‘‘గెలిచినప్పటికీ అతను శత్రువు నుంచి క్షేమంగా లేడు. ఆ శత్రువు విజయం వైపు సాగిపోతూనే ఉన్నాడు.’’
-వాల్టర్ బెంజమిన్,(ద థీసిస్ ఆన్ ది ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ)
మహాత్మాగాంధీ హత్య జరిగిన చాలా ఏళ్ళ తరువాత హంతకుడు నాథూరాం గాడ్సే ఇబ్బందికర వ్యక్తిత్వం ఈ రోజు మన ముందుకొచ్చింది. నాథూరాం గాడ్సేతో ఉన్న సంబంధాలు ఇబ్బందికరమైనప్పటికీ, అతని ఆలోచనకు మూలమైన వి.డి. సావర్కార్ ను తమ పార్టీ గురువుగా, తాత్వికుడిగా బీజేపీ బహిరంగంగానే అంగీకరిస్తోంది.
ఇదే రోజున, 1948 జనవరి 30వ తేదీన గాంధీజీని నాథూరాం గాడ్సే హత్య చేశాడు.
‘‘పాకిస్థాన్ కు మహాత్మా గాంధీ సహాయం చేస్తూనే ఉన్నాడని 1948 జనవరి మొదటి వారంలోనే నాకు అర్థమైపోయింది. అందుకునే ఆయన్ని చంపాలనుకున్నాను. పాకిస్థాన్ తో వ్యవహరించడానికి నాకు వేరే మార్గం లేదు’’ అని నాథూరాం గాడ్సేని విచారించడానికి ముందు, ఇంటరాగేష్ న్ సమయంలో ఆయన చెప్పిన మాటలివి.
‘‘గాంధీజీ హత్యకు చేసిన కుట్రలో సావర్కార్, నారాయణ ఆప్టే లకు చెందిన ఆనవాళ్ళను అతను ఆత్రంగా తొలగించాడు. పాకిస్థాన్ కు 55 కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని కోరుతూ జనవరి 13 వ తేదీన గాంధీజీ నిరవధిక నిరాహార దీక్షకు పూనుకోవాలని భావించిన తరువాత ఆయనను చంపాలని నిర్ణయించాడు. అందుకోసం తన అకౌంటును మార్చేశాడు.’’ అని దీరేంద్ర కే ఝా ‘గాంధీ అసాసిన్ : ద మేకింక్ ఆఫ్ నాథూరాం గాడ్సే’ అన్న తన పుస్తకంలో రాశాడు.
గాంధీ హత్య జరిగిన 77 సంవత్సరాల తరువాత, హంతకుడు నాథూరాం గాడ్సే వ్యక్తిత్వాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడానికి కానీ, తిరస్కరించడానికి కానీ మోడీ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి మనస్కరించడం లేదు. ఇతర దేశాధి నేతలు భారతదేశాన్ని సందర్శించినప్పుడు-ఢిల్లీలో 2023లో జరిగిన జీ20 సమావేశాలకు- ప్రధాని నరేంద్రమోడీ రాజ్ ఘాట్ లో గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తున్నప్పుడు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు యథావిధిగా గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సే పట్ల తమకున్న గౌరవ భావనను వ్యక్తం చేశారు.
గాడ్సేతో వారికి సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఆయన గురువు, తమ పార్టీ నాయకుడు, తమ పార్టీ తాత్వికుడు, తమ హిందుత్వ సిద్ధాంతానికి మూలకర్త వి.డి సావర్కార్ ను బహిరంగంగా అంగీకరిస్తుంటారు. గాడ్సేతో అన్నిరకాల సంబంధాలున్నప్పటికీ, గాంధీజీ హత్య కేసులో న్యాయస్థానం శిక్ష విధించడం వల్ల గాడ్సేని సొంతం చేసుకోవడానికి ఇబ్బందిపడుతున్నారు.
