
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ రాజ్యాంగాన్ని మార్చేశాం. భారతీయ రాజ్యాంగ పాలన కిందికి ఆ ప్రాంతాన్ని తెచ్చేశాం. అంతేకాకుండా ఎప్పుడూ లేని విధంగా ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసేశాం. కేంద్ర ప్రాలిత ప్రాంతంగా నేరుగా కేంద్ర హోంశాఖ ప్రత్యక్ష పరిపాలన లో ఉన్న ఐదేళ్ల లో ఉగ్రదాడికి సంబంధించిన ఒక్క వార్త కూడా నమోదు కాలేదు అని పార్లమెంట్ లో ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నది.
సాధారణంగా కేంద్ర పాలిత ప్రాంతంలో రక్షణ భద్రత అక్కడ కొలువుదీన ప్రభుత్వం చేతిలో ఉండదు. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేసినట్టు? సుప్రీంకోర్టుకు చాలా సార్లు జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతమనే చెప్పారు. త్వరలో రాష్ట్రంగా మార్చుతామని సెలవిచ్చారు. దీంతో పాటు ఉగ్రవాదాన్ని రూపుమాపుతాం అన్నారు, కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని బతికిస్తామన్నారు. ఇవి ఏవీ జరగలేదు, ఎన్నికల తర్వాత కూడా రాష్టం గా మార్చిన సందర్భం గురించి కానీ పార్లమెంట్ లో సంబంధింత చట్టం చేసినట్లు గానీ సమాచారం లేదు. పైగా 2014 నుంచి ఇప్పటి వరకు ఉగ్రదాడులు కశ్మీర్లో ఇంకా ఎక్కువ అయ్యాయి. ఈ కాలంలో వచ్చిన మార్పు ఒక్కటే. గత ఐదేళ్లుగా రాష్ట్రపతి పాలన లో ఉన్న సమయంలో ఆ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం లో ఏమి జరిగింది అన్న విషయంలో ఒక్క విషయం కూడా బయటకి పొక్కలేదు. ఇంటర్నెట్ మొదలు వార్తా సంస్థలు అన్నీ ఎమర్జెన్సీ నాటి స్తితిని అనుభవించాయి.
అయితే, ఈ కాలంలో తమ నాయకత్వంలో అద్భుత పరిస్థితులు సృష్టించాము అని చెప్పుకునే ప్రయత్నంలో అంతర్జాతీయ ప్రతినిధి బృందాలను ఈ ప్రాంతానికి ఆహ్వానించింది. అదంతా వీడియోల్లో ప్రసారం చేసింది. అది చూసి అంతా బాగానే ఉంది అనుకుని రక్షణ వ్యవస్థ సరళతరం అయ్యాక పర్యాటకులుగా వెళ్ళిన సామాన్య ప్రజలను ఉగ్రమూకలకు బలిచేసింది ప్రభుత్వం కాదా? పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు, మరికొన్ని భూభాగాలతో మన ప్రియమైన నా దేశం- అఖండ భారత్ అనే నినాదాలు చేసే పెద్దలు, నలుగురు ఉగ్రవాదులు మన నేల మీద మన పౌరులను చంపేస్తుంటే ఏం చేసినట్టు? పహల్గావ్ ఉగ్రదాడిలో సామన్యులు బలికాకుండా, ప్రాణంతో మళ్లీ వారిని ఇంటికి పంపలేని అసమర్థులుగా ఉన్నామా మనం? పదేళ్ల క్రితం ఆనాటి కేంద్ర పాలకులను దద్దమ్మలని తిట్టిపోశాం. మరీ పదేళ్ల నుంచి పరిపాలనాదక్షులుగా చెలామణి అవుతున్న మనం చేస్తున్నదేమిటి? ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని నెలకొల్పితే, ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చేందుకు పదేళ్లలో ప్రణాళికలు సిద్దం చేసిన దాఖలాలు ఉన్నాయి. సామదానభేద దండోపాయాలతో ఆయా ఎమ్మెల్యేలను, ఎంపీలను మభ్యపెట్టో లోభానికి గురిచేసో జైళ్లలో వేసో ఫిరాయింపులతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలని కేంద్రప్రభుత్వం కూల్చింది. ఈ పరిణామాలను చరిత్ర గ్రంధస్థం చేసింది. అందుకే ఈ పాలకులకు చరిత్ర పట్ల ఏవగింపు.
