
న్యూఢిల్లీ: కేవలం కొన్నినెలల ముందు బీహార్‌లో సమగ్ర ఓటరు జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పలుసందేహాలకు తావిస్తోంది. 2003 జనవరి ఒకటో తేదీ నాటికి ఓటర్ జాబితాలో పేరు లేని వాళ్లంతా తమ ఓటు హక్కును ఖరారు చేసుకునేందుకు తమ పౌరుసత్వాన్ని, తల్లిదండ్రుల పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కేవలం రెండు నెలల గడువులో ఇంత బృహత్ కార్యాన్ని నెరవేర్చే అవకాశం ఉందా అన్నది ప్రశ్న. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడానికి ముందే ఈ కసరత్తు పూర్తి కాకపోతే బీహార్‌లో లక్షలాదిమంది పౌరులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనర్హులుగా మారుతారు. ఈ విధంగా భారీ సంఖ్యలో ప్రజలకు ఓటు హక్కు నిరాకరించడం, వారి పౌరసత్వంపై సందేహాలు లేవనెత్తడం గమనిస్తే స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌర జాబితా తయారీకి నడుం కట్టిందా అన్న సందేహం కూడా కలుగుతోంది.
బీహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేయాలంటూ జూన్ 24న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. చివరిసారిగా 2003లో ఇటువంటి సవరణ జరిగిందని ఎన్నికల సంఘం ఆ ప్రకటనలో తెలిపింది. ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాను సవరించాలన్న నిర్ణయాన్ని సమర్థించుకుంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ కాలంలో విదేశీ పౌరులు ఓటర్లుగా నమోదయ్యారని వారిని గుర్తించి ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి ఈ సమగ్ర సవరణ అవసరమవుతుందని ప్రస్తావించింది.
“వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, తరచుగా పెరుగుతున్న వలసలు, ఎదిగి వస్తున్న యువ ఓటర్లు, చనిపోయిన వారి వివరాలు గుర్తించి ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగించకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో లోపరహితమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు ఈ సవరణ అవసరమయింది” అని ఎన్నికల సంఘం ప్రకటించింది.
బీహార్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి రాసిన 19 పేజీల లేఖతో పాటు జత చేసిన దరఖాస్తు ఫారంలో 1987 జూలై 1వ తేదీ ముందు పుట్టిన ఓటర్లు తమ జనన ధ్రువీకరణతో పాటు పుట్టిన స్థలాన్ని కూడా ధృవీకరించుకునేందుకు అవసరమైన పత్రాలు సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 1987 జూలై ఒకటో తేదీ తర్వాత 2004 డిసెంబర్ రెండో తేదీ మధ్యకాలంలో పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీ స్థలం లాంటి వివరాలతోపాటు తన తల్లిదండ్రులలో ఎవరో ఒకరికి సంబంధించిన పుట్టిన తేది స్థలం వివరాలు కూడా జత చేయాలని, 2004 డిసెంబర్ రెండో తేదీ తర్వాత ఓటర్లుగా నమోదైన వారు తమ ధ్రువీకరణ పత్రాలతో పాటు తల్లిదండ్రులు ఇరువురికి సంబంధించిన దృవీకరణ పత్రాలు సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.
