మిశ్రమ ఆర్థికవ్యవస్థతో మొదలైన స్వతంత్ర భారత ప్రస్థానం.. కార్పోరేట్లకు రెడ్ కార్పెట్‌లో స్వాగతాలు పలికే దశకు చేరుకుంది. దేశానికి కీలకమైన ఉక్కు, రక్షణ, విద్య, వైద్యం వంటి రంగాల్లో ఒకప్పుడు ప్రభుత్వం కూడా కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ పేరుతో పూర్తిగా ఆ కాడిని పక్కన పడేశారు.బడా కార్పోరేట్లదే రాజ్యం. ఖండాతరాల్లో వందల కోట్ల ప్రాజెక్టులతో దేశ ఆర్థిక వ్యవస్థను, పాలక పక్షాలను శాసించే స్థాయికి అవి విస్తరించాయి. ఈ తిమింగలాల ధాటిని తట్టుకు నిలబడ గల దమ్మూధైర్యం ప్రభుత్వాలకూ లేకపోగా వారి కనుసన్నల్లో మెలుగుతూ అనుకూల విధానాలతో అందలం ఎక్కిస్తున్నాయి.
అభివృద్ధి పేరిట వందల వేల ఎకరాలను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారు. తక్కువ ధరకు నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నారు. స్థానిక ఉపాధి ఈ పరిశ్రమల్లో అంతంత మాత్రమే. ప్రజా ఉద్యమాలను బలప్రయోగంతో అక్రమ అరెస్టులతో అణచి వేస్తున్నారు. అభివృద్ధి ముసుగులో అన్ని రకాలుగా విధ్వంసం జరుగుతోంది. భూసేకరణ కోసం ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేయిస్తున్నారు. పెద్ద ఎత్తున చెట్లను నరికేస్తున్నారు. గూడు చెదిరిన సామాన్య జనం పొట్టచేత పట్టుకుని దూరప్రాంతాలకు వలసలు పోతున్నారు. నిన్నటి వరకు కాడి పట్టి వ్యవసాయం చేసుకుంటూ సగర్వంగా, స్వతంత్రంగా తలెత్తుకు బతికిన అన్నదాత నిర్మాణ కార్మికుడిగా, సెక్యూరిటిగార్డుగా ఆత్మాభిమానాన్ని చంపుకుని బతుకులు వెళ్లదీయవలసిన దుస్థితి.
ఎవరి స్వార్థంవారిది
ఒకప్పుడు పరిశ్రమలు, ప్రభుత్వాలు, పత్రికల మధ్య స్పష్టమైన విభజన రేఖలుండేవి. ఇప్పుడవి పూర్తిగా చెరిగి పోతున్నాయి. ఎవరి ప్రయోజనాలు వారు కాపాడుకోవటానికి పరస్పరం నియంత్రించుకునేందుకు. దారికి తెచ్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. పార్టీలకు, ప్రభుత్వ పగ్గాలు చేపట్టటమే లక్ష్యం. పరిశ్రమలకు` ఆ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి తమ ప్రయోజనాలకు అనుగుణమైన నిర్ణయాలను తెచ్చుకోవడం లక్ష్యం.
ప్రభుత్వాలకూ ప్రజలకు మధ్య వారధిగా ఒకప్పుడు పత్రికలు నిలిచేవి. ఇప్పుడా ఉదాత్త ఆశయాలు పత్రికలలో కనుమరుగయ్యాయి. ప్రభుత్వం విదిల్చే వాణిజ్య ప్రకటనల కోసం అర్రులు చాస్తున్నారు. టెక్నాలజీ విస్తరణతో పత్రికారంగం వివిధ మాధ్యమాలలోకి విస్తరించింది. టీవీలు జత చేరాయి. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది.
అధికారమే సమస్తమని పాలించే పార్టీలు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. సొంతంగా మీడియా సంస్థలను మొదలుపెట్టాయి. తమ అనుకూల పారిశ్రామిక వేత్తలతో మీడియాలో పెట్టుబడులు పెట్టించి, మీడియాను పూర్తిగా తమ చెప్పుచేతల్లోకి తీసుకుంటున్నారు. మరోపక్క ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవటానికి కార్పొరేట్లు బహువిధమార్గాలను అనుసరిస్తున్నాయి. నేరుగా ఆయా పార్టీలకు ఎన్నికల నిధులు సమకూర్చడంతో పాటు, మీడియాలో మెజారిటి షేర్లు కొని ఆ అస్త్రం ద్వారా పాలక పక్షంపై ఒత్తిడి తెస్తున్నాయి.
