కేంద్ర ఆర్థిక మంత్రి ప్రజలకోసమే ఈ బడ్జెట్ అని గొప్పగా చెప్పుకున్నప్పటికీ ప్రజాజీవితాలతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్న సామాజిక రంగాల కేటాయింపులు ఆయా రంగాల అవసరాలకు ఎంతో దూరంగానే ఉన్నాయి.
వికసిత భారత నిర్మాణం కోసం ఆర్థిక రంగంతో పాటు ప్రజలపై కూడా పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించడం సంతోషదాయకమే. ప్రజా జీవితాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసేదీ, జీవన ప్రమాణాలు పెంచటంలో కీలక పాత్ర పోషించే రంగాల్లో ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం కేటాయించే నిధులు తక్కువగా ఉన్నాయి. వివిధ ప్రభుత్వ కమిటీలు, విధాన నిర్ణాయక సంస్థలు, పరిశోధనలు ప్రతిపాదించినట్లు స్థూల జాతీయోత్పత్తిలో విద్యా రంగానికి ఆరు శాతం, వైద్యరంగానికి మూడు శాతం నిధులు కేటాయించాలంటే ప్రస్తుత బడ్జెట్ తరహాలో కొనసాగటం ఏమాత్రం సరిపోదు.
పాఠశాల విద్య
పాఠశాల విద్యకు గత 2024`25 సంవత్సరంలో 73000 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత బడ్జెట్లో దీన్ని 78600 కోట్లకు పెంచారు. అంటే కేవలం 7.6 శాతం పెరుగుదల. ప్రభుత్వ అంచనాల ప్రకారమే ద్రవ్యోల్బణం షుమారు ఆరుశాతం ఉంది. అంటే ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే పాఠశాల విద్య రంగానికి కేటాయింపుల్లో పెరుగుదల లేనేలేదని చెప్పాలి. బడ్జెట్ ప్రసంగంలో పాఠశాల విద్య రంగానికి మౌలిక వసతుల కొరత గురించి మాటమాత్రం కూడా ప్రస్తావించలేదు. మౌలిక వసతులు విస్మరించి డిజిటల్ వనరుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వటం వలన పెద్దగా ప్రమాణాలు పెరిగేదేమీ లేదు. సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చే అదనపు అవకాశాలు వినియోగించుకోవటం ఎంత అవసరమో బాల్యం నుండే డిజిటల్ సేవలకు దూరంగా ఉన్న జనాభాను ప్రత్యేకించి విద్యార్ధులను మెయిన్ స్ట్రీంలోకి తీసుకురావటం అంతకన్నా ముఖ్యమైనది. ప్రతి ఏటా కేటాయించిన బడ్జెట్లు కూడా ఖర్చు చేయకపోవటం మరింత ఆందోళనకరమైన అంశం. ఉదాహరణకు 2024`25 బడ్జెట్లో పాఠశాల విద్యకు కేటాయించినదానికంటే ఐదువేలు కోట్లు ఖర్చు పెట్టలేకపోయింది కేంద్ర ప్రభుత్వం.
గత రెండు దశాబ్దాలుగా అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకానికి ఇప్పుడు ప్రధానమంత్రి పోషణ పథకం అని పేరు పెట్టారు. స్వభావం రీత్యా ఇది మంచి పథకం. ప్రారంభ దినాల్లోనూ ప్రత్యేకించి కోవిడ్ కాలంలోనూ ఈ పథకం కీలకపాత్ర పోషించింది. సమాజంలో వెనకబడి కుటుంబాలకు చెందిన పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ఎంతో కొంత ప్రయత్నం జరిగింది. ప్రత్యేకించి విద్యార్ధినులకు ఎక్కువ ఉపయోగం జరిగింది. ఇప్పటికీ విద్యార్ధుల పౌష్టికాహారం విషయంలో కనీసం ఒకపూటైనా కడుపు నిండా తినేందుకు అవకాశం కలిగిస్తోంది. రోజురోజుకీ ఎక్కువమంది విద్యార్ధులు పాఠశాలలో చేరటంతో పదోతరగతి వరకూ ఈ పథకాన్ని విస్తరించాలన్న డిమాండ్ కూడా ముందుకొస్తోంది. ఈ పథకాన్ని ఆశించి ఆదరిస్తున్న వారిలో ఎక్కువమంది విద్యార్ధులు ఉదయాన్నే బడికి వచ్చేటప్పుడు కనీసం లంచ్ బాక్స్ తెచ్చుకోలేని స్థితిలో ఉన్న వారు కూడా ఇప్పటికీ ఉన్నారని అటువంటి వారికి మధ్యాహ్న భోజన పథకం వరదాయనిగా మారిందని అనేక సర్వేల్లో వెల్లడైంది. మద్యాహ్న భోజన పథకంలో భాగంగా మరింత పోషకాహారం అందించేందుకు అనేక సూచలు, సలహాలు వస్తున్నా ఇప్పుడున్న బడ్జెట్ కేటాయింపుల్లో ఇవేవీ సాధ్యం కాని పరిస్థితి ఏర్పడిరది. 