
‘నరివెట్ట’ అని మలయాళం సినిమా ‘సోనీ లివ్’ లో ఇప్పుడు నడుస్తోంది. 2003 నాటి ముతుంగ ఆదివాసీ పోరాటం నేపథ్యం తో తీసిన ఈ సినిమాలో- వైనాడ్ ప్రాంతంలో నిర్వాసితులైన ఆదివాసులు తమకు నివాసస్థలాల కోసం పోరాడుతుంటారు. వాళ్ల కోర్కెలు తీర్చడం ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. పోలీసులను మోహరిస్తారు. ఆందోళనను భగ్నం చేయడానికి ఎటువంటి సమర్థనా దొరకదు. ఆదివాసులకు మావోయిస్టుల అండ ఉన్నదని, వారి మధ్య సంబంధాలున్నాయని ప్రచారం చేస్తుంటారు. ఒక పోలీసును తామే చంపించి, ఆ నెపాన్ని ఆదివాసుల మీద వేస్తారు. అంతరాత్మ కలిగిన ఒక మంచిపోలీసు ఆ కుట్రను తెలుసుకుని, న్యాయవ్యవస్థ సహాయంతోదాన్ని బయటపెడతాడు. చివరకు న్యాయం గెలుస్తుంది.
ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అని పిలిచే తరహా ఎత్తుగడ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ప్రాబల్యవర్గాలు ఎప్పటి నుంచో అనుసరిస్తూ వస్తున్నవే. జర్మన్ పార్లమెంటు భవనాన్ని తగులబెట్టించి, హిట్లర్ దాన్నికమ్యూనిస్టుల మీద తోస్తాడు. ఒక తీవ్రమైన అణచివేత చర్యను తీసుకోదలచినప్పుడు, ప్రత్యర్థులు అందుకు తగ్గ కారణం ఏదీ అందించనప్పుడు, తామే గంధర్వులుగా మారి కాగల కార్యాన్ని నెరవేర్చుకోవడం అన్నమాట. ఉద్యమంలో హింస ఉండనక్కరలేదు, అణచివేయదలచుకున్నప్పుడు, హింసను ఉద్యమానికి ఆపాదించవచ్చునన్నమాట.
చట్టబద్ధ మార్గాల ద్వారా, విజ్ఞాపనల ద్వారా కోర్కెలను నివేదించాలని ప్రభుత్వాలు చెబుతుంటాయి. అటువంటి ఉద్యమాలకే చట్టాల రక్షణ, ప్రోత్సాహం ఉంటాయని ప్రకటిస్తుంటాయి. ఎంత చిన్నడిమాండ్ మీద జరిగే ఉద్యమమైనా, అధికారుల, పోలీసుల తీరు వల్ల, వాళ్లు కల్పించే అవరోధాల వల్ల ఎక్కడో ఒక చోట ఉద్రిక్తమవుతుంది. శాసనోల్లంఘన, సహాయనిరాకరణ సత్యాగ్రహంలో భాగమని, అన్యాయ పాలనను ఎదిరించడం నైతికమయిన బాధ్యత అని గాంధీజీ కూడా అన్నారు. పాలకరాజకీయాల పెద్దలు నడిపే ఉద్యమాలు కూడా బరి తెగించకుండా ఉధృతం కావు. బుద్ధిగా, వినయంగా జరిగే పోరాటాలను మెచ్చి మేకతోలు కప్పిన ఉదంతాలు, ప్రజానుకూలంగా పరిష్కరించిన దాఖలాలు చరిత్రలో పెద్దగా కనబడవు. ప్రజలు కోరుతున్నదానికి, ఆధిక్య వర్గాల వారి ప్రయోజనాలకు మధ్య ఉన్న ఘర్షణే ప్రధానంగా ప్రభుత్వవైఖరులను నిర్ణయిస్తుంది తప్ప ఉద్యమం ఏ తీవ్రతతో నడుస్తోంది అన్నది కాదు.
