
బ్రిటీష్ కాలం నుండి ఇప్పటి వరకు బలహీన వర్గాలపై కొనసాగుతున్న పోలీసు అమానుషత్వాలు
(సమాజంలో చట్టం, ఆస్తి సంబంధాలు పరిరక్షించబడాలంటే కాయకష్టం చేసే అలగా జనాన్ని, ఓటు హక్కులేని వాళ్లని అదుపులో ఉంచడానికిగాను పోలీసులు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడడం ఆవశ్యకం, ప్రయోజనకరం అని అటు రాజ్యం ఇటు పబ్లిక్ కూడా గట్టిగా నమ్ముతుంటారు)
ఏ ఆధునిక సమాజానికైనా చట్టపరమైన పాలనే పునాది వంటిది. చట్టం ముందు అందరూ సమానమే అనే హామీని ఇస్తుంది. న్యాయం, కఠినమైన యంత్రాంగం, చట్టం, దానిని అమలు చేసే బహుళ వ్యవస్థలు సామాజిక సంబంధాలను తీర్చిదిద్దుతాయి. అదే సందర్భాంలో పాత్రధారులు, సందర్భాలు వీటిని సవాలు చెయ్యడం ద్వారా పునర్ నిర్మితమవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలోనే చట్టం నైతిక ధర్మం అనే లక్షణాన్ని సంతరించుకుంటుంది. చట్టం, న్యాయం, సమాజం వీటి మధ్య ఉన్న సంబంధాలు ఎలా ఇరుకున పడుతుంటాయో మనం ఈ వ్యాసంలో పరిశీలిద్దాం.
చరిత్ర, న్యాయ చరిత్ర, సామాజిక-న్యాయ అధ్యయనాల్లో ఉన్న సారూప్యతలు అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసం ఉపకరిస్తుందని భావిస్తున్నాం. ఈ వ్యాసాన్ని డాక్టర్ నితిన్ సిన్హా(లీబ్నిగ్- సెంట్రమ్ మోడర్నర్ ఓరియంట్, జడ్ఎంఓ బెర్లిన్), డాక్టర్ శకుంతలాసేన్(నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరు విశ్రాంతి ఆచార్యులు), విద్యా రవీంద్రనాథ్(సెంటర్ ఫర్ మోడ్రన్ ఇండియన్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ గోట్టింజెన్)లు తీర్చిదిద్దారు.
భారతదేశంలో పోలీసుల క్రౌర్యం విచ్చలవిడిగా తయారయ్యింది. చిన్నచిన్న నేరాల విషయంలో పేదలు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులపై హింసకు పాల్పడుతన్న సంఘటనలు నానాటికీ పెచ్చరిల్లి పోతున్నాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే 2023లో విశాఖపట్నం పోలీసు కమిషనరేట్ పరిధిలోని పద్మనాథం పోలీసు స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన దళిత వ్యక్తిపై ఈ ఇద్దరు పోలీసులు ‘థర్డ్ డీగ్రీ’ ప్రయోగించారు. వాళ్లు పెట్టిన చిత్రహింసలకు సదరు అనుమానితుడి తుంటి ఎముక విరిగిపోయింది. ఇంతకూ ఇతని మీద ఉన్న అభియోగం ‘కోడిని దొంగతనం’ చేశాడని.
2024లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ జిల్లాల్లో పార్థి తెగకు చెందిన వ్యక్తిని దొంగతనానికి పాల్పడ్డాడనే అభియోగం మీద అరెస్టు చేసి చిత్రహింసల పెట్టడం వల్ల అతను చనిపోయాడు. బ్రిటిష్ కాలంలో ఈ తెగకు చెందిన వారి మీద సహజ నేరస్థులుగా ముద్ర వేశారు.
