
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం కొంతకాలంగా తగ్గుతూ పోయింది. వారి స్థానాన్ని మైనింగ్ కంపెనీలు ఆక్రమించాయి. ఈ తతంగమంతా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పర్యవేక్షణలో జరుగుతోంది. తనను తాను ఈ జిల్లాకు సంరక్షక మంత్రిగా ఫడ్నవీస్ నియమించుకున్నారు. ఈ ఆదివాసుల అడవిపై మైనింగ్ ప్రభావం ఎలా ఉండబోతుంది? గడ్చిరోలిపై మా ధారావాహికలో ఇది మొదటి వ్యాసం.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాసిన వ్యాసం జూన్ 7న ఒక ఆంగ్ల పత్రికలో ప్రచురితమైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వాదనను ఈ వ్యాసంలో ఫడ్నవీస్ సవాలు చేశారు.
ఆసక్తికర విషయమేంటంటే, ఈ వ్యాసం ప్రారంభ వాక్యాలు పూర్తిగా భిన్నమైన అంశంపై కేంద్రీకరించబడ్డాయి. జూన్ 6న తాను గడ్చిరోలి జిల్లా పర్యటనలో ఉన్నానని, అబుజ్మద్ దట్టమైన అడవులను సందర్శించిన మొదటి ముఖ్యమంత్రినని ఫడ్నవీస్ రాశారు. “నేను గడ్చిరోలిలో రాత్రి బస చేశాను. ఇప్పటి వరకు కనీసం నాలుగు రాత్రులు అక్కడ ఉన్నాన”ని వ్యాసంలో చెప్పుకొచ్చారు.
రాహుల్ గాంధీ మాటలకు ప్రతిస్పందనగా ఈ వ్యాసం రాయబడింది. అయితే, ఎన్నికల ప్రక్రియపై దృష్టి సారించే ఈ వ్యాసం, గడ్చిరోలి నుంచి ఎందుకు ప్రారంభమైందోనని ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు ఈ జిల్లా పట్ల విడదీయరాని ప్రత్యేక అనుబంధం ఉంది.
దండకారణ్యం నుంచి నక్సలైట్లను పూర్తిగా ఏరివేసినప్పుడు, ఈ దట్టమైన అడవి రూపురేఖలు ఎలా మారుతాయని తరచుగా అడుగుతుంటారు. దీనికి సమాధానం, మావోయిస్టు ప్రభావిత గడ్చిరోలి జిల్లాలో ప్రస్తుతం కనిపిస్తుంది.
గత కొన్ని సంవత్సరాలుగా ఈ జిల్లాలో మావోయిస్టు ఉద్యమం ఎలా అయితే ఓవైపు బలహీనపడుతూ కుంచించుకుపోయిందో, మరోవైపు గనులు- పరిశ్రమలను విస్తరించే ప్రక్రియను మహారాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది.
కొన్నిరోజుల క్రితం ఒక వార్తాపత్రికలో రెండు వార్తలు ఒకేసారి పక్కపక్కకు ప్రచురితమయ్యాయి. అందులో ఎన్కౌంటర్లో సీనియర్ మావోయిస్టు నాయకుడు మరణం గురించిన ఒక వార్త ఉంది. రెండవది, గడ్చిరోలి జిల్లాలో ఇనుప ఖనిజ కర్మాగారానికి అటవీ శాఖా అనుమతి మంజూరు చేయడం గురించిన వార్త ఉంది. ఇందులో 1.23 లక్షల చెట్లను నరికివేయాలని ప్రస్థావించబడింది.
అయితే, గత సంవత్సరాల్లో ఈ అడవిలో విస్తృతమైన మైనింగ్ హక్కులను పొందుతున్న లాయిడ్స్ స్టీల్‌కు కాంట్రాక్ట్ ఇవ్వబడింది.
