
ఈ ఏడాది మార్చి 13న ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ పేరుతో ఒక సర్క్యులర్‌ను విడుదలైంది. అందులో తెలిపిందేంటంటే వీసీ, రిజిస్ట్రార్, ఓఎస్డీ, ప్రిన్సిపల్స్, విభాగాధిపతులు, శాఖధిపతుల కార్యాలయాల ఆవరణలో విద్యార్థులు ట్రెస్పాస్ నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేయకూడదని, నినాదాలు సైతం ఇవ్వకూడదని, అసభ్యకర బూతు పదజాలాన్ని వాడకూడదని, ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇవి చేయడం వల్ల వందేళ్ల ఓయూ ప్రతిష్ట దిగజారుతుందని, ఆ ప్రతిష్టను కాపాడేందుకే పలు నిబంధనలతో కూడిన ఈ సర్క్యులర్‌ను విడుదల చేశామని అధికారులు పేర్కొన్నారు.
అయితే, ఈ సర్క్యులర్ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్( ఔటా )తో పాటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, నాన్ టీచింగ్ స్టాఫ్ సైతం ఖండించారు. ఇక్కడే విద్యను అభ్యసించి, ప్రస్తుతం తెలంగాణ పౌర సమాజంలో తమవంతు పాత్రను పోషిస్తున్న పలువురు ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, న్యాయవాదులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, మేధావులందరూ తమ భావజాలానికి అతీతంగా ముక్తకంఠంతో ఈ సర్క్యులర్‌ను తప్పుబట్టారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు గత 25 రోజులకు పైగా సర్క్యులర్‌ను రద్దు చేయాలని వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నా వర్సిటీ అధికారులు తమ పొరపాటును చక్కదిద్దుకోకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు.
అసలు ప్రతిష్ట అంటే ఏంటి? ఓయూకు ఆ ప్రతిష్ట ఎలా వచ్చింది? ప్రతిష్ట, ప్రస్తుత నిషేధాజ్ఞలకు ఉన్న సంబంధం ఏమిటీ? విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నాలు, నిరసనలు, నినాదాలు చేయడం వల్ల వర్సిటీ ప్రతిష్ట నిజంగానే దిగజారుతుందా ? ప్రతిష్ట పేరుతో ఏదైనా కుట్ర దాగి ఉందా ? నిర్బంధానికి అకాడమిక్ ఫ్రీడంకు ఉన్న సంబంధం ఏంటి? ఓయూ పై నిషేధాజ్ఞల విషయంలో పాలకుల పాత్ర ఏంటి? అందులో వీసీల వైఖరి ఏంటి ? అనే మౌలికమైన ప్రశ్నలు వేసుకుంటే నిషేధాజ్ఞల వెనక దాగిన నిజం ఏంటో ప్రస్ఫుటమవుతుంది.
అకాడమిక్ ఫ్రీడం..
ప్రతిష్ట అంటే గౌరవం, పేరు, కీర్తి, లేదా సామాజిక స్థానం అని అర్థం. ఇది సాధారణంగా ఒక వ్యక్తి, సంస్థకు లభించే విశిష్టతను తెలుపుతుంది. ఉస్మానియా వర్సిటీ 1917లో ప్రారంభించబడింది. అప్పటి నుంచి తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, అస్తిత్వ, సాంస్కృతిక సమస్యలను పరిష్కరించే ఒక వేదికగా వర్సిటీ నిలుస్తోంది. వందేమాతర ఉద్యమం నుంచి తెలంగాణ సాధన వరకు ఓయూ పాత్ర అత్యంత కీలకమని చెప్పవచ్చు. దీంతోనే గౌరవం, పేరు, కీర్తి, విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభించి, ప్రతిష్ట పెరుగుతూ వచ్చింది.
కేవలం విద్యా బోధన, పరిశోధన ఆధారంగానే ప్రతిష్ట పెరగలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సామాజిక చలనంలో వచ్చిన విశేష మార్పులను ప్రత్యక్షంగా చూసి, భాగస్వామ్యమైన సందర్భాలు అనేకం. ఫలితంగా వర్సిటీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. క్యాంపస్‌లో ఉద్యమాలు జరగడం వల్లే ఓయూ ప్రతిష్ట దిగజారిపోతుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఈ ప్రచారంలో పాలకుల కుట్ర కోణం దాగి ఉంది.