బీహార్‌లో దాదాపు 8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ 8 కోట్ల మందికి సంబంధించిన వివరాలు సేకరించి తనిఖీ చేసి ఖరారు చేయటానికి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన సమయం కేవలం రెండు నెలలు. జూన్ 25 నాటికి ఈ కసరత్తు మొదలైంది.(కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు సకాలంలో పూర్తి చేయాలంటే రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించే సిబ్బంది రోజుకి 24 గంటలు పనిచేసి కనీసం 55 వేల మందికి సంబంధించిన తనిఖీలు పూర్తి చేయాలి. అది కూడా రెండు దఫాలుగా పూర్తి చేయాలి. అంటే రోజుకు లక్ష పదివేలమందికి సంబంధించిన వివరాలు సేకరించి తనిఖీ చేసి ఖరారు చేస్తే తప్ప ఈ కసరత్తు పూర్తి కాదు. అంటే గంటకు మూడు వేల మందికి సంబంధించిన వివరాలు ఖరారు చేయాలి. అంటే నిమిషానికి నలభై మందికి సంబంధించిన వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎనిమిది కోట్ల భారతీయుల పౌరసత్వం కేవలం అరసెకనులో తేలిపోవాలి- అనువాదకులు)
ఇంతటి బృహత్ కర్త్వ్యాన్ని నెరవేర్చటానికి గాను పోలింగ్ బూత్ స్థాయి అధికారులు జులై 26వ తేదీ వరకు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తారు. అలా సేకరించిన వివరాలు ఆగస్టు ఒకటో తేదీ నాటికి ప్రచురించాలి. అలా ప్రచురించిన ముసాయిదా ఓటర్ జాబితాలను పోలింగ్ బూత్ పరిధిలో అందరికీ అందుబాటులో ఉంచాలి. ముసాయిదా జాబితాపై ఎవరైనా అభ్యంతరాలు చెప్పాలనుకుంటే సెప్టెంబర్ ఒకటో తేదీలోపు అభ్యంతరాలు చెప్పాలి. ఈ అభ్యంతరాలు పరిష్కరించి తుది ఓటర్ల జాబితాను 2025 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి ప్రచురించాలి.
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులకు ఎటువంటి ఆధారాలు లేకుండా ఓటర్ హక్కు ధృవీకరించారన్న భారతీయ జనతా పార్టీ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అర్థం చేసుకోవాల్సి ఉంది. మహారాష్ట్ర ఎన్నికల సమయంలో కూడా ఓటర్ జాబితా తారుమారయిందని కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించింది.
2003 కంటే ముందే ఓటరుగా నమోదైన వారే పౌరులు అన్న భావన..
జూన్ 24వ తేదీ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశంలో 11వ పేరా గ్రాఫ్‌లో “చివరిసారిగా ఓటర్ జాబిత సమగ్ర సవరణ 2003లో జరిగింది. ఆ మేరకు 2003 జనవరి ఒకటో తేదీ నాటికి ఓటర్లుగా నమోదైన వారికి ఓటుహక్కు ఖాయం అవుతుంది. 2003 జనవరి ఒకటో తేదీ నాటికి ఓటరుగా నమోదైన వారికి సంబంధించి వేరే అభ్యంతరాలు లేకపోతే వారికి ఓటు హక్కుతో పాటు వారసత్వం కూడా ఖాయం అవుతుంది” అని స్పష్టంగా ప్రకటించింది.
“ఇటువంటి సమగ్ర సవరణ చివరిసారిగా 2003లో జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుంది. అంటే 2003 కంటే ముందు ఓటర్లుగా నమోదు అయినవారు పౌరులుగానే పరిగణించబడతారు. అంటే 2003 తర్వాత ఓటరుగా నమోదైన వారు పౌరులని స్పష్టం చేయలేము. అంటే వారి పౌరసత్వం సందేహాస్పదం అవుతుంద”ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకులు జగదీష్ చొక్కర్ ది వైర్‌తో అన్నారు.
“2003 నుంచి 2024 వరకు, 2024 లోక్‌సభ ఎన్నికలతో సహా వీళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే పౌరసత్వమే గ్యారెంటీ లేని పౌరులు పాతికేళ్ల పాటు ఐదు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్నారని భావించాలా? గత 21 సంవత్సరాలుగా కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ ఓటర్ల జాబితాలో ఎటువంటి సమగ్ర సవరణ చేపట్టలేదు. రెండు దశాబ్దాలు తర్వాత కళ్ళు తెరిచి ఎన్నికల సంఘం దృష్టిలో 2003 తర్వాత బీహార్ పౌరులు ఓటర్లుగా నమోదైనా నమోదు కానట్లే. ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల పేర్లు తొలగించడానికి పద్ధతి ఉంది. తాజా ఆదేశాల ద్వారా స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ విధివిధానాలకు పద్ధతులకు చెల్లు చీటి ఇచ్చింది. 2003 తర్వాత నమోదైన ఓటర్లు అందరినీ తాజా ఆదేశాల ద్వారా ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. నాకు తెలిసినంతవరకు ఇది చట్ట విరుద్ధమైన చర్య” అన్నారు చొకర్.