చైను దొంగతనం చేశాడనో, కోడిని దొంగతనం చేశాడనో అరెస్టు చేసిన సందర్భాలలో పోలీసులు ఇంత అతిగా వ్యవహరించడానికి కారణం అధికారాన్ని బేఫర్వాగా దుర్వినియోగం చేసినా అడిగేవాడు ఉండడనే ధీమాయే. నేరాలను నియంత్రించడానికి పోలీసులు ఇలా అతిగా వ్యవహరించడమే సరైన పరిష్కారం అనీ, అలా అతిగా, చట్టవ్యతిరేకంగా వ్యవహరించే పోలీసులు చాలా నిజాయితీపరులై, సమాజాన్ని ఉద్ధరించే ఉదాత్త నాయకులై ఉంటారని మనకు తెలియచెప్పే సినిమాలు కోకొల్లలుగా వచ్చాయి. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించడమే నిజాయితీకి తార్కాణమైతే పోలీసు సంస్కరణలు, రాజకీయ నాయకులకు పోలీసు వ్యవస్థ లొంగి ఉండి పనిచెయ్యాల్సి రావడం అనే ప్రశ్నలలో సహజసత్యం మనకు ఎదురవుతుంది. పోలీసుల అతిపట్ల ఆరాధనాభావం ఎంత ఉన్నా పోలీసుల దాష్టీకం అంతా పేద వర్గాలకు చెందిన వారి మీదా, ఇంటి పనివారు, చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్లు తదితర సామాజిక బలహీనవర్గాల మీదనే కొనసాగడం గమనార్హం. నేర నిర్ధారణ కాకముందే వీరిని నేరస్థులుగా పరిగణించే ధోరణి పోలీసుల వ్యవస్థలో ప్రబలంగా నెలకొని ఉంది.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు నివేదించిన వివరాల ప్రకారం 2023 నాటికి, అంతకు ముందు ఉన్న మూడేళ్ల కాలానికంటే 60 శాతం లాకప్ డేత్లు పెరిగాయి. రెండేళ్ల ముందు కాలంతో పోలిస్తే ఈ లాకప్ డేత్లు 75శాతం పెరిగాయి. జాతీయ మానవహక్కుల కమిషన్ సంకలించిన గణాంకాల ప్రకారం గుజరాత్, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్, బీహార్, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పోలీసులు హింసకు పాల్పడిన కేసులు 60 శాతం పెరిగాయి. అనుమానిత నేరస్థుల లాకప్ డెత్‌లు, ఎన్కౌంటర్లు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తున్నాం, మన న్యాయ- చట్ట వ్యవస్థలలో బ్రిటిష్ వలసవాద వాసనలు వదిలిస్తున్నామని పాలకులు గొప్పలు చెబుతున్న కాలంలో ఈ గణాంకాలు ఆందోళన కలిగించేవే. ప్రభుత్వం పోలీసు వ్యవస్థలో సంస్కరణలు ప్రవేశపెట్టడానికి కంటే ముందు ఎలాంటి సంస్కరణలు అవసరమో ముందుగా గుర్తించాలి. అలా గుర్తించాలి అంటే ముందు కొన్ని కులాలకు చెందిన వారిని, కాయకష్టం చేసే వారిని నేరస్థులు అనే ముందస్తు అంచనాతో హింసకు గురిచెయ్యడం వ్యవస్థీకృతం అవడానకి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని గుర్తించి దాన్ని సరిదిద్దాలి.
స్వాతంత్య్రానంతర భారతదేశంలో పాలకులు పోలీసు సంస్కరణల గురించి జపించడం ఫ్యాషనైపోయింది. 1979లో నేషనల్ పోలీసు కమిషన్‌ను ఏర్పాటు చేసిన తదనంతర కాలంలో పోలీసు బలగాల రూపురేఖలు, లక్షణాలు మార్చడానికి సదుద్దేశ్యంతో అనేక సిఫార్సులు, ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. పోలీసువ్యవస్థ నిష్పక్షపాతంగా, ప్రభావవంతంగా, నైపుణ్యంగల సంస్థగా, పారదర్శకత, జవాబుదారీతనాలు ముఖ్య విధులుగా గల సంస్థగా తీర్చిదిద్దడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి.
అందులో భాగంగా ”చట్టాన్ని అమలు చెయ్యడంలో ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు పోలీసు వ్యవస్థ సామర్థ్యాన్ని మరింతగా పెంపొందించడం. నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ ప్రజల రాజ్యాంగ హక్కులను, స్వేచ్ఛలను సంపూర్ణంగా కాపాడేలా వ్యవహరించేలా రూపొందించడమే. పోలీసుల వ్యవస్థ మౌలిక కర్తవ్యం చట్టానికి లోబడి నిష్ఫక్షపాతంగా, చట్టాన్ని అమలు చేసే సంస్థగా వ్యవహరించడం. ప్రభుత్వం ఆదేశాలు రాజ్యాంగాన్ని ఇతర న్యాయపరమైన సూత్రాలనుగానీ ఉల్లంఘించేలా ఉన్నప్పటికీ వాటిని సరకు చెయ్యకుండా చట్టానికి లోబడి వ్యవహరించాలి” అని నేషనల్ పోలీసు కమిషన్ తన తొలి నివేదికలో పేర్కొన్నది.
