
- భారతదేశ మూలవాసులెవరు? ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారెవరు? తేల్చుకోవడానికి, కాలక్రమంలో ఇక్కడ కులాలు ఎలా పుట్టాయన్నదానికి ప్రపంచ వైజ్ఞానికులు కొన్ని ముఖ్యమైన పరిశోధనలు చేశారు. ఇంకా కొందరు చేస్తూనే ఉన్నారు.
మైఖేల్ బమ్‌శద్, తూమస్ కిమిసిలిడ్, లిన్బీ జుర్డేలు జరిపిన పరిశోధనల సారాంశాన్ని క్రోడీకరించి ప్రకటించారు.
భారత ఉపఖండంలో జీవిస్తున్న 1.417(2022) బిలియన్ ప్రజల మూలాల గురించి తెలుసుకోవడానికి ఈ పరిశోధనలు జరిగాయి.
ఇండో యూరోపియన్ భాష మాట్లాడే వారు కొందరు ఉత్తరాన పశ్చిమ దిశ, యురేషియా(యూరోప్ + ఆసియా) నుంచి వలస వచ్చారు.
ద్రావిడ భాషలు మాట్లాడే దక్షిణ భారతీయులలో వీరు కలసి, క్రమంగా హిందూ కులవ్యవస్థకు పునాదులు వేశారని, మూలవాసుల్ని బలవంతంగా అణగదొక్కి దేవుళ్ల పేరుతో ధర్మప్రభోదాలు చేస్తూ, వారిపై ఆధిపత్యం సాగిస్తూ వచ్చారని పరిశోధకులు తేల్చారు.
3 నుంచి 8 వేల సంవత్సరాల మధ్య కాలంలో అనతోలియా, కాకసస్ వంటి ప్రాంతాలకు యురేషియన్లు వెళ్లారు.
అక్కడి ప్రాంతీయ స్థితిగతులపై అవగాహన పెంచుకుని, మూలవాసుల భూములు ఆక్రమించుకున్నారు. అంతేకాకుండా, వారిని బానిసలుగా మార్చి, హిందూ కులవ్యవస్థను ప్రతిష్టాపించి- అధికారం చేజిక్కించుకున్నారని ధృవపరిచారు. భారతీయులకు యురోపియనులతో, ఆసియా వాసులతో గల సంబంధాలు బయటపడడానికి జన్యు పరిశోధనలే శరణ్యమయ్యాయి. అంత వరకు చారిత్రక సిద్ధాంతాలుగా ఉన్న విషయాలకు వైజ్ఞానిక ఆధారాల్ని సమకూర్చాయి.
యూరోప్ నుంచి ఆర్యులు వలస వచ్చారని నిర్థారణ..
ఎంటీ డీఎన్ఏ లేక వై- క్రోమోజోమ్ పాలిమార్ఫిజాల వల్ల ఈ దేశ జనాభాలో ఆర్యుల మూలాలున్నవారు, ఆసియా నుంచి లేదా యూరోప్ నుంచి వలస వచ్చినవారేనన్నది నిర్ధారణ అయ్యింది. యురేషియన్లు అంటే ఆర్యులు, ఈ దేశంలోకి వలసలు రావడానికైనా, స్థిరపడడానికైనా నియోలిథిక్ యుగం చాలా కీలకమైంది. అలాగే ప్లిస్టోసీన్ యుగంలో జరిగిన వలసలు కూడా ముఖ్యమైనవే. బహుశా, అప్పుడే ఆఫ్రికా నుంచి పశ్చిమాసియాకు, అక్కడి నుంచి దక్షిణ భారతదేశానికి వలసలు జరిగాయి.
అయితే, యూనివర్సిటీ ఆఫ్ ఉట్టా(UTAH) అమెరికా, ఆంధ్రా యూనివర్సిటీ(ఏపీ, ఇండియా)లలో భారత ప్రభుత్వ సహకారంతో పరిశోధనలు జరిగాయి. ఇంటిపేర్లు, పుట్టిన స్థలాలు, వారివారి కులాలు, వర్ణాలు అన్నీ నమోదు చేయబడ్డాయి. వాటితో పాటు రక్తం, తల వెంట్రుకలు కూడా డీఎన్ఏ పరీక్షల కోసం సేకరించడం జరిగింది.