తమ సొంత మీడియా కోసం పాలక పార్టీలు, ప్రభుత్వ ప్రకటనలను ఉదారంగా గుప్పిస్తున్నాయి. దీనికి తోడు తమ అధినాయకుడిని వార్తల్లో, టీవీ డిబేట్లలో ఆ మీడియా సంస్థలు కీర్తిగానాలు చేస్తున్నాయి. పనిలో పనిగా ప్రత్యర్థి పార్టీలపై హద్దులు దాటి వ్యాఖ్యానాలు, విమర్శలు చేస్తున్నాయి. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా! అన్నట్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే దారిని అనుసరిస్తోంది.
పత్రికలు, టీవీలకు తోడు సోషల్ మీడియా సమాంతర వ్యవస్థగా వేళ్లూనుకుంటోంది. యూట్యూబ్, మేటా, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలు కూడా ప్రజలను ప్రభావితుల్ని చేయడంలో, అసత్య కథనాలను నిజమని భ్రమింపచేయడంలో ఎంతో కొంతమేర సఫలమవుతున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియా ద్వారా ప్రచారానికి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇందుకోసం యువతను రిక్రూట్ చేసుకుని ప్రత్యర్థి పార్టీలపై బరితెగించి బురదచల్లుతున్నాయి. ఇది చాలదన్నట్లు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండి, మంచి ఫాలోయింగ్‌తో మేధావులుగా చలామణి అవుతున్న వారిని తమ వైపు తిప్పుకుంటున్నాయి. ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఏదో ఒక పార్టీ ప్రభావంలోకి వెళుతున్నారు. ఇండిపెండెంట్ ఆలోచనతో ప్రజల పక్షాన బాసటగా నిలవలేకపోవటం విచారకరం.
తామరతంపరగా పుట్టుకొస్తున్న యుట్యూబ్ ఛానళ్లు సమాజంలో చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. జర్నలిజంలో పరిచయం, ప్రవేశం ఉన్నా లేకున్నా కొందరు యూట్యూబ్‌ను ఆశ్రయించుకుని వ్యూస్ కోసం సంచలనాల అసత్య కథనాలు నిస్సిగ్గుగా కుమ్మరిస్తున్నారు. వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతూ జర్నలిజం ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నారు. ఇటువంటి వారి వల్ల సమాజంలో జర్నలిస్టులంటేనే ఏవగించుకునే పరిస్థితి ఏర్పడిరది. పత్రికా చట్టాలతో పాటు ఐటీ చట్టాలు కూడా అందుబాటులో ఉన్నా కట్టలు తెంచుకుని విరుచుకు పడుతున్న మురుగు ప్రవాహాన్ని ప్రభుత్వఅధికారులు నిరోధించలేకపోతున్నారు.
ఈ క్రమంలో మీడియా విశ్వసనీయత పూర్తిగా అడుగంటింది. ఎవరి రాతలు ఏమిటో, ఏ వ్యాఖ్యాత ఏ పక్షమో ప్రతివారికి తెలుసు. మీడియాను నమ్మే పరిస్థితి లేకపోవడంతో వందలవేల కోట్ల ఖర్చుతో సాగిస్తున్న ప్రచారమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. వీలైనంత వరకు ఓటర్లు ప్రతి ఎన్నికల్లో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ, అదుపు తప్పిన పార్లీ నేతలకు గుణపాఠాలు చెప్తున్నారు.
సీఎస్ఆర్ నిధుల మాటున..