అకాడమిక్ ఫ్రీడమంటే విద్యా బోధన, పరిశోధన, విమర్శనాత్మక ఆలోచనల విషయాల్లో ప్రొఫెసర్లు, విద్యార్థులకు- రాజ్యం, సమాజం, సంస్థాగత నిబంధనలు, ప్రజల ఒత్తిడిలో ఎలాంటి జోక్యం లేకుండా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి, చర్చించడానికి, విమర్శించడానికి, ప్రొఫెసర్లు పలు దృగ్విషయాలను బోధించడానికి, విద్యార్థులు సైతం అధ్యయనం చేయడానికి విమర్శనాత్మక స్వేచ్ఛ ఉండటాన్నే ‘అకాడమిక్ ఫ్రీడం’ అంటారు. ప్రస్తుత ఓయూ అకాడమిక్ ఫ్రీడం పరిస్థితి అధ్వానంగా మారింది. రాజనీతి శాస్త్రంలో అంతర్జాతీయ అంశాలు పరిశోధన చేసే విద్యార్థికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనలను విమర్శనాత్మక ధోరణితో, పక్షపాత ధోరణికి తావివ్వకుండా ఆయా అంశాలను పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే విద్యార్థులు ఇటీవల ఇజ్రాయిల్ పాలస్తీనాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం అతి ముఖ్యమైనదిగా గ్రహించారు. ఈ తరహా అంశాలను ఉమ్మడిగా చర్చించడానికి విద్యార్థులు ముందుకు వచ్చారు. అయితే ఇజ్రాయెల్ వంటి అంశాన్ని చర్చించేందుకు వర్సిటీలో తాము అనుమతి ఇవ్వలేమని స్వయంగా ప్రొఫెసర్లే చెబుతుండటం గమనార్హం. ఈ విషయంలో పై అధికారులు, పోలీసుల నుంచి తమకు ఆంక్షలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. అయితే ఇదే వర్సిటీ 1980వ దశకంలో పాలస్తీనా స్వతంత్ర సమరయోధుడు యాసర్ అరాఫత్ పోరాట పటిమను గురిస్తూ ‘గౌరవ డాక్టరేట్’ను ప్రదానం చేసిన విషయాన్ని ఓయూ అధికారులు మర్చిపోవడం బాధాకరం.
వీసీల వైఖరి..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014- 16 వరకు ఓయూతో పాటు మిగతా వర్సిటీలకు అప్పటి టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్) ప్రభుత్వం వీసీలను నియమించలేదు. 2016లో ప్రొఫెసర్ ఎస్ రామచంద్రంను ఓయూ తొలి వీసీగా నియమించింది. ఆయన వీసీగా ఉన్నప్పుడే పలు వివాదాలు తలెత్తాయి. అయితే, ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మాత్రం సభలు, సమావేశాల నిర్వహణలకు ఆంక్షలు విధించలేదు. ఇది హర్షించే అంశం. రామచంద్రు నిత్యం పరిపాలన భవనంలో అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి మార్గం చూపేవారు. అధికారిక నివాస గృహంలోకి కూడా విద్యార్థులకు అనుమతి ఇచ్చి సమస్యలు పరిష్కరించిన దాఖలాలు ఉన్నాయి. రామచంద్రం పదవి కాలం 2019లో ముగిసింది. ఆ తర్వాత రెండేళ్ల వరకు ప్రభుత్వం వీసీని నియమించకుండా కాలం వెల్లదీసింది. పూర్తి కాలపు వీసీని నియమించాలని విద్యార్ధులు ఒత్తిడి పెంచగా 2021 ప్రొఫెసర్ డి రవీందర్ వీసీగా నియమితమయ్యారు. ఆ వెంటనే తెలంగాణ ప్రాంతానికి చెంది, మలి ఉద్యమంలోనూ పాల్గొన్న సెక్యూరిటీలను తొలగించారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన ‘బి’ సెక్యూర్ అనే సెక్యూరిటీ సంస్థలో ఉద్యోగం చేసి, పదవీ విరమణ పొంది, పెన్షన్ పొందుతున్న ఆర్మీ ఉద్యోగులను సెక్యూరిటీగా నియమించారు. అయితే, వారు విద్యార్థుల రక్షణను గాలికి వదిలి వీసీ, రిజిస్ట్రార్, ఓస్డీ, ప్రిన్సిపల్స్, ఇతర పరిపాలనా అధికారులకు రక్షణ కల్పించడమే పరమావధిగా భావించారు. విద్యార్థులు, ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, వర్కర్స్ రక్షణను పట్టించుకోలేదు.
