
వామపక్ష తీవ్రవాద సంస్థలను అరికట్టే లక్ష్యంతో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక పౌర భద్రత బిల్లును ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం, చట్టవిరుద్ధ సంస్థల సభ్యులకు రెండు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. రాష్ట్రంలో మావోయిజాన్ని నియంత్రించడానికి ఈ బిల్లు అవసరమని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
న్యూఢిల్లీ: రాష్ట్రంలో “వామపక్ష తీవ్రవాద సంస్థలను” అరికట్టడానికి ఉద్దేశించిన ప్రత్యేక పౌర భద్రత బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ గురువారం(జూలై 10) మెజారిటీతో ఆమోదించింది.
ది హిందూ రిపోర్ట్ ప్రకారం, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడుతూ, రాష్ట్రంలో మావోయిజాన్ని నియంత్రించడానికి ఈ బిల్లు అవసరమని అన్నారు. గతంలో రాష్ట్రంలో కనీసం నాలుగు జిల్లాలు వామపక్ష తీవ్రవాదం ప్రభావంలో ఉండేవని, ప్రస్తుతం రెండు తాలూకాలు మాత్రమే ప్రభావంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సంస్థలు భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని తెలియజేశారు.
భారత కమ్యూనిస్ట్ పార్టీ(సీపీఐ) ఈ బిల్లును వ్యతిరేకించింది. ఇతర పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినప్పటికీ అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రవేశపెట్టిన బిల్లును మూజువాణి ద్వారా ఆమోదించారు.
దీని కంటేముందు, రాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే ఈ బిల్లుపై జాయింట్ సెలెక్ట్ కమిటీ నివేదికను బుధవారం(జూలై 9)నాడు సమర్పించారు. డిసెంబర్ 2024లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మహారాష్ట్ర ప్రత్యేక పౌర భద్రత బిల్లు– 2024ను ప్రవేశపెట్టారు.
ఉభయ సభలలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తర్వాత ప్రజా భద్రతా చట్టాన్ని అమలు చేసిన ఐదవ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలుస్తుంది. ఈ చట్టం ప్రకారం, చట్టవిరుద్ధ సంస్థల సభ్యులకు రెండు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఈ చట్టం కింద నేరాలు గుర్తించదగినవిగా ఇంకా నాన్- బెయిల్‌గా ఉంటాయి. అంతేకాకుండా ఇటువంటి సంస్థలకు, సంఘాలకు చెందిన డబ్బును జప్తు చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం , బిల్లులో రెండు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ బిల్లు “చట్టవిరుద్ధమైన కార్యాచరణ”ను తెలియజేస్తుంది. “ఏదైనా వ్యక్తి లేదా సంస్థ చేసే ఏదైనా చర్య, మాట్లాడాడం, వ్రాసిన పదాలు, సంకేతాలు, కనిపించే ప్రాతినిధ్యాల ద్వారా లేదా (i) సమాజానికి, శాంతి– సామరస్యానికి ప్రమాదం లేదా భంగం కలిగించేది, (ii) ప్రజాస్రవంతి నిర్వహణకు ఆటంకం కలిగించేది లేదా జోక్యం చేసుకునేది, లేదా (iii) చట్టం లేదా దాని స్థాపించబడిన సంస్థలు, అంతేకాకుండా సిబ్బంది పరిపాలనకు ఆటంకం కలిగించేది లేదా జోక్యం చేసుకునేది”లాంటి వాటిని ఈ బిల్లు “చట్టవిరుద్ధమైన కార్యాచరణ”గా పరిగణించబడే నాలుగు ఇతర చర్యలను నిర్వచిస్తుంది.
రాజకీయ నిరసనకారులు, కార్యకర్తలపై బిల్లును దుర్వినియోగం చేయబోమని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సభలో సభ్యులకు హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని కోల్పోయారని ఆయన అన్నారు. అంతేకాకుండా, వాళ్లు పట్టణ ప్రాంతాల్లోని యువతను బ్రెయిన్‌వాష్ చేసి, వారిని ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ బిల్లు అటువంటివారిని నియంత్రిస్తుందని ఆయన పేర్కొన్నారు.
“మిగతా నాలుగు రాష్ట్రాలు 48 సంస్థలను నిషేధించాయి. మహారాష్ట్రలో 64 అటువంటి సంస్థలు ఉన్నాయి, ఇవి దేశంలోనే ఎక్కువని చెప్పాలి. వామపక్ష తీవ్రవాద సంస్థలలో ఒక్కటి కూడా నిషేధించబడలేదు. రాష్ట్రం వారికి సురక్షితమైన నివాసంగా మారింది. ఈ చట్టం కింద సామాన్యులను ఎవరినీ అరెస్టు చేయలేరు. ఒకవేళ ఎవరినైనా అరెస్టు చేయదల్చితే ఆ వ్యక్తి నిషేధిత సంస్థలో భాగం కావడం అవసరం” అని ఫడ్నవీస్ అన్నారు .
ఈ బిల్లుపై సీపీఐ ఎమ్మెల్యే వినోద్ నికోల్ ఆందోళన వ్యక్తం చేశారు. “చట్ట నియమాల ప్రకారం నిరసన తెలిపే సంస్థలు సమస్యలను ఎదుర్కోకూడదు. కానీ ఈ చట్టం ద్వారా ఆ అవకాశాలు ఉన్నాయి, కాబట్టి నేను ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాను” అని అన్నారు.
బిల్లులోని కొన్ని నిర్వచనాలు అస్పష్టంగా ఉన్నాయని ఎన్సీపీ(ఎస్పీ) నాయకుడు రోహిత్ పవార్ అన్నారు. “తీవ్రవాద వామపక్ష సంస్థలు” అని కాకుండా, దీనిని నక్సలైట్ సంస్థ అని పిలవవచ్చు. బిల్లులోని పదప్రయోగంతో వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడమే ఉద్దేశ్యంగా అనిపిస్తోంది. నిర్వచనంలో స్పష్టత ఉండాలి“అని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు నిరసనలు చేపడితే ఈ చట్టం కింద కేసులు నమోదు చేస్తారా అని శివసేన (యుబీటీ) ఎమ్మెల్యే వరుణ్ సర్దేశాయ్ ప్రశ్నించారు. “ప్రతి విశ్వవిద్యాలయంలో వామపక్ష భావజాలంతో కూడిన గ్రూపులు ఉంటాయి. వారు నిరసనలు నిర్వహిస్తే లేదా వాట్సాప్‌లో ఏదైనా పోస్ట్ చేస్తే, వారిపై ఏదైనా చర్య తీసుకుంటారా?” అని ఆయన ప్రశ్నించారు.
తెలియాల్సిందేంటే, ఎల్గార్ పరిషత్ కేసులో అనేక మంది కార్యకర్తలు– విద్యావేత్తలను అరెస్టు చేసిన తర్వాత 2018లో కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ నాయకులు “అర్బన్ నక్సల్” అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. అప్పటి నుంచి, ఈ పదాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వ విమర్శకులకు తరచుగా ఉపయోగిస్తున్నారు.
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.