తదనంతరం 1980, 1990, 2000 సంవత్సరాలలో వెలువరించిన నివేదికలు కూడా పోలీసు వ్యవస్థపై లక్ష్యాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థ పనిచెయాలని నొక్కి వక్కాణించాయి. అలాగే ఎఫ్ఐఆర్లను నిర్భయంగా నమోదు చెయ్యాల్సిన అవసరాన్ని, నిజాయితీగా, సూటిగా ఇతరత్రా విధానపరమైన నిర్ణయాలకు కట్టుబడి పని చెయ్యాల్సిన అవసరాన్ని, పోలీసు రిక్రూట్మెంట్ వ్యవస్థను క్రమబద్దీకరించాల్సిన పద్ధతుల గురించి ఈ నివేదికలు అనేక సిఫార్సులు చేశాయి. సాక్షులను లోతుగా, క్షుణ్ణంగా విచారించడం, రాజకీయ జోక్యాన్ని నివారించడానికి జ్యుడిషియల్ విచారణ సంఘాన్ని ఏర్పాటు చెయ్యడం, పారదర్శకత, జవాబుదారీతనం, చట్టపరమైన పాలనకులోబడి ఉండడం ఈ మూడు మార్గదర్శకాలకు లోబడి పోలీసు వ్యవస్థ పనిచెయ్యాలని ఆ నివేదికలు స్పష్టం చేశాయి.
పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనం పెంపొందించడానికి అనేక సంస్కరణలు, పరిష్కార విధివిధానాలు రూపొందించినప్పటికీ సమాజంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజానీకంపై పోలీసువ్యవస్థ దౌర్జన్యపూరితంగా, హింసకు పాల్పడేలా వ్యవహరిస్తూ వస్తున్న వైఖరిని సంస్కరించి వ్యవస్థలో వృత్తి నైపుణ్యం, ఆధునిక వ్యవహారశైలి అబ్బించడానికి ఇవి ఎంత మాత్రం తోడ్పడలేదు.
కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగులకు సమగ్రమైన శిక్షణ ఇవ్వకపోవడం, మితిమీరిన రాజకీయ జోక్యం, బ్రిటిష్కాలపు పోలీసు చట్టాల వారసత్వధోరణులు వదిలించుకోకపోవడం వంటి కారణాల మూలంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు క్రిమినల్ చట్టాలూ 1861 నాటి బ్రిటిష్ పోలీసు చట్టాలకు అతీతంగా డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన పరిష్కారాలు సాధించేందుకు వీలుగా రూపొందించామని చెపుతున్నారు. అయినప్పటికీ పై లోపాలను అధిగమించిడానికి ఇవి ఏమేరకు తోడ్పడతాయి అనేది ప్రశ్నార్థకమే.
‘భారతీయ నాగరిక్ సురక్షా సంహితాలు’ పేరిట కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మూడు క్రిమినల్ చట్టాలలో నేరాలకు సంబంధించిన నిర్వచనాలలో అనేక అస్పష్టతలు ఉండడం, కాలం చెల్లిన బ్రిటిష్ కాలం నాటి చట్టాలలోని అనేక క్లాజులను యధాతథంగా కొనసాగించడం మూలంగా పోలీసులు చట్టాన్ని అతిక్రమించకుండా వ్యవహరించడానికి తగిన కీలకమైన రక్షణలు కల్పించడంలో విఫలమయ్యాయి. న్యాయం జరిగేలా చూడడానికి, నిజాయితీ పద్ధతిని అనుసరించామని నిర్ధారించడానికి నేరం జరిగిన ప్రదేశాన్ని, విధానాన్ని , సన్నివేశాలను వీడియో రూపంలో డాక్యుమెంట్ చెయ్యాలనే క్లాజు పోలీసుల నిరంకుశాధికారాన్ని ప్రదర్శించకుండా నిలవరించడానికి ఉద్దేశించినవే అని చెబుతున్నారు. అయినప్పటికీ కొత్తగా ప్రవేశపెట్టిన మూడు క్రిమినల్ చట్టాలు పోలీసు వ్యవస్థను ఆధునీకరించడంలోగానీ, వలస కాలంనాటి అవశేషాలను పరిహరించడంలోగానీ ప్రాప్తకాలజ్ఞతకు లోబడి లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ మెరమెచ్చుల ప్రకటనలే తప్ప ఆచరణయోగ్యమైనవికావని వివరించారు.
