
ఆరున్నర సంవత్సరాలపాటు జైలులో గడిపిన ఎల్గార్ పరిషత్ కేసు నిందితుడు మనదేశంలోని కారాగారాలు “అత్యవసర స్థితి”లో ఉన్నాయని కూడా చెబుతున్నాడు.
ముంబై: రోనావిల్సన్ చాలా కాలం నుండి ఖైదీల హక్కుల కోసం పని చేస్తున్న న్యాయవాది. అంతేకాకుండా రాజకీయ ఖైదీ అన్న పదానికి విశ్వనీయమైన ప్రచారకుడు కూడా. అయినాకూడా, ఎల్గార్ పరిషత్ కేసుకు సంబంధించిన సుదీర్ఘ జైలు జీవిత సమయంలో తనలో ఒక నైతిక సందిగ్ధతకు సంబంధించిన పెనుగులాట జరగడాన్ని ఆయన గమనించాడు.
మహారాష్ట్రలో పూనేలోని ఎరవాడ, నవీ ముంబైలోని తలోజా కేంద్రకారాగారాలలో ఆయన ఆరున్నరేండ్ల జైలు జీవితాన్ని గడిపాడు. జైలు జీవితంలో తన కార్యాచరణతో జైలు పరిధిలోనే తను చేసిన పరిశోధన వల్ల సరికొత్తగా- దగ్గర నుండి చూసిన అనుభవాలతో 53 ఏండ్ల రోనా ఇప్పుడు “రాజకీయ ఖైదీ” అనే పదాన్ని విభిన్నమైన దృక్పథంతో చూస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని ఎరుకతో కులము, మతము అనే ప్రమాణాలనుండీ పరిశీలిస్తున్నాడు.
భారతదేశ నేపథ్యంలో మరీ ముఖ్యంగా ప్రధానస్రవంతి సంభాషణల్లో “రాజకీయ ఖైదీ” అనే మాట వామపక్ష కార్యకర్తలతో ముడిపడి ఉంది. ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టయిన తొలి 16మంది మానవ హక్కుల కార్యకర్తలలో ఒకరైన రోనా ఇది సరైన అవగాహన కాదని వాదిస్తున్నాడు.
వలసవాద వ్యతిరేక పోరాటంలో నెహ్రూ, గాంధీలను కూడా రాజకీయ ఖైదీలుగా గుర్తించిన విషయాన్ని ఆయన గుర్తుకు తెస్తున్నాడు. ఈ పదానికున్న చరిత్రను వెలికితీస్తూ బహుశా ఐరిష్ జాతీయవాదులే మొదటగా తమకు రాజకీయఖైదీ హోదా కల్పించమని డిమాండ్ చేసిన వారని ఆయన నమ్ముతున్నాడు.
జైలులో గణనీయమైన కాలాన్నే తాను గడిపినందువల్ల ఈ అవగాహనని మరింతగా విస్తృతపరిచేందుకు ఆయన ఇటీవల ప్రయత్నిస్తున్నాడు. “రాజకీయఖైదీ” అంటే ఎవరూ అనే దాని చుట్టూ జరుగుతున్న వాదనలో “కనపడకుండా పోయిన చారిత్రక, సామాజిక నేపథ్యాల”ను, భారతీయ సమాజం వలస పూర్వ, వలసానంతర కాలాల్లో, కేవలం పుట్టుకను ఆధారంగా చేసుకొని సృష్టించిన ఒక ప్రత్యేకమైన “నేర వర్గీకరణ”ను ఆయన గుర్తిస్తున్నాడు.
సామాజిక పిరమిడ్ ను భగ్నం చేసేవాళ్లను ఈ తిరోగమన సమాజం శిక్షిస్తుంది.
దీనికిగాను జైలులో తన సహచరుడు మహేశ్ రౌత్ చేసిన పరిశోధనను ఆయన ఉపయోగించుకున్నాడు.
