
మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్రాలకు కేంద్రం అందించే కాపెక్స్ రుణాలకు కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈమారు తొలిసారిగా రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు కాపెక్స్ రుణాలను పొందే వీలుకల్గింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన రూ 1.5 లక్షల కోట్ల కాపెక్స్ రుణాలలో 60 శాతం అంటే 87 వేల కోట్ల రుణాల విషయంలో సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర నిర్ణయం పలు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగకరంగా మారింది.
50 ఏళ్లకుగాను ఈ రుణాలు వడ్డీ లేకుండా కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వనుంది. అయితే రాష్ట్రాల్లో మౌలిక సౌకర్యాల కల్పన కోసం మాత్రమే ఈ రుణాలను వినియోగించాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ మూలధన వ్యయం పెంచుకునేందుకు ప్రోత్సాహం అందించడంతో పాటు దేశ వ్యాప్తంగా మౌలిక సౌకర్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ప్రత్యేకించి కీలకమైన మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేసేలా, తద్వారా ప్రజలకు అందించే సేవలను మెరుగుపరుస్తూ ఆర్థిక ప్రగతిని సాధించేలా రాష్ట్రాలను ప్రోత్సహించడమన్నదే ఈ రుణాల ముఖ్య ఉద్దేశ్యం. గత కొన్నేళ్లుగా సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక సౌకర్యాలతో కూడిన ప్రగతి లక్ష్యంగా పీపీపీ పద్ధతిలో ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్రం సూచిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం మొదటగా ఇచ్చే 87వేల కోట్ల రుణాలను ,రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎక్కువగా అన్‌టైడ్, ప్రాజెక్టు లింక్డ్ రుణాలుగా 2026 ఆర్ధిక సంవత్సరానికి అందిస్తారు. నిర్దేశించిన 1.5 లక్షల కోట్లలో మిగిలిన 63 వేల కోట్ల రూపాయలను రాష్ట్రాల వారీగా సంస్కరణలకు అనుసంధానంగా విడుదల చేస్తారు. అయితే 63 వేల కోట్ల విషయంలో తరువాత మార్గదర్శకాలను జారీ చేయనున్నారు.
2026 ఆర్ధిక సంవత్సరానికి కాపెక్స్ రుణాలుగా అందించే 87 వేల కోట్లలో ముందుగా రాష్ట్రాలకు 55 వేల కోట్లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 2వేల కోట్లు కేటాయించారు. 15వ అర్ధిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర పన్నులు, సుంకాల వాటాలకు అనుగుణంగా రాష్ట్రాల మధ్య ఈ 55 వేల కోట్లు రుణాలుగా పంపిణీ చేస్తారు. యూటీల విషయంలో 2వేల కోట్లలో కాశ్మీర్‌కు 12వందల కోట్లు, ఢిల్లీకి 600 కోట్లు, పుదుచ్చేరికి 200 కోట్లు కేంద్రం కేటాయించింది.
రాష్ట్రాలకు, యూటీలకు కేటాయించిన ఈ నిధులలో తప్పనిసరి షరతులకు లోబడి వున్న వాటికి తొలి ఇన్స్టాల్మెంట్గా 66 శాతం రుణాన్ని అందజేస్తారు. మిగిలిన 34 శాతం రుణాన్ని, మొదటి విడతగా పొందిన రుణం 75 శాతం వినియోగించిన వివరాలు, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర వాటాను 2025 మార్చి నాటికి ఎంత జమచేశారన్న దాని ఆధారంగా అందజేస్తారు.
అంతే కాకుండా రాష్ట్రాల వారీగా సామర్థ్యం పెంచడానికి 2023-24 కంటే 2024-25 మూలధన వ్యయంలో 10 శాతం కంటే ఎక్కువ వృద్ది రేటు సాధించిన అవకాశం ఉన్న రాష్ట్రాలు, యూటీలకు ఇవ్వడానికి మరో 15 వేల కోట్లు కేంద్రం అందుబాటులో ఉంచింది. అలాగే 2025 ఆర్దిక సంవత్సరంలో రాష్ట్రాల సొంత మూలధనం వృద్ది కోసం కేంద్రం 25 వేల కోట్ల సహాయాన్ని అందించింది. అలాగే రైల్వే ప్రాజెక్టులు, మెట్రోరైలు ప్రాజెక్టులు, హైవేలు, విద్యుత్ ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, జల్ జీవన్ మిషన్, అమృత్, PMGSY కోసం వివిధ పథకాలకు, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 10వేల కోట్లు కేంద్రం కేటాయించింది. ఈ నిధులకోసం రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాజెక్టులు, పథకాల జాబితాను 2025 అక్టోబర్ 15 తేదీ నాటికి కేంద్రానికి సమర్పించాలి.