వృత్తుల, ఆర్థిక, సామాజిక స్థితిగతుల వివరాలు కూడా సేకరించడం జరిగింది. ఇందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య – మొదటి మూడు స్థానాల్లో/స్థాయిలలో ఉన్న వీరు రెండు సార్లు జన్మమెత్తిన వారుగా భావిస్తారు. కాపులు, యాదవ్‌లు ఒకసారి జన్మనెత్తిన వారిగా భావిస్తారు. వీరిది నాలుగో స్ఠానం. ఇక చివర ఐదో స్థానంలో ఉన్నవారు పంచములు. వీరు అంటరానివారుగా పరిగణించబడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మాతృభాషగా గల అన్ని కులాల నుంచి నమూనాలు సేకరించి, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరిపి క్రిష్ణన్- రెడ్డి అనే పరిశోధకులు 1994లో ఫలితాలు ప్రకటించారు.
దీనికి మరింత బలాన్ని చేకూర్చే పరిశోధనలు హైదరాబాదు “సెంటర్ ఫర్ సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ”(సీసీఎంబీ)లో జరిగాయి. భారతీయ మూలవాసులు ఎవరన్నది గ్రహించడానికి డాక్టర్ తంగరాజ్ స్వయంగా అండమాన్ నికోబార్ తెగలవారి డీఎన్ఏ సేకరించి, అధ్యయనం చేసి విశ్లేషించారు. హరియాణాలో రాఖిగర్హి అనే సింధూ నాగరికతకు సంబంధించిన ప్రాంతం ఉంది. అక్కడ దొరికిన 60 అస్థిపంజరాల నుంచి ఒక పూర్తి జన్యుక్రమాన్ని పరిశోధకులు నిర్మించగలిగారు. ఇది అండమాన్ నికోబార్ తెగల జన్యుక్రమాన్ని పోలి ఉంది. అంటే హరప్పా ప్రజలకు- అండమాన్ నికోబార్లలో ప్రస్తుతం ఉన్న తెగలవారికి(హంటర్ గేదరర్స్) దగ్గరి సంబంధాలున్నాయి. వీరి పూర్వీకులే ఒకప్పటి హరప్పా వాసులన్న మాట!
ఇరాన్- టర్కీల నుంచి ఐదువేల ఏళ్లక్రితం యూరోప్ వైపు మాత్రమే కాకుండా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు కొందరు వలస వచ్చారని తెలిసింది. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం హరప్పా ప్రాంతంలో నివసించిన ఒక వ్యక్తి జన్యు క్రమాన్ని సీసీఎంబీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్, అతని సహచరులు పునర్నిర్మించారు. అలాగే 524 మంది డీఎన్ఏను విశ్లేషించారు.
కొన్నివేల ఏళ్ల క్రితం జీవించిన ఇంతమంది వ్యక్తుల డీఎన్ఏ విశ్లేషించడం ఇదే ప్రథమం హరప్పా ప్రాంతంలో 12 వేల ఏళ్ల నుంచి రెండు వేల ఏళ్ల దాకా అంటే, ఇనుపయుగం వరకు జీవించి ఉన్న ప్రజల అవశేషాల నుంచి డీఎన్ఏ సేకరించగలిగారు.
యురేషియన్లు అంటే సంచారజాతి ఆర్యులు ఇక్కడి మూలవాసులు కాదని మైఖేల్ బమ్‌శద్ బృందం చెప్పారు. ఇక్కడ డాక్టర్ తంగ్రాజ్ బృందం చెప్పిన విషయం దాదాపు ఒకటే నాణానికి ఒక వైపున్న విషయం ఒకరు చెబితే, మరొక వైపున్న విషయం మరొకరు చెప్పారు.
సింధూ నాగరికత మీద హింసోన్మాద సంచార జాతి ఆర్యుల దాడి..