మహేశ్ గడ్చిరోలీకి చెందిన ఆదివాసీ హక్కుల కార్యకర్త. ఇంతకుమునుపు ఉనికిలో ఉన్న ప్రధాన మంత్రి గ్రామీణ అభివృద్ధి పరిశోధకుడు. జైలును ఆయన తన పరిశోధనశాలగా మార్చుకున్నాడు. ఆయన చాలా ఏండ్ల పాటు తలోజా జైలులో ఉండి, ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ కు లోబడి అరెస్టయిన వ్యక్తుల వివరాలను సేకరించాడు. ఈ చట్టాన్ని 2012లో పిల్లలపై లైంగిక వేధింపులు, దోపిడీ, బాధించడానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టారు. రౌత్ పరిశోధన వల్ల ఈ చట్టం కింద నిర్బంధానికి గురయినవాళ్ళు 80 శాతం మంది దళితులు, ముస్లీంలు, ఇతర నిమ్నవర్గాల ప్రజలుగా తేలింది.
“వీరిలో కొందరు వాస్తవంగానే నేరపూరిత చర్యలకు పాల్పడి ఉండవచ్చు కానీ చాలామంది కేవలం సామాజిక పిరమిడ్ ను భగ్నం చేయడం వల్లనే నేరస్తులుగా చూపబడ్డారు” అని ఆయన అన్నాడు.
“ఈ యువకులు తెలిసో తెలియకనో ఇతర కుల స్త్రీలతో ప్రేమ వ్యవహారాలు, లైంగిక సంబంధాలు ఏర్పరుచుకోవడం ద్వారా సామాజిక చలనాన్ని ఆశించారు. ఇది సామాజిక కట్టుబాట్లను ధిక్కరించడంగా భావించబడింది. ఈ అతిక్రమణని ఈ తిరోగమణ సమాజం శిక్షిస్తుంది. ఫలితంగా వారి చర్యలు వారిని జైలుపాలు చేశాయి” అని రోనా వివరించాడు.
మరీ ముఖ్యంగా కుల కట్టుబాట్లతో, తీవ్రమైన మతతత్వంతో విడిపోయి ఉన్న భారత సమాజంలో ఇలాంటి అతిక్రమణని రాజకీయచర్యగా అర్థం చేసుకునేందుకు రోనా ప్రయత్నం చేస్తున్నాడు.
ఆదివాసులు తమ భూమి హక్కు కోసం చేసే పోరాటాలను ప్రస్తావిస్తూ ఆదివాసీలు వారి నేల కోసం పోరాడుతున్నారు. ఒక ప్రత్యేకమైన భూభాగంలో పుట్టడంవల్ల వారు రాజకీయ ఖైదీలవుతారని ఆయన అన్నాడు. రాజ్యం నుండి, భూమిలోని సంపద్వంతమయిన ఖనిజాలను సొంతం చేసుకోజూసే కార్పోరేట్ల నుండి తమ భూమిని కాపాడుకొనేందుకు వారు పోరాటం చేయాల్సి వస్తుందని ఆయన గుర్తుచేస్తున్నాడు.
“కాలం గడిచేకొద్దీ అనేక సమూహాల సహజమైన జీవితము, సంచార జీవిత సమూహాలతో సహా నేరపూరితమవుతుంది” అని చెబుతూ వలస కాలంలో అమలు చేసిన బ్రిటీష్ వ్యాగ్రన్సీ యాక్ట్, ఇంకా దానిని పోలిన ఇతర చట్టాలను ఆయన ప్రస్తావించాడు.
“వీటన్నిటినీ లోతుగా అధ్యయనం చేయడనికి వలస కాలంలో రాజ్యం అవలంబించిన లీగల్ ఆర్కిటెశ్చర్ గురించి అవగాహన ఉండాలి. డీకోలనైజేషన్ గురించి అందరూ మాట్లాడుతున్నప్పటికీ అదే రకమైన లీగల్ ఆర్కిటెశ్చర్ ను ప్రస్తుత రాజ్యం కూడా అనుసరిస్తూంది” అని ఆయన అన్నాడు.
భారతీయ న్యాయ వ్యవస్థ నిర్బంధానికి గురైన ఏ వ్యక్తినీ “రాజకీయ ఖైదీ”గా గుర్తించలేదు. ఒక దశాబ్దం క్రితం దాకా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాజకీయఖైదీని ప్రత్యేక తరగతిగా గుర్తించి, పుస్తకాలు, ఆహారం, జైలు లోపల చోటూ కల్పించడం వంటి విషయాల్లో కొన్ని వసతులు కల్పించారు. కానీ 2013లో స్టేట్ జైల్ మాన్యువల్ నుండి ఈ తరగతి విభజనని తొలగించారు.
