
ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా అమెరికా నుండి తరలించబడే భారతీయుల్లో గుజరాతీయులే ఎక్కువ అన్నది తాజా వార్త. భారతదేశం నుండి అక్రమంగా అమెరికాలో అడుగుపెట్టిన వారి సంఖ్య 67391. అందులో గుజరాత్ వాసులు 41330.
ఈ విధంగా దొడ్డిదారిన ఖండాలు దాటి అమెరికాలో ప్రవేశించటం అంటే ఆషామాషీ కాదు. డింగుచా గ్రామం నుండి కెనడా సరిహద్దుల్లోగుండా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన జగదీష్ పటేల్, అతని భార్య, ఇద్దరు పిల్లలు మంచువానకు దాదాపు సజీవసమాధి అయినంత పనైంది.
గుజరాతీలు ఆఫ్రికా నుండి అమెరికా వరకూ బతుకుదెరువుకోసం వెళ్లటం కొత్తేమీ కాదు. ఈ కాలంలో రాష్ట్రం కూడా సంపన్న రాష్ట్రమైంది. దేశానికే ఆదర్శరాష్ట్రంగా ప్రచారమూ జరుగుతోంది. ఏ రాష్ట్రంలోనూ లేనంతగా గుజరాత్లో తలసరి ఆదాయం రు.181963. జాతీయ సగటు తలసరి ఆదాయం 99404 రూపాయలతో పోలిస్తే దాదాపు రెట్టింపు. మరి అటువంటి ఆదర్శరాష్ట్రం, ఆర్థికాభివృద్ధిలో దేశానికే పాఠాలు నేర్పిన రాష్ట్రం నుండి కూలీలు బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని దేశాలు, ఖండాలు దాటి ఎందుకు వెళ్తున్నారు?
సమాధానం చెప్పటం తేలికే. గుజరాత్లో ఎంతమంది కుబేరులున్నారో అంతకన్నా వేల రెట్లు బికారులున్నారు. పని చేయటానికి చేతినిండా పని కల్పించలేకపోతోంది రాష్ట్ర ప్రభుత్వం.
కటికదారిద్య్రానికి కేంద్రం
రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న వేగానికి అనుగుణంగా ఉపాధి కల్పన జరగటం లేదు. ఉన్న ఉద్యోగాలైనా కార్మికుల కడుపునింపేవిగా ఉన్నాయా అంటే అదీ లేదు. ఉత్పత్తికి అవసరమైన శ్రమ రానురాను సంఘటిత రూపం వదిలి అసంఘటితరూపం తీసుకొంటోంది. అంటే గతంలో పని చేసేవారికి కొన్ని కనీస భద్రతలుండేవి. ఇప్పుడు ఏ భద్రతా లేని వాతావరణంలో కష్టపడాల్సి వస్తోంది.
సంఘటిత లేదా వ్యవస్థాగత శ్రమకు మరో రూపం పని చేసే వారికి, పని ఇచ్చే వారికి మధ్య ఉండే కాంట్రాక్టు. ఈ కాంట్రాక్టులు (నియామకాలు) ఏదో ఒక స్థాయిలో రాతపూర్వకంగా ఉంటే అందులో కార్మికులకు ఒకటో రెండో హక్కులు ఉంటాయి. 2022లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కార్మిక సర్వే (గణాంక నిపుణుల భాషలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటారు) గుజరాత్లో నోటిమాటే కాంట్రాక్టుగా పని చేసే కార్మికులు 72 శాతంగా ఉన్నారు. వీరికి ఫలానా యజమాని నుండి ఫలానా జీత భత్యాల ప్రాతిపదికన ఫలానా సమయం నుండి ఫలానా సమయం వరకూ పని ఇస్తున్నామని రాతపూర్వకంగా ఇవ్వరన్నమాట. ఇటువంటి కార్మికులు కర్ణాటకలో 41 శాతం, తమిళనాడులో 53 శాతం, కేరళలో 57 శాతం, మధ్యప్రదేశ్‌లో 64 శాతం, హర్యానాలో 65 శాతం, మహారాష్ట్రలో 68 శాతం ఉన్నారు. ఎటువంటి కాంట్రాక్టు లేకుండా పని చేయటం అంటే పనికీ గ్యారంటీ ఉండదు. జీతాలకూ గ్యారంటీ ఉండదు.