2013- 2025 వరకు పాత మాటలేనా..!
2014లో అధికారంలో రాకముందు యూపీఏ చెత్త పరిపాలన వల్ల ఉగ్రవాదులు జనాన్ని చంపేస్తున్నారని బీజేపీ/ఎన్డీఏ నేతలు ఎన్నికల సభల్లో మాట్లాడారు. మరి 2014 నుంచి 2025 వరకు తమరు ఏం చేస్తున్నట్టు? 2013లో ప్రతిపక్ష నాయకుడు రాజ్‌నాథ్ జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఓ ప్రకటన చేశారు. 2014 లో అధికారానికి రావడానికి ముందు, 2019 లో రాష్ట్ర ప్రభుతాన్ని రద్దు చేయటానికి ముందు ఇలాంటి ప్రకటనలు ఎన్నో వచ్చాయి.

అయితే, అప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి యూపీఏ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టారు. మరి పదేళ్ల తరువాత కూడ అవే పరిస్థితులు పునరావృతం అవుతుంటే తప్పెవరిది? ఇంకా అటువంటి వాటి గురించే అవే మాటలు మాట్లాడుతూ ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోద్దామా? సోషల్ మీడియాను రాజకీయ రణక్షేత్రంగా మార్చేసి ఫేక్ న్యూస్‌తో హేట్ రాజకీయాలతో మార్ఫింగ్, ఏఐ జనరేటెడ్ ఫోటోలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఎన్ని ఎన్ని ప్రచారాలు చేస్తారు? క్లిష్ట సమయాలలో ప్రభుత్వాన్ని నడిపే పాలకులు “మౌనం”గా ఉంటే సరిపోతుందా? కానీ, మౌనానికి అర్థం ఏంటి? ఘటన జరిగిన తర్వాత ఉలిక్కిపడి వేటాడుతాం వెంటాడుతాం అంటే చాలా?
రెండు సైన్యాలను నడిపిని మాణిక్ షా..
అఖండ భారత్ సరే, రెండు వైపుల నుంచి భారతదేశాన్ని పాకిస్తాన్ వేధిస్తున్న తరుణం లో మనం ఉన్నాము. ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సిననది మానేక్ షా గురించి. పాకిస్తాన్‌ను రెండుగా చీల్చి బంగ్లాదేశ్‌ని ఏర్పాటు చేసి, పాకీస్తాన్ని బలహీనం చేసిన ఘనత ఇందిరా గాంధీ ప్రభుత్వానికి ఉంది. ఇందిరా నాయకత్వంలో సైన్యాలను నడిపి బంగ్లాదేశ్‌ని సామ్ మానెక్షా గెలిపించారు. తన చురుకైన హాస్యంతో, అంచనాలకు అందని సరదా వ్యాఖ్యలతో తనదైన ప్రసిద్ధి సాధించారు. 1971 భారత- పాకిస్తాన్ యుద్ధంలో కీలకపాత్ర పోషించిన ఆయన సేవను గుర్తించి పద్మభూషణ్‌తో ప్రభుత్వం సత్కరించింది.
అయితే, సామ్ మానెక్షా ఒకానొక సందర్భంలో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానెక్షా ప్రసంగం మొదలుపెట్టగానే, సభికులు “గుజరాతీలో మాట్లాడు” అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. అప్పుడు ఆయన కంటితడి చూపుతో ప్రేక్షకులను పరిశీలిస్తూ “నేను భారతదేశంలోని వివిధ ప్రాంతాల సైనికులతో పనిచేసినపుడు, వారి భాషలు నేర్చుకున్నాను. కానీ గుజరాత్ నుండి వచ్చిన
సైనికుల సంఖ్య చాలా తక్కువ. కాబట్టి నాకు గుజరాతీ భాష నేర్చుకునే అవకాశం కలగలేదు” అని అన్నారు. దీంతో కొన్ని క్షణాలు సభాస్థలిలో నిశ్శబ్దం రాజ్య
మేలింది.