(పవిత్రమైన రంజాన్ మాసంలో మొమినాపూర్ ప్రాంతంలోని జామామసీదు దగ్గర పోలీసులు, భద్రతా బలగాల ‘రూట్ మార్చ్’. మహారాష్ట్రలోని నాగపూర్‌లో తాజాగా ప్రజ్వరిల్లిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో విధించిన కర్ఫ్యూ సందర్భం- 2025 మార్చి 21. ఫొటో కర్టెసీ పీటీఐ)
స్వాతంత్ర్యం తర్వాత మనదేశం బ్రటిష్ కాలం నాటి పోలీసు చట్టం 1861ను యధాతథంగా అనుసరించింది. దీని మూలంగా పోలీసులు చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించినా శిక్ష పడుతుందనే భయం లేకుండా వ్యవహరించే సంస్కృతి ప్రబలిపోవడానికి దారి తీసింది. పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు మూలం ఇదే. ప్రముఖ చరిత్రకారుడు డేవిడ్ అర్నాల్ట్ పంతొమ్మిదవ శతాబ్దాపు మద్రాస్ పోలీసు వ్యవస్థ మీద చేసిన పరిశోధనలో ఇందుకు తగిన కారణాలు వివరించాడు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో బ్రిటిష్ సామ్రాజ్య ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఉద్దేశించి 1861 పోలీసు చట్టాన్ని రూపొందించారని స్పష్టం చేశాడు. బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా ఐర్లాండ్‌లో రైతాంగం చేసిన తిరుగుబాటు, అడపాదడపా చోటు చేసుకున్న ఉగ్రవాదదాడులను అరికట్టడానికి ‘రాయల్ ఐరిష్ కానిస్టేబులరీ’ చట్టాన్ని రూపొందించారు. 1861 పోలీసు చట్టాన్ని కూడా అదే నమూనాలో బ్రటిష్ సామ్రాజ్య ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం తీర్చిదిద్దారు. పోలీసుల రోజువారీ కార్యకలాపాల మీద కార్యనిర్వాహక వ్యవస్థ సంపూర్ణాధికారం చెలాయించేందుకు ఈ చట్టం ఉపకరిస్తుంది. పోలీసు వ్యవస్థ కార్యకలాపాలను పర్యవేక్షించడానికిగానీ, ప్రజలకు జవాబుదారీతనం వహించేలా చూడడానికిగానీ, చట్టవ్యతిరేక పద్ధతులు పాటించకుండా నిలవరించడానికిగానీ, తీవ్రాతితీవ్రమైన శిక్షలు విధించకుండా చూడడానికిగానీ తగిన స్వయంప్రతిపత్తిగల వ్యవస్థకు చోటు లేకపోవడం ఈ చట్టంలోని ప్రధాన లోపం.
బ్రిటిష్ వలసకాలం నాటి పోలీసులు భారతీయులకు ముఖ్యంగా సంచార జాతులను, బలహీన వర్గాల, కులాలకు చెందినవారిని నియంత్రించడం, నిర్బంధించడం, నేరస్థులుగా పరిగణించడమే ప్రధానకర్తవ్యంగా పనిచేశారు. భారతీయ పోలీసు వ్యవస్థలో ఈ నాటికీ అవే ధోరణులు వారసత్వంగా కొనసాగుతు ఉన్నాయి. అంతేకాదు ప్రజలపై నమ్మకం ఉంచకపోవడం, అవినీతి, దళిత, ఆదివాసీ ప్రజానీకాన్ని లక్ష్యంగా పెట్టుకుని వేధించడం, నేరాంగీకారానికి ముద్దాయిపై హింసకు పాల్పడడం, రాజకీయ నాయకులు అడుగులకు మడుగులు ఒత్తడం వంటి ధోరణులు 1861 నాటి ఇండియన్ పోలీసు చట్టం నుండి వారసత్వంగా వస్తున్న చరిత్రయే. పోలీసు వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు మధ్యన బలమైన చారిత్రక బంధం పంతొమ్మిదవ శతాబ్దం తొలినాళ్లలోనే ఏర్పడింది.