దీన్నే వ్యవస్థాగత శ్రమశక్తిని అసంఘటిత శ్రమశక్తిగా మార్చటం అంటారు. సాధారణ భాషలో చెప్పుకోవాలంటే కార్మికులను, ఉద్యోగులనూ భద్రత కలిగిన ఉద్యోగాల నుండి తొలగించి భద్రతలేని అడ్డా మీది కూలీలుగా మార్చటం. కాజువల్ కార్మికుల సగటు వేతనం జాతీయ స్థాయిలో రోజుకు 433 రుపాయలు. కానీ గుజరాత్లో మాత్రం కేవలం 375 రూపాయలే. ఇది జాతీయసగటు దినసరి వేతనం కంటే తక్కువ. సగటు దినసరి వేతనాలు కేరళలో అత్యధికంగా 836 రూపాయలు ఉంటే, తమిళనాడులో 584 రూపాయలు, హర్యానాలో 486 రూపాయలు, పంజాబ్‌లో 449, కర్ణాటకలో 447, రాజస్థాన్‌లో 442, ఉత్తరప్రదేశ్‌లో 432, బీహార్‌లో 426 రూపాయలుగా ఉంది. దేశంలో కాజువల్ వర్కర్‌కు గుజరాత్ కన్నా తక్కువ దినసరి సగటు వేతనం ఉన్న రాష్ట్రం చత్తీస్గడ్ ఒక్కటే.
పేదరికం తీవ్రతను అర్థం చేసుకోవడానికి వేతనాలు ఒక్కటే కొలమానం కాదు. గుజరాత్లో పట్టణ, గ్రామీణ ప్రజల నెలసరి కుటుంబ ఖర్చులు ఆ రాష్ట్రంలోని పేదరికం తీవ్రతను మరింత కొట్టొచ్చినట్లు చూపిస్తాయి. జాతీయ నమూనా సర్వే సంస్థ 2022-23 సంవత్సరానికి చేసిన అధ్యయనం ప్రకారం గుజరాత్లో గ్రామీణ ప్రజలు నెలకు రు. 3798 రూపాయలు కంటే మించి ఖర్చుపెట్టే స్థితిలో లేరు. పట్టణ ప్రాంత ప్రజల నెలసరి ఖర్చు కేవలం 6621 రూపాయలు మాత్రమే. తమిళనాడు గ్రామీణ ప్రాంత ప్రజలు 5130 రూపాయల నెలసరి ఖర్చుతో జీవితం వెళ్లదీస్తుంటే పట్టణ ప్రాంత ప్రజల నెలసరి ఖర్చు 7666. కేరళలో 5924, 7707, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రజల నెలసరి ఖర్చు 4870, పట్టణప్రాంత ప్రజల నెలసరి ఖర్చు 6872. హర్యానాలో 4859, 7911. మహారాష్ట్రలో 4010, 6657గా ఉంది.
పేదరికాన్ని మరింత సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఐక్యరాజ్యసమితి బహుముఖ దారిద్య్ర సూచిని రూపొందించింది. ఈ సూచిక కేవలం ఒక కుటుంబం నెలకు చేసే ఖర్చుతో పాటు కుటుంబంలో విద్య, వైద్యం కోసం పెడుతున్న ఖర్చులను కూడా లెక్కలోకి తీసుకుంటుంది. వీటన్నిటినీ కలిపి చూస్తే గుజరాత్ ఈ సూచికల్లో అత్యంత దిగువ స్థానాల్లో ఉంది. గుజరాత్, బెంగాల్‌లు దురవస్థ విషయంలో పోటీ పడుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో పేదల పరిస్థితి ఈ రాష్ట్రాల కంటే ఎంతో కొంత మెరుగ్గానే ఉంది.
గుజరాత్లో ఆహార భద్రత లేని కుటుంబాలు రాష్ట్ర జనాభాలో 38 శాతం ఉన్నాయి. గుజరాత్ కంటె ఎక్కువమంది ఆకలితో ఉన్న రాష్ట్రాలు బీహార్, జార్కండ్లు మాత్రమే.