అస్సాం ప్రభుత్వం 2019లో మొదటిసారి జాతీయ పౌరసత్వ జాబితాను ప్రకటించింది. చట్టబద్ధమైన భారతీయ పౌరులు, సరైన ఆధారాలు సాక్ష్యాలు లేకుండా 1971 మార్చి 24 ఆర్థరాత్రి వలస వచ్చి భారతీయ పౌరసత్వం పుచ్చుకున్న వారి వారసులు మధ్య వ్యత్యాసాన్ని తేడాలను గుర్తించడం ఈ జాబితా లక్ష్యం. అంతిమంగా అస్సాంలో 19 లక్షల మంది ఓటర్లను లేదా పౌరులను, పౌరులు కాదని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ పౌరసత్వ జాబితా స్పష్టం చేస్తోంది. జాతీయ పౌరసత్వ జాబితాలో స్థానం సంపాదించుకోవడానికి ఒక వ్యక్తి తన పౌరసత్వాన్ని నిరూపించుకోవాలి. కానీ ప్రస్తుతం ఈ ప్రక్రియ యావత్తు ఓటరు జాబితా సవరణ రూపంలో జరుగుతుంది” అని చొక్కర్ వివరించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రమాణ పత్రాల జాబితా కేవలం సూచన ప్రాయమైనది మాత్రమే. సంపూర్ణమైనది కాదు. అంటే కేంద్ర ఎన్నికల సంఘం కావాలనుకుంటే ఓటర్ల నుంచి తమ పౌరసత్వాన్ని ధ్రువీకరించుకోవడానికి తాజాపత్రాలు లేదా అదనపు పత్రాలు అడగవచ్చు. ఈ సందేహం వచ్చినప్పుడు ఆదనపు పత్రాలు సేకరించడానికి, వాటిని ధ్రువీకరించడానికి ఈ రెండు నెలల గడువు సరిపోతుందా అన్నది ప్రశ్న.
“(కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశంలో) పౌరసత్వ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. కానీ ప్రజాప్రాతినిధ్య చట్టం ఓటు హక్కు పొందడానికి సమర్పించాల్సిన పత్రాల జాబితా ఏమిటన్నది స్పష్టంగా పేర్కొనలేదు. తాజా ఆదేశంలో ప్రస్తావించిన ధ్రువీకరణ పత్రాలు సూచనాప్రాయమైనవి మాత్రమే అంటే అంతవరకు సంతోషం. 2003కు ముందు ఓటర్ల జాబితాలో నమోదైన ఓటర్ల అందరికీ సంబంధించిన పౌరసత్వం ధ్రువీకరణ కూడా మంచిదే. కాకపోతే ఈ ధ్రువీకరణకు కావలసిన పత్రాలు సమీకరించేందుకు, సమర్పించేందుకు తనిఖీ చేసేందుకు ప్రతిపాదించిన గడువు చాలా పరిమితమ”ని పాట్నా కేంద్రంగా ఉన్న చాణిక్య నేషనల్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఫైజాన్ ముస్తఫా అన్నారు.
మాజీ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎన్ గోపాలస్వామి అభిప్రాయంలో తాజా కసరత్తును జాతీయ పౌరసత్వ జాబితా రూపొందించే ప్రయత్నంగా చూడాల్సిన అవసరం లేదు.
“ఈ వాదనలో ఎటువంటి బలం లేదు. ఎన్నికలలో భారతీయ పౌరులు మాత్రమే పాల్గొనాలి, విదేశీయులు కాదు. ఓటర్లు దేశీయులా విదేశీయులా అన్నది చట్ట ప్రకారం సరి చూడటానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆందోళన ఎందుకు,?” అన్నారు.