ప్రతిష్టాత్మకమైన ఫోర్ట్ సెయింట్ జార్జి గవర్నరుగా 1803లో విలియం బెంటిక్ను నిమయించినప్పుడు ఈస్టిండియా కంపెనీ అధికారులు అతగాడు ఈ పదవికి తగినవాడు కాదని భావించారు. విలియం బెంటిక్ శిక్షణ అంతా మౌళికంగా సైనిక వ్యవహారాలకు చెందినది కావడం. పైపైచ్చు అతని అనుభవం అంతా యూరప్ ఖండానికి పరిమితం కావడం మూలాన కంపెనీ అధికారులు ఈ అభిప్రాయానికి వచ్చారు. భారతదేశం మీద, పరిపాలనా వ్యవహారాల మీద బెంటిక్‌కు ఏమాత్రం అవగాహన లేదనే అంచనా కూడా మరొక కారణం. వాస్తవానికి బెంటిక్‌కు ఈ భారీ పదవి దక్కడం వెనుక అతని తండ్రి ప్రమేయం ఉంది. బ్రిటిష్ రాజ్యంలో తన పలుకబడిని ఉపయోగించి బెంటిక్‌కు ఈ పదవి దక్కేలా చూశాడు. మద్రాస్ ప్రెసిడెన్సీ కొత్తగా స్వాధీనం చేసుకున్న భూభాగాల మీద పాలనాపరమైన పట్టు సంపాదించి తన సామర్ధాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత బెంటిక్ భుజస్కంధాలపై పడింది.
1805 నవంబర్ 14న వెల్లూర తిరుగుబాటు బెంటిక్ సామర్థ్యం నిరూపణకు సవాలుగా మారింది. మద్రాస్ సైనిక నిబంధనావళిని ఆచరించడాని వెల్లూరు సిపాయిలు తిరస్కరించారు. అప్పటి వరకు వెల్లూరు సిపాయిలు సంప్రదాయంగా ధరిస్తూ వచ్చిన తలపాగా బదులు పదాతిదళం, ఫిరంగిదళం కొత్త టోపీలు ధరించాలని, కుల-మత చిహ్నాలను ధరించడం వదులుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
ఇంతపెద్ద ఎత్తున సైనిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిన నేపథ్యంలో మద్రాస్ క్రిమినల్ పోలీసు వ్యవస్థ మొత్తాన్ని సమూలంగా ప్రక్షాళన చెయ్యాలని బెంటిక్ అనుకున్నాడు. మొదట దేశీసిపాయిల అవిధేయతను కట్టడి చెయ్యాలనే ఉద్దేశ్యంతో తగిన సంస్కరణలు తీసుకురావాలని తలంచినా క్రమంగా సమాజంలో నేరాలను అరికట్టడానికి తగిన విచక్షణాయుత చట్టబద్ధమైన అధికారాలతో కూడిన పోలీసు వ్యవస్థను నెలకొల్పాలనే ప్రణాళిక విస్తరించింది.