దేశంలోనే అత్యధిక తలసరి ఆదయాం ఉన్న రాష్ట్రంలో అత్యంత కటిక దారిద్య్రం ఎలా పేరుకుపోతోంది? ఈ కటిక దారిద్య్రాన్ని అధిగమించే ప్రయత్నంలోనే ప్రజలు ఎంతో కొంత మెరుగైన జీవితాలు ఆశించి అక్రమ మార్గాల్లోనో, సక్రమ మార్గాల్లోనో ఇతర దేశాలకు వెళ్లి బతకటానికి సిద్ధమవుతున్నారు. అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన 42వేల గుజరాతీయులు ఈ కోవకు చెందినవారే. కాలుకడుపులు చేపట్టబట్టుకుని కారుచీకట్లో ప్రయాణించి ఇతర దేశాలకు వెళ్లటానికి ప్రయత్నం చేస్తున్నారు.
పరిమిత ఉపాధి, పెట్టుబడి కేంద్రీకరణ, గుత్తాధిపత్యం దిశగా ఆర్థిక వ్యవస్థ
ఈ పరిస్థితికి కారణాలు తెలుసుకోవాలంటే 2001 తర్వాత మోడీ నాయకత్వంలో గుజరాత్ ప్రయాణించిన ఆర్థికాభివృద్ధి మార్గాన్ని అర్థం చేసుకోవాలి. 2001 నుండి 2014 మధ్య కాలంలో గుజరాత్ విద్యవైద్య గ్రామీణాభివృద్ధి రంగాలను గాలికొదిలేసి కేవలం పారిశ్రామిక వృద్ధి లక్ష్యంగా మౌలికవసతులు, పెట్రోకెమికల్ కాంప్లెక్సులు కట్టుకుంటూ పోయారు. నౌకాశ్రయాలు, బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురుశుద్ధి పరిశ్రమలు నిర్మించుకుంటూ పోయారు. ఇంకా చెప్పాలంటే శ్రమాధారిత పరిశ్రమలు స్థానే పెట్టుబడి కేంద్రీకృత పరిశ్రమలకు పెద్ద పీట వేసింది.
అప్పటి వరకూ సాంప్రదాయకంగా అనుసరిస్తూ వచ్చిన గుజరాత్ ఆర్థికాభివృద్ధి నమూనాకు ఇది పూర్తి భిన్నమైనది. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రంగా ఉన్న రాష్ట్రం గుజరాత్. ప్రభుత్వాలు కూడా ఈ పరిశ్రమలకు పెద్దఎత్తున ఊతమిచ్చేవి. 1990 దశకం నాటికి కూడా చిన్నమధ్యతరహా పరిశ్రమల కేంద్రంగానే ఉంది ఈ రాష్ట్రం. ఈ పరిశ్రమల్లోనే ఎక్కువమందికి ఉపాధి దొరికేది.
2003లో మోడీ అమల్లోకి తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం పై సాంప్రదాయక ఆర్థిక విధానాలకు తిలోదకాలిచ్చింది. 2009 పారిశ్రామిక విధానం తర్వాత ఇక ఉపాధి ఊసే ప్రభుత్వ ప్రకటనల్లో కనుమరుగైంది.
రాష్ట్రంలోని పారిశ్రామిక వాడల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన చట్టపరమైన అడ్డంకులు తొలగించే లక్ష్యంతో గుజరాత్ ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టాన్ని మోడీ ప్రభుత్వం ఆమోదించింది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించటమే ఈ చట్టం లక్ష్యం. దేశంలోనే కాక విదేశాల నుండి కూడా పెట్టుబడులు ఆకర్షించేందుకు అనువైన రాష్ట్రంగా గుజరాత్‌ను తీర్చిదిద్దాలన్నది 2009లో ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక విధానం సారాంశం. మూడు బిలియన్ డాలర్లు విలువైన పరిశ్రమల మొదలు 10 బిలియన్ డాలర్లు విలువైన పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షించాలన్నది మోడీ లక్ష్యం. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వం కల్పించదల్చుకున్న ఉపాధి అవకాశాలు కేవలం రెండువేలు. అంటే ఐదులక్షల పెట్టుబడికి ఒక ఉద్యోగం అన్నమాట.ఈ విధానం ద్వారా శ్రమాధారిత ఆర్థిక వ్యవస్థ స్థానే పెట్టుబడి కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థకు మోడీ పాలనలో పునాదులు పడ్డాయి. ఆ స్థాయి పరిశ్రమలు ఆహ్వానించాలంటే వాళ్లు అడిగినంత భూమి అడిగిన పద్ధతుల్లో అందచేయాలన్నది 2009 నాటికి మోడీ విధానంగా ఉంది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం, లేదా ప్రైవేటు పరిశ్రమాధిపతులకు అమ్మటం, లేదా 99 ఏళ్లకు లీజుకివ్వటానికి వీలుగా చట్టాలు, నియమాలు రూపొందించింది మోడీ ప్రభుత్వం.