పట్టణ ప్రాంతాల్లోని పోలీసు సిబ్బంది, పోలీసు స్టేషన్లకు గృహనిర్మాణం, యూనిటీ మాల్స్ నిర్మాణం, విద్యార్ధులకు లైబ్రరీలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఐకానిక్ టూరిస్ట్ సెంటర్లు, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల కోసం గత సంవత్సరం కాపెక్స్లోన్ పథకంలో ఆమోదించబడిన మూలధన ప్రాజెక్టులకు మరో 5 వేల కోట్లు కేటాయించారు.
2024 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేసిన రూ.1,49,484 కోట్ల కాపెక్స్ రుణాలలో షరతుల కారణంగా రాష్ట్రాలు వినియోగించుకోలేక పోయాయి.
2020-21 నుండి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయం కోసం ప్రత్యేక సహాయ పథకాలను అమలు చేస్తోంది. ఇది రాష్ట్రాలను ప్రోత్సహించడమే కాక, మద్దతు ఇవ్వడానికి పెట్టుబడి ఆధారిత ఆర్థిక వృద్ధిని పెంచడానికి సహాయపడుతుంది. అందుకే ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్రాలకు మరింత ఊతం ఇచ్చేందుకు వీలుగా కాపెక్స్ రుణాల నిబంధనలను కేంద్రం మరింత సడలించింది.
పెరుగుతున్న అప్పుల అవసరాలు..
భారీగా పెరుగుతున్న ఆర్థిక వ్యయాలు, అధికారం కోసం ఇస్తున్న హామీలు దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థిక చిక్కులలో పడేస్తున్నాయి. పెరుగుతున్న ఆర్థిక భారాన్ని భరించడానికి రాష్ట్రాలకు అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్రం ఇచ్చే అప్పుల పైనా ఆధారపడుతున్నాయి. జీఎస్డీపీ ఆధారంగా చూస్తే దేశంలోని 15 రాష్ట్రాలు 2026 ఆర్థిక సంవత్సరంలో అధికంగా అప్పులు చేయాల్సిన అవసరం ఉందని, ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2026 సంవత్సరానికి కొన్ని పెద్ద రాష్ట్రాలు మార్కెట్ రుణాలను పెంచాలని యోచిస్తున్నాయి. అందులో అగ్రస్థానంలో తమిళనాడు వుండగా ఆ తరువాత స్థానంలో మహారాష్ట్ర, కర్ణాటక వున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
రుణం-జీడీఎస్పీ నిష్పత్తి ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తారు. అది 25 శాతం వరకు ఉంటే ఆరోగ్యకర నిష్పత్తిగా పరిగణిస్తారు. చాలా రాష్ట్రాలు ఆ పరిమితిని మించివున్నాయి. 52.3 శాతంతో బీహార్ అగ్రస్థానంలో వుండగా, పంజాబ్ 47.3 శాతం, పశ్చిమ బెంగాల్ 38.9 శాతం, ఆంధ్రప్రదేశ్ 35.1 శాతంతో తర్వాత స్థానంలో నిలుస్తున్నాయి. ఈ నిష్పత్తి 26.07 శాతంగానే వున్నా తమిళనాడు అప్పులు తీసుకోవడంలో ముందు వరుసలో వుంది.
ఆదాయ వ్యయాలు పెరుగుతున్న కొద్దీ, మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడులు తగ్గుతున్నాయి. ఇటీవల కాలంలో అనేక రాష్ట్రాలు బడ్జెట్లో కేటాయించిన కాపెక్స్ లక్ష్యాలను అందుకోవడంలో కష్టపడుతున్నాయి. రాష్ట్రాలు అవసరమైన సంస్కరణలు అమలు చేయడంలో విఫలం అవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఇచ్చే వడ్డీ రహిత రుణాలను 1.5 లక్షల కోట్ల నుంచి 1.25 లక్షల కోట్లకు తగ్గించింది. అయితే పెరుగుతున్న రాష్ట్రాల అవసరాలను దృష్టిలో వుంచుకొని 2026 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కాపెక్స్ రుణాలను మళ్లీ 1.5 లక్షల కోట్లకు పెంచి, నిబంధనలను సడలించడంతో రాష్ట్రాలకు మరింత ఊరట లభిస్తోంది.