ఎన్నార్సీ కంటే ప్రమాదకరం..
ఈ కసరత్తు ఎన్నార్సీ కంటే ప్రమాదకరమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఈ కసరత్తు బీహార్‌లో జరుగుతున్నా బీజేపీ అసలు లక్ష్యం బెంగాల్ అని మమతా బెనర్జీ అన్నారు. అక్రమ వలసదారులకు తృణమూల్ కాంగ్రెస్ ఆశ్రయం ఇస్తోందంటూ గత కొంతకాలంగా బీజేపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
గ్రామీణ బెంగాల్ ఓటర్ల స్థానంలో ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి వచ్చినవారిని ఓటర్లుగా చేస్తారని మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు.
“ప్రజాస్వామ్యం కట్టుబానిస అని బీజేపీ భావిస్తే పొరపాటు. విద్యార్థులు, గ్రామీణ పేదలు, వలస కార్మికులు, సాధారణ ప్రజలు, నిరక్షరాస్యులయిన తల్లితండ్రులు ఈ కసరత్తు వలన పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది” అని అన్నారు మమతా బెనర్జీ.
మోసపూరిత ఆలోచన..
బీహార్‌లో ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుత ఓటరు జాబితా సవరణను వ్యతిరేకిస్తున్నాయి. పరిష్కారం పేరుతో భారీ మోసానికి బీజేపీ బరి తెగిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు పన్నిన పన్నాగమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
ఇండియా బ్లాక్ భాగస్వామ్య పక్షాలు ఓ విలేకరుల సమావేశం జరిపాయి. త్వరలోనే ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నట్టు ఇండియా బ్లాక్ ప్రతినిధులు తెలిపారు.
“బీహార్‌లో ఓటర్ల జాబితాను సమగ్రంగా సవరించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి మార్చ్‌లో ప్రచురించిన బీహార్ ఓటర్ల జాబితాను పక్కన పెట్టినట్లే. మొత్తానికి పూర్తిగా తాజా జాబితా తయారవుతుంది”అని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అన్నారు.
“కేవలం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు ఈ కసరత్తు ఎందుకు చేపట్టారన్నదే ప్రశ్న. కేవలం రెండు నెలల వ్యవధిలో ఇంటింటికి తిరిగి ఓటర్ జాబితాను తాజాపరచడం సాధ్యమేనా? అంతేకాదు ఓటర్ల జాబితాను తనిఖీ చేసే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన ధ్రువీకరణ పత్రాల జాబితాను గమనిస్తే పేదల వద్ద ఇవన్నీ అంత భద్రంగా ఉండే అవకాశం లేదు. ఈ విషయంపై మా ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు, ప్రధానమంత్రి మోడీకి రానున్న ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్నట్లు ఉంది. చివరకు పేదల నుంచి ఓటు వేసే హక్కును కూడా లాగేసుకోదలుచుకున్నారు. ప్రజాస్వామ్యంలో పేదల చేతుల్లో ఉన్న ఏకైక సాధనం ఓటు. సమాజంలో వెనుకబడిన వారి నుంచి నితీష్, బీజేపీలు ఈ ఆఖరి హక్కును కూడా లాక్కోదల్చుకున్నారు.
“2019లో బీహార్‌లో జాతీయ పౌరసత్వ జాబితా రూపొందించే ప్రయత్నాలను స్వయంగా నితీష్ కుమార్ అడ్డుకున్నారు. ఎన్నార్సీ ఎక్కడిది? అమలు చేసే సమస్య లేదు. అసలు అవసరం ఏముంది? అని ప్రశ్నించారు” అంటూ తేజస్వి యాదవ్ గుర్తు చేశారు.
బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన తాజా కసురత్తు గురించి రాష్ట్ర ప్రభుత్వం గానీ జనతాదళ్(యునైటెడ్) కానీ ఇంతవరకు స్పందించలేదు.
ఓటర్ల వెలి, పారదర్శకత లోపం, ఓటు హక్కు రద్దు గురించిన ఆందోళనలు..