2024`25లో ఈ పథకానికి రు.12467 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం దాన్ని రు.12500 కోట్లకు మాత్రమే పెంచారు. ఇది పెరుగదల అని మహా అయితే ప్రభుత్వ వర్గాలు చెప్పుకుంటాయి తప్ప మరెవ్వరూ చెప్పుకోలేరు. కానీ గత సంవత్సరం ఈ పథకం కింద ఖర్చు పెట్టింది కేవలం 10 వేల కోట్లు మాత్రమే. కేటాయింపులే అరకొర అనుకుంటున్నప్పుడు ఆ అరకొర కేటాయింపులు కూడా పూర్తిగా ఖర్చు కాకపోవటం వెనక ఉన్న మతలబు ఏమిటన్నది వెలికి తీయటానికి లోతైన పరిశోధన అవసరం.
అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం
మధ్యాహ్న బోజన పథకం గురించి బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావన రాకపోయినా గర్భవతులైన మహిళలకు, బాలింతలకు, శిశువులకు ఎంపిక చేసిన జిల్లాల్లో అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్లు ప్రస్తావించారు. ఎంపిక చేసిన జిల్లాలు అంటే అభివృద్ధికి దూరంగా ఉన్న జిల్లాలు అన్నమాట. గతంలో వెనకబడిన ప్రాంతాలు అని ప్రణాళిక సంఘం ఓ వర్గీకరణ చేసేది. ఇప్పుడు ఆ వర్గీకరణను రద్దు చేసిన బిజెపి తన రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త వర్గీకరణను ముందుకు తెచ్చింది. ఆ కొత్త వర్గీకరణే అభివృద్ధి కాంక్షిస్తున్న జిల్లాలు అన్న వర్గీకరణ. దీన్నే పత్రికా పరిభాషలో ఎంపిక చేసిన జిల్లాలు అంటున్నారు.
ఈ పథకాన్ని అమలు చేయాలంటే పథకం కింద ప్రజలకు అందించే వనరులకు వెల కట్టాలి. పెరుగుతున్న ధరల నేపథ్యంలో సరైన సరసమైన వెల నిర్ణయిస్తామని ఆర్థికమంత్రి తెలిపారు. ఈ సవరణ చాలా అవసరం. ప్రస్తుతం శిశువులకు ఎనిమిది రూపాయల విలువైన పౌష్టికాహారం అందిస్తుంటే బాలింతలకు, వయోజనులైన యువతులకు తొమ్మిదిన్నర రూపాయల విలువైన పౌష్టికాహారం సరఫరా చేస్తున్నారు. ఈ విలువలు ఏడేళ్ల క్రితం నిర్ధారించిన విలువలు. ఈ ఏడేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు కనీసం ఏడురెట్లు పెరిగాయి. కానీ ప్రభుత్వం లబ్దిదారులకు ఇచ్చే వనరుల ఖరీదు మాత్రం మార్చలేదు. ఈ పరిస్థితుల్లో ఈ ధరలు సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ పథకాల గురించి ఇంత గొప్పగా చెప్పుకున్నప్పటికీ కేటాయింపులు ఏమీ పెద్దగా మారలేదు. పెరగలేదు. గమ్మత్తుగా 2024`25 బడ్జెట్లో ఈ పథకాల కింద 21200 కోట్లు కేటాయించారు. సవరించిన అంచనాల్లో దీన్ని 20070 కోట్లకు తగ్గించారు. మళ్లీ ప్రస్తుత బడ్జెట్ అంచనాల్లో ఈ పథకాల కేటాయింపు 21960 కోట్లకు పెంచారు. స్థూలంగా చూసినప్పుడు పెరుగుదల లేదని తెలిసిపోతోంది. అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం కేటాయింపులు గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ పెరుగుదల కేవలం లబ్దిదారుల సంఖ్య పెంచటానికే కాదు. ఈ పథకాల అమలుకు కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచేందుకు కూడా అవసరమే.
