
ద వైర్ తెలుగు ప్రత్యేక కథనం.
…………………………….
కులగణన ..దేశంలో ఇప్పుడు ఇదో జఠిల సమస్య. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జనాభా లెక్కలు చేపడుతుందే కాని, కులాల వారీగా లెక్కలు తీయదు. తీయలేమని కూడా సర్వోన్నత న్యాయస్థానానికే తేల్చిచెప్పింది. అన్ని పార్టీల ఒత్తిడి మేరకు 2011 జనాభా లెక్కలలో కులాల వారీగా లెక్కింపు జరిగినా, కులాల వారీగా జనాభా లెక్కలు అధికారికంగా వెల్లడి కాలేదు.అంతేకాదు కేంద్రానికి సంబంధం లేదన్నట్లు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేసినా , అదికూడా వివాదాల చూట్టూ తిరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో చేసిన లెక్కలను బయట పెట్టలేని దౌర్భాగ్య స్ధితి…
తెలంగాణ లో ఇప్పుడు కులగణన హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల హామీలలో కులగణనను చేర్చాం. అధికారంలోకి వచ్చిన ఏడాది లోనే చేసి చూపించామంటూ, ప్రకటనలు గుప్పించారో లేదో.. అది కాస్తా రాజకీయ వివాదంగా మారింది. సొంత పార్టీలోనే కులగణనపై అగ్గి రాజుకోవడం, ప్రతిపక్ష బీఆర్ఎస్ దీనిని ఆసరాగా తీసుకోవడంతో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడి, కులగణన సరిగా జరగలేదని ఒప్పుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. మూడు శాతం ప్రజలు కులగణన సర్వేకు దూరంగా వుండటంతోనే సమస్యంటూ, మరోమారు వారికీ కులగణనలో పాల్గొనే అవకాశం కల్పించింది. కేసీఆర్ కుటుంబ సభ్యులు సైతం కులగణనలో పాల్గొన లేదని, సర్వే సిబ్బంది కి వివరాలు కూడా ఇవ్వలేదని, అలాంటి వారికోసం మరోమారు అవకాశం కల్పిస్తున్నామంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు కూడా…
అసలు కులగణన ఎందుకు ..ఎవరు దీనికోసం పట్టుబడుతున్నారన్నది చూస్తే… దేశంలో ఎన్నో కులాలున్నా.. బీసీ కులాల చుట్టూనే ఇదంతా సాగుతోంది. దేశంలో మెజారిటీ గా వున్న బీసీ జనాభా కు అదే నిష్పత్తిలో సామాజికంగా, ఆర్ధికంగా, విద్యా, ఉపాధిపరంగా న్యాయం జరగడం లేదన్నది రిజర్వేషన్లు లభించడం లేదన్నది బలమైన వాదన. 1980 నుంచి మారిన రాజకీయపరిణామాలలో కులాలవారీగా పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పడం మొదలెట్టాయి. అంతే వెనుకబడిన కులాలకు ముఖ్యంగా బీసీలకు రాజకీయంగా కూడా రిజర్వేషన్లు దక్కాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది.ప్రస్తుత దేశ రాజకీయ పరిణామాల నేపధ్యంలో బీజేపీని ఇరుకున పడేయడానికి, అధికారం చేపట్టడానికి కులగణనను కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా వాడుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి.మరోవైపు రాజకీయాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకత కూడా ఎదురుకావడం మొదలైంది.
గతంలో ఈ పరిస్థితులను అప్పుడు తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే…దేశంలో రిజర్వేషన్ల అమలుతో పాటూ, సంక్షేమ పథకాల అమల్లో కులానిది కీలక పాత్రగా మారింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ లకు మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రాజకీయంగానూ ఎస్సీ ,ఎస్టీ లకు ప్రత్యేక నియోజక వర్గాలు వున్నాయి. ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ ల రిజర్వేషన్లు అమలవుతుంటే.. మేము చేసిన పాపమేంటంటూ ఇప్పుడు బీసీ వర్గం ఉద్యమిస్తోంది.1979లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇచ్చే పరిశీలించేందుకు భారత ప్రభుత్వం మండల్ కమిషన్ను ఏర్పాటుచేసింది.
మండల్ కమిషన్ అంచనా ప్రకారం దేశంలో బీసీలు 52 శాతం ఉంటే వారికి 27 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ వస్తున్నారు.విద్యా, ఉద్యోగ, ఉపాధి లో మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు అమలవు తున్నాయి. రాజకీయంగా చూస్తే కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకే బీసీల రిజర్వేషన్లు పరిమితం చేశారు.
