
ఇప్పటికే కులాధారిత రిజర్వేషన్లు అనుభవిస్తున్న సామాజిక తరగతులలో ఆర్థికంగా వెనుకబడిన వారికి, ఇప్పటికీ రిజర్వేషన్ ఫలాలు పొందలేని వారికి ప్రాధాన్యత ప్రాతిపదికన రిజర్వేషన్లు వర్తింపజేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ఈ వ్యాజ్యంపై స్పందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిల ధర్మాసనం ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేస్తోంది.
దిశా నిర్దేశం..
నోటీసులు ఆదేశించిన తర్వాత పిటీషనర్ను ఉద్దేశించి మాట్లాడుతూ, “జస్టిస్ సూర్యకాంత్ వచ్చే వాయిదా నాటికి వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉండాలి.
ఈ ప్రతిపాదనపై తీవ్రమైన ప్రతికూలత వ్యక్తం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి” అని హెచ్చరించారు.
పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు పిటిషన్ల తరఫున న్యాయవాది “ఈ ప్రజాప్రయోజనం వ్యాజ్యంలో రిజర్వుడు తరగతుల వారికి నిర్దిష్ట ఆర్థిక ప్రాతిపదికను నిర్ధారించడం ద్వారా రిజర్వేషన్లు అర్హులైన వారికి, నిజంగా వెనుకబడిన వారికి అందించేలా చేయవచ్చ”ని పేర్కొన్నారు.
దీనికి స్పందనగా జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ “అంటే మీరు కులాధారిత రిజర్వేషన్లను తప్పు పట్టడం లేదు. రాజ్యాంగం కులాల ప్రాతిపదికన కల్పించిన రిజర్వేషన్లను చట్టబద్ధమైనవని అంగీకరిస్తూనే, కాలక్రమంలో రిజర్వేషన్ల ద్వారా లబ్ది పొందిన కొందరు తమ సామాజిక ఆర్థిక స్థాయిని మెరుగుపరుచుకుంటే, వారే రిజర్వేషన్ ఫలాలు నిరంతరం పొందేలా ఉన్న విధానాన్ని సవరించి అదే సామాజిక తరగతులు రిజర్వేషన్స్ సదుపాయాలు పొందని వారికి, సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగు పడని వారికి రిజర్వేషన్లు అందేలా చూడాలని ప్రతిపాదిస్తున్నారు. అంతేనా” అని ప్రశ్నించారు.
అభివృద్ధి లక్ష్యంగా రిజర్వేషన్లు..
రిజర్వేషన్లు యావత్ సమాజాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రూపొందించినప్పుడు, దాని ఫలితాలు సమాజంలోని అందరికీ అందుబాటులో ఉండాలా? లేక కొందరికి పరిమితం కావాలా అన్న విషయాన్ని రాగద్వేషాలకు అతీతంగా పరిశీలించేందుకు సిద్ధమని ధర్మాసనం ప్రకటించింది.
ఇంకా తేలిక పాటి భాషలో చెప్పాలంటే, రిజర్వేషన్లకు అర్హులైన సామాజిక తరగతులలోనే రిజర్వేషన్లు సమాన నిష్పత్తిలో సమన్యాయ సాధన దిశలో అమలు జరగాలని పిటిషనర్లు ప్రతిపాదించారు.
ఇలా ఆయా సామాజిక తరగతులలో ఎక్కువ మందికి న్యాయం జరగాలంటే, ఆ తరగతికి లోబడి అమలయ్యేలా ఆర్థిక ప్రాతిపదికను కూడా రూపొందించాలని పిటిషనర్లు తమ వాదనలో చెప్పారు.
అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సామాజిక తరగతులలో కూడా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు జరిపే విధానాన్ని రూపొందించాలన్నది పిటిషనర్ల వాదన.
రిజర్వేషన్లు పొందే సామాజిక తరగతులలోని మరింత వెనుకబడిన వారిని ఉపతరగతులుగా భావించి, వారికి రిజర్వేషన్ ఫలాలు అందుబాటులోకి వచ్చే విధంగా నిర్దిష్ట ప్రాధాన్యత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు జరిగేలా చూడాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.