గుజరాతీలు వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తారు. చాలా మంచి లక్షణాలు కూడా ఉన్నవారే, గుజరాత్లో జన్మించిన గాంధీ ఈ దేశానికి జాతిపిత కూడా. అయితే మనకు వ్యాపారం కంటే మన దేశం అనే జాతీయత అవసరమని గుర్తుంచుకోవాలి.
ఇందిరాగాంధీని ప్రశంసించిన వాజ్‌పేయి..
మరో సంఘటన, 1971 ఏప్రిల్ మంత్రివర్గ సమావేశంలో అందరూ అప్పట్లో నియంత అనుకుంటున్న ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, జనరల్ మానేక్షాను పాకిస్తాన్‌తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారాని అడిగారు. అప్పుడు సమాధానంగా “మన పదాతిదళం ఉపయోగించే ఆయుధాలు ఎక్కెక్కడో నిలిపి ఉన్నాయి. యుద్ధ యూనిట్లు, కాల్బలాల విషయంలో సమస్య ఉంది, కేవలం పన్నెండు ట్యాంకులు మాత్రమే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా ధాన్యం కోతకు అవసరమైన రైలు బోగీల కోసం పోటీ పడాల్సి వస్తుంది” అని మణిక్ షా చెప్పారు. అంతేకాకుండా రానున్న వర్షాకాలం తరువాత హిమాలయాల్లో రహదారులు తెరుచుకుంటాయని, లేకపోతే వాతావారణం వల్ల భారీ వరదలు రావచ్చని ఆయన హెచ్చరించారు. అప్పుడు మంత్రివర్గ సభ్యులు వెళ్లిన తర్వాత, మాణిక్షా ఇందిరాగాంధీకి రాజీనామా ఇద్దామనుకున్నారు.

ఆమె రాజీనామా అవసరం లేదు, దానికి బదులు మరేం చేద్దామని అడిగారు. తాను నిర్ణయించే సమయానికి ప్రారంభించేందుకు అనుమతిస్తే, విజయానికి సంబంధించి హామీ ఇవ్వగలనని ఆయన చెప్పారు. దీనికి ఇందిరా గాంధీ ఒప్పుకొని సరే అన్నారు. ఆ విధంగానే మన దేశం గెలిచిందనేది చరిత్ర. ఎమర్జెన్సీ ఒక చీకటి కథ. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇందిరా గాంధీని విజయేందిర అని రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్‌పేయి స్వయంగా ప్రశంసించింది మాత్రం బంగ్లా విముక్తి సమయంలోనే. ఒకప్పటి విజేయిందర ఇప్పటి బీజేపీ నేతల అభిప్రాయంలో చేతకానిది గా మిగిలిపోయింది. పార్టీ లు నాయకులు మాటలు మార్చవచ్చు కానీ చరిత్ర మారదు. అది వాస్తవం. వాస్తవమే చరిత్ర.

మాణిక్ షా, నేతాజీల వంటి వారి అవసరం..
ప్రస్తుత కాలంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వంటి నేతల అవసరం ఎంతైనా ఉంది. అటువంటి వ్యక్తులు సైనిక శక్తిగా మారి, విజ్ఞతతో ధైర్యంగా అసాంఘిక శక్తుల వైపు తుపాకీలు ఎక్కుపెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. అంతేకాకుండా రాజకీయ నాయకులను కూడా ప్రశ్నించి, నిజం చెప్పి, వ్యూహం నేర్పి భారత దేశాన్ని గెలిపించాల్సిన నేతలు మనకు అవసరం.
సంకుచిత ఎజెండాల కోసం కాకుండా భారతదేశం కోసం అటువైపుగా అడుగులు వేసి దేశాన్ని గెలిపించాలి. చెత్త రాజకీయాలు కాదు, మన కైలాస హిమాలయాలను, మన కశ్మీర్‌ను గెలిపిద్దాం. మన రాజ్యాన్ని- రాజ్యాంగాన్ని, రాజనీతిని నిలబెడడాం.
ఉగ్రవాదాన్ని బతికించేదెవరు..