మే 22న లాయిడ్స్ మెటల్స్ & ఎనర్జీ ఖనిజాన్ని శుభ్రం చేసే ప్లాంట్ కోసం 900 హెక్టార్లకు పైగా అడవులను తొలగించాలని పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఇందులో భాగంగా 1,23,000 చెట్లను నరికివేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఫడ్నవీస్ వ్యాసం ప్రచురించబడిన జూన్ 7న, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల అంచనా కమిటీ(ఈఏసీ) గడ్చిరోలిలోని సుర్జాగఢ్ గనిలో ఇనుప ఖనిజం ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి, లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్‌కు పర్యావరణ అనుమతి ఇవ్వాలని సిఫార్సు చేసింది. తన వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 మిలియన్ టన్నుల నుంచి 26 మిలియన్ టన్నులకు పెంచడానికి ఈ క్లియరెన్స్ కంపెనీకు వీలు కల్పిస్తుంది. 2023 ప్రారంభంలో కంపెనీ తన ఉత్పత్తిని సంవత్సరానికి 3 మిలియన్ల నుంచి 10 మిలియన్ టన్నులకు పెంచడానికి ప్రభుత్వం అనుమతించింది.
గమనించదగ్గ విషయమేంటంటే, ఈ ప్రాజెక్టును ఇప్పటికే “ఉల్లంఘన కేటగిరీ కేసు”గా వర్గీకరించారు. ఈ సంస్థ పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలినప్పటికీ, కంపెనీ ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకోవడానికి అనుమతి లభించింది.
గడ్చిరోలిలోని ఒక కోర్టులో పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986లోని సెక్షన్లు 15, 16, 19 కింద మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు డిసెంబర్ 2022లో ఫిర్యాదు చేసింది. 2007 పర్యావరణ అనుమతి ప్రకారం, ఐదు సంవత్సరాల కాలం ముగిసిన తర్వాత కూడా గని కార్యకలాపాలను కంపెనీ కొనసాగిస్తోందని ఫిర్యాదులో ఆరోపించింది. మంత్రిత్వ శాఖ- కోర్టు రికార్డుల ప్రకారం కంపెనీ అధికారులు తమ నేరాన్ని అంగీకరించడంతో దోషులుగా నిర్ధారించబడ్డారు. కంపెనీకి రూ 5.48 కోట్ల జరిమానాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించింది.
వివాదాలతో సుదీర్ఘ సంబంధం..
ఈ మైనింగ్ స్థలం సున్నితమైన భమ్రాగఢ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోది కావడంతో, ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి వివాదంలో చిక్కుకుంది. గడ్చిరోలి జిల్లాలో ఇనుప గనిని నడుపుతున్న ఏకైక మైనింగ్ కంపెనీ లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్. ఈ కంపెనీ 2007లో సుర్జాగఢ్ గనిని 20 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. తరువాత దీనిని 2057 వరకు పొడిగించారు.

గడ్చిరోలిపై దేవేంద్ర ఫడ్నవీస్‌కు ప్రత్యేక ఆసక్తి..
ఖనిజ, అటవీ వనరులతో నిండిన జిల్లాగా పేరుగాంచిన గడ్చిరోలిలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తారు. “అభివృద్ధి” పరంగా ఈ జిల్లా చాలా వెనుకబడినదిగా పరిగణించబడుతుంది. ఈ జిల్లా ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్మద్ పర్వతాన్ని సరిహద్దుగా కలిగి ఉంది.
సుర్జాగఢ్ కొండలో మొత్తం 857 మెట్రిక్ టన్నుల ఎక్కువ నాణ్యత గల ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయని అంచనా వేయబడింది. ఇందులో 156 మెట్రిక్ టన్నుల హెమటైట్, 701 మెట్రిక్ టన్నుల బ్యాండెడ్ హెమటైట్ క్వార్ట్జ్(బీహెచ్‌క్యూ) ఉన్నాయి.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తనను తాను గడ్చిరోలి సంరక్షక మంత్రిగా, తన మంత్రివర్గ సహచరుడు ఆశిష్ జైస్వాల్‌ను సహ సంరక్షక మంత్రిగా నియమించుకున్నారు. ఈ విధంగా, జిల్లా పూర్తి నియంత్రణను ఆయన తన చేతుల్లోకి తీసుకున్నారు.
