
బీజేపీ పాలిత ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో 2023 మే నెలలో మెయితీ- కుకీ తెగల మధ్య గొడవ రాజుకుంది. అది కాస్తా హింసాత్మకంగా మారింది. దాదాపు 21 నెలలుగా పరస్పర దాడులు, హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలు, బాంబు దాడులతో రాష్ట్రం అతలాకుతలమైంది. చివరికి ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామాతో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడి, రాష్ట్రపతి పాలనకు దారితీసింది.
మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు అసెంబ్లీలో బీజేపీకి అత్యధిక మెజార్టీ ఉంది. అయినా బీజేపీ బీరెన్ సింగ్‌కు ప్రత్యామ్నాయంగా మరో ముఖ్యమంత్రిని నియమించి, అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. నిత్యం అల్లర్లు, మారణహోమాలతో రక్తసిక్తమైన రాష్ట్రంలో చివరకు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలనను విధించింది.
అల్లర్లకు ఆజ్యం పోసిన సీఎం బీరేన్ సింగ్..
మెయితీ తెగకు చెందిన ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ మణిపూర్‌లో అల్లర్లను ప్రేరేపించేలా మాట్లాడిన కొన్ని ఆడియో టేపులు లీక్ అయ్యాయి. ఈ ఆడియో టేపులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ‘మెయితీలను ఆయుధాలు దోచుకోనివ్వండి, లూటీలు చేయనివ్వండి’ అని పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ఆదేశించినట్లు ఈ ఆడియో టేపుల పూర్తి సారాంశం. ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ అండ, పోలీసుల సహకారంతో దోచుకున్న ఆయుధాలతో మెయితీ మిలిటెంట్ గ్రూపులు పోలీసు వాహనాల్లోనే ప్రయాణిస్తూ కుకీలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని లీక్ అయిన ఆడియో టేపుల ఆధారంగా కుకీ హ్యూమన్‌రైట్స్ ఆర్గనైజేషన్ (కోహుర్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం ఆదేశాలతో ప్రైవేట్ ఫోరెన్సిక్ లాబరేటరీ ట్రూత్ ల్యాబ్స్ 93 శాతం ఆడియో టేపులు బిరేన్ సింగ్ గొంతుతో సరిపోలుతున్నాయని నిర్ధారించింది. మణిపూర్ అల్లర్లను ఎవరు ప్రేరెపించారో ఈ ఆడియో టేపులు తేల్చేశాయి.
ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్‌ను కొనసాగనివ్వడానికి చాలామంది బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. వారంతా ముఖ్యమంత్రి పీఠం నుంచి బిరేన్ ను దించివేయాలని బహిరంగంగానే బీజేపీ అధిష్టానానికి, ప్రధాని మోదీకి తెలిపారు. నిజానికి అదే జరిగితే బీజేపీ పెద్దలకు అంతకంటే అవమానం మరొకటి ఉండదు. ఈ పరిస్థితులను ముందే పసిగట్టిన బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగానే బిరేన్ సింగ్‌తో రాజీనామా చేయించి, అసెంబ్లీ సమావేశాలనూ రద్దు చేసింది.
ఆ రాష్ట్ర చివరి అసెంబ్లీ సమావేశం 2024 ఆగస్టు 12న జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 (1) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీల చివరి సమావేశం తర్వాత ఆరు నెలల కంటే ముందే సమావేశమవ్వాలి. రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య గడువు ఆర్నెల్లకంటే ఎక్కువ ఉండకూడదన్న నిబంధన మణిపూర్ గవర్నర్‌కు తెలియదా? బిరేన్ స్థానంలో ముఖ్యమంత్రి పీఠంపై ఎవరిని నియమించాలో బీజేపీ తేల్చుకోలేక, రాజ్యాంగ సంక్షోభం నెలకొందని, రాష్ట్రపతి పాలన విధించడం ఏ రకమైన ప్రజాస్వామ్యం?
రాష్ట్రపతి పాలన ఎంతకాలం కొనసాగుతుంది?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం మణిపూర్‌లో రాజకీయ అస్థిరత కారణంగా రాష్ట్రపతి పాలన విధించారు. ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనా విధించడం ఇది 11వ సారి. మణిపూర్‌లో చివరిసారి 2001 జూన్ 2 నుండి ప్రారంభమై 2002 మార్చి 6న రాష్ట్రపతి పాలన ముగిసింది. 23 ఏళ్ల తర్వాత మణిపూర్‌లో మళ్ళీ ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు.
