
‘ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్కో సన్మతి దే భగవాన్’ లాంటి సంస్కృతి ఈ దేశంలో పరంపరగా కొనసాగుతుందని, బాపు పేరుతో నిర్మించబడ్డ ఆడిటోరియంలో ఆయనకు ఇష్టమైన భజనను పాడడాన్ని నిలిపే వారికి బహుశా తెలిసి ఉండకపోవచ్చు. 1940వ దశకంలో ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో రైతు ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో క్రీయాశీలకంగా పాల్గొన్న రైతు నేత రాం మొహమ్మద్ సింగ్ ఈ పరంపరకు అసలైన ప్రతీకగా నిలుస్తారు.
గత డిసంబర్ 25న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి శతాబ్ది సంవత్సరం, మదన్ మోహన్ మాలవీయ జయంతి వేడుకలను పాట్నాలో నిర్వహించారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి అటల్ విచార్ పరిషత్, దిన్కర్ న్యాస్ సమితి ఆధ్వర్యంలో బాపు ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. పలువురు ప్రముఖ బిజెపి నాయకులు ఈ వేడుకకు హాజరైయ్యారు. వారి ముందే కార్యక్రమం మధ్యలో బాపుకు ఇష్టమైన భజన ‘రఘుపతి రాఘవ రాజా రాం..’ గీతాన్ని పట్టుకొని రచ్చ జరిగింది. రచ్చ ఎక్కడ వరకు దారితీసిదంటే ఆ గీతాన్ని పాడే జానపదగాయకురాలు దేవి క్షమాపణ చెప్పే వరకు వెళ్లింది.
‘భగవంతుడు ఒక్కడే, ఈ భజనను పాడడం వెనుక నా ఉద్దేశ్యం కేవలం భగవంతుడు రాముడిని గుర్తుచేసుకోవడమే’ అని గాయకురాలు సంజాయిషీ చెప్పినా రాద్ధాంతం చేసినవారు ఆ మాటలను పట్టించుకోలేదు.
జరిగిన ఘటనను పరిశీలిస్తే అల్లరి చేసే వారికి ఈ భజనలో ‘ఈశ్వర్ అల్లా తేరో నామ్’ అనే పంక్తి మాత్రమే అన్నిటికన్నా అభ్యంతరకరంగా అనిపించింది. ఇంకా ఆ పంక్తులను ఇష్టపడేవారిని తమ శక్తిని చూపించి, వారిని అణిచివేయాలనుకున్నారు. జ్ఞానం విషయానికి వస్తే భగవంతుడు వారికి ఇంకాను ప్రసాదించలేదని అర్థమవుతుంది.
ఈ ఘటన తర్వాత చాలా మందికి 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మస్జిద్ కూల్చివేత తర్వాత జరిగిన ఓ విషయం గుర్తుకువచ్చింది. అదేంటంటే, కూల్చివేత జరిగిన కొన్ని రోజులకు దేశ నలుమూలల నుంచి సర్వోదయ కార్యకర్తలు రామ్ కీ పైడి వద్దకు చేరుకున్నారు. అక్కడ ‘ఈశ్వర్ అల్లా తేరో నామ్’ భజనను పాడడం మొదలు పెట్టారు. దీంతో కోపానికి గురైన కరసేవకులు విచక్షణారహితంగా వారిని చితకబాదారు.
ఈ రెండు ఘటనల మధ్య కేవలం స్వల్పమైన తేడానే ఉంది. సర్వోదయ కార్యకర్తలు కరసేవకుల దాడికి గురైన కూడా జ్ఞానం గురించి మాట్లాడడం మాత్రం ఆపలేదు. కానీ, జానపదగాయకురాలు అప్పటికప్పుడే క్షమాపణ చెప్పడమే శ్రేయస్సుగా భావించింది.
ఏదిఏమైనప్పటికీ.. అనేక భాషలు, మతాలు, సంస్కృతి ఉన్నటువంటి ఈ దేశంలో అందరిని ఒక తాటిపైకి తేవడం కోసం, అందరిని కలిపి ఉంచడం కోసం చాలా ఆచితూచి కొన్ని వాక్యాలను మనుగడలోకి తెచ్చారు. ప్రస్తుతం వాటికి వ్యతిరేకంగా కొందరు ద్వేషాన్ని వ్యాపిస్తున్నారు. ఇటువంటి చర్యలు ప్రస్తుత రోజుల్లో చాలా ఆందోళన కలిగించే విధంగా మారాయి.