ప్రజల అసమ్మతి కానీ, ఆకాంక్షకానీ ఎంతో నైతికతతో, అనవసర ఆవేశాలను నిగ్రహించుకుంటూ వ్యక్తం అవుతున్నప్పటికీ, ప్రభుత్వాలు, ఏలికలు దాన్ని అశాంతిగానే, హింసగానే పరిగణిస్తారు. సమాజంలో ఎవరో ఒకరు మిలిటెంట్ వ్యక్తీకరణ చేస్తుంటే, వారికీ వీరికీ లింకులు పెడతారు. తీవ్రవ్యక్తీకరణలను నిరోధించడానికి కొత్త చట్టాలు చేస్తాము, కట్టుదిట్టాలు పెంచుతాము అన్నారంటే అర్థం, అంతిమంగా ఏ ఉద్యమవ్యక్తీకరణనైనా నిరోధించడానికి, నిషేధించడానికి ప్రయత్నిస్తున్నట్టే. పౌరసత్వ సవరణ చట్టానికి ఢిల్లీలో నిరసనలు వ్యక్తమయినప్పుడు, రైతాంగం నెలల తరబడి దేశరాజధానిలో ఆందోళన చేసినప్పుడు, ప్రభుత్వం వాటిలో అర్బన్ నక్సలిజాన్ని, తీవ్రవాదాన్ని చూసింది. కార్యకర్తల మీద ఉపా కేసులు, రాజద్రోహం కేసులు పెట్టింది.
మహారాష్ట్రలో ఈ మధ్య ఉభయసభల ఆమోదం పొందిన ‘ ప్రత్యేక ప్రజా భద్రతాచట్టం’ (ఎంఎస్పిఎస్ఎ)మీద పౌరసమాజం, ప్రతిపక్ష రాజకీయపార్టీలు చెబుతున్నఅభ్యంతరాలను ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. అర్బన్ నక్సలిజాన్ని నిరోధించడానికి ఈ చట్టాన్ని ఉద్దేశించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అది అన్నిరకాల ఉద్యమాలను, పోరాటాలను అణచివేయడానికి తీసుకువస్తున్నారని విమర్శకులు అంటున్నారు. బిజెపికి వ్యతిరేకులైనవారందరి మీదా ఈ చట్టాన్ని ప్రయోగిస్తారని, ప్రతి అసమ్మతినీ నేరంగా పరిగణిస్తారని ఉద్ధవ్ ఠాక్రే ప్రజలను హెచ్చరించారు. ‘చట్టవ్యతిరేక కార్యకలాపాలు’ అన్న మాటకు ఇచ్చిన విస్తృతార్థం కారణంగా, కార్మికనాయకులను, ప్రజాఉద్యమాలను ఈ చట్టం లక్ష్యంగా పెట్టుకునే ప్రమాదం ఉందని మార్క్సిస్టు పార్టీ చెప్పింది. ఇది క్రూరచట్టమని, సామాన్యులను, వారి నిరసనలను అణచివేయడమే దాని అసలు లక్ష్యమని కాంగ్రెస్ విమర్శించింది. ఇదంతా నియంతృత్వ అధికారానికి దారితీస్తుందని అందరూ అన్నారు. అర్బన్ నక్సలైట్ల మీద మాత్రమే గురిపెడితే తమకు పెద్ద అభ్యంతరం లేదన్న ధ్వని ఇందులో వినిపిస్తుంది కానీ, నల్లచట్టాల సందర్భంగా ప్రతిఘటన ఇటువంటి వాదనలతోనే తలెత్తడం సహజం. అర్బన్ నక్సలైట్ల హక్కుల గురించి , వారి తరఫున మాట్లాడే ధైర్యం, సంసిద్ధత ఇప్పుడెవరికీ లేవు కాబట్టి కూడా ఆ పరిమితిని అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ఒక తరహా వ్యక్తీకరణ మీద నిర్బంధాన్ని అనుమతిస్తూ పోతే, అది చివరకు అన్ని వ్యక్తీకరణలనూ ఆవరించగలదన్న సత్యాన్ని అందరికీ అనుభవంలోకి రావడం కూడా నిజం.