2025 మొదటి రోజు గడ్చిరోలిలో ఫడ్నవీస్ బసచేశారు. గడ్చిరోలి జిల్లాలో రాత్రి బస చేసిన మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కూడా ఆయనే. ఈ సమయంలో, ఆయన జిల్లాలో లాయిడ్స్ మెటల్ కంపెనీకి చెందిన కొన్ని యూనిట్లను కూడా ప్రారంభించారు.

గడ్చిరోలి కోసం రూ 60,000 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీంతో పాటు, ప్రభుత్వం విమానాశ్రయాన్ని నిర్మించాలని, నాగ్‌పూర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను గడ్చిరోలి వరకు విస్తరించాలని కూడా ఆలోచిస్తోంది. దీనిని “సమృద్ధి మహామార్గ్” అని పిలుస్తారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపాదిత గడ్చిరోలి విమానాశ్రయం కోసం ఒక ప్రత్యేక సర్వేకు జూన్ 19న ఆదేశించారు. అంతేకాకుండా, ఆ ప్రాంతంలోని ఇతర ప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున భూసేకరణ చేయాల్సిందిగా కూడా ఆదేశించారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వార్షిక ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం జరిగింది. అందులో ఫడ్నవీస్ సంతకం చేసిన మొదటి మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ గడ్చిరోలిలో పెట్టుబడులకు సంబంధించినది.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 2025 జూలై 22న నక్సల్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలో అనేక ప్రధాన మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో హెడ్రిలో సంవత్సరానికి 50 లక్షల టన్నుల(ఎంటీపీఏ) సామర్థ్యంతో ఇనుప ఖనిజం గ్రైండింగ్ ప్లాంట్ మొదటి దశ, 10 ఎంటీపీఏ సామర్థ్యంతో స్లర్రీ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.
దీంతో పాటు కాన్సారిలో 4.5 ఎంటీపీఏ సామర్థ్యం కలిగిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, 100 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి, ఒక పాఠశాల, నక్సల్ ప్రభావిత ప్రాంతంలో 116 ఎకరాలలో విస్తరించి ఉన్న లాయిడ్స్ టౌన్షిప్ ఉన్నాయి.
జిందాల్ పెట్టుబడి..
జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ గడ్చిరోలి జిల్లాతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో అనేక ప్రాజెక్టులలో సుమారు రూ 3 లక్షల కోట్లు పెట్టుబడిగా పెట్టింది. జంషెడ్పూర్ తర్వాత భారతదేశంలో రెండవ ఉక్కు నగరం ఈ జిల్లాలో నిర్మించబడుతుందని చెబుతున్నారు.
“మహారాష్ట్రలో ఉక్కు, సౌరశక్తి, ఆటో, సిమెంట్ వంటి కీలక రంగాలలో వైవిధ్యభరితమైన పెట్టుబడులు పెట్టే కంపెనీ అయిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం, గడ్చిరోలిని భారతదేశపు “ఉక్కు నగరం”గా అభివృద్ధి చేయాలనే మా దార్శనికతను నెరవేర్చడంలో ఒక కీలకమైన అడుగు” అని ఫడ్నవీస్ తెలియజేశారు.
2025 ఏప్రిల్ 11న జరిగిన గడ్చిరోలి జిల్లా పెట్టుబడి సదస్సులో 66 ఎంఎస్ఎంఈలు రూ 493.4 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి.
ఇంతలో, మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎంఐడీసీ) గడ్చిరోలిలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ స్టీల్ ప్రాజెక్ట్ కోసం సుమారు 3,500 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియను ప్రారంభించింది. మావోయిస్టు ప్రభావిత జిల్లాలోని వాడ్సా తాలూకాలో ఈ భూమిని సేకరించడానికి గుర్తించారు. రాష్ట్రం ఉక్కు కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్న జిల్లాలో విస్తీర్ణం పరంగా ఇది అతిపెద్ద భూసేకరణ అని నమ్ముతారు.