ప్రభుత్వాలైనా, పరిశ్రమలైనా పూర్తిగా ప్రజానికంపై ఆధారపడే మనుగడ సాగిస్తాయి. ప్రజ్రలు చెల్లించే ప్రత్యక్ష, పరోక్ష పన్నులతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ప్రజలు, వస్తుసేవలు వినియోగించబట్టే పరిశ్రమలూ విరజిల్లుతున్నాయి. తమ ఉనికికి ఆధారమైన ఆ ప్రజానికంలో వెనకబడిన వారి సంక్షేమాన్ని పట్టించుకోవలసిన కర్తవ్యమూ వీరికి ఉంది. ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తున్న నిధులు ఏ మేరకు లబ్ధిదారులకు ప్రయోజనం కలిగిస్తున్నాయో చెప్పే శాస్త్రీయ గణంకాలు లేవు. ఆ సంక్షేమమూ ఓటరును ప్రలోభపరిచే తాయిలంగా మారింది. పరిశ్రమలు కూడా కమ్యూనిటి అభివృద్ధికి పాటుపడేలా చూసేందుకు కంపెనీల చట్టాన్ని సవరించారు. రూ.500 కోట్లు అంతకు మించిన నికర విలువ కలిగిన కంపెనీలు, వేలు కోట్లు అంతకు మించిన వార్షిక టర్నోవర్ కలిగిన కంపెనీలు లేదా రూ.5 కోట్లు అంతకు మించిన నికరలాభం ఆర్జిస్తున్న కంపెనీలు తమ లాభాల్లో 2 శాతం మొత్తాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద చేపట్టే కార్యక్రమాలకు వెచ్చించాలి. ఈ నిధుల కేటాయింపులోనూ చాలా రాజకీయాలు చొరబడ్డాయి.
సీఎస్ఆర్ నిధుల వినియోగాన్ని పరోక్షంగా నియంత్రించాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఉదాహరణకు ఫలాన ప్రభుత్వ పాఠశాలల్లో బ్లాక్ బోర్డుల కోసం నిధులు కేటాయించండి, ఈ నియోజకవర్గంలో కమ్యూనిటి హాల్ నిర్మించండి అంటూ ఒత్తిడి తెస్తున్నాయి. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడిని కొంత మేరకైనా తగ్గించుకో చూస్తున్నారు. మరో పక్క ఆయా వర్గాల ప్రజల ఆదరణ పొందటానికి ఇది ఉపకరిస్తోంది.
పరిశ్రమల యాజమాన్యాలు కూడా తక్కువేమీ తినలేదు. సీఎస్ఆర్ నిధుల ద్వారా ఆయా కమ్యూనిటీలు, కాలనీల్లో పట్టు, ప్రాబల్యం పెంచుకుంటూ ఒపీనియన్ లీడర్ ద్వారా తమ అనుకూల వాణిని విన్పించేలా జాగ్రత్త పడుతున్నాయి. కొన్ని చోట్ల స్థానిక సంస్థల ఎన్నిల్లో తమ మద్దతుదారులు విజయం సాధించేలా చూసేందుకు పావులు కదుపుతున్నాయి. ఇది సహజంగానే పాలక పక్షనేతలకు కంటగింపుగా మారింది.
ఈ మొత్తం అవ్యవస్థలో సామాన్యుడు జీరో అయ్యాడు. నిజానికి సామాన్యుడే సకలవిధ వ్యవస్థలకూ కేంద్రబిందువే అయినా అతని గోడు వినే వారెవరూ లేరు. పేదలు మరింత పేదరికంలోకి కూరుకు పోతున్నారు. సంపన్నలు మరింత బలపడుతున్నారు. పేదలు ధనికుల మధ్య అంతరం పెరుగుతూ వస్తోంది. ఇది సహజంగానే సామాజిక అశాంతికి బాట వేస్తోంది.
ఏ పక్షం వైపు మొగ్గు చూపకుండా స్వతంత్ర, నిష్పాక్షిక విశ్లేషణలు అభిప్రాయాలతో పనిచేసే మీడియా వ్యవస్థలు బలపడాల్సిన తరుణమిది. విశాల ప్రజాప్రయోజనాపేక్షే పరమావధిగా బాధ్యతాయుతంగా మెలుగుతూ సమాజానికి దిక్సూచిలా నిలిచే మీడియా వేదికలు విరివిగా అందుబాటులోకి రావాలి. ఇప్పుడు తెలుగు ప్రజలకు చేరువవుతున్న ది వైర్ ఆ లోటును భర్తీ చేస్తుందని ఆకాంక్షిస్తున్నాను. ది వైర్ తెలుగు నిర్వాహకులకు అభినందనలు.