కేంద్రం ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలనను ఆరు నెలల పాటు విధించవచ్చు. పార్లమెంటు ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి, గరిష్టంగా మూడు సంవత్సరాల కాలానికి దీనిని పునరుద్ధరించవచ్చు. కానీ అలా పొడిగించిన ప్రతి సారీ పార్లమెంట్ ఆమోదం కావాలి. ఈ కాలంలోనే రాజ్యాంగ యంత్రాంగాన్ని పునరుద్ధరించాలి. 2027 వరకు పదవీకాలం ఉన్న మణిపూర్ అసెంబ్లీని కేంద్రం రద్దు చేయలేదు. కానీ ‘సస్పెండ్ యానిమేషన్’లో ఉంచింది. దీని అర్థం రాష్ట్రపతి పాలన ముగిసిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా వీలు కల్పించడం.
భారత్‌లో విలీనం..
స్వాతంత్య్రానికి పూర్వం మణిపూర్ రాచరిక పాలనలో ఉండేది. 1891లో బ్రిటిష్ పాలన కిందకు వచ్చింది. అంతకు ముందు ఆ ప్రాంతాన్ని పాలించిన రాజులు మెయితీ తెగకు చెందిన వారు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ పాలకులు మణిపూర్‌ని భారత్‌లో విలీనం చేయకుండా 1891కి ముందు పాలించిన రాజ వంశానికి ఇచ్చేశారు. మెయితీ తెగకు చెందిన నాటి మణిపూర్ మహారాజు బోధచంద్ర సింగ్ భారత్‌లో విలీనం కాకుండా హైదరాబాద్ నిజాం నవాబులా స్వతంత్ర దేశంగా ఉంచాలని ప్రయత్నించారు. కానీ అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో అక్టోబర్ 1949లో మణిపూర్ భారత్‌లో విలీనం అయ్యింది.
మణిపూర్‌లో అనేక తెగలు ఉన్నప్పటికీ కీలకంగా మూడు తెగలు కనిపిస్తాయి. అందులో మెయితీలు ప్రధానంగా హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా జనాభా వీరిదే. నాగ తెగ ఎక్కువ మంది క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వీరి జనాభా సుమారు 24 శాతం. కుకీలు ఎక్కువ మంది ప్రాంతీయ గిరిజన పద్ధతులను ఆచరిస్తుండగా మరికొందరు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వీరి జనాభా సుమారు 16 శాతం. మెయితీలలో 8 శాతం మంది ముస్లింలు అయితే వీరిని మెయితీ పంగల్లు అని పిలుస్తారు. 1993లో మెయితీ హిందువులు-మెయితీ ముస్లింల మధ్య హింస చెలరేగింది. కుకీ, నాగాలలో ఎక్కువ మంది క్రైస్తవులు. 1993లో మణిపూర్ నాగ- కుకీ హింసను చూసింది. దీనిలో వంద మందికిపైగా కుకీలు హతులయ్యారు. నాగాలు- కుకీలు సాంప్రదాయకంగా ఒకరినొకరు వ్యతిరేకించుకున్నప్పటికీ వారిప్పుడు మెయితీలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుతున్నారు.
హింస తొలిసారిగా ఎక్కడ జరిగింది?
మణిపూర్ రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది ఉన్న మెయితీలు తమకు షెడ్యూల్డు తెగల హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీ హోదా డిమాండ్‌ను నిరసిస్తూ ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ 2023 మేలో నిర్వహించిన ‘ట్రైబల్ సాలిడారిటీ మార్చ్’ సందర్భంగా శరచ్చంద్రాపూర్ జిల్లాలోని టోర్బంగ్ ప్రాంతంలో మొదట హింస చెలరేగింది. మెయితీలు బాగా అభివృద్ధి చెందారని, వారిని ఎస్టీ జాబితాలో కలిపితే భారత రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను, ఉద్యోగావకాశాలను కోల్పోతామని ఎస్టీలు ఆందోళన చెందుతున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం గిరిజనుల భూమిని ఇతరులు ఆక్రమించుకోకుండా రక్షణ కల్పిస్తున్నాయి.