ఎల్గార్ పరిషత్ రాజకీయ కార్యాచరణని రాజ్యము తన ఆధిపత్యానికి అవమానంగా భావిస్తుంది
కారాగారంలో రాజకీయఖైదీల రాజకీయ వైఖరులకు చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుందని రోనా అంటాడు. పరిషత్ కేసులో తను గానీ, ఇతర ఉద్యమకారులుకానీ రాజకీయ కార్యాచరణకు దిగితే రాజ్యం దానిని తన “ఆధిపత్యానికి అవమానం”గా భావిస్తుంది. నిందితులను విరోధులుగా చూస్తున్నదని ఆయన అంటాడు.
2020ఫిబ్రవరిలో వేగంగా వ్యాపిస్తున్న కొవిడ్ పై పోరాడేందుకు బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. దీనికి కొన్ని వారాల ముందు పరిషత్ నిందితులను ఎరవాడ జైలు నుండి నవీముంబైలోని తలోజా జైలుకు తరలించారు. ఇక్కడ వారం వారం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసుకునే సదుపాయాన్ని జైలు అధికారులు ఆపి వేశారు.
అనేక విజ్ఞప్తుల తర్వాత, తమ కుటుంబ సభ్యులు ప్రెస్ తో మాట్లాడం ఆపేస్తే తిరిగి ఫోన్ సదుపాయం కలిగిస్తామని వారు అన్నారు.
“నేను నా కుటుంబ సభ్యులను ఎలా ఆదేశించగలను” అని రోనా అంటాడు.
సంవత్సరాలు గడిచేకొద్దీ హక్కుల కార్యకర్తలపై జైలు అధికారులు కొంత మెత్తబడ్దారు. కొన్ని సదుపాయాలను కూడా అందించారు. కానీ అవి వారు తమ నిరసనలను తెలపకుండా ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఎల్గార్ పరిషత్ కేసు ఉద్యమకారులు ఒకసారి నిరసనలకు దిగితే దాని ప్రభావం జైలులో వెల్లువ మాదిరిగా ఉండేది. జైలులో ఉండే ఇతర ఖైదీలూ గొంతేత్తేవారు. ఇది జైలు అధికారులకు ఎంతమాత్రమూ నచ్చదు.
జైలులో పరిషత్ నిందితులు నిరసనలను తెలపడం ద్వారా మహారాష్ట్ర జైలు మాన్యువల్ ప్రకారం రోజుకు 13 లీటర్ల నీరు, అంటే 9 బకెట్లు మొత్తంగా పొందేలా చేసుకోగలిగారు.
“జైలులో వివక్ష తీవ్రంగా ఉంటుంది. మాకు రావలసిన నీళ్ళ కోటాను మేము పొందుతుంటే, ఇతరులు మాత్రమూ ఒకటి లేదా అర బకెట్ నీళ్ళతోనే సరిపుచ్చుకోవాల్సి ఉండేది. ఆ కొద్ది మొత్తం నీళ్ళతో జైలులో గడపడం అంటే అక్కడి జీవన పరిస్థితులు ప్రతీ ఒక్కరికీ దుర్భరంగా మారడమే” అని ఆయన అంటారు.
ఒక్కో బ్యారక్ లో ఉండే నాలుగు మరుగు దొడ్లలో రెండు మాత్రమే పని చేస్తాయి. ఇది జైలులో అలిఖిత నియమంగా ఉంటుంది. జైలు బ్యారక్ కు దగ్గరగా ఉండే మరుగు దొడ్డిని వాడకుండా వదిలేస్తారు. ఈ జాగ్రత్త తీసుకుంటేనే అక్కడ నుండి వచ్చే దుర్వాసన బ్యారక్ కు చేరకుండా ఉంటుంది.
కరోనా సమయంలోనూ ఆ తర్వాతా జైలులో గడపడం వల్ల రోనా భారత దేశంలో ఉన్న జైళ్ళ గురించి ఒక మాట అంటారు. “కరోనా వంటి అంటువ్యాధులతో సంబంధం లేకుండానే మన జైళ్ళు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాయి.”