ప్రస్తుత పోలీసు వ్యవస్థ దొంగలను కనిపెట్టి విచారించడానికి ఉపయుక్తంగా లేదు. కాబట్టి కొత్తగా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. అని పోలీసు బిల్లుకు కౌన్సిల్లో ప్రవేశపెడుతూ బెంటిక్ స్పష్టం చేశాడు. చట్టాన్ని నిలబెట్టడానికి పబ్లిక్నగానీ, ప్రైవేటునగానీ కఠినాతికఠినమైన శిక్షలు విధించడానికి వీలుగా సాధికార వ్యవస్థను నెలకొల్పాల్సిన అవసరం ఉందని స్పష్టీకరించాడు. ప్రజారక్షణ పరమోన్నత ప్రాముఖ్యతగా పరిగణిస్తున్న రీత్యా నిర్భంధానిక పూనుకోవడం రక్షణ, న్యాయం అనేవి బ్రిటిష్ ప్రభుత్వ సహజ స్వాభావిక లక్షణాలకు వ్యతిరేకం అయినప్పటికీ వ్యక్తి స్వేచ్ఛను నియంత్రించడం అవసర, ఆస్తులను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారనే అనుమానితులను శిక్షించడానికి పోలీసులకు విశిష్ట అధికారాలు కల్పించడం కూడా అంతే అవసరం అని కౌన్సిల్లో నొక్కి చెప్పాడు. ఇందుకు అనుగుణంగా పోలీసు బలగాలను విస్తరించి, పోలీసు సూపరింటెండ్లను, చట్టం అమలుకు విచారణాధికారాలు కల్పిస్తూ పరస్పర సంబంధాలు గల ఏజెన్సీలను ఏర్పాటు చేశాడు. దానికి తోడు సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజానీకం పాల్పడే చిన్నపాటి పొరబాట్లకు కూడా తక్షణం శిక్షలు అమలు చేసే విచక్షణాధికారాలు కల్పించాలనే డిమాండ్ వలస పాలన యంత్రాంగంలో నానాటికీ పెరుగుతూ వస్తుంది. విలియం బెంటిక్ పోలీసులకు ఆ అధికారాలు కట్టబెట్టాడు. ప్రత్యేకించి కొన్ని సామాజిక వర్గాలకు చెందినవారు చిన్నపాటి నేరాలకు పాల్పడినా వారి మీద చట్టబద్ధంగా బలప్రయోగం చెయ్యవచ్చనే సంస్కృతి పోలీసు వ్యవస్థలో ఆనాటి నుండే కొనసాగులూ వస్తుంది.
(జమ్ములో పీహెచ్ఇ దినసరి వేతన కార్మికుల సంఘ సభ్యులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణ పడుతున్న దృశ్యాలు. 2025 మార్చి 22 పిటిఐ సౌజన్యంతో)
అయితే బెంటిక్ చేసిన ప్రతిపాదనలకు మద్రాస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుండి వ్యతిరేకత ఎదురయ్యింది. సుప్రీంకోర్టు బ్రిటిష్ రాజరిక సంస్థ అయినప్పటికీ స్వయం ప్రతిపత్తిగల సంస్థగా ఇంగ్లీష్ న్యాయసూత్రాలను తుచ తప్పక పాటించేది. 1807లో జస్టిస్ హెన్రీ గ్విలిమ్ పోలీసులకు విచారణాధికారాలు, శిక్షలు విధించే విచక్షణాధికారాలు కల్పించాలని బెంటిక్ ప్రతిపాదించిన బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాడు. పేచీ నేరాలకు పాల్పడే అనుమానితులను పోలీసు సబార్డినేట్లు గుర్తించేందుకు అధికారాలు ఇవ్వడం సరికాదని, పోలీసు అధికారుల మీద, సబార్డినేట్ ట్రిబ్యునళ్ల మీద సుపీరియర్ కోర్టుల పర్యవేక్షణ ఉండాల్సిందే అని గ్విలిమ్ బలంగా వాదించాడు.
అక్కడితో ఆగకుండా తన వాదనలను కార్యరూపంలో కూడా పెడుతూ పోలీసు సబార్డినేట్లు తమ మీద హింసకు పాల్పడ్డారనో లంచం తీసుకున్నారనో ఎవరన్నా ఫిర్యాదు చేసిన ప్రతి సందర్భంలోనూ పోలీసుల మీద జరిమానాలు విధించాడు. స్థానిక ప్రభుత్వానికి, పోలీసు అధికారాలకు వ్యతిరేకంగా ప్రజానికాన్ని గ్విలిమ్ రెచ్చగొడుతున్నాడని పోలీసు సూపరింటెండెంట్ ఆరోపించాడు. పోలీసులకు ఒసగిన ఏకపక్ష అధికారాలను సుప్రీంకోర్టు నియంత్రిస్తున్న మూలంగా అలగా జనంలో చట్టం అంటే లెక్కలేనితనం ప్రబలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ఉదంతం నుండి మనకు స్పష్టంగా అర్థం కావాల్సిందేంటంటే చట్టాధికారాలు వినియోగంలో విచక్షణాధికారాన్ని ప్రదర్శించాలని న్యాయస్థానం నిర్దేశిస్తుంది.