మణిపూర్ ప్రభుత్వం 1988లో చేసిన ‘మణిపూర్ లాండ్ రెవెన్యూ అండ్ లాండ్ రీఫార్మ్స్’ చట్టం అయినా 2018లో తీసుకువచ్చిన ‘మణిపూర్ పీపుల్స్ ప్రొటెక్షన్ చట్టం’ అయినా రాజ్యాంగంలోని అధికరణ 371(సి) కింద ఆదివాసులకు చట్టబద్ధంగా కల్పించిన హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఉల్లంఘిస్తోందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
బీజేపీకి మెజారిటీ.. అయినా రాష్ట్రపతి పాలన..!
మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు 2022లో జరిగిన ఎన్నికలలో బీజేపీ 37 స్థానాలను గెలుచుకుంది. పైగా ప్రభుత్వానికి మిత్ర పక్షాల మద్దతు ఉంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది.
రాష్ట్రపతి పాలనకు ప్రధాన కారణాలు :
– అంతర్గత అసమ్మతి: అన్ని పార్టీలలోని కుకీ ఇతర గిరిజన తెగలకు చెందిన ఎమ్మెల్యేలు రాజకీయాలకతీతంగా ఏకమయ్యే పరిస్థితులు ఏర్పడ్డ కారణంగా పాలక బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ప్రమాదం కనిపిస్తోంది. ఇదే జరిగితే బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది.
– పెరుగుతున్న హింస: మెయితీ- గిరిజన తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఘోరంగా దెబ్బతిన్న శాంతిభద్రతలతో పాలక ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది.
– తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకోలేకపోవడం: నిజానికి అన్నింటి కంటే ముఖ్య కారణం ఇదే..! మెయితీ- కుకీలు మధ్య ఘర్షణల కారణంగా గిరిజన- గిరిజనేతరలుగా నిలువుగా చీలిపోయిన బీజేపీ నాయకులు తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమ పార్టీలోని ఒకరిని నియమించడంలో విఫలమయ్యారు.
– రాజకీయ వ్యూహం: అసమ్మతితో ప్రభుత్వం కూలిపోయి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ మీద ఏర్పడ్డ తీవ్ర వ్యతిరేకత విపక్షాలకి మేలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనేలా చేసి, భవిష్యత్తులో తిరిగి బీజేపీ అధికారంలోకి రావడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించడం మోదీ లక్ష్యంగా కనిపిస్తోంది.
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనా విధించిన సందర్భాలు..
1967లో జనవరి 12- మార్చి 19 (66 రోజులు): ముఖ్యమంత్రి మైరేంబం కోయిరెంగ్ సింగ్ రాజీనామా తర్వాత ఏర్పడ్డ రాజకీయ అస్థిరత కారణంగా తొలిసారిగా రాష్ట్రపతి పాలన విధించారు.
1967 అక్టోబర్ 25 – 1968 ఫిబ్రవరి 18 (116 రోజులు): ముఖ్యమంత్రి లాంగ్జామ్ థంబౌ సింగ్ స్వల్ప పదవీకాలం తర్వాత, రాష్ట్రంలో ఏర్పడ్డ అస్థిరత కారణంగా కేంద్రం జోక్యంతో రాజకీయ ప్రతిష్టంభన ఎదుర్కొంది.
1969 అక్టోబర్ 17 – 1972 మార్చి 22 (2 సంవత్సరాల 156 రోజులు): సాయుధ తిరుగుబాటు తీవ్రతరం కావడం, ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం డిమాండ్లు పెరగడంతో సుదీర్ఘకాలం రాష్ట్రపతి పాలన విధించారు దీంతో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి.
1973 మార్చి 28 – 1974 మార్చి 3 (341 రోజులు): రాజకీయ అస్థిరత, పార్టీ ఫిరాయింపులు ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి దారితీశాయి.
1977లో మే 16 – జూన్ 28 (41 రోజులు): అధికార పార్టీలోని అంతర్గత అసమ్మతి, అవినీతి ఆరోపణల కారణంగా రాష్ట్రపతి పాలన విధించారు.
1979 నవంబర్ 14 – 1980 జనవరి 13 (60 రోజులు): పార్టీ ఫిరాయింపుల తర్వాత ప్రభుత్వం కూలిపోవడంతో రాష్ట్రపతి పాలనా విధించారు.
1981లో ఫిబ్రవరి 28 – జూన్ 18 వరకు (111 రోజులు): జనతా ప్రభుత్వంలో అసంతృప్తి, అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ప్రభుత్వాన్ని రద్దు చేశారు. దీంతో రాష్ట్రపతి పాలన ఏర్పడింది.
1992లో జనవరి 7 – ఏప్రిల్ 7 (92 రోజులు): పార్టీ ఫిరాయింపుల తర్వాత నాటి సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. ఇది కేంద్రం జోక్యానికి దారితీసింది.