ఇక బీసీల రిజర్వేషన్లు రాష్ట్రానికో రకంగా ఉన్నాయి. అవి ఆయా రాష్ట్రాలు చేపట్టిన సర్వేల ఆధారంగా ఉంటాయి. ఎస్సీ ఎస్టీలకు వారి పూర్తి జనాభాకు తగిన నిష్పత్తిల్లో రిజర్వేషన్లు ఇస్తే, బీసీలకు మాత్రం వారి జనాభాలో సగం నిష్పత్తికే రిజర్వేషన్ ఇస్తున్నారన్న ఆరోపణ వుంది.
అయితే బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన తరువాత అగ్రవర్ణ పేదలకు 10 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ కల్పించడం అది బీజేపీ ఎదుగుదలకు ఉపయోగపడటం కూడా ప్రాధాన్యత సంచరించుకుంది.ఓసీల జనాభా చాలా తక్కువ ఉన్నప్పటికీ వారిపై ఏ సర్వే లేకుండానే నేరుగా ఎస్టీల కంటే ఎక్కువగా 10 శాతం రిజర్వేషన్ ఇచ్చారన్నది వివాదంగా మారింది. అదేక్రమంలో ఆర్ధిక పరిస్థితి ని దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ కల్పించడం పై హర్షతారేకాలు వ్యక్తమయ్యాయి.
తెలంగాణ కులగణన విషయానికి వస్తే…రేవంత్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సుమారు 50 రోజుల పాటు కులగణన సర్వే జరిపింది. ఈ సర్వేలో 96.9 శాతం కుటుంబాలు తమ వివరాలు తెలిపాయి. 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం ప్రకటించింది.సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మొత్తం 3.54 కోట్ల మందిని సర్వే చేసినట్లు సర్కార్ తెలిపింది. అయితే ఇందులో 46.25 శాతం బీసీ జనాభా ఉన్నట్లు నిర్థారించింది.అసెంబ్లీ వేదికగా ఈ వివరాలు ప్రభుత్వం బయట పెట్టగా , బీసీ జనాభా 50 శాతానిపైగా ఉంటుందని… ప్రభుత్వం చెబుతున్న లెక్కలు సరిగా లేవని బీసీ సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.. తెలంగాణలో తాజాకులగణన సర్వే ప్రకారం
ఎస్సీలు 17.43 శాతం,
ఎస్టీలు 10.45 శాతం,
బీసీలు 46.25 శాతం,
ఓసీలు 15.79 శాతం,
ముస్లిం మైనారిటీ బీసీల జనాభా 10.08 శాతం,
ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56.33 శాతం,
ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం,
మొత్తం ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతం గా లెక్క తేలింది. అదే వివాదానికి దారితీసింది. 2014 లో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలోనే బీసీల జనాభా ఎక్కువ వుందని, ఏకంగా 22 లక్షల వరకూ బీసీ జనాభా ఎందుకు తగ్గిందన్న ప్రశ్నలు దూసుకు వచ్చాయి. రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత ప్రభావం చూపుతున్న రెడ్డి సామాజిక వర్గం జనాభా 17.06 లక్షలుగా ఉంది. రాష్ట్ర జనాభాలో వీరు 4.81 శాతంగా ఉన్నారు. 2014 సర్వేతో పోలిస్తే రెడ్డి సామాజిక వర్గం జనాభా 0.5 శాతం మేర పెరిగింది. ముస్లిమేతర అగ్రకులాల జనాభా 13.31 శాతంగా ఉంటే.. రెడ్డి సామాజిక వర్గాన్ని మినహాయించి.. బ్రాహ్మణ, కమ్మ, వెలమ, కోమటి తదితర అగ్రకులాలన్నీ కలిపి 8.50 శాతంగా ఉన్నాయి.ఓసీ జనాభా పెరగడాన్ని బీసీ సంఘాల నేతలు తప్పుపట్టారు. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది.
అనుకున్నదొక్కటి అయింది
ఒక్కటి.. చందంగా రాజకీయంగా తలనొప్పులు వచ్చిపడ్డాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికల సమరానికి సై అందామన్న ఆశలూ అడి ఆశలయ్యాయి. మళ్లీ కులగణనతో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చింది.