మైనింగ్ అనుమతులను వేగవంతం చేయడానికి బిల్లు..
గడ్చిరోలి జిల్లాలో మైనింగ్ అనుమతులను వేగవంతం చేయడానికి, ఖనిజ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఏకీకృత అథారిటీని ఏర్పాటు చేయడానికి జూన్ 30న మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గడ్చిరోలి జిల్లా మైనింగ్ అథారిటీ(జీడీఎంఏ)చైర్మన్‌గా ఉండనున్నారు.
ఈ బిల్లు ప్రకారం, అథారిటీకి ఉన్న అన్ని చట్టాలను దాటవేసే అధికారం ఉంటుంది. అంతేకాకుండా దాని చర్యలు లేదా ఆదేశాలకు వ్యతిరేకంగా ఏ దావాను/విచారణను స్వీకరించడానికి ఏ కోర్టుకు అధికార పరిధి ఉండదు.
జూలై 7న ఈ బిల్లును మహారాష్ట్ర శాసన మండలి ఆమోదించింది. జూలై 7న మహారాష్ట్ర పరిశ్రమ మంత్రి ఉదయ్ సమంత్ గడ్చిరోలిని ఉక్కు ఉత్పత్తి కేంద్రంగా మార్చడానికి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించారు.
గనుల కోసం క్యూకడుతున్న కంపెనీలు..
ఈ కంపెనీల రాకతో స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడ్చిరోలి జిల్లాలో గనులు తవ్వడానికి కంపెనీలు క్యూకడుతున్నాయని గిరిజన కార్యకర్త లాలాసు నోగోటి అంటున్నారు. ఆయన మాటల ప్రకారం, రాబోయే రోజుల్లో జిల్లా అంతటా మొత్తం 25 చోట్ల గనులు తెరవాలనే ప్రతిపాదన ఉంది.
సుర్జాగఢ్ కొండల శ్రేణికి అవతలి వైపున కూడా గనిని విస్తరిస్తున్నారు. దీనిలో ఆరు బ్లాక్‌లను వివిధ కంపెనీలకు ఇచ్చారు. వీటిలో జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, రాయ్‌పూర్‌కు చెందిన నేచురల్ రిసోర్సెస్ ఎనర్జీ కంపెనీ ఉన్నాయి. కోర్చి తహసీల్‌లోని జెండేపాడ్ కొండ, భమ్రాగఢ్ తహసీల్‌లోని బాబాలై కొండలలో ఇనుప గనులను తెరవాలనే ప్రతిపాదన కూడా ఉంది.
ఇనుప ఖనిజంతో పాటు, అదానీ గ్రూప్ యూనిట్ అంబుజా సిమెంట్స్‌కు గడ్చిరోలిలోని దేవల్మారి కాటేపల్లి ప్రాంతంలో సున్నపురాయి తవ్వకాలకు కూడా అనుమతి లభించింది. ఇది దాదాపు 538 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో దాదాపు 150 మిలియన్ టన్నుల సున్నపురాయి ఉంటుందని అంచనా.
మొహగావ్ గ్రామసభ అధ్యక్షుడు దేవ్‌సాయి ఆత్ల మాట్లాడుతూ, చమోర్షీ తాలూకాలో 1200 హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. గిరిజన కంపెనీని ముందుకు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని 90 సంవత్సరాలు లీజుకు ఇచ్చే ప్రణాళిక ఉందని అన్నారు.
“ఈ ప్రాంతం ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోకి వస్తుంది కాబట్టి, బయటి కంపెనీ ఇక్కడ భూమిని పొందదు. దీంతో బయటి కంపెనీ ఒక గిరిజనుడి పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా మొదట భూమిని అతని పేరుకు బదిలీ చేసిన తర్వాత, దానిని అతని నుంచి లీజుకు తీసుకుంటుంది” అని దేవ్‌సాయి ది వైర్ హిందీకి తెలియజేశారు.
