
ది వైర్, ఆ సంస్థ జర్నలిస్టులపై అస్సాం పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్పై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ నిరాశను వ్యక్తం చేశాయి. బీఎన్ఎస్లోని సెక్షన్ 152 “పత్రికల గొంతును నులిమే ఆయుధమ”ని అభివర్ణించాయి. అంతేకాకుండా, ఈ సెక్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.
న్యూఢిల్లీ: ది వైర్, ఆ సంస్థ జర్నలిస్టులకు వ్యతిరేకంగా అస్సాం పోలీసులు తీసుకున్న ప్రతీకార చర్యపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా- ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ నిరాశ వ్యక్తం చేశాయి. రెండు నెలల్లో రెండవసారి ది వైర్ మీడియా సంస్థపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 152ను అస్సాం పోలీసులు ప్రయోగించారు.
దేశద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ది వైర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగస్టు 12న నోటీసు జారీ చేసింది. అంతేకాకుండా జూలైలో మోరిగావ్‌లో నమోదైన కేసులో అస్సాం పోలీసులు ఎటువంటి “శిక్షాత్మక చర్య” తీసుకోకుండా, ది వైర్ వ్యవస్థాపక ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్‌తో సహా ఆ సంస్థ జర్నలిస్టులకు రక్షణ కల్పించింది.
అదే రోజు, రాష్ట్ర పోలీసులు దాఖలు చేసిన తాజా ఎఫ్ఐఆర్లో వరదరాజన్- సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్లకు గౌహతి క్రైమ్ బ్రాంచ్ సమన్లు జారీ చేసింది. ఈ ఎఫ్ఐఆర్లో “దేశద్రోహం” అభియోగాన్ని కూడా చేర్చారు.
ది వైర్‌కు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు...
ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ తమ ప్రకటనలో, “గుర్తించాల్సిందేంటే, 2025 ఆగస్టు 12న సమన్లు జారీ చేయబడ్డాయి. అయితే జస్టిస్ సూర్యకాంత్, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం వరదరాజన్‌తో పాటు ది వైర్ జర్నలిస్టులందరికీ 2025 జూలై 11న మోరిగావ్‌లో అస్సాం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్(0181/2025)లో సెక్షన్ 152, బీఎన్ఎస్ ఇతర నిబంధనల కింద ఎటువంటి శిక్షాత్మక చర్యల నుంచైనా రక్షణ కల్పించింది” అని పేర్కొన్నాయి.
“ప్రస్తుతం, ఎటువంటి కారణం తెలియజేయకుండానే మరో ఎఫ్ఐఆర్ను అస్సాం పోలీసులు దాఖలు చేశారు. అంతేకాకుండా, వరదరాజన్– థాపర్లను ఆగస్టు 22న గౌహతిలోని క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలన్నారు. అలా చేయకపోతే వారిని అరెస్టు చేస్తామని బెదిరించారు” అని ప్రకటనలో తెలియజేశారు.
ప్రకటన ప్రకారం, “గమనించాల్సిందేంటే, భారతీయ శిక్షాస్మృతి ఆర్టికల్ 124ఏ ప్రకారం దేశద్రోహ చర్యలు– క్రిమినల్ విచారణలను నిలిపివేయాలని 2022 మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది. బీఎన్ఎస్ సెక్షన్ 152 అనేది సెక్షన్ 124ఏకు సంబంధించిన కొత్త రూపం. గత వారం తన రిట్ పిటిషన్లో బీఎన్ఎస్ సెక్షన్ 152 చెల్లుబాటును కూడా ది వైర్ సవాలు చేసింది. అంతేకాకుండా, అస్సాం ప్రభుత్వంతో పాటు ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేసింది.’‘
ఈ ప్రకటనపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ లాహిరి– జనరల్ సెక్రటరీ నీరజ్ ఠాకూర్, ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ అధ్యక్షురాలు సుజాత రాఘవన్– కార్యదర్శి అదితి బహల్ సంతకం చేశారు.
“గత వారం, ది వైర్– వరదరాజన్‌లకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉపశమనాన్ని మేము స్వాగతిస్తున్నాము. కానీ, వారిపై ఇంకా కరణ్ థాపర్‌పై మరో కేసును నమోదు చేశారు. దీని వల్ల భారతదేశంలోని మీడియాను లక్ష్యంగా చేసుకోవడానికి సెక్షన్ 152 ఒక ఆయుధంగా మారిందని స్పష్టం అవుతోంది”అని వారు పేర్కొన్నారు.
“భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)ఏలో పొందుపరచబడిన భావ ప్రకటనా స్వేచ్ఛకు ముప్పు కలిగించే బీఎన్ఎస్లోని క్రూరమైన సెక్షన్ 152ను ఉపసంహరించుకోవాలని, అలాగే మీడియా సంస్థ ది వైర్ జర్నలిస్టులపై నమోదైన ఈ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సంతకందారులు డిమాండ్ చేశారు. పత్రికల గొంతు నులమడానికి బీఎన్ఎస్ సెక్షన్ 152 ఆయుధంగా ఉపయోగించబడుతుందని అస్సాం పోలీసుల చర్యల వల్ల అర్థమవుతుంది.” అని ఇంకా ప్రకటనలో చెప్పుకొచ్చారు.
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.