“అర్హత కలిగిన పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చడం ద్వారా వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం, అనర్హులైన వారిని ఓటరు జాబితా నుంచి తొలగించడం, ఈ కసరత్తులో పూర్తిస్థాయిలో పారదర్శకతను పాటించటం తమ ఉద్దేశమ”ని కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 24వ తేదీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
తాజా కసరత్తులో భాగంగా పోలింగ్ బూత్ స్థాయి అధికారులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా దరఖాస్తు ఫారాలు నింపుకొని ఇంటింటికి తిరిగి ఓటర్లకు అందజేస్తారు. ఈ ఫారం ఎన్నికల సంఘం వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉన్నది. ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న వారందరూ ఈ ఫారాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
అయితే గ్రామీణ పేదలు, కంప్యూటర్ గురించి అవగాహన లేనివారు, వలస కార్మికుల విషయంలో ఇది సాధ్యమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తో పాటు బీహార్ నుంచి కూడా అత్యధిక సంఖ్యలో కార్మికులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు.
2023లో నీతి ఆయోగ్ రూపొందించిన ఒక అధ్యయనం ప్రకారం జాతీయ సగటు అక్షరాస్యత 73% అయితే బీహార్‌లో సగటు అక్షరాస్యత కేవలం 66% మాత్రమే. నేటికీ 88% గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు.
“వలస వెళ్లిన బిహారి కార్మికులు ఈ ఫారాన్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటారు? ఎక్కడ అందజేస్తారు? గ్రామీణ బీహార్‌లో ఎంతమందికి కంప్యూటర్ నుంచి కాగితాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసి, మళ్లీ అప్లోడ్ చేయటం తెలుసు? ఈ పనులు పూర్తి చేయడానికి రాష్ట్రంలో ఎన్ని కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయి? కరెంట్ సరఫరా పరిస్థితి ఏంటి?” అంటూ ఈ కసరత్తు సాధ్యాసాధ్యాలపై జగదీష్ చోకర్ పలు సందేహాలను వ్యక్తం చేశారు.
తాజా కసరత్తులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లకు సంబంధించిన వివరాలతో పాటు ఓటర్ల తల్లిదండ్రుల వివరాలు కూడా తప్పనిసరిగా సమర్పించాలని కోరింది. జనన- మరణ రికార్డులు సక్రమంగా లేని రాష్ట్రంలో ఇటువంటి అంశాలు అనివార్యం చేయటం అంటే పెద్ద ఎత్తున ఓటర్లు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
“పౌరులు తమను తాము పౌరులుగా నిరూపించుకోవడానికి ప్రభుత్వ విభాగాలు అవసరానికి మించిన కాగితాలు, పత్రాలు అడగటం అంటే ఈ ప్రక్రియలో చాలామంది పౌరసత్వానికి అనర్హులు అయ్యే ప్రమాదం ఉన్నది”అని సతర్క్ నాగరిక సంఘటన్ పేరుతో ప్రభుత్వ విధానాలలో పారదర్శకత కోసం పనిచేస్తున్న అంజలి భరద్వాజ్ ఆందోళన వ్యక్తం చేశారు.
“గణనీయమైన సంఖ్యలో ఓటర్లు అనర్హులుగా ప్రకటించబడే ప్రమాదం ఉన్నది అంటే, వారు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశాలు లేవు.
“ఇక్కడ ఒక విషయం స్పష్టం అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల నుంచి చాలా ధ్రువీకరణ పత్రాలు కోరుతోంది. అటువంటి సమాచారం ఓటు హక్కును ఖరారు చేయడానికి ఎందుకో అర్థం కావడం లేదు. కనీస తనిఖీ జరిగిన తర్వాతనే వారికి ఓటు హక్కు ఖాయం అయింది. కానీ ఇప్పుడు అదే వ్యక్తులకు ఓటు హక్కు ఖాయం చేయటానికి వేరేవేరే పత్రాలు ఎందుకు అవసరమవుతున్నాయి? ఓటర్ల జాబితాలో ఉన్న పౌరుడికి ఓటు హక్కును గ్యారెంటీ చేయడానికి ఇన్ని కాగితాల అవసరమేమిటో ఎన్నికల సంఘం వివరించాలి. అంతేకాదు, ఓటర్లకు సమాచారాన్ని అందించాలన్న విషయంలో మాత్రం ఎన్నికల సంఘం ముందుకు రావడం లేదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వమే 1961 నాటి ఎన్నికల నిర్వహణ నిబంధనా వళిలో 93(2)(అ)ను సవరించింది” అంటూ అంజలి భరద్వాజ్ గుర్తు చేశారు.
ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలు తనిఖీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశంలో పారదర్శకత కోసమే ఈ ప్రయాస అన్న విషయాన్ని గుర్తు చేస్తూ జగదీష్ చోకర్ “ఒకసారి ఓటర్లు సమర్పించిన తరువాత ఈ పత్రాలను కేవలం ప్రభుత్వ అధికారులు మాత్రమే చూడగలరు. పారదర్శకత అంటే ఇదేనా?” అని ప్రశ్నించారు.
ఆందోళనలు నిరాధారం..
ఇదిలా ఉండగా మరోవైపున మాజీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గోపాలస్వామి దేశంలో చాలాకాలం పాటు ఇటువంటి సమగ్రమైన ఓటర్ల జాబితా సవరణ జరపలేదని, ఇంటింటికి తిరిగి తనిఖీ చేయలేదని అటువంటి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం ఆహ్వానించదగిందేనని అన్నారు.
“ఈ కసరత్తు చేసే అధికారులందరూ పాత ఓటర్ల జాబితాను కూడా వెంటబెట్టుకొని వెళ్లాలి. ఒకవేళ సదరు కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడు అందుబాటులో లేకపోతే పాత ఓటర్ల జాబితా ఆధారంగా తనిఖీ బృందం ఇంటికి వచ్చినప్పుడు లేని కుటుంబ సభ్యుడి పేరు కూడా ఓటర్ల జాబితాలో చేరుస్తారు. వాళ్లనేమి జాబితా నుంచి తొలగించకూడదు. ఒక ఓటరు పేరు జాబితా నుంచి తొలగించబోయే ముందు ఎన్నికల సంఘం ఒకటికి నాలుగు సార్లు సరి చూసుకుంటుంది” అన్నారు.
“కొత్తగా ఓటర్లుగా నమోదయ్య వారి విషయంలో ప్రత్యేకించి 2004 తరువాత పుట్టిన యువకుల తల్లిదండ్రులు అందుబాటులోనే ఉంటారు. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన ధ్రువీకరణ పత్రాలు చూపించడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అటువంటి ధ్రువీకరణ పత్రాలు లేని వ్యక్తుల విషయంలో వారి సంబంధించిన ధ్రువీకరణ వేరే పద్ధతుల్లో జరుగుతుంది. కాబట్టి ధ్రువీకరణ పత్రాలు లేకపోతే ఓటు హక్కు రద్దవుతుందన్న ఆందోళనకు ఆధారాలు లేవు. పట్టణ ప్రాంతాల్లో మన పక్కింటి వాళ్లకే మన గురించి తెలియదు. ఓటర్ల జాబితా సవరింపులు ప్రధానంగా పట్టణాల్లో అవసరం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్లంతా పట్టణాల్లోనే నివసిస్తున్నారు. ఇంటింటికి తిరిగి తనిఖీ చేయకపోతే ఓటర్ల జాబితా సరిగ్గా రూపొందించలేము అన్నదేమీ లేదు. కానీ నిర్దిష్ట సమయంలో ఇంటి వద్ద లేనంత మాత్రాన వారి హక్కు కోల్పోయే పరిస్థితి ఉండదు. చాలామందిని ఓటర్లుగా చేర్చుకోవడానికి ఈ కసరత్తు ఉపయోగపడుతుంది”అని గోపాలస్వామి అన్నారు.
అనువాదం: కొండూరి వీరయ్య