కొంతమంది తన దగ్గరకు వచ్చారని ఆయన చెప్పారు. ఆ వ్యక్తులు ఆ భూమిని తమ సొంత కంపెనీ “ఆదిమ్ పరంపరైక్ సంస్థ” పేరు మీద దేవ్‌సాయిని బదిలీ చేయాలని కోరారు. ప్రతిగా, వారు అతనికి కొంత డబ్బు ఇచ్చారు. ఆ భూమిని అతని కంపెనీ పేరు మీద బదిలీ చేస్తామని, తొమ్మిది సంవత్సరాల తర్వాత అతని నుంచి 90 సంవత్సరాల పాటు లీజుకు తీసుకొని మైనింగ్ చేస్తామని కూడా చెప్పారు.
మైనింగ్‌కు వ్యతిరేకత..
సుర్జాగఢ్ ప్రాంతంలో మైనింగ్‌ను స్థానిక గిరిజనులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి అనేక వివాదాలు ఉన్నాయి. కంపెనీలు తమను మోసం చేసి, తమ భూమిని చట్టవిరుద్ధంగా లాక్కొని దానిపై మైనింగ్ ప్రారంభించాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
2007లో సుర్జాగఢ్లో లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్‌కు మైనింగ్ చేయడానికి అనుమతి లభించింది. అంతేకాకుండా 2008లో 340.09 హెక్టార్ల విస్తీర్ణంలో మైనింగ్ లైసెన్స్ పొందింది. అయితే, మావోయిస్టులు- గిరిజన వర్గాల వ్యతిరేకత ఇంకా అటవీ, భూమి హక్కులకు సంబంధించిన సమస్యల కారణంగా చాలా సంవత్సరాలుగా మైనింగ్ జరగలేదు. కొన్నిసార్లు, మావోయిస్టులు కంపెనీ వాహనాలను తగలబెట్టి, ఉద్యోగులను కొట్టారు. 2013లో కంపెనీ ఉపాధ్యక్షుడు జస్పాల్ ధిల్లాన్‌తో పాటు మరో ఇద్దరిని కూడా మావోయిస్టులు హత్య చేశారని ఆరోపించారు.
ఆ తరువాత, మైనింగ్ ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగడానికి వీలుగా ఆ ప్రాంతంలో పారామిలిటరీ దళాల ఉనికిని పెంచాలని నిర్ణయించారు. అందులో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 2015 ఆగస్టులో కేంద్ర హోంమంత్రిని అభ్యర్థించారు.
ఆ తర్వాత ఆ కంపెనీ మైనింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నించింది. 2016 డిసెంబర్ 5న 70 గ్రామాల నుంచి గిరిజన నాయకులు, స్థానిక సామాజిక సంస్థలు, రాజకీయ నాయకుల ప్రతినిధులు సుర్జాఘర్లో సమావేశమై మైనింగ్‌ను నిలిపివేయాలని అంతేకాకుండా ప్రభుత్వం ఉన్న, ప్రతిపాదిత మైనింగ్ లీజులన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ప్రజల జీవనోపాధిని కాపాడటానికి అటవీ హక్కుల చట్టం, 2006- షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీ విస్తరణ(పీఈఎస్ఏ) చట్టాన్ని అమలు చేయడానికి కూడా వారు తీర్మానాలను ఆమోదించారు.
స్థానిక గిరిజనుల నిరసనలు తెలిపిన్నప్పటికీ, తవ్వకం పనులు ఆగలేదు. 2016 డిసెంబర్ 24న మావోయిస్టులు సుర్జాగఢ్ గనిపై దాడి చేసి, లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్‌కు చెందిన డజన్ల కొద్దీ ట్రక్కులు, మట్టి మూవర్లకు నిప్పు పెట్టారు. దాదాపు 80 వాహనాలు దగ్ధమయ్యాయి. కంపెనీకి రూ 13 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.