గాడ్సే కోర్టులో చేసిన ప్రకటనలో, తాను రాసిన ‘మే ఐ ప్లీజ్ యువర్ ఆనర్ సేస్’’ అన్న పుస్తకంలో ఇలా ప్రకటించారు. ‘‘జాతి పితగా గాంధీజీ మోస్తున్న బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారని నేను బలంగా నమ్ముతున్నాను. పాకిస్థాన్ జాతిపితగా తనను తాను రుజువు చేసుకున్నారు. నా దేశం, నా మాతృభూమి ని సజీవ జంతువులపైన జరిపే ప్రయోగశాలగా తాయారు చేసినందుకు, ఈ మాతృభూమికి పుట్టిన బాధ్యతగల బిడ్డగా నాకర్తవ్యాన్ని నిర్వర్తించడానికి జాతిపితగా పిలుస్తున్న వ్యక్తి ని అంతమొందించాలని నేను భావించాను.’’
దేశ విభజన జరిగినప్పుడు 1947నాటి దేశ పరిస్థితిలో, పది లక్షల మంది హిందువులు, సిక్కులు, ముస్లింలు దారుణంగా హత్యకు గురయ్యారు. అరవై లక్షల మంది తమ నివాసాలను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. తమ వ్యక్తిగత విషాదాలతో పగ తీర్చుకోవడానికి ప్రజలను ఉన్మాద పరిస్థితుల్లోకి నెట్టేశారు. ఢిల్లీలో దెబ్బతిన్న అనేక మంది శరణార్థుల్లో గాడ్సీ లేరు. బాగా స్థిర పడిన కుటుంబం నుంచి వచ్చిన గాడ్సే తన రాజకీయ చర్యలతో ప్రజల్లో గుర్తింపు పొందాలనుకున్నాడు. గాడ్సే గురువు సావర్కార్ అతనికి అనేక దశల్లో శిక్షణ ఇచ్చి గాంధీజీని హత్య చేయడానికి తయారు చేశాడు.
హైదరాబాద్ లో నిజాం రజాకార్ లకు వ్యతిరేకకంగా పోరాడడానికి శిక్షణ పొందే తొలి బృందం కోసం హిందూ మహాసభలో చేరాలని సలహా ఇచ్చిన సావర్కార్ ను గాడ్సే 1938లో రత్నగిరిలో కలిశాడు. గాడ్సే హైదరాబాదులోకి ప్రవేశించగానే అతన్ని అరెస్టు చేసి, ఏడాది శిక్ష విధించి జైలుకు పంపారు. ఫలితంగా హిందుత్వం కోసం పనిచేయాలనే సంకల్పం అతనిలో అప్పుడే బలపడింది. ఈ శిక్షణ పొందిన యువకులపైన సావర్కార్ కు ఒక విశ్వాసం కలిగి, పూనే లోని హిందూ మహాసభ భక్తుల్లో ఒక చిన్న రహస్య స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయాలని గాడ్సేకి చెప్పాడు. హిందూ మహాసభ అనుమతించకపోయినప్పటికీ, రహస్య కార్యక్రమాలు చేపట్టడానికి తనకు విధేయులైన వారి చేత సావర్కార్ ప్రమాణం చేయించాడు. తమ హక్కులను, మతాన్ని దురాక్రమణ చేసే వారి నుంచి కాపాడడానికి, ప్రతి హిందూ సంస్థకూ సాయం చేయడానికి ‘సావర్కారిజాన్ని’ ప్రచారం చేయడం ఈ గ్రూపు ప్రధాన కర్తవ్యం. సావర్కార్కు, డాక్టర్ డి.ఎస్. పర్చూరుకు సహాయం చేయడానికి గ్వాలియర్ లో హిందూ రాష్ట్ర సేన నుంచి పూనాలో హిందూ రాష్ట్ర దళ్ ను గాడ్సే ఏర్పాటు చేశాడు. డాక్టర్ డి.ఎస్. పర్చూరు తన వద్ద ఎప్పుడూ చంపడానికి ఉపయోగించే 9 ఎం ఎం ఆటోమేటిక్ బెరెట్టా తుపాకీని ఉంచుకునే వాడు. గాడ్సే, సావర్కార్ మధ్య ఉన్న గురు శిష్యుల సంబంధాన్ని ఇవ్వన్నీ తెలియచేస్తాయి. కానీ, గురువును అంగీకరిస్తూ, శిష్యుణ్ణి అంగీకరించకపోవడం వారికి సాధ్యం కావడం లేదు.