దేశంలో అప్పటికే సుసంపన్నంగా ఉన్న సింధూ(హరప్పా) నాగరికతను హింసోన్మాద సంచార జాతి ఆర్యులు ధ్వంసం చేశారు. అది అప్పటికి శాంతి నిలయంగా ఉండేది. చివరికి వారు సప్త సింధు ప్రాంతంలో నివాసాలేర్పరుచుకుని, స్థిరపడి అనేక రకాల సాహిత్యం సృష్టించారు. దాని ప్రకారం బ్రహ్మ నుదుటి నుంచి పుట్టిన వారు బ్రాహ్ముణులని, వారు మాత్రమే పూజలు చేయాలని, క్షత్రియులు రాజ్యాలేలాలని, వైశ్యులు వ్యాపారాలు చేయాలని, శూద్రులు (ప్రస్తుతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు)పై మూడు వర్గాల వారికి సేవలు చేస్తూ ఉండాలని రాసుకున్నారు.
వర్ణాశ్రమ ధర్మాన్ని రక్షించడానికి “మనుస్మృతి”ని సృష్టించుకున్నారు. శూద్రుల్ని బ్రాహ్మణులు దోచుకోవచ్చనీ చెప్పారు. దానికి న్యాయబద్దతను కల్పించుకున్నారు. అందుకే ఇప్పటికీ బ్రాహ్మణుడు పూజామంత్రాల్లో తప్పనిసరిగా “స్వాహా”అని అంటుంటారు. అంటే, “నీ సంపద అంతా నాకు రానీయ్” అని కోరుకోవడమన్నమాట.
మన ఇంట్లో పూజ చేస్తూనే, మన ఎదుటే మన సంపద అంతా తనకు దక్కాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అందుకే ఈ దేశంలో చెప్పులు కుట్టడం, డ్రైనేజీ శుభ్రం చేయడం నీచమైన పనులయిపోయాయి. ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజల ఆరోగ్యం కాపాడే పనులు హీనంగా చూడబడుతున్నాయి. దేనికీ పనికిరానివి, మూర్ఖత్వంలో ముంచే పనులు- పిండాలు పెట్టడం, తద్దినాలకి మంత్రాలు చదవడంవంటి పనులు చాలా ఉన్నతమైన పనులుగా చలామణి అవుతున్నాయి.
సమాజానికి ఉపయోగపడేవి ఏవో, ఉపయోగపడనివి ఏవో ఆలోచించుకునే పనే లేదా? ఆర్యులు సృష్టించిన ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ చివరికి మూలవాసులైన బహుజనుల్ని అధికారానికి, ఆర్థిక సంపదకు దూరం చేసింది. విజ్ఙానానికి, సామాజిక హోదాకు దూరం చేసింది. బ్రాహ్మణీయ- మనువాద వ్యవస్థ బంధాల్ని తెంచుకుని, సమానత్వం కోసమని కొందరు ఇతర మతాల్లోకి మారిన మన మూలవాసుల్ని- బహుజనుల్ని ప్రస్థుతం విదేశీయులుగా ముద్ర వేస్తున్నారు. అంటే, మన చేయితోనే మన కన్నును మనం పొడుచుకునే పనిని కుట్రపూరితంగా మనతోనే చేయిస్తున్నారన్నమాట!
బ్రాహ్మణీయవ్యవస్థను బద్దలు కొట్టిన భారతరాజ్యాంగం..
భారత రాజ్యాంగంతో- మనువాద బ్రాహ్మణీయవ్యవస్థను బద్దలు కొట్టి, అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో బతికే ఏర్పాటు జరిగింది. కానీ, రాజ్యాంగంపై నమ్మకం లేని మనువాదులు ప్రస్తుతం ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. దీంతో సామాజిక న్యాయం అందని ద్రాక్షే అయ్యింది. మూలవాసులైన ఈ దేశ బహుజనులు విదేశీయులు కాదు. మధ్య ఆసియా నుంచి దండెత్తి వచ్చిన ఆర్య- మనువాద- బ్రహ్మణ వర్గాలే విదేశీయులు! వైజ్ఞానిక పరిశోధనలన్నీ ఈ విషయాన్నే బలపరిచాయి కదా!
సింధూ నాగరికత చిహ్నాలు, ఆదివాసుల్లో, గోండుల్లో ఇప్పటికీ కనిపిస్తాయి. అలాగే గిరిజనులు రావణుడు, మహిషాసురుడు, నరకుడు తమ పూర్వీకులనుకుని పూజించడం ఉంది. బలి చక్రవర్తి రాజ్యం మళ్లీ రావాలని కేరళలో “ఓనం” పండుగ చేస్తారు.