దీని తరువాత, ఆ ప్రాంతంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. “మైనింగ్‌ను వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు పోలీసులు, పారామిలిటరీ దళాల చేతుల్లో వేధింపులకు గురయ్యారు. అంతేకాకుండా, అరెస్టులను ఎదుర్కోవలసి వచ్చింది” అని లాలాసు అన్నారు.
2017లో దాదాపు 70 గ్రామాల ప్రజలు ప్రభుత్వ మైనింగ్ లైసెన్సుల కేటాయింపును వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. లైసెన్స్ ప్రక్రియలో సరైన విధానాన్ని పాటించలేదని వారు భావిస్తున్నారు.
స్థానికుల అభిప్రాయం ప్రకారం, అటవీ హక్కుల చట్టం- 2006 కింద భూసేకరణ ప్రక్రియ, పంచాయతీ(షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం, 1996 కింద వారి సమ్మతిని పొందడం ఇంకా ప్రారంభించబడలేదు.
తవ్వకం చట్టాలు, పర్యావరణ చట్టాలు, పీఈఎస్ఏ చట్టాలను ధిక్కరిస్తూ ఇక్కడ మైనింగ్ జరుగుతుందని ఆయన అంటున్నారు.
పొట్టేగావ్కు చెందిన ఆదివాసీ వికాస్ పరిషత్ కార్యకర్త వినోద్ మాండవి, 2010లో గడ్చిరోలి కలెక్టర్ మైనింగ్‌కు ప్రజల సమ్మతిని చూపించడానికి నకిలీ గ్రామసభ పత్రాలను తయారు చేశారని ఆరోపించారు. ఎటపల్లి బ్లాక్‌లోని బండే ప్రాంతంలోని దామకొండవాహి గ్రామంలోని గ్రామ సేవకుల ద్వారా ఇటువంటి నకిలీ గ్రామసభ పత్రాలను తయారు చేశారు.
2023 సంవత్సరంలో, సుర్జాగఢ్ మైనింగ్‌కు వ్యతిరేకంగా దాదాపు ఎనిమిది నెలల పాటు కొనసాగిన 70కి పైగా గ్రామాల గిరిజనుల శాంతియుత ధర్నాపై పోలీసులు దాడి చేసి, వారిని అడ్డుకున్నారు.
పోలీసులు, పరిపాలన, కంపెనీ యాజమాన్యం నిరంతరం ప్రజలను బెదిరిస్తున్నారని, వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని లాలాసు నోగోటి చెప్పారు.
2023లో తోడ్‌గట్ట వద్ద క్వారీకి వ్యతిరేకంగా 255 రోజుల పాటు జరిగిన ధర్నా, గడ్చిరోలి చరిత్రలో అత్యంత దీర్ఘకాల ఆదివాసీ ఆందోళనలలో ఒకటిగా నిలుస్తుంది.

“శాంతిపూర్వకంగా చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం పోలీసుల చేత నిర్దయగా అణిచివేసింది. ప్రజలను అక్కడ నుంచి పంపించి వేశారు. అక్కడి గుడిసెలను కూల్చివేశారు. మహిళలతో పాటు 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి మీద అబద్ధపు కేసులను మోపారు. అంతేకాకుండా 17- 18 రోజులు చంద్రపూర్ జైలులో ఉంచారు. తర్వాత బెయిల్ మీద విడుదల చేశార”ని లాలాసు పేర్కొన్నారు.
“ఆ ప్రాంతంలో ప్రతి ఐదు కిలోమీటర్‌కు ఒక పోలీసు స్టేషను తెరిచారు. ఎవరైనా కూడా గొంతెత్తితే వారి మీద మావోయిస్టు అనే ముద్రను వేయడం జరుగుతోంది. నేను కూడా చాలా సార్లు పోలీసుల అదుపులోకి తీసుకోబడ్డాను” అని వినోద్ మండవీ అన్నారు.