ఈ బిల్లు మహారాష్ట్రలోనే మొదటగా ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న వేసుకోవాలి. ‘మొదటగా’ అంటున్నామంటే, కారణం – ఇటువంటి చట్టాలు మునుపు వేరే రాష్ట్రాలలో ఉన్నప్పటికీ, అర్బన్ నక్సలైట్లను లక్ష్యంగా ప్రకటించుకుంటూ వస్తున్న మొదటి చట్టం కాబట్టి. అర్బన్ నక్సలైట్లతో వ్యవహరించడానికి ఇతర రాష్ట్రాలతో సరిసమానమైన చట్టవ్యవస్థ ఉండాలన్న కారణంతో ఈ బిల్లును తీసుకువస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. చత్తీస్గఢ్, తెలంగాఇణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో ఇటువంటి చట్టం ఉన్నదని, తమ దగ్గర కూడా ఉంటే సమన్వయం కుదురుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం వివరించింది. నిజానికి, ఇటువంటి కొత్తచట్టం అవసరమేమీ లేదు. ఈ బిల్లులో ఉన్న అనేక అంశాలు, ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉనికిలో ఉన్న ‘ఉపా’ వంటి చట్టాలలో ఉన్నవే. పైగా, మహారాష్ట్రలో ‘మోకా’ వంటి ప్రత్యేక చట్టం కూడా అమలులో ఉన్నది
కొద్దికాలంగా జాతీయస్థాయిలో, అర్బన్ నక్సలిజం అన్నమాటను నిందార్థంలో బహుళ ప్రచారంలో పెట్టారు. రాహుల్ గాంధీని కూడా ఆ మాట ఆపాదించి విమర్శించారు. ముందే డెడ్ లైన్ ప్రకటించిన 2026 మార్చి నాటికి సాయుధ మావోయిస్టుల అణచివేత తరువాత, భావ, ప్రచార రంగాలలో ప్రభావ శీలురుగా ఉన్న ఉద్యమకారులను, మావోయిస్టు సానుభూతిపరులను తగిన పద్ధతిలో అదుపుచేయాలన్న ఆలోచనను కేంద్రప్రభుత్వ పెద్దలు సూచిస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా ‘వామపక్ష తీవ్రవాదాన్ని’ లక్ష్యంగా పెట్టుకుని తీసుకువస్తున్న మొదటి ప్రజాభద్రతాచట్టం ఈ మహారాష్ట్ర చట్టం. 1992లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, 2005 లో తీసుకువచ్చిన ప్రజాభద్రతాచట్టాలు ప్రధానంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలను, సంస్థలను, వ్యక్తులను నిర్వచించడానికి, నిషేధించడానికి ఆస్తుల స్వాధీనానికి ఉద్దేశించినవి. వాటి సందర్భం కూడా ‘వామపక్ష తీవ్రవాదమే’ అయినప్పటికీ, ప్రత్యేకించి చట్టాలలో అట్లా పేర్కొనలేదు. వాటి ఆధారంగానే నాటి పీపుల్స్వార్ను, అనేక ప్రజాసంస్థలను నిషేధించారు. ఇప్పుడు జాతీయ స్థాయిలోనే మావోయిస్టు పార్టీ నిషేధంలో ఉన్నది కాబట్టి, ఆయా రాష్ట్రాలు వేరుగా నిషేధించనక్కరలేదు. అందుకే ప్రస్తుత బిల్లు ఉద్దేశ్యం, లక్ష్యం ప్రత్యేకమైనవి. పైగా, బిల్లు మీద నియమించిన సంయుక్త సభాసంఘం (జాయింట్ సెలక్ట్ కమిటీ) చేసిన సిఫారసులలో చట్టం పేరులోనే అర్బన్ నక్సలైట్ నిరోధక అన్నవిశేషణం చేర్చాలన్న సూచన ఉన్నదట. సభాసంఘం సూచించిన మూడు చిన్న చిన్న మార్పులకు అంతిమ రూపంలో చోటు కల్పిస్తారో లేదో ఇంకా తెలియదు. గవర్నర్ సంతకం తరువాత చట్టంగా మారే మహారాష్ట్ర బిల్లు, అనేక ఇతర రాష్ట్రాలలో, ముఖ్యంగా ఎన్డిఎ పాలిత రాష్ట్రాలలో, రాబోయే బిల్లులకు ప్రారంభం కావచ్చు.
తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాలతో కలగలసి ఉన్న మావోయిస్టు ప్రాబల్య అటవీ ప్రాంతం మహారాష్ట్రలో ఉంది. అదే సమయంలో, దక్షిణాది రాష్ట్రాలను మినహాయిస్తే, దేశంలో విస్తృతమైన పౌరసమాజం కూడా మహారాష్ట్రలోనే ఉంది. మావోయిస్టు, దళిత ఉద్యమాలు బలంగా ఉన్నచోటు. కార్మికోద్యమం అవశేషాలు, సినిమారంగంతో ముడిపడిన అభ్యుదయాలు ఇంకా మిగిలిన చోటు. బీమా కోరేగావ్ కేసులో కూడా ఈ రాష్ట్రం నుంచి నిందితులు ఎక్కువ. 2024 లోనే సభాప్రవేశం చేసిన ఈ బిల్లు, రాష్ట్ర ఎన్నికల తరువాత, సభాకమిటీ నివేదిక సమర్పించిన తరువాత, పునరుత్థానం చెందింది.
వ్యక్తులు, లేదా సంస్థలు, ముఖ్యంగా నక్సలైట్, అర్బన్ మావోయిస్టు చర్యలతో సంబంధం కలిగిన వ్యక్తులు, సంస్థలు, శాంతిభద్రతలకు ముప్పు కలిగించకుండా, హింసను ప్రేరేపించకుండా, ప్రభుత్వాల చట్టబద్ధ పాలనను అడ్డుకోకుండా చర్యలుతీసుకోవడానికి, ఆ నేరాలకు పాల్పడితే శిక్షించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ‘చట్టవ్యతిరేక’ గుర్తింపును సమీక్షించడానికి ముగ్గురు హైకోర్టు న్యాయాధికారులతో ఒక సలహా బోర్డు ఉంటుంది కానీ, నిందితులకు, చట్టవ్యతిరేక సంస్థల విషయంలో కోర్టుల జోక్యం మీద పరిమితులు ఉంటాయి. ఈ చట్టం కింద నేరాలన్నీ పోలీసు యంత్రాంగం నేరుగా కల్పించుకోవడానికి వీలుగా ఉంటాయి. వారంటు లేకుండా అరెస్టు చేయవచ్చు. నేరారోపణలన్నీ బెయిల్ లభించేవి కావు. చట్టవ్యతిరేకసంస్థలో సభ్యులకు 2-3 సంవత్సరాల జైలు, ౩ లక్షల దాకా జరిమానా విధించవచ్చు. సభ్యులు కాకుండా చట్టవ్యతిరేక సంస్థకు నిధులు సేకరిస్తే, రెండు సంవత్సరాల జైలు, రెండు లక్షల జరిమానా దాకా విధించవచ్చు. చట్టవ్యతిరేక సంస్థను నిర్వహిస్తే, ప్రచారం చేస్తే మూడు సంవత్సరాల జైలు, మూడు లక్షల జరిమానా, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా, వాటిని ప్రోత్సహించినా, ప్లాన్ చేసినా 7 సంవత్సరాల జైలు, 5 లక్షల జరిమానా దాకా ఎదుర్కోవాలి. చట్టవ్యతిరేక కార్యక్రమాలలో ప్రత్యక్షప్రమేయానికి అత్యధిక శిక్ష ఏడేళ్లు, అత్యధిక జరిమానా ఐదు లక్షలు. నోటిఫై సంస్థలతో సంబంధం ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. విచారణ ప్రారంభం కాకుండానే, స్తిరాస్తులలో నివసించేవారిని తొలగిస్తారు.