వైద్యరంగంపై ఖర్చు
వైద్య ఆరోగ్య రంగానికి కేటాయించిన బడ్జెట్ కూడా అవసరాలు తీర్చేదిగా లేదు. తన బడ్జెట్ ప్రసంగంలో వైద్య కళాశాలల్లోనూ, శిశు సంరక్షణా కేంద్రాల్లోనూ సీట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. సదుద్దేశ్యాలే. కానీ వైద్య ఆరోగ్య శాఖకు కేటాయింపులు ఈ సదుద్దేశ్యాలను ఆచరణ సాధ్యం చేసేవిగా లేవు. ఆరోగ్య, శిశు సంక్షేమ శాఖకు పోయినేడాది 88000 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం కేటాయించింది 96000 కోట్లు. పోయిన సంవత్సరం బడ్జెట్తో పోలిస్తే దాదాపు ఎనిమిది వేల కోట్లు అదనం అనిపిస్తుంది కానీ సవరించిన అంచనాలతో పోలిస్తే పెరిగింది వేయి కోట్లే. పెరుగుతున్న అవసరాలను తీర్చటానికి కనీసం ఈ బడ్జెట్ను రెట్టింపు చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా అపరిష్కృతంగా మిగిలిపోయింది.
జాతీయ ఆరోగ్య పథకం ప్రధానంగా వైద్య ఆరోగ్య సేవలు అందించేందుకు కావల్సిన మౌలికసదుపాయాల కల్పనపై కేంద్రీకరిస్తోంది. ప్రత్యేకించి ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలను బలోపేతం చేయటం ఈ పథకం లక్ష్యంగా ఉండేది. ఈ పథకానికి కేటాయించిన నిధుల్లో కేవలం 3.4 శాతం పెరుగుదల మాత్రమే కనిపిప్తోంది. పోయిన సంవత్సరం ఈ పథకానికి కేటాయించింది 34000 కోట్లు. ఈ సంవత్సరం కేటాయించింది 37223 కోట్లు. మరోవైపున ప్రధానమంత్రి జన్ ఆరోగ్య పథకం ప్రధానంగా బీమా వ్యాపారాన్ని ప్రోత్సహించే పథకం. ఈ పథకానికి గత సంవత్సరం 7300 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 9406 కోట్లు కేటాయించారు. ఈ పథకాన్ని వయో వృద్ధులకు కూడా వర్తింపచేయాలని ప్రతిపాదించినప్పుడు ఈ కేటాయింపుల పెరుగుదల ఊహించినదే. బీమా రంగంలో ప్రధాన సేవలు ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించుకుంటున్న తరుణంలో ఇటువంటి పథకానికి కేటాయింపులు పెంచటం అంటే సార్వత్రిక ప్రజోపయోగ అవసరాలకు వనరులు కుదించటమే. ఈ మోడల్ వలన తలెత్తే సమస్యల గురించి మరింత లోతైన విశ్లేషణ అవసరం.
ఏతావాతా చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో సామాజిక రంగాలు అప్రధానమైనవన్న అంచనా మరోసారి రుజువైంది. అమర్త్యసేన్ ప్రతిపాదించిన మానవ పెట్టుబడి వనరుల అభివృద్ధిలో విద్య, వైద్య ఆరోగ్య రంగాలు కీలకమైనవి. వాటి ఆధారంగానే నైపుణ్యాలు అభివృద్ధి అవుతాయి. నైపుణ్యవంతమైన కార్మికులు ఉంటేనే ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది. దేశం ఆర్థిక శక్తిగా అవతరిస్తుంది. అందుకే ఆరోగ్యపరంగా శక్తివంతమైన కార్మికవర్గాన్ని తయారు చేసుకోవడానికి ఈ పథకాలు కీలక పునాదులు వేస్తాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి పథకాలకు నిధులు కోత కోయటం, నామమాత్రంగా పెంచటం అంటే దేశాన్ని ఆర్థిక శక్తిగా తయారు చేయాలన్న లక్ష్యాన్ని విస్మరించటమే.
దీపా సిన్హా
అనువాదం : కొండూరి వీరయ్య