1993 డిసెంబర్ 31 – 1994 డిసెంబర్ 13 (347 రోజులు): రాజకీయ అస్థిరత, పరిపాలన వైఫల్యంతో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఏర్పడింది.
2001 జూన్ 2 – 2002 మార్చి 6 (276 రోజులు): పార్టీ ఫిరాయింపుల తర్వాత ప్రభుత్వం కూలిపోవడంతో రాష్ట్రపతి పాలన ప్రారంభమైంది.
2023 నుంచి రెండు తెగల మధ్య వివాదం కొనసాగింది. ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ రాజీనామా చేయడంతో ఇది కాస్త చివరికి రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను విధించారు.
శాంతి నెలకొనేలా చర్యలు..
‘రోమ్ నగరం తగలబడి పోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు’ జాతుల మధ్య సంఘర్షణలతో వందల మంది మరణించి, వేలాది మంది అమాయకులు నిరాశ్రయులై, పోలీసు శిబిరాల్లో తలదాచుకుంటే కనీసం దేశ ప్రధాని మోదీ ఆ రాష్ట్రాన్ని సందర్శించకపోడం, జరిగిన మారణహోమంపై పార్లమెంటులో చర్చించకపోవడం హింసకు మరింత ఆజ్యం పోసినట్లయింది. మణిపూర్‌లో అల్లర్లు చెలరేగి యుద్ధ భూమిని తలపించినప్పుడే బిరేన్ సింగ్‌ను తొలగించి, రాష్ట్రపతి పాలన విధించి ఉండి ఉంటే, ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండే కాదు. జాతుల మధ్య విద్వేషాలు రగిలి హత్యలకు దారితీసేవి కావు.
మెయితీ- కుకీల మధ్య కొనసాగుతున్న హింసను అడ్డుకోవడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమయిందని ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి బిరేన్ సింగ్‌ను ఆ పదవీ నుంచి తీసేసి రాష్ట్రపతి పాలనా విధించినంత మాత్రాన హింస ఆగినట్టు, శాంతి నెలకొన్నట్టు కాదు. బిరేన్ సింగ్ కారణంగా చీలిపోయిన మెయితీ- కుకీ జాతుల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడడం ఇప్పుడు కేంద్రం ముందున్న అతిపెద్ద సవాలని చెప్పవచ్చు. జాతుల మధ్య తేడాతో వారూ వీరూ అని చూడకుండా ప్రజలు సోదరభావంతో శాంతియుతంగా ఒక్కటవ్వాలి. ఇది సాధ్యం కావడం అంత తేలిక కాదు.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ముఖ్యమంత్రిగా కుకీలను ఇతర దేశం నుంచి వలస వచ్చారని, గంజాయి సాగు చేస్తారని కుకీలను తీవ్రంగా ద్వేషిస్తూ వారిని తక్కువ చూపు చూసిన బిరేన్ సింగ్ ఈ సంక్షోభానికి బాధ్యుడని ఆడియో టేపుల లీకేజీతో బట్టబయలైంది. వాస్తవానికి మణిపూర్‌లోని అన్ని వర్గాలు గంజాయి సాగు చేస్తాయి. కానీ కేవలం కుకీలను మాత్రమే వేలెత్తిచూపడం విద్వేష భావాలకు మరింత ఆజ్యం పోసింది. మెయితీల ఎస్టీ హోదా డిమాండ్ ఇంకా పరిష్కారం కాకపోగా ‘కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం’లాగా బీజేపీ పరిస్థితి తయారైంది.
ఏదిఏమైనా ఇప్పటికైనా కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకోవాలి. గతంలో సాయుధ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్), కేంద్రం మధ్య శాంతి ఒప్పందం జరిగింది. అలా మెయితీలు- కుకీల మధ్య శాంతి చర్చలు, ఒప్పందాలు జరిపించాలి. దీనికోసం, అలానే శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? మణిపూర్‌లో తిరిగి శాంతి నెలకొంటుందా? రాష్ట్రపతి పాలనను ఎంతకాలం పొడిగిస్తారనేది వేచి చూడాలి.
డా చెట్టుపల్లి మల్లిఖార్జున్
(రాజకీయ విశ్లేషకులు, ‘ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ తిరుగుబాటు ఉద్యమాలు- అంతర్గత భద్రత’అనే అంశంపై పీహెచ్డీ చేశారు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.