ఇదిలా ఉంటే ‘ఆర్ట్స్ కాలేజీ కాలేజీ ఆవరణలో సభలు, సమావేశాలు నిర్వహించరాదని, హాల్స్‌లో కూడా నిర్వహించవద్దంటూ, మరికొన్ని హాల్స్ల అనుమతికి భారీగా చార్జీలు విధిస్తూ వీసీ రవీందర్ ఒక సర్క్యులర్‌ను జారీ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఈ వీసీని కలవాలంటే ఒక యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉండేది. వర్సిటీలకు స్వయంప్రతిపతి ఉన్నా, అన్నింటికీ యూజీసీ రూల్స్ వర్తిస్తాయని చెప్పే సదరు వీసీ మాత్రం ప్రొఫేసర్లకు సీనియర్ ప్రొఫేసర్లుగా పదోన్నతులు కల్పించి, యూజీసీ నిబంధనలను తుంగలో తొక్కారు. ఇలా పదోన్నతి పొందిన వారిలో వీసీ రవీందర్ కూడా ఉండటం గమనార్హం.
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఇంత నిర్బంధం ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగితే తెలంగాణ వచ్చేదానే సందేహం కలుగుతుంది. గత తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ పాలనలో వీసీల ప్రవర్తన ఇలా ఉంటే, ప్రజాపాలన అంటూ ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ 2024లో ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కుమార్ మొలుగారంను కొత్త వీసీగా నియమించింది. నూట ఏడేళ్ల వర్సిటీ చరిత్రలో తొలిసారిగా దళిత(మాదిగ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి వీసీగా అవకాశం లభించింది.
గత వీసీ చేసిన తప్పులను ఇతను సరిదిద్దుతాడని అందరూ ఆశించారు. కానీ, ఆయన వైఖరి భిన్నంగా ఉందని ఆరు మాసాల్లోనే తేలిపోయింది. వివిధ సమస్యలపై కలిసేందుకు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లు ప్రయత్నించగా వీసీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. గత ‘బి’ సెక్యూర్ సెక్యూరిటీ సంస్థ ఇప్పుడు సహారా సెక్యూరిటీగా పేరు మార్చుకుంది. కానీ, రక్షణ విషయంలో మార్పు లేదు.
ఇటీవల సాయంత్రం 6 గంటల తర్వాత మహిళా విద్యార్థిని సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘిస్తూ(మహిళా సెక్యూరిటీ ) లేకుండా వాహనంలోకి ఎక్కించారు. ఇదేమిటని ప్రశ్నించిన ఓ పరిశోధక విద్యార్థితో సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఇక, దివ్యాంగ విద్యార్థులు తమ సమస్యను పరిష్కరించాలని వీసీ కార్యాలయంలో నిరసన తెలిపే మానవత్వం మరిచిన అధికారులు పోలీసులతో కేసులు నమోదు చేయించారు. దివ్యాంగుల భవిష్యత్ గురించి ఆలోచించకపోవడం అత్యంత బాధాకరం. 2017- 18లలో పీహెచ్డీ అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఆన్లైన్ జర్నల్స్‌ని యాక్సిస్, లైబ్రరీ సౌకర్యం లేదు. రీసెర్చ్ మెథడాలజీ కోర్సును బోధించలేదు. పైగా కరోనా కాలంలో విద్యార్థులు రెండు సంవత్సరాలు విలువైన పరిశోధన సమయాన్ని కోల్పోయారు. ఈ కారణంగా విద్యార్థులు తమకు మరింత గడువు కావాలని విద్యార్థులు కోరుతున్నారు. గత వీసీ రవీందర్ తరహాలోనే పీహెచ్డీ సబ్మిషన్కు ఒక తేదీని డెడ్ లైన్‌గా విధించారు. లేదంటే డాక్టరేటు డిగ్రీని రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. పీహెచ్డీ కోర్సు ఫీజులను తగ్గించాలని, అడ్మిషన్లను పెంచాలని కోరినా పట్టించుకోవడం లేదు. ఫలితంగా యూజీసీ అందించే నేషనల్ ఫెలోషిప్లను కోల్పోపోతున్నారు. నాణ్యమైన భోజనం, హాస్టళ్లు, లైబ్రరీలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అడిగితే పట్టించుకోవడం లేదు. వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించకుండా ప్రతిష్ఠ గురించి మాట్లాడటం సరికాదు.
ప్రభుత్వాల పాత్ర
స్వరాష్ట్రంలో తొలిసారిగా పాలన పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్, తొలుత ఉస్మానియా వర్సిటీని ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ స్థాయిల్లో అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికింది. అయితే, కేసీఆర్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వర్సిటీకి అరకొర నిధులు కేటాయించింది. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహించింది. అంతటితో ఆగకుండా విశ్వవిద్యాలయాన్ని నిర్బంధ వలయంగా మార్చారు. ఇక 2017లో ఓయూ వందేళ్ల వేడుకల్లో పాల్గొనేందుకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరు కాగా, విద్యార్థులను నిర్బంధించారు. ఆరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన కేసీఆర్, ఒక మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వెనుతిరిగారు. అంటే పరిస్థితి ఆనాడు ఏవిధంగా ఉందో ఒక్కసారి అర్ధం చేసుకోవచ్చు.