శారీరక దండన ద్వారా జోక్యం చేసుకోవడం అనే విధానాన్ని అనుసరించి ఇవి పని చేస్తాయి. కాబట్టే ఖైదీలు తమకు వ్యతిరేకంగా ఉన్న విధానాలకు వ్యతిరేకంగా తమను తాము సమీకరించుకుంటుంటారు. కానీ వీరిని జైలు అధికారులు లొంగదీసుకుంటారు. “ఈ బంధీలు ఆందోళనా జీవులు( ప్రధాన మంత్రి మాటల్లో) ఎంతమాత్ర్రమూ కాదు. వీరు ఎన్నడు కూడా సంఘాలలో కలిసి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు కాదు. వీళ్ళు సాధారణ మనుషులు.”
వాళ్ళు ఒక్కటిగా జమకూడినపుడు వ్యవస్థ ఒకసారిగా నిద్దుర లేస్తుంది. వాళ్ళ వీపులను పగలగొట్టడం, ప్రోత్సాహకాలను నిలిపివేయడం, ఒకరికి మరొకరిని వ్యతిరేకంగా ఉసిగొల్పడం జరుగుతుంది. చివరకు జైలు అధికారులు “ఇదంతా బాగుచేయలేని ఆ16మంది పనని మమ్మల్ని నిందిస్తారు.” అని ఆయన అంటాడు.
జైలులో చేసే కొన్ని నిరసనలు వ్యక్తిగత ప్రయోజనాలకు, మరికొన్ని అందరి బాగుకు దారి చూపుతాయి
కిందటి ఏడాది మధ్యలో రోనా, అతని సహచరుడు ప్రొఫెసర్ హనీ బాబు, జైలు క్యాంటిన్ లో తడి పొడి వస్తువుల ఆకస్మిక ధరల పెరుగుదలకూ, అవినీతికీ వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముందున్నారు.
మొదట కొంతమంది ఈ ఉద్యమకారులకు మద్దతుగా వచ్చారు. కానీ జైలు అధికారుల ఒత్తిడితో వారు వెనక్కి తగ్గారు. చివరకు నిరసన ఫలితంగా ఎల్లార్ పరిషత్ నిందితుల కోరికలను అంగీకరించారు. కానీ ఈ ఫలితాల నుండి మిగిలిన ఖైదీలు మినహాయించబడ్డారు.
“ఒక కిలో మాంసం బదులు 400గ్రాములు అనే లెక్కతో సరైన పరిమాణంలో మాకు ఆహారం అందింది. కానీ ఇతరులకు మాత్రం పాత లెక్కలే కొనసాగాయి. కొన్ని పోరాటాలు వ్యక్తిగత ప్రయోజనాలను కలిగిస్తే మరికొన్ని అందరి బాగుకూ తోడ్పడతాయని ఇక్కడ సంవత్సరాలు గడిచేకొద్దీ నాకు అర్థం అయింది” అని రోనా తెలిపారు.
ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టయిన అందరి మాదిరిగానే రోనాకూడా మహారాష్ట్రలోని తలోజా జైలులోనూ, ఇతర జైళ్ళలోనూ కోర్టు ముందు హాజరు పరిచే పద్దతి విఫలమవడంతో- దానికి వ్యతిరేకంగా పోరాడాడు. జైలులో తాను బంధీగా ఉన్నంత కాలమూ కోర్టుకు తీసుకపోవడానికి గానీ, ఆసుపత్రికి తీసుకపోవడానికి గానీ తగినంత ఎస్కార్ట్ ఉన్నట్టుగా తనకు గుర్తు లేదని ఆయన అన్నాడు.
ఈ విషయంలో వారు నిరసనలు తెలుపుతూ వచ్చారు. కానీ కిందటి నెలలో నవీ ముంబైలోని కోల్డ్ ప్లే ప్రదర్శన సందర్భంగా సిబ్బంది అక్కడ విధులను నిర్వహించాలనే పేరుతో మొత్తంగా జైలులోని ఏ ఒక్క ఖైదీనీ బయటకు తీసుకపోలేమని అన్నప్పుడు మాత్రం వీరు చేసిన నిరసన విజయవంతమయింది.
“ఈ విషయంలో మేము ఊరుకోమన్న సంగతి జైలుఅధికారులకు తెలుసు. ఇతర ఖైదీలలోనూ నిరసన స్పష్టంగా కనపడుతున్నది. అప్పుడు మేము చేసిన నిరసన సానుకూల ఫలితాలనిచ్చింది. అప్పటినుండీ చాలా మంది బంధీలకు వారివారి తేదీల ప్రకారం కోర్టులకూ, ఆసుపత్రులకూ ఎస్కార్ట్ తో పోవడానికి అనుమతి దొరికింది” అని అన్నారు.