ఆర్యులు వచ్చి, ఇక్కడి తెగలవారిని చంపి, వాటి చుట్టూ కథలల్లి- ఆ ఆదిమ జాతి వారసుల్ని శూద్రులుగా, పంచములుగా వెలివేశారు. మన పూర్వీకుల చావుల్ని పండగలని నమ్మించి మన చేత వారనుకున్న పండుగలు చేయిస్తున్నారు. అనాలోచితంగా బహుజనులు ఆయా పండగలు చేస్తూనే ఉన్నారు. విశ్వాసం ఎంత గట్టిపడితే అది అంత మూఢ విశ్వాసమౌతుంది. మూఢ విశ్వాసాలు వదిలేసి బయటపడితేనే నిజాలు నిక్కచ్చిగా తెలుస్తాయి.
చేదు అనుభవాలను ఎదుర్కొన్న ప్రముఖులు..
నిత్య జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల్ని చూద్దాం. బాబా సాహెబ్ అంబేడ్కర్ ఒకసారి కావాలనే మదన్ మోహన్ మాలవ్యాకు నీళ్లగ్లాసు అందించారు. ఆయన దాన్ని అందుకుని నీళ్లుతాగలేదు. “ఒక దళితుడి చేతితో నీళ్లు తాగుతానా?” అన్న అహంభావం.
ఇలాంటి చేదు అనుభవాలు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులకు కూడా ఎదురయ్యాయి. రాజస్తాన్‌లోని బ్రహ్మగుడిలోకి అనుమతించకపోవడంతో, ఆ దంపతులు బయట గుడిమెట్ల మీద పూజలు నిర్వహించుకున్నారు. బీజేపీ కూర్చోబెట్టిన దళితరాష్ట్రపతి కదా ఆయన? అరెస్సెస్- బీజేపీలకు వ్యతిరేకంగా ఎలా నడుచుకుంటారు? ఇలాంటి సంఘటనలు నిత్యం వార్తల్లో వింటూనే ఉంటాం. మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడు జనరల్ స్థానం నుంచి ఒక దళితుడు సర్పంచుగా ఎన్నికయ్యాడు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన అతణ్ణి, అతని సర్పంచ్ కార్యాలయంలోనే నేల మీద కూర్చోబెట్టి- ఊరి పెద్దలైన మిగితా సభ్యులు కుర్చీలలో కూర్చున్నారు.
సభ్యసమాజానికి ఇది సిగ్గుచేటు కదా? ఆంధ్రప్రదేశ్‌లో దళిత మహిళా ఎమ్మెల్యేని వినాయకుడి మండపంలోకి రానివ్వలేదు. “కులం పేరు చెప్పి కుళ్లు పెంచగనేల?/ కులము జోలి ఏల గుణమే చాలు!/ వాసనగల పూవు పరిమళించినరీతి/ తెలవిరాణకెక్కు తెలుగుబిడ్డ” అని అన్నారు తెలుగుకవి నార్ల చిరంజీవి.
కులరహిత భారతీయ మానవ సమాజం రూపుదిద్దుకోవాలంటే తమిళనాడు మహిళ స్నేహ పార్దిబ రాజాను ఆదర్శంగా తీసుకోవాలి. ఎంతో సంఘర్షించి, కుల మతాలు లేని తొలి భారతీయ మహిళగా ఆమె ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్ తీసుకోవగలిగారు.
వాస్తవ పరిస్థితుల్ని తెలియజేస్తూ ప్రధాని మోడీకి ఉత్తరం రాసిన మేధావుల మీద రాజద్రోహం కేసుపెడితే ఇక ప్రజలు ఊరికే చూస్తూ ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. కులం మతం వద్దనేది వాటి మీద అక్కసుతో కాదు. అందరం మనుషులమేనన్న విశాల భావంతో, “మనిషి” పట్ల ఉన్న గౌరవంతో ప్రేమతో వద్దంటున్నారు.
(వ్యాస రచయిత విశ్రాంత బయాలజీ ప్రొఫేసర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.