గాడ్సే, సావర్కార్ రెండు సభల్లో కలిసిన విషయం చాలా మందికి తెలియదు. లండన్ లో అక్టోబర్ 1906లోను, 1909లో జరిగిన సభ ల్లో ఇద్దరూ కలిసి మాట్లాడారు. నిలంజన్ ముఖోపాధ్యాయ ‘ద ఆర్ ఎస్ ఎస్: ఐకాన్స్ ఆఫ్ ది ఇండియన్ రైట్’ అన్న తన పుస్తకంలో ఇలా రాశారు. ‘‘ఈ సభతో గాంధీ చాలా కలత చెందారు. రెండవ సారి జరిగిన సభ గురించి గోపాల కష్ణ గోఖలేకి రాసిన లేఖలో గాంధీజీ తన విచారాన్ని వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా బ్రిటిష్ వారిని తరిమేయాలనే హింసను రాజకీయ ఆయుధంగా వాడాలన్న సావర్కార్ దృష్టికోణాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.’’
సావర్కార్ గురించిన దృక్పథాన్ని మరింత గా తెలుసుకోవడానికి ‘హిందుత్వ అండ్ వైలెన్స్: వి.డి. సావర్కార్ అండ్ పొలిటిక్స్ ఆఫ్ హిస్టరీ రైట్స్’ అన్న పుస్తకంలో వినాయక్ చతుర్వేది ఇలా రాశారు. ‘‘ లండన్ లో 1909లో జరిగిన బహిరంగ సభలో గాంధీ, సావర్కార్ ఇద్దరూ హింస కేంద్రీకరించడాన్ని వ్యతిరేకించారు. ఒకరికొకరితో కాకుండా ఇరువురూ భిన్న మైన తమతమ ఆలోచనలతో వాదనలను వినిపించినట్టు మాట్లాడారు. స్వరాజ్యం, నాగరికత, హిందుత్వం, హింస వంటి వాటి పైన తమ దృక్పథాన్ని ప్రతిబింబించేలా రాజకీయ పదజాలాన్ని వాడ లేదు. భగవద్గీత, రామాయణం వంటి వాటి పైన సావర్కార్, గాంధీ ఒకరి వ్యాఖ్యానాల పైన మరొకరు ఆసక్తి చూపించలేదు. తమ తమ ఆలోచనల ఆధిక్యానికి జరిగిన యుద్ధం హింసాత్మకంగా ముగిసింది.’’
ఎవరు హింసాత్మక ముగింపు కోసం ఎవరు కలిశారో మనకు తెలుసు. చంపడానికి ఎవరు కుట్ర పన్నారో తెలుసు. నాకు ఆవేదన కలిగించే ఒక విషయం ఏమిటంటే, వివేకానందుడికి భక్తుణ్ణని ఎప్పడూ చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ, హింస వేపు మొగ్గు చూపి, క్రైస్తవం, ఇస్లాం మతాల పట్ల అసహనాన్ని ప్రదర్శించే, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన నాజీ నియంతృత్వాన్ని ఆరాధించే సావర్కార్ పట్ల ఎలా పూజ్య భావాన్ని కలిగి ఉంటారు? అసలు స్వభావాలు వ్యక్తిత్వంగా ప్రతిబింబించిన మోడీ అట్ట బొమ్మ ఫ్యాషెన్ గా వివేకానందుడు కనిపిస్తాడు.
-రవి జోషి
అనువాదం : రాఘవ