ఒక్క తెలంగాణ నే కాదు దేశంలో కొన్ని రాష్ట్రాలు కులగణన చేపట్టినా దాని ఫలితాలు ప్రజలకు ఇవ్వలేక, న్యాయ పరమైన వివాదాలలో చిక్కుకున్నాయి. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి దాటరాదన్న సుప్రీంకోర్టు తీర్పు కూడా పలు రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో అభాసుపాలవుతోంది.భారత్లో బ్రిటిష్ పాలనా కాలంలో, 1872లో జనాభా లెక్కలు మొదలయ్యాయి. 1931 వరకు బ్రిటిష్ అధికారులు జనాభా లెక్కలలో కులాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించారు.స్వాతంత్ర్య వచ్చాక భారత్ లో తొలిసారి 1951లో జనాభా లెక్కలు చేపట్టారు. అప్పుడు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సమాచారం మాత్రమే సేకరించారు. అప్పటినుంచి కులగణనను భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వచ్చింది. అయితే బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు అక్కడి డిమాండ్లకు తలొగ్గి కులగణన డిమాండ్ మొదలు పెట్టినా, రాజ్యాంగ పరంగా అది చెల్లదంటూ కోర్టులలో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అనేక అడ్డంకుల మధ్య బీహార్ లో2022 చివర్లో కులగణన చేపట్టి 2023 వివరాలు బైటపెట్టారు.రాష్ట్ర జనాభా 13 కోట్లు.ఇందులో అగ్రవర్ణాల సంఖ్య 15.52 శాతంగా ఉంది.ఓబీసీలు 27.12 శాతం, ఈబీసీలు 36.01 శాతం కలుపుకొని బీసీలు 63.13 శాతం మంది ఉన్నారు. షెడ్యూల్డ్ కులాల వారు 19.65 శాతం, షెడ్యూల్డ్ తెగలవారు 1.68 శాతం ఉన్నారని తేల్చింది.బీహార్ కులగణన అన్ని రాష్ట్రాలకు దిక్సూచి లా మారింది.బీజేపీ ప్రజల మధ్య కులాలచిచ్చు పెట్టారని మండిపడింది.
ఇక మహారాష్ట్ర లో 2021లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ గొడవ వచ్చింది. దీంతో 2021 జనాభా లెక్కలతో పాటూ కులాల లెక్కలు కూడా తీయాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.అంతేకాదు, 2011 లో చేసిన కులాల లెక్కలు విడుదల చేయాలని కూడా మహారాష్ట్ర కోరగా, కేంద్రం రెండింటికీ తిరస్కరించింది.అటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటక లోనూ కులగణన చేపట్టారు. అయితే సొంత పార్టీలోనే దీనిపై చిచ్చు రేగడంతో సర్వే రిపోర్ట్ ను అధికారికంగా వెల్లడించలేక పోయారు.రాష్ట్రంలో రాజకీయంగా ఆధిపత్య కులాలైన లింగాయత్, వొక్కలిగ కులాలు సర్వే నివేదికను వ్యతిరేకించాయి. నివేదిక అశాస్త్రీయంగా ఉన్నట్టు ఆ వర్గాలు ఆరోపించాయి. వొక్కలిగ కులానికి చెందిన రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
ఏదేమైనా బీసీలకు రాజ్యాధికారం దిశగా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ లో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి బీసీ ముఖ్యమంత్రి అన్న డిమాండ్ సాగుతోంది. దేశంలో కులవ్యవస్థ ను రూపుమాపాలన్న మేథావుల మాటలు, సమాజంపై కులవ్యవస్థ ప్రభావం మాట ఎలావున్నా, ప్రస్తుత రాజకీయాలు మాత్రం కులాలు చుట్టే తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఏపీకే పరిమితమైన కులాల కుంపటిపై నేడు తెలంగాణ నేతలూ చలి కాచుకోవడానికి సిద్దమైపోయారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
అసలు ఏ కులం ఏ స్థితిలో వుంది.. ఆయా కులాలలో పేదల శాతం ఎంత…ఏ కులం వారు ఏ ప్రాంతంలో ఎక్కువ స్థితిలో వున్నారో తెలిస్తే …దానికి అనుగుణంగా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల అమలులో మార్పులు చేయవచ్చన్నది కొందరి వాదన, అసలు రిజర్వేషన్లే దండగ, కేవలం ఆర్థిక పర రిజర్వేషన్లే వుండాలనేది మరి కొందరి ఆకాంక్ష.. ఏదైనా కులాల రొంపిలో కొట్టుకుంటున్న రాజకీయ వ్యవస్థలో కులగణన చేపట్టకుండా కేంద్రం లోని బీజేపీ కూడా ఇంక ఎంతకాలం లాగక్కొస్తుంది.. దేశ వ్యాప్తంగా కులగణనకు సిద్దపడక తప్పదేమో. కొసమెరుపు ఏమిటంటే… అటు ప్రభుత్వ పెద్దల వద్ద, పార్టీల నేతల దగ్గర ప్రాంతాలవారీగా కులాల జనాభా లేక్కలు అనధికారంగా ఎప్పుడో వున్నాయి. ఆ లెక్కలే ఆడిస్తున్నాయి కూడా.
– బాలకృష్ణ.ఏం, సినియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.