కేవలం పహల్గాంలో నలుగురు మాత్రమే ఉగ్రవాదులు కాదు, కేవలం పాకిస్తాన్‌లోనే కాదు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు అడుగడుగున ఉగ్రవాదులున్నారు. అవకాశవాద, అవినీతిలో కూరుకుపోయిన అధికార- రాజకీయ ఉగ్రవాదులు, లంచం తీసుకునే సివిల్ అధికారుల వల్లనే ఉగ్రవాదులు బతుకుతున్నారు. ఉగ్రవాదం బతుకుతుంది. రాచ, అరాచ రాజకీయాలు, ప్రభుత్వాలు కేవలం ఉగ్రవాద డబ్బుతోనే మనుగడ సాగిస్తున్నాయి. ఆ దేశం, ఈ దేశమని కాదు, ప్రతి బిజినెస్‌లో పెద్దలు, నేతలు బతుకుతున్నారు. తమ ఉనికి కోసం చంపుతున్నారు. చంపిస్తున్నారు.
పదేళ్ల ముందు, పదేళ్ల నుంచి, రాబోయే పదేళ్లదాకా, లేదా వందేళ్లదాకా ఉగ్రవాదం ఉంటుంది. తమ స్వార్థం కోసం కొందరు ఉంచుతారు. వ్యాపారం కోసం రాజకీయం కోసం. అధికారం కోసం, ఎన్నికల కోసం, ఎన్నికల బాండ్స్ కోసం, సుప్రీంకోర్టు కూడా ఎలెక్షన్ బాండ్స్ స్కీం వంటి దానిని స్కాం అంటుందే కానీ అన్యాయంగా కార్పొరేట్ డబ్బు సేకరించి, విరాళాల పేరుతో వచ్చే ఆ మురికి డబ్బు, లంచపు నల్లధనం ఖర్చు చేస్తూ జనాన్ని మోసం చేసి అధికారాలు కొనుక్కుంటున్న నేరాల గురించి ఏం మాట్లాడడం లేదు.
ఐఎస్ఐ ఉగ్రవాదులకు బలైన జి కృష్ణప్రసాద్..
1992 నవంబర్ 29న హైదరాబాదులోని టోలి చౌకీ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాచుకున్నట్లు స్పెషల్ ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్ ఇంటెలిజెన్స్ శాఖలో అడిషినల్ పోలీసు అధికారిగా ఉన్నటువంటి జి కృష్ణప్రసాద్ నేతృత్వంలో ఆపరేషన్ మొదలుపెట్టారు. ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు జరిగిన ఎదురుకాల్పులలో కృష్ణప్రసాద్ చనిపోయారు. కృష్ణప్రసాద్ మాత్రం ఐఎస్ఐ ఉగ్రవాదులను ఎదుర్కొంటూ దళానికి నాయకత్వం వహించారు. మామూలు కానిస్టేబుళ్లను ముందు నిలబెట్టకుండా తానే ముందడుగు వేస్తూ ఉగ్రవాది ఏకె 47 తూటాలకు ఎదురు నిలిచారు. టోలి చౌకీ లాంటి రద్దీ ప్రాంతం ఐఎస్ఐ ఉగ్రవాదులకు ఆశ్రయంగా ఉండవచ్చని అప్పట్లో ఎవరికీ తెలియదు. ఉగ్రవాదుల వద్ద ఏకే 47 తుపాకులు ఉండటం ఆశ్చర్యం. ఆ ఏకే 47 తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి కృష్ణప్రసాద్‌ను, ఆయన గార్డును కూడా చంపేశారు.
ఈ కేసులో కృష్ణప్రసాద్‌ను హత్య చేసిన ముజిబ్ అహ్మద్ అనే ఉగ్రవాదికి జీవితకాల కారాగార శిక్ష విధించారు. కానీ అది నిజంగా జీవితాంతం కాదు. అతను కేవలం ఏడు సంవత్సరాల శిక్షను అనుభవించి జైలు నుంచి బయటకు వచ్చాడు. ఐఎస్ఐ ఉగ్రవాది ముజిబ్ అహ్మద్ విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదలవడం కృష్ణప్రసాద్ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. రెమిషన్ (remission)నియమాలను ఖచ్చితంగా, ఏ ఆలోచనా లేకుండా వర్తింపజేసిన ప్రభుత్వం ఉగ్రవాదిని సాధారణ ఖైదీతో సమానంగా చూడడం దుర్మార్గం. ఫలితంగా ఉగ్రవాది హాయిగా విడుదలై బయటకు వచ్చి మరికొన్ని ఉగ్రవాద కార్యక్రమాలలో పాల్గొన్నాడు. దీని మీద ప్రభుత్వ అధికారులు స్పందించి “ప్రభుత్వం ఖైదీల విడుదలకు కొన్ని ప్రమాణాలను నిర్ణయించింది. ఆ ప్రమాణాలను ఎవరు పాటించారో తెలియదు. ఆ ఉగ్రవాద హంతకుడిని పూర్తిగా విడుదల చేసే ముందు, ఆ హంతకుడు పరివర్తన చెందాడా లేదా లేకుండానే ఇటువంటి చర్య తీసుకుంటారా? ” అన్నారు.
హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు నుంచి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు ముజిబ్‌ను ‘‘అనుచిత ప్రవర్తన’’కారణంగా బదిలీ చేశారు. అంతకుముందు ఒంటరి సెల్లో ఉంచారు. ఇతర ఖైదీలతో అతనికి సంబంధం ఉండకుండా చూశారు. అంత వరకు బాగుంది. కానీ ఈ అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. “మీరు మారిపోయారా?” అని ఆనాటి విలేఖరులు అడిగితే నిందితుడు ఓ నవ్వు నవ్వి కెమెరా ముందు నుంచి వెళ్లిపోయాడు.
కృష్ణప్రసాద్ కుటుంబ బంధువులు ప్రభుత్వాన్ని పోలీసు అధికారులనూ అభ్యర్థించలేదు. కానీ దారుణమైన ఒక ఉగ్రవాది చట్టం ప్రకారం జైలు నుంచి విడుదలై, ఆనందంగా బయట తిరుగుతుండటం, దేశభక్తితో ప్రాణత్యాగం చేసిన వీరుడైన వ్యక్తిని ఇంత నిర్లక్ష్యం చేయడాన్ని మాత్రం ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. బ్రిటీష్ తుపాకుల ముందు తన ఛాతీ విప్పిన టంగుటూరు ప్రకాశం పట్ల ఎంత గౌరవం చూపించారో, అలానే ఐఎస్ఐ ఉగ్రవాదుల తుపాకుల తూటాలకు ఎదురొడ్డి పోరాడిన కృష్ణప్రసాద్ పట్ల కూడా అంతటి గౌరవం చూపించాలి కదా. కాని అలా చూపించ లేదు.
“ఒక ఉగ్రవాది అంత త్వరగా మారిపోయాడనడం ఆశ్చర్యంగా ఉంది” అంటూ కృష్ణప్రసాద్ భార్య జానకీ అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా “ఇది ప్రభుత్వ నిర్ణయం, నాకు ఎలాంటి అభిప్రాయం లేదు” అని చెప్పారు. అయితే, ప్రపంచాన్ని వణికించిన కరోనా మహ్మారి కాలంలో జానకీ, ఆమె కూతురు ఇద్దరూ ఆసుపత్రిలో మరణించారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించను కూడా స్పందించలేదు. కృష్ణ ప్రసాద్ చనిపోయిన తర్వాత తక్కువ అద్దెతో ప్రభుత్వ క్వార్టర్లో ఉండే అవకాశం కూడా కృష్ణప్రసాద్ కుటుంబానికి ఇవ్వలేదు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి చనిపోయిన కృష్ణప్రసాద్ త్యాగాన్ని గుర్తించి వీరోచిత పతకమే ఇవ్వలేదు. ఆయన చేసిన త్యాగానికి అసలైన గౌరవం దక్కలేదు.

బాధిత కుటుంబాన్ని పలకరించినప్పుడు “హైదరాబాద్‌లో ఐఎస్ఐ ఉగ్రవాద కార్యకలాపాలు వేరే రకంగా ఉన్నాయి” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీంతో “కృష్ణప్రసాద్ కుటుంబ నివాసానికి వెళ్లి, ఆయన భార్యను, కూతురు దీప్తిని కుమారుడు వివేక్‌ను కలిసి మాట్లాడి వారికి ధైర్యం ఇవ్వడం మన బాధ్యత” అని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఆ మాత్రం చేయకపోతే ప్రభుత్వం వారిని మర్చిపోలేదని జనం నమ్మడానికి అవకాశం ఉండదు.