పైవన్నీసరే, అసలు సమస్య, చట్టవ్యతిరేకత కార్యక్రమానికి ఇచ్చిన నిర్వచనంలోనే. ప్రభుత్వ కార్యక్రమాలను భగ్నం చేసే హింస, దొమ్మీ, మారణాయుధాల, పేలుడు పదార్థాల వాడకం వంటివి ఎట్లాగూ చట్టవ్యతిరేకమైనవే. వాటికి తోడు, “ ప్రజాభద్రతకు ప్రమాదం కలిగించే విధంగా, చట్టబద్ధ వ్యవస్థల మీద అవిశ్వాసం కలిగే విధంగా చేసే చర్యలు, మాట్లాడే మాటలు, రాసే రాతలు” అన్నీ చట్టవ్యతిరేకంగానే పరిగణన పొందుతాయి. చట్టవ్యతిరేక సంస్థ అని నోటిపై అయిన సంస్థకు అనుకూలంగా ప్రచారం చేయడం, వాటిని ప్రోత్సహించడం వంటి వన్నీ ప్రాసిక్యూషన్ ఎట్లాగైనా అన్వయించే అవకాశమున్న నేరాలు. ఒక ప్రజా ఉద్యమ సంస్థను చట్టవ్యతిరేకంగా నోటిఫై చేస్తే, ఆ ఉద్యమం నాయకులు, భాగస్వాములు, సానుభూతిపరులు, సమర్థకులు, మంచిచెడ్డలు వివేచించి రాసే పాత్రికేయులు, రచయితలు – అందరూ నేరస్థులే అవుతారు. బెయిల్ దొరకని అభియోగాలు కావడం, సమీక్షకు ఆరునెలల దాకా అవకాశం ఉండడం కారణంగా, ప్రభుత్వం నింద మోపినవారందరూ కనీసం ఆరునెలల పాటు నిర్బంధంలో ఉండవలసి ఉంటుంది. ఢిల్లీ హింసాకాండ కేసుల్లో బందీలుగా ఉన్న విద్యార్థి ఉద్యమకారులు మూడేళ్లకు పైబడి బెయిల్, విచారణ లేకుండా నిర్బంధంలో ఉండడం, బీమాకోరేగావ్ కేసులో ఇప్పటికీ అనేకులు జైలులో ఉండడం గమనిస్తే, ఈ ప్రజాభద్రతాచట్టంలో అధికారికంగా పేర్కొన్న శిక్షలు పెద్ద విశేషంగా, కఠినమైనవిగా అనిపించవు. కానీ, ప్రజా ఉద్యమకారుల విషయంలో, విచారణ పూర్తి చేసి శిక్షలు విధించడం కంటె, రిమాండ్లో దీర్ఘకాలం బాధించడమే లక్ష్యంగా ప్రాసిక్యూషన్ వ్యవహరిస్తోంది.
వివిధ వామపక్షాలకు అనుబంధంగా ఉన్న ట్రేడ్ యూనియన్లు, ప్రజాసంఘాలు, ఇక ముందు ఈ చట్టం భయంతో వ్యవహరించవలసి వస్తుంది. రాజీ లేని పోరాటాలకు తెగించే ఎవరైనా చట్టవ్యతిరేక ముద్రను ఎదుర్కొనే ప్రమాదముంటుంది. అంతెందుకు, మహారాష్ట్ర ప్రజాభద్రతాచట్టాన్ని వ్యతిరేకించే పార్టీల వారు కూడా చట్టవ్యతిరేక శక్తులకు అనుకూలంగా మాట్లాడుతున్నారన్నఅభియోగాలను ఎదుర్కొనవలసి రావచ్చు. యాభైమూడు మంది సభ్యులున్న మహారాష్ట్ర ప్రతిపక్షం, బలహీనస్వరంతో తప్ప సభలో అభ్యంతరాలు చెప్పలేకపోయారంటే, కునారిల్లిన ప్రతిపక్షాలను ఇటువంటి బిల్లులను ఇంకెంతగా పాతాళానికి తొక్కేస్తాయోనని భయం వేస్తుంది.
అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు? ఆ మాట సాయుధ విప్లవకారుల సంస్థలు అంగీకరించేది కాదు. బహిరంగ ప్రజాజీవితంలో ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయవాదులు, హక్కుల కార్యకర్తలు, దళిత, ఆదివాసీ సాధికార శక్తులు, ఆయా రంగాలలో న్యాయం కోసం పోరాడతారు. అనేక సందర్భాలలో, వారి వాదన, వివిధ రాజకీయపక్షాల వైఖరితో సమన్వయించవచ్చు, అట్లాగే, మావోయిస్టుల వైఖరితో కూడా సరిపోలవచ్చు. అట్లాగని, వారందరూ అర్బన్మావోయిస్టులు అవుతారా? ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలతో వివిధ ప్రజాస్వామ్య వేదికల ద్వారా గట్టిగా పోరాడుతున్నవారు ఇప్పటికే, రాజ్యం అణచివేతను రుచిచూస్తూ ఉన్నారు. వారికి ఈ బిల్లు కొత్తగా పెట్టే భయమేమీ లేదు. అంతకు మించిన విశాల ఆవరణంలో, ప్రజల సంక్షేమాన్ని, సామాజిక న్యాయాన్ని, చట్టబద్ధ పాలనను కోరే వారు, భావప్రకటనా స్వేచ్ఛను హక్కుగా వినియోగిస్తున్న వారు, ఇప్పటిదాకా అధికారపు కొరడాకొస రుచితెలియనివారు – ఈ శ్రేణులన్నీ ఇప్పుడు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ‘నరివెట్ట’ సినిమాలో మాదిరి గానే, సాధారణ ఉద్యమాలను అణచడానికి కూడా ‘తీవ్ర ముద్ర’లు ఉపయోగిస్తారు.
కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీ విశ్వసించే సిద్ధాంతానికి గురుతుల్యులైన పెద్దమనిషి ప్రకారం, హిందూదేశానికి మైనారిటీలు, కమ్యూనిస్టులు గర్భ శత్రువులు. ప్రభుత్వ వ్యవహారసరళిలోను, ఆ రాజకీయపార్టీ శ్రేణులలోను ఆ వైరం, తీవ్రరూపంలో వ్యక్తమవుతూనే ఉన్నది. కమ్యూనిస్టు రహిత భారత్ వారి అమృతకాల లక్ష్యం. దాన్నిసాధించడం మీద వారు సీరియస్ గా ఉన్నారు. అందులో భాగమే ‘కగార్’ అయినా, ఈ చట్టమైనా! మావోయిస్టుల వంటి సాయుధ కమ్యూనిస్టులను అణచివేసిన తరువాత, తక్కిన కమ్యూనిస్టులను వదిలిపెడతారనుకోవడం భ్రమ. సంస్థానిర్మాణాల్లో ఉండే విభేదాలు, భావావరణంలో ఉండవు, స్థూలంగా ప్రజానుకూలంగా వ్యవహరించేవారి మధ్య సరిహద్దులు స్పష్టంగా ఉండవు. కాబట్టి, కమ్యూనిస్టులకే కాదు, ఉదార, ప్రజాస్వామిక, కనీస అభ్యుదయ భావాలను విశ్వసించే వారందరికీ ఇబ్బందులు వస్తాయి. ఎంఎస్పిఎస్ఎ- 2024, ఆ నిర్బంధ పర్వానికి పూరించిన ‘పాంచజన్యం’.
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డిఎ ప్రభుత్వం కూడా మహారాష్ట్రను చూసి తన ప్రజాభద్రతాచట్టానికి కొత్త కోరలు తొడగవచ్చు.
కే శ్రీనివాస్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.