నూతన పారిశ్రామిక విధానం రైతాంగంతో పాటు కార్మికులను కూడా దెబ్బతీసింది. 1990 దశకం వరకూ ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు పొందాలంటే ప్రతి పరిశ్రమా కనీసం వందమంది శాశ్వత ఉద్యోగులను నియమించుకోవాలన్న నిబంధన ఉండేది. మోడీ హయాం వచ్చేసరికి ఈ నిబంధన రద్దుచేసి వంద మందికి పని చూపిస్తేచాలు అన్న కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది.
గుజరాత్ ప్రభుత్వం అమలు చేసిన నూతన పారిశ్రామిక విధానం పిడికెడు మంది పారిశ్రామికవేత్తలకు, గుత్తాధిపతులకు మేలు చేసింది. గ్రామీణ పేదలు, రైతాంగం, కార్మికులకు తీరని అన్యాయం చేసింది.
ఈ విఢానాల వలన 2013 నాటికి దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆహ్వానించిన రాష్ట్రంగా ఎదిగింది. కానీ ఉపాధి కల్పనలో మాత్రం పరిస్థితి నానాటికీ దిగజారిపోయింది. ఏతావాతా చూస్తే ఉపాధిసహిత పారిశ్రామిక విధానం కాస్త ఉపాధి రహిత పారిశ్రామిక ఉత్పత్తి విధానంగానూ, కార్మికుల ఆకలి తీర్చే పారిశ్రామిక విధానం స్థానంలో పెట్టుబడిదారుల లాభార్తి తీర్చే పారిశ్రామిక విధానంగానూ మారింది. ఈ కోణంలో తమిళనాడు మెరుగైన పరిస్థితుల్లో ఉంది. 2013 నాటికి దేశంలోని పారిశ్రామిక పెట్టుబడిలో 17.7 శాతం గుజరాత్లో ఉంటే పారిశ్రామిక ఉపాధిలో వాటా కేవలం 9.8 శాతమే. దీనికి భిన్నంగా దేశ పారిశ్రామిక పెట్టుబడిలో కేవలం 9.8 శాతం కలిగి ఉన్న తమిళనాడు పారిశ్రామిక ఉపాధిలో 16 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది.
భారీ పరిశ్రమల వలన కొత్తగా ఉపాధి అవకాశాలు ఏర్పడకపోగా ఉన్న చిన్న మధ్యతరహా పరిశ్రమలు దివాళా తీశాయి. అనుబంధ ఉత్పత్తులు సరఫరా చేసే చిన్న మధ్యతరహా పరిశ్రమలకు సకాలంలో చెల్లింపులు రాకపోవటంతోపాటు విద్యుత్ ప్రైవేటీకరణతో అడ్డూ అదుపు లేకుండా పెరిగిన విద్యుత్ ధరలతో 2004 నుండి 2014 సంవత్సరాల మధ్య గుజరాత్లో 60వేల చిన్న పరిశ్రమలు దివాళా తీసి మూతపడ్డాయి.
ప్రపంచంలోనే అత్యంత కుబేరుల జాబితాలో చేరిన అదానీ దేశంలో క్రోనీ పెట్టుబడిదారీ విధానానికి నిలువెత్తు నిదర్శనం. అన్న లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు పెట్టిన అదానీ కేవలం 36 వేలమందికి మాత్రమే ఉపాధి కల్పించారు.
క్రిస్టొఫ్ జాఫ్రెలాట్
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.