ఉగ్రవాదానికి ఫుల్స్టాప్ పెట్టడానికి కేంద్ర హోంమంత్రి కఠిన చర్యలు తీసుకుంటున్నారని అనేకసార్లు ప్రకటించారు. గత పదేళ్లలో ప్రధాని కూడా ఇదే మాట అంటున్నారు. అయినా, పహల్గావ్లో ఉగ్రవాద దాడి జరిగింది, తరుచుగా జమ్మూ కశ్మీర్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి.
నిర్లక్ష్యం, వైఫల్యం, అన్నీ అమ్ముకోవడమేనా..
దేశంలో అడుగడుగున వైఫల్యం రాజ్యమేలుతోంది. బిజినెస్, వ్యాపారం, అంతర్జాతీయంలో అమ్ముకోవడాలే గాని, జాతీయతాభావనే లేదు. ఇది మనదేశం, మనమే కాపాడుకుందామనే మాటలేని రోగం రాజకీయనాయకులకే కాదు, సగం మంది ప్రజలకు కూడా ఉంది.
ఓ వైపు ప్రకృతిని నాశనం చేస్తున్నాము. కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఖనిజాలను వెలికితీస్తున్నాం. ఆ ఖనిజాల కోసం అడవులను నరికిపారేస్తున్నాం. కానీ నిజాన్ని నమ్మడం లేదు, అబద్ధాలను నిజాలుగా నమ్ముతున్నాం. ‘సత్యం ఏవ విజయతే’అని మన జాతీయ నినాదం. 150 కోట్ల జనాల్లో ఎంతమంది నిజం చెబుతున్నారు. ‘రామ్ నామ్ సత్య్ హై’అనే దానిని దేశంలో చిత్తశుద్ధితో వినేవారు ఎంతమంది ఉన్నారు? రాముడి పేరుతో రాజకీయాలు, మతం పేరుతో అధికారాలతో ఆడుకుంటూ, ఉన్నత పదవుల కోసం ‘జై శ్రీరామ్’ అంటున్నారు.
రామరాజ్యం రావడం లేదు. కానీ, తిరుమల హుండీలో డబ్బు మీదే ధ్యాస మనది. భక్తిలేదు భయం లేదు. ఏ విధంగా అక్రమంగా, దుర్మార్గంగా, కోట్లు కోట్లు సంపాదించి గర్భగుడులలో ఒక్కొక్క స్థంబానికి బంగారపు తాపడాలకు డబ్బిస్తాం కానీ పేదవాడికి తిండిపెట్టేవారు లేరు.
ఏదైనా కమిట్మెంట్ ఉంటే కదా?
అమెరికాలో ఆకాశాలను తాకే రెండు అద్భుతమైన భవనాలను ఉగ్రవాదులు విమానాలతో కూల్చారు. ఈ దుర్మార్గం వల్ల వందలాది మంది జీవితాలు నాశనం అయ్యాయి. ప్రస్తుతం పహల్గావ్ ఉగ్రదాడిలో మొత్తం 26 మంది చనిపోయారు. ఈ నేరం చిన్నదేం కాదు. వెంటాడి వెంటాడి ఒక్కొక్కణ్ని పట్టుకు శిక్ష వేస్తామంటున్న కేంద్ర ప్రభుత్వానికి వందలాది వందనాలు. అయితే, అమెరికా ఏం చేసిందేమిటి? మాటలు కాదు. తూటాలు కాదు. రాజకీయం కాదు. ఎక్కడ ఎక్కడున్నా సరే వేటాడి పట్టుకుని అమెరికాను కాపాడుకోవడానికి చూపిన కమిట్మెంట్ మనకు ఆదర్శం కావాలి.
కమిట్మెంట్ అంటే కట్టుబాటు, దీక్ష. అకుంఠిత దీక్ష కావాలి. ఉందా? ఒక్కో మరణానికి కన్నీటి బిందువునైనా ఇచ్చుకున్నామా? క్రికెట్ మైదానంలో ఓ రెండు క్షణాలు నిలబడి నివాళి అర్పిస్తే సరిపోతుందా? కోట్లకోట్ల వ్యాపారం కోసం ప్రచారం కోసం మౌనమే సరిపోతుందా? ఒక్కో ప్రాణానికి, ఒక్కో సైనికుడి జీవనానికి సరిపోయే పరిహారం ఇచ్చే దమ్ముందా?
మాడభూషి శ్రీధర్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.