అంతే కాకుండా ఐదు ప్రైవేటు వర్సిటీలను నెలకొల్పారు. గతంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నేతలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మారువేషంలో హాజరయ్యారంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సైతం ఓయూలోకి అనుమతించకుండా ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తీర్మానించే విధంగా అప్పటి వీసీపై ఒత్తిడి తెచ్చారనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యాన్ని నిరసిస్తూ ఆనాడు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ చేపట్టిన వినూత్న నిరసన తీవ్ర చర్చకు దారి తీసింది.
అయితే, తమ ఏడో గ్యారంటీ ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం ఏడో గ్యారంటీకి సమాధి కట్టే విధంగా అడుగులు వేస్తుంది. ‘ప్రజా పాలన’ మొదలైందంటూ ప్రగతి భవన్ చెంత ఉన్న ముళ్లకంచెలను తొలగించినప్పుడు, ఆ చర్యను అనుసరిస్తూ ఉస్మానియా విద్యార్థులు ఓయూ పరిపాలన భవనం చుట్టున్న ముళ్ల కంచెలను కూడా తొలగించాలని నిరసనలు తెలిపారు. అధికారులు తొలగించగా కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం గొప్పగా చెప్పుకుంది. ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో సభలు, సమావేశాల నిర్వహణ అనుమతి హామీని తుంగలో తొక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో విద్యార్థి, నిరుద్యోగుల పాత్ర కీలకం. ఈ విషయాన్ని మరిచిన రేవంత్ రెడ్డి, గత పాలకుల బాటలో నడుస్తూ ఉస్మానియా వర్సిటీపై ఆంక్షలు విధిస్తున్నారు.
తరగతి గదులు, వసతి గృహాలు, లైబ్రరీలోకి ప్రవేశించి అరెస్టు చేయడం బహుశా ‘ప్రజా పాలన’లోనే చోటు చేసుకుందని తేలిపోయింది. వర్సిటీలకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి, అభివృద్ధి చేస్తామన్న వాగ్దానం అటకెక్కింది. పూర్వం జరిగిన ఒకట్రెండు సంఘటనలు చూపిస్తూ ఓయూలో విద్యార్థి సంఘాల ఎన్నికలకు స్వస్తి పలికారు. విద్యార్థులు కలిసేందుకు ప్రస్తుత వీసీ సమయం ఇవ్వరు. ఇలా విద్యార్థుల హక్కులను కాలరాస్తూ పాలకుల మన్ననలు పొందేందుకు పరితపిస్తున్నారనే విమర్శ లేకపోలేదు. సమస్యలు పరిష్కరించకుండా పైగా నిషేధాజ్ఞలు విధించడం ఏంటి? పార్లమెంటు, అసెంబ్లీ చట్టసభల్లో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో తమ ఆవేదన, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పోడియం చెంతకు చేరుకుంటారు. భారత రాజ్యాంగం కలిపించిన స్వేచ్ఛ, జీవించే హక్కును కాలరాసే విధంగా ఈ ఓయూ నిషేధాజ్ఞల సర్క్యులర్ ఉంది.
గతంలో ఒక కేసును పరిశీలించిన అనంతరం వ్యాఖ్యానిస్తూ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ‘ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలపడం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం. దానిని అణిచివేస్తే, అది ప్రెజర్ కుక్కర్‌లా పేలి ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మరే అవకాశం ఉంటుంది’ అని అన్నారు. అంతేకాదు, “ఎక్కడ మనస్సు భయం లేకుండా స్వేచ్ఛగా ఉంటుందో, అక్కడ జ్ఞానం విరాజిల్లుతుంది” అని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన మాటలు ఓయూ గోడల మీద లిఖించబడ్డాయి. పైన రెండు వేర్వేరు వ్యాఖ్యలను స్పూర్తిగా తీసుకునే విధంగా వీసీల వైఖరి, ప్రభుత్వాల పాత్ర ఉండాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యాబోధన, పరిశోధన జరగాలి. అప్పుడే నూతన ఆలోచనలు పుడతాయి. వర్సిటీలు స్వయంప్రతిపత్తితో వర్ధిల్లుతాయి.
సత్య నెల్లి
రీసెర్చ్ స్కాలర్ – పొలిటికల్ సైన్స్
ఉస్మానియా యూనివర్సిటీ
9550395232
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.