లేకపోతే, బాపు పేరు మీద నిర్మించిన ఆడిటోరియంలో ఆయనకు ఇష్టమైన పాటను పాడడాన్ని ఎలా ఆపుతారు. అధికారంలో తమ పార్టీ వారే ఉన్నారు కాబట్టి ఆపిన వారు సురక్షితంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా మారిదంటే కంచె పొలాన్ని తినేయడానికి సాహసం చేస్తుంది.
కంచె పొలాన్ని తినేస్తుందా?
అధికార దాహం నుండి పుట్టిన ఉన్మాదం ఈ దేశ ఉదారవాద- ఉన్నత విలువల పరంపరను వారిని అర్ధం చేసుకోనివ్వదని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. సుదీర్ఘ చరిత్రలో కొందరు దేశాన్ని ‘కుచ్ బాత్ హై కి హస్తీ మిట్తీ నహీఁ హమారి, సదియోఁ రహా హై దుశ్మన్ దౌరే జహా హమారా’ అనే పాట వరకు తెచ్చారు. ఈ సాంస్కృతిక పరిణామాలనైతే ఉన్మాదులుగా మారిన వారికి అసలే అర్థంకావు.
మరీ, ‘ఈశ్వర్ అల్లా తేరో నామ్’ మహాత్మగాంధీ కల్పించింది కాదని వారు ఎలా అర్థం చేసుకోగలరు. సాధు కవుల సాహిత్యం ఇటువంటి ఉన్నత భావాలను కలిగి ఉంది. వీటిని వేరు చేయడం అంటే పువ్వును చుట్టుముట్టిన సీతాకోక చిలుకను దాని నుంచి వేరు చేయడం లాంటిది.
పరంపర, ఆమోదం మాటకు వస్తే.. ఇటువంటి అల్లర్లు, సంచలనాత్మకమైన హెడ్‌లైన్స్ ఇంకా వీడియోలు ఎన్నైన చేయని దశదిశాల వ్యాపించిన, అమోఘమైన పంక్తులను తొలగించడం కానీ ఏ సంస్కృతి నుంచి దూరం చేయడం కానీ ఎట్టి పరిస్థితిలో జరగదు.
యాధృచ్ఛికంగా, చాలా లోతుగా ఉన్నటువంటి ఈ పరంపర వేళ్లకు ఒక మంచి ఉదాహరణగా బస్తీ రైతులను చూపించవచ్చు. గడిచిన శతాబ్దంలోని 4- 5వ దశకంలో తాము దున్నె భూమి మీద యాజమాన్య హక్కులను పొందడం కోసం రైతులు ఉద్యమించారు. ఈ ఉద్యమం ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఊపందుకుంది. అందులో బస్తీ రైతులు ఎక్కువగా పాల్గొన్నారు.
మతపరంగా విభజించబడ్డ బస్తీ రైతులను ఒక నేత కలపాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ‘ఈశ్వర్ అల్లా తేరో నామ్’ దారి మీద నడుస్తూ తన పేరును రామ్ మొహ్మద్ సింగ్ అని మార్చుకున్నారు. ఈ పేరుకు ఎంతలా ఆమోదం లభించిందంటే, ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎవరికి గుర్తే లేకుండా పోయింది.
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఒకప్పుడు స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్‌లో ప్రొఫేసర్‌గా ఉన్నటువంటి రాజేంద్ర సింగ్ ఒక అధ్యయనం చేశారు. పీజెంట్ మూవ్మెంట్ ఇన్ యూపీ: ఏ స్టడీ ఇన్ పాలిటిక్స్ ఆఫ్ లైండ్ ఎండ్ లైండ్ కంట్రోల్ ఇన్ బస్తీ డిస్టిక్ట్: 1801- 1970 అనే పేరుతో ఈ అధ్యయనం కొనసాగింది. ఈ అధ్యయనంలో రైతు నేత రామ్ మొహమ్మద్ సింగ్ వెలుగులోకి వచ్చారు. ఆయన బస్తీ రైతులతో ‘నిజాయి బోల్ ఆందోలన్’ మొదలు పెట్టిన కొన్నేళ్ల తర్వాత అనుకోకుండా తోకచుక్కలా విజృంభించారు. మొదటి సారి 1944 అక్టోబర్‌లో చర్చనీయాంశంగా మారారు.
