కాలం సాఫీగా కొనసాగింది. పశ్చిమాసియాలోని సాంప్రదాయ ముడి సరఫరాదారులు తమ ఎగుమతులను ఐరోపాకు మార్చారు. దీంతో భారత్ తీవ్రంగా స్పందించి, రష్యా నుంచి రాయితీలో ఇంధనం కొనుగోలును పెంచింది. దీని వల్ల వాణిజ్యంలో కొంత పెరుగుదల ఏర్పడింది.
అంతర్ ప్రభుత్వ కమిషన్ ఏజెండాను జయశంకర్ ప్రస్తావిస్తూ, “టారిఫ్- నాన్టారిఫ్ అవరోధాలను తొలగిచడం, లాజిస్టిక్ లోపాలను సరిచేయడం, అంతర్జాతీయ ఉత్తర- దక్షిణ రవాణా కారిడార్, చెన్నై- వ్లాదివోస్తొక్ కారిడార్ వంటి అనుసంధాన ప్రాజెక్టులను విస్తరించి, సాఫీగా చెల్లింపులు సాగేందుకు చర్యలు తీసుకోవాలి” అని తెలియజేశారు.
ఫ్రీ ట్రేడ్ ఒప్పందం వైపుగా అడుగులు..
భారత్- యురేషియన్ ఎకనామిక్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందాన్ని త్వరతగతిన ముగించాలని జయశంకర్ కోరారు. అంతేకాకుండా, 2030 వరకు ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు పెరిగేందుకు, వ్యాపార లావాదేవీల లక్ష్యాలను సవరించాలని కూడా నొక్కి చెప్పారు.
ఇంటర్ఫాక్స్ వార్తా సంస్థ కోట్ చేసిన దాని ప్రకారం, సమావేశానికి సహ అధ్యక్షత వహించిన రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మంత్రోవ్ మాట్లాడారు. “భారత్‌కు ఓడల ద్వారా ముడి చమురు,పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు ఎగుమతులు కొనసాగుతాయి. దీంతో పాటు లిక్విఫైడ్ సహజ వాయువు ఎగుమతిని విస్తరించే అవకాశాన్ని కూడా మాస్కో పరిశీలిస్తుంది” పేర్కొన్నారు.
భారత్‌తో అణుఇంధనంపై మరింత లోతైన సహాకారాన్ని రష్యా కోరుకుంటుందని మంత్రోవ్ అన్నారు.
రష్యా ఎగుమతులతో ముడిపెట్టి, భారత్ ఎగుమతులపై 50శాతం సుంకాలు పెంచాలని వాషింగ్టన్ నిర్ణయించింది. అయినప్పటికీ బారత్‌కు ముడి చమురు సరఫరాలు సుస్ధిరంగానే ఉంటాయని న్యూఢిల్లీలో రష్యన్ అధికారులు ధీమా వ్యక్తం చేశారు.
తమ జాతి శ్రేయస్సు దృష్ట్యా అమెరికా చర్యలను అధిగమించే మార్గాలను మాస్కో- న్యూఢిల్లీ కనుగొంటాయని, రష్యన్ దౌత్యకార్యాలయంలోని చార్జి డి అఫేర్స్, రోమన్ బాబుష్కిన్ అన్నారు.
రాజకీయ పరిస్థతి ఎలా ఉన్నా చమురు ఎగుమతి మాత్రం అదే స్థాయిలో ఉండగలదని అంచనావేస్తున్నట్లు ఆయన విలేకరులకు చెప్పారు.
రష్యన్ ముడి చమురును రాయితీ ధరలకు ఇస్తున్న కారణంగా, భారత్‌కు ఇది ఎంతో “లాభదాయకమ”ని డిప్యూటీ ట్రేడ్ కమీషనర్ ఇవాగ్నిగ్రివా అన్నారు. ఇతర వనరుల కంటే కూడా 5% నుంచి 7% తక్కువ ధరతో సరఫరా సాగుతుందని చెప్పారు. ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరంగా ప్రవాహం కొనసాగించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని మాస్కో అభివృద్ది చేసిందని గ్రివా తెలియజేస్తూ, భారతీయ బ్యాంకుల్లో బిలియన్ల డాలర్లు చిక్కుక్కున్న కారణంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరించి రూపాయిలో చెల్లింపులను అంగీకరించడమైందని తెలియజేశారు.
న్యూఢిల్లీ- బీజింగ్‌ల మధ్య సంబంధాలలో సామరస్యం ఏర్పడితే గ్రేటర్ యురేషియన్ ఒప్పందంగా పిలువబడే దాని క్రింద భారత్- చైనాలతో త్రైపాక్షిక సహాకారాన్ని పునరుద్ధరించేందుకు అవకాశాలు ఏర్పడగలవని భారత్‌లో రెండవ సీనియర్ దౌత్యవేత బాబుష్కిన్ ఆశాభావాన్ని వెలిబుచ్చారు.
భారత ప్రధాన మంత్రి మోదీతో జరపనున్న వార్షిక సమావేశం కోసం రష్యన్ అధ్యక్షులు వ్లాదిమీర్ పుతిన్ ఈ ఏడాది చివర్లో న్యూఢిల్లీని సందర్శిస్తారని బాబుష్కిన్ చెప్పారు. అంతేకాకుండా చైనాలో అగస్టు 31 నుంచి ప్రారంభం కానున్న షాంఘాయి కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ- పుతిన్ సమావేశమవుతారని ఆయన తెలిపారు.
అనువాదం: ఘంటా రాజు
(ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.