ఆ ప్రాంతానికి చెందిన ఇతర వ్యక్తులు కూడా ది వైర్‌కు చాలా విషయాలు తెలియజేశారు. “గనులకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడానికి ప్రజలు ఇప్పుడు ప్రమాదకరంగా భావిస్తున్నారు. ఎందుకంటే పోలీసులు, పారామిలటరీ బలగాల చేతిలో వాళ్లు వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మావోయిస్టులనో లేదా ఉపా లాంటి కఠినమైన చట్టాల ప్రయోగంతో వారి మీద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు” తెలియజేశారు.
స్థానభ్రంశం మీద సవాళ్లు- ఆదివాసుల భూముల పరిస్థితి..
“ప్రస్తుతం ఈ ప్రాంతంలో గనుల వల్ల ఏ ఊరి ప్రజలు విస్థాపనకు గురికాలేదు. కానీ మున్ముందు ఈ ప్రమాదం ఎక్కువ మొత్తంలో పొంచి ఉంది. ఎలా అయితే గనులు విస్తరిస్తూ పోతాయో ప్రజల భూములను లాక్కోవడం మొదలవుతుంది. ప్రాంతంలోని కొన్ని గ్రామాలలో లాయిడ్స్ కంపెనీ ప్రజల నుంచి భూమిని తీసుకోవడం మొదలు పెట్టింది” అని లాలాసు చెప్పుకొచ్చారు.
“హెఢ్రీ గ్రామంలో లాయిడ్స్ కంపెనీ ఒక స్కూల్, ఆసుపత్రి, ఇంకా ఒక ట్రైనింగ్ సెంటర్ నిర్మించింది. దీని కోసం ఆదివాసుల భూమి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మైనింగ్ ఎలా అయితే విస్తరిస్తూ ఉందో, ఇతర కార్యకలాపాల కోసం కూడా ఆదివాసుల భూములను తీసుకుంటున్నారు.

“ప్రభుత్వం నుంచి కంపెనీకు 340.09 హెక్టార్ ప్రాంతంలో మైనింగ్‌కు అనుమతిస్తూ లైసెన్స్ లభించింది. కానీ కంపెనీ మాత్రం ఆ ప్రాంతంలో దాని కంటే ఎక్కువ భూమిని ఇతర కార్యకలాపాల పేర్ల మీద తీసుకుంటుంది” అని లాలాసు అన్నారు.
ఇదే కాకుండా, ఎటాపల్లి ఇంకా మాదిగుడెంలో ముడి పదార్థం నిలువచేయడం కోసం కంపెనీ చాలా ఎక్కువ భూమని తీసుకుంది. ఆలాపల్లి, కామన్చెరు దరిదాపుల్లో కూడా పార్కింగ్, ఇనుప ఖనిజంతో పాటు తీయబడిన మట్టి, రాళ్లు మొదలైన వాటిని డంప్ చేయడానికి ఆదివాసులకు సంబంధించిన ఎక్కువ భూమిని సంపాదించుకున్నారు.
ఈ విధంగా ఆదివాసుల భూమిని లాక్కోని కంపెనీలకు ఇవ్వడం జరుగుతోంది.
ది వైర్ హిందీ ఈ మొత్తం విషయం గురించి, భూసముపార్జన నుంచి ఆదివాసుల ఆందోళనల గురించి, లాయిడ్స్ కంపెనీ ఇంకా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ప్రశ్నించింది. ది వైర్ హిందీలో రిపోర్ట్ పబ్లిష్ అయ్యే వరకు వారి వద్ద నుంచి ఎటువంటి సమాధానం లభించలేదు. సమాధానం లభించిన వెంటనే ఈ వార్తను అప్డేట్ చేయడం జరుగుతుంది.
అనువాదం: వంశీకృష్ణ చౌదరి
(మరో వ్యాసం: ఈ ప్రాజెక్టుల ప్రభావం స్థానిక జీవిన విధానం మీద ఎలా ఉంటుంది?)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.