వ్యవసాయ భూములను రైతాంగం స్వాధీనం చేసుకోకుండా, చెరువుల నీటితో పంటలకు సజావుగా నీరు అందించకుండా ఒక రాజ్‌పుత్ భూస్వామి అడ్డుకుంటున్నాడు. అతని ఏజెంట్లు రైతులను, కార్మికులను కొట్టి, దుర్భాషలాడుతూ, శ్రామిక మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవారు. ఇంకా వారి ప్రవర్తనకు వ్యతిరేకంగా విచారణ జరగలేదు. అప్పుడు ‘వాదన లేదు, న్యాయవాది లేడు, అప్పీలు లేదు’ అనే పరిస్థితి. ఇటువంటి సందర్భంలో రామ్ మొహమ్మద్ సింగ్ అనుచరులు దాదాపు ఐదు వందల మంది సాయుధ రైతులు, దాదాపు ఒకటిన్నర వేల మంది సాధారణ రైతు పురుషులు, స్త్రీలు, పిల్లలు, రాజ్‌పుత్ భూస్వామి భవనాన్ని చుట్టుముట్టారు.
రైతులు సంఘటనా శక్తితో భూస్వామి నివాసాన్ని చుట్టుముట్టి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలు పెట్టారు. వాళ్ల నినాదాలు: అత్యాచారం నడవదు, భూమి(యాజమాన్య హక్కు ఇవ్వకపోవడంతో) ప్రతీకారాన్ని ప్రాణం తీసి తీసుకుంటాం, రక్తం పీల్చే వారిని మట్టిలో కలుపుతాం. ఏదిఏమైనప్పటికి, రైతులకు దిశానిర్దేశం చేసే ఒక రైతు నేతను భూస్వామి తుపాకితో హత్య చేసి, చుట్టుముట్టిన రైతు ఆందోళనకారులను చెదరగొట్టాడు. కానీ ఈ సంఘటనతో రైతుల కోపం శాంతించాల్సింది పోయి ఇంకా ఎక్కువైంది.
ప్రొ. సింగ్ ప్రకారం, నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ నేతృత్వంలో నడిచిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లో రామ్ మొహమ్మద్ సింగ్ సైనికుడిగా సేవలను అందించారు. ఆయన బర్మా (మమన్మార్)లో హింద్ ఫౌజ్ బ్యానర్ మీద ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వా బస్తీ రైతుల ఆందోళనలో క్రీయాశిలకంగా మారారు. ఆయన ఆ ప్రాంతంలో విప్లవ రైతు పార్టీని కూడా స్థాపించారు.
మత విభజన రైతుల ఐక్యతకు ఆటంకంగా మారడాన్ని ఆయన చూశారు. దీనికి పరిష్కారం దిశగా ఈ విభజనను అంతం చేయడానికి తన పేరులో హిందూ దేవుడు రాముడితో పాటు ఇస్లాం ప్రవక్త మొహమ్మద్ పేరును కూడా తగిలించారు. దీంతో విభజన అంతానికి తనకు పూర్తి సహాయం లభించింది. ఇంకా ఐదు వందల గ్రామాలలో బలమైన రైతుల సంఘాన్ని ఏర్పాటు చేయడంలో విజయవంతం అయ్యారు.
విప్లవపార్టీ ఆలయం నుంచి నడిచేది..
సంతోషకరమైన మాటేంటే ఆయన విప్లవపార్టీ కార్యాలయం ఒక ఆలయం నుంచి నడిచేది. అలానే అయోధ్యలోని అనేక ఆలయాలు విప్లవకారులకు ఆశ్రయాలుగా ఉండేవి.
కానీ, రెండింటికి ఒక వ్యత్యాసం ఉంది. అయోధ్యలోని సాధవులు స్వయంగా విప్లవ కార్యక్రమాలలో భాగం అయ్యేవారు కాదు. కానీ బస్తీలోని ఆలయ సాధువులు కచ్చితంగా సమయానికి రైతులను ఆలయానికి పిలిచేవారు. నిరసనలు, వ్యూహ రచనలో నిర్ణయాలు ఇచ్చేవారు.
సాయుధులైన రైతులు అక్కడి రాజ్‌పుత్ భూస్వాముల కుటుంబాలకు చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేశారు. ఇందులో ఒక సాధువు పోలీసులకు చిక్కాడు. పోలీసులు ఆయనను విచారించడంతో ఆయన వద్ద మందుగుండు, ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో ‘విప్లవంతో తుడిచిపెట్టబడే’ అని ఆయా రాజుల, భూస్వాముల పేర్లు నమోదు చేసి ఉన్నాయి. స్వాతంత్య్రం తర్వాత 1950లో జరిగిన ఈ భాన్పూర్ రైతు ఉద్యమం ఎక్కువగా చర్చించబడింది.
