
విజయవాడ: రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అప్పు స్థానంలో గ్రాంట్‌గా నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే, రాజధాని నిర్మాణానికి ఉపయోగకరంగా ఉంటుందని ఏపీ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి అవనిగడ్డ పున్నారావు అన్నారు. అంతేకాకుండా దీని వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతోన్న రాష్ట్రానికి భారం కాకుండా ఉంటుందని ఆయన తెలిపారు. మే 2న ప్రధాని మోడీ ఏపీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి అవనిగడ్డ పున్నారావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
“అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం సందర్భంగా మోడీ విజయవాడకు వస్తున్నారు. గతంలో వచ్చినప్పుడు చెంబెడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లిన సంగతి ప్రజలు మర్చిపోలేరు. అయన రాకపోకల ఖర్చులు కూడా గిట్టుబాటు కాలేదు” అని అన్నారు. అంతేకాకుండా, “ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని 2014 ఎన్నికలకు ముందు ఎన్డీఏ పార్టీ అధినేత మోడీ హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి అయ్యే ఆర్థిక వనరులను సమకూర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొనబడింది. కానీ, 2014లో అమరావతి శంకుస్థాపన సందర్భంగా మోడీ ఏపీకి వచ్చారు. అప్పుడు రాష్ట్ర, రాజధాని అభివృద్ధికి భారీగా నిధులు ప్రకటిస్తారని ప్రజలు ఎంతో ఆశించారు. చెంబెడు నీళ్లు, గుప్పెడు మట్టితో సరిపెట్టి రాష్ట్ర ప్రజల ఆశలను నీరు కార్చారు” అని పున్నారావు గుర్తుచేశారు.
“రాజధాని నిర్మాణానికి సుమారు రూ 50 వేల కోట్ల నిధులు అవసరమని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయినా, గత 11 సంవత్సరాలలో రూ 1500 కోట్లు మాత్రమే కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించింది” అని తెలిపారు.
రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ..
“అమరావతి రాజధాని ఆశలను గత రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చినా, మూడు రాజధానుల పేరుతో వివాదాన్ని సృష్టించినా కేంద్రం నోరు విప్పలేదు, జోక్యం చేసుకోలేదు. అంతేకాకుండా హైకోర్టులో రాజధాని నిర్మాణానికి కేంద్రానికి సంబంధం లేదని అఫిడవిట్ దాఖలు చేసింది. 41 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలకు అమరావతిలో స్థలాలు కేటాయించినా, ఇప్పటివరకు ఎక్కువ కార్యాలయాల పనులు కూడా ప్రారంభించలేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మిగిల్చిన పుణ్యం మోడీదే” అని ప్రకటనలో చెప్పుకొచ్చారు.
2014 సంవత్సరంలో రాష్ట్రంలో టిడిపి, బిజెపి ప్రభుత్వం రూపొందించిన పూలింగ్ చట్టం గురించి ఆయన ప్రస్తావించారు. ఆ చట్టం నేటికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని, దీంతో రైతులు, కూలీలు, ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని వాపోయారు. “చట్టబద్ధమైన హామీల అమలు కోసం, అమరావతి పరిరక్షణ కోసం పోరాడిన వారిపై పెట్టిన కేసులు ఈ నాటికి రద్దు చేయలేదు.” అని తెలిపారు.
ఒక కొలిక్కి వచ్చేనా..!
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి మళ్లీ అధికారంలోకి వచ్చిందని, రాష్ట్రంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పున్నారావు గుర్తు చేశారు. కనీసం ఈ సారైన రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, హడ్కో తదితర సంస్థల ద్వారా 31 వేల కోట్ల అప్పులు మంజూరు చేయించే ప్రకటనలకే పరిమితమయ్యారని వాపోయారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ 1400 కోట్లు మాత్రమే గ్రాంటు ఇస్తుందని ప్రకటించారని పేర్కొన్నారు. “మళ్లీ అప్పులు, వడ్డీలతో సహా రాష్ట్ర ప్రజలే చెల్లించాలి. భవిష్యత్తులో ఇది భారంగా మారుతుంది” అని అన్నారు.
భారీగా నిధుల అవసరం..
“అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మే 2న మోడీ అప్పులు కాకుండా స్పష్టంగా గ్రాంట్లు ఇస్తూ ప్రకటన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు” అని తెలియజేశారు.
ఇంకా, “ఆరు నెలలలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల పనులు పూర్తి చేయడానికి నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. రాజధాని అమరావతితో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలి. విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు ఏర్పాటు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులపైన మోడీ స్పందించాలి.” అని పున్నారావు డిమాండ్ చేశారు.
“రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్రం, రాజధాని అభివృద్ధిలో 10 సంవత్సరాలకు పైగా విలువైన సమయం కోల్పోయాం. కాబట్టి ఇప్పటికయినా తక్షణమే నిధులు కేటాయించాలి. వేగంగా పనులు జరగాలి. రాజధాని అమరావతి, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలి. అవసరమైన స్పష్టమైన చర్యలతో రాష్ట్ర ప్రజలు ఆశించిన రీతిలో మోడీ స్పందిస్తారని ఆశిస్తున్నాం.” అని కోరుతూ పున్నారావు ఆశాభావం వ్యక్తం చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.