రోనా సహ నిందితుడు, సీనియర్ న్యాయవాది సునీల్ గాడ్లింగ్, సాంస్కృతిక కార్యకర్త సాగర గోర్కే ఇదే విషయంలో బాంబే హైకోర్ట్ లో పిటీషన్ కూడా వేశారు.
రోనా చదువును కొనసాగించాలనుకుంటున్నాడు. కానీ తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నాడు.
రోనా కేరళ వాసి అయినప్పటికీ, తన వయోజన జివితమంతా విద్యార్ధిగానూ ఆ తర్వాత హక్కుల కార్యకర్తగానూ దాదాపుగా ఢిల్లీలోనే గడిపాడు.
2003లో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సయ్యద్ అబ్దుల్ రహమాన్ జిలానీ పార్లమెంట్ పై దాడి కేసులో అరెస్టయి దీర్ఘకాలపు జైలు జీవితాన్ని గడిపి, చివరకు తనపై మోపిన ఆరోపణలు నిరాధారమని తేలడంతో విడుదలయ్యాడు. జిలానీ విడుదలయిన తర్వాత రోనాతో కలిసి “కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్” ను ఏర్పరచాడు. ప్రొఫెసర్ సాయిబాబా విడుదలకు ఈ కమిటీ పెద్దఎత్తున ప్రచారాన్ని నిర్వహించింది. 2018లో రోనా అరెస్టయిన తర్వాత జిలానీ(అక్టోబరు,2019), సాయిబాబా(అక్టోబరు2024), ఇద్దరూ చనిపోయారు.
“జిలానీ నాకు పెద్దన్న లాంటి వాడు. ఆయన చనిపోయిన నెల గడచిపోయాకకానీ నాకు ఆ సంగతి తెలియలేదు. నేను జైలు నుండీ బయటకు వచ్చాక మొదటగా కలిసింది జిలానీ కుటుంబాన్నే. జిలానీ కొడుకు అతీఫ్ కు ఈ మధ్యనే పెండ్లి నిశ్చయమయింది. కూతురు విదేశాల్లో డాక్టరేట్ చేస్తున్నది”అని రోనా ఉద్వేగంగా చెప్పాడు.
రోనా కూడా డాక్టరేట్ చేయాలనుకుంటున్నాడు. JNUలో M Phil పూర్తయిన తర్వాత తను డాక్టరేట్ కు కూడా నమోదు చేసుకున్నాడు. కానీ సరిగ్గా అప్పుడే పార్లమెంట్ పై దాడి కేసు విచారణ జరుగుతున్నది. “జిలానీకి మద్దతుగా రక్షణ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించేందుకు దృష్టి పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను” అని తను చెప్పాడు.
ఇప్పుడు నేను బయటకు వచ్చాను. నా చదువునిక కొనసాగిస్తానని ఆయన అన్నాడు.
ఇప్పటికయితే కేసు విచారణ ముగిసేదాకా, లేదా బెయిల్ నిబంధనలు మారే వరకూ తను ముంబై నగర పరిధిలోనే ఉండాల్సి ఉంటుంది. దీనికిగానూ వెస్టర్న్ సబర్బ్ లోని కమ్యూనిటీ రిట్రీట్ లో తాత్కాలికంగా నివాసాన్ని సంపాదించుకోగలిగాడు. దేశవ్యాప్తంగా ఉన్న అతని స్నేహితులు, బంధువులు అతనని కలుస్తున్నారు.
కానీ వయసులో పెద్దదయిన తన అమ్మ, తను అరెస్టయినప్పటినుండి జబ్బుపడి కదలలేకుండా ఉంది. “నా అరెస్ట్ ఆమె మీద గాఢమైన ప్రభావాన్నే వేసింది. ఆమె బాగా బలహీనమయిపోయింది. ఆమె ముంబైకి రాలేదు. నేను ఈ నగరాన్ని వదిలి వెళ్లలేను. ఆమె ఆరోగ్యం కోసం నేను ఆందోళన పడుతున్నాను” అని ఆయన అన్నాడు.
-సుకన్యా శాంత
అనువాదం : నాగరాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.