ఏదిఏమైనప్పటికి, ఏ సాధువుకు ఇతర స్థానిక రైతు సంఘాలకు రామ్ మొహమ్మద్ సింగ్ పేరుతో ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. అంతేకాకుండా రామ్ మొహమ్మద్ రైతు పార్టీతో లోతైన సమన్వయం ఉండేది. స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయన లేవనెత్తిన రైతుల డిమాండ్స్‌ను సమర్ధించేవారు. ఉదాహరణకు స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా వ్యవసాయ భూమి యాజమాన్యం హక్కులు దానిని దున్నే వారికే ఉండాలని అంగీకరించేవారు.
ఇంతకు ముందు రాజ్‌పుత్ భూస్వామి నివాసాన్ని చుట్టుముట్టిన విషయాన్ని ప్రస్థావించాము. ఆ వ్యూహాన్ని రచించడానికి దానిని అమలు చేయడానికి కాంగ్రెస్‌కు చెందిన గ్రామస్థాయి కార్యకర్త, అగ్రవర్ణమైన కూడా ఇందులో పాలుపంచుకున్నాడు.
ఏదైనా ఒక పార్టీ, సంఘం సిద్ధాంతాలకు ఆందోళనకార రైతులు పూర్తి నిబద్ధులుగా ఉన్నారనే విషయం చెప్పడం కష్టం. ఎందుకంటే, ఎటువంటి స్థితిలోనైనా వాళ్ల డిమాండ్స్ వాళ్లకు ప్రధానమైనవిగా ఉండేవి. దీంతో వాళ్లు ఫిరాయింపులు కూడా చేసేవారు. అవసరమైతే తమ వైఖరి కూడా మార్చుకునేవారు ఇంకా రణనీతిని కూడా మార్చుకునేవారు.
కానీ ఆ తర్వాత రామ్ మొహమ్మద్ సింగ్ ఏమైయ్యారో సరిగ్గా ఏమి తెలియదు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ విషయం జనబాహుళ్యంలో ఉంది. అదేంటంటే రైతుల అనేక ఆందోళనలు, నిరసనల తర్వాత పోలీసులు వాళ్లకు వ్యతిరేకంగా కేసులు నమోదు చేసి, వాళ్ల వెనుకపడ్డారు. అయినప్పటికీ ఎటువంటి యాక్షన్‌లో రామ్ మొహమ్మద్ ప్రత్యక్షంగా భాగస్మామ్యం కాలేదు. తెర వెనుక ఉండి దిశానిర్దేశం చేసేవారు.
పోలీసులు వెనుకపడేసారికి వారి బారి నుంచి తప్పించుకోవడానికి రామ్ మొహమ్మద్ అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి మళ్లీఎప్పుడూ కనబడలేదని తెలుస్తోంది.
చాలా సంవత్సరాల తర్వాత 1985 సెప్టెంబర్ 16న బస్తీ పక్కన ఉన్నటువంటి ఫైజాబాద్(ప్రస్తుత అయోధ్య)లో అజ్ఞాత బాబా చనిపోయారు. ఆయన నివాసం వద్ద నేతాజి సుభాష్‌చంద్రబోస్‌కు సంబంధించిన చాలా వస్తువులు దొరకడంతో ఆయనను నేతాజీ అనుకొని కొందరు ప్రచారం చేశారు. అయితే అజ్ఞాతబాబా రామ్ మొహమ్మద్ సింగ్ అయి కూడా ఉండొచ్చని మరో సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు.
నేతాజీ అనుచరుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడు అవ్వడంతో ఆయన వద్ద నేతాజీకి సంబంధించిన వస్తువులు ఉండడం సర్వసాధారణం. కానీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి గొలుసులను జోడించేపని కుదరలేదు. ఇంకా సందేహం, సందేహంగానే మిగిలిపోయింది.
కానీ, ఇది ఆయన ప్రభావమే కావచ్చేమో 1970లో బస్తీలో రైతుల కొత్త ‘భూ ఆందోళన’ ప్రారంభమైంది. ఆ ఉద్యమంలో దళితుల- ముస్లిం రైతులు ముందు ఉండి పరస్పరం ఐక్యతా నినాదాలు చేశారు.
కానీ ఏం తెలుసు, ఇప్పుడు ‘రఘుపతి రాఘవ రాజా రాం’ అనే దానికే కొందరు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఈ మహానుభావులకు ఎప్పుడు జ్ఞానం లభిస్తుందో వాళ్లు ఇదంతా ఎప్పుడు అర్ధం చేసుకుంటారో? అయితే, వాళ్లు అన్ని అర్థం చేసుకొని కూడా ఏమి అర్థంకానట్టు ఉండడానికి ఒట్టు అయితే తీసుకోలేదు కదా?
– కృష్ణ ప్రతాప్ సింగ్
(రచయిత సీనియర్ జర్నలిస్ట్)
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.