పోలీసులకు, ఈస్టిండియా కంపెనీ అధికారులు వ్యతిరేకంగా గ్విలిమ్ తన ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు. దీంతో ప్రభుత్వం గ్విలిమ్ను అరెస్టు చేసి, బలవంతంగా ఇంగ్లాండ్ తరలించి న్యాయమూర్తిగా అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డాడనే అభియోగాల మీద విచారణను ఎదుర్కోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా గ్విలిమ్ వెనుకడుగు వెయ్యలేదు. పోలీసు సూపరింటెండ్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు గ్రాండ్ జ్యూరీకి ఫిర్యాదు చేశాడు. పోలీసు సూపరింటెండ్ సక్రమమైన పద్ధతులు అనుసరించకుండా తనకు ఉన్న ఏకపక్ష అధికారాలతో ఇష్టారాజ్యంగా సమన్లు జారీచెయ్యడం, అరెస్టు చెయ్యడం, ఖైదు చెయ్యడంవంటి చర్యలకు పాల్పడుతన్నాడని తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇంగ్లీష్ ‘లా’ భారతీయులు సహా ప్రతిపౌరునికి పీడన నుండి రక్షణ కల్పించేలా రూపొందించబడింది కాబట్టి గ్రాండ్ జ్యూరీ తగిన న్యాయం చెయ్యాలని కోరాడు. ఎట్టకేలకు పోలీసు సూపరింటెండెంట్ తదితర అధికారాలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని గ్రాండ్ జ్యూరీ అంగీకరిస్తూనే భారతీయులలో అధికారులకు వ్యతిరేకంగా గ్విలిమ్ తిరుగుబాటు తత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడన్న ప్రభుత్వ వైఖరి కూడా సమంజసమే అని భావిస్తూ గ్విలిమ్ను ఇంగ్లాండ్‌కు రప్పించాలని ఆదేశించింది.
ఇంత జరిగిన పోలీసు బలగాల వ్యవహారశైలిలో ఏమాత్రం మార్పురాలేదు సరికదా తదనంతర కాలంలో పోలీసు వ్యవస్థ నిరంకుశ న్యాయం మరింతగా ప్రబలిపోయి సాధారణీకరించబడింది. చిన్నచిన్న నేరాలకు పాల్పడేవారిని సరైన దారిలో పెట్టాలంటే ‘రూల్స్’ పక్కనపెట్టి వెనువెంటనే శిక్షలు విధించడం సానుకూల ఫలితాలను ఇస్తుంది. కాలం కూడా కలిసి వస్తుంది అని వలస ప్రభుత్వాధికారులు వాదనకు దిగారు. చిన్నపాటి నేరాలకు పాల్పడినవారి మీద కఠినాతికఠినమైన శిక్షలు విధించడానికి వీలుగా మద్రాస్ ప్రభుత్వం మరిన్ని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు కూడా బలపరిచింది.
ఉదాహరణకు చెప్పుకోవాలంటే 1811 పోలీసు చట్టం, 1818 మద్రాస్ మెరైన్ చట్టాలు ఉపాధి సంబంధిత కేసులు, కాంట్రాక్టు ఉల్లంఘనలు, పట్టణ కార్మికులు పాల్పడే దొంగతనాలకు సంబంధించిన కేసులు విచారించడానికి క్రింది కోర్టులకు అపరిమితమైన అధికారాలు కల్పించాయి. సాక్ష్యాలు, నేర నిరూపణకు కావల్సిన ఆధారాలు సమర్పించడం వంటి కీలక నేర నిర్ధారణ అంశాలు అతి సాధారణీకరించారు. గతంలో నేరం ఆపాదించబడిన వారి దగ్గర తాడు, ఇనుపవస్తువులు, బట్ట, చెక్కవంటి వస్తువులు ఏమి దొరికినా వారిమీద కొత్తగా నేరానికి పాల్పడబోతున్నారన్న అభియోగం మోపి పోలీసులు అరెస్టు చెయ్యవచ్చు, మెజిస్ట్రేటు శిక్షలు వెయ్యవచ్చు. తదనంతర సంవత్సరాలలో ముద్దాయిలు నేరం చేసినట్లు స్వయంగా అంగీకరించేలా చెయ్యడానికి హింసకు పాల్పడడానికి కూడా పోలీసు అధికారులకు అధికారాలు దక్కాయి.
వలస పరిపాలనా కాలంలో నేర నిర్ధారణకు కీలకమైన సాక్ష్యాలు ప్రవేశపెట్టాల్సిన అవసరం లేకుండానే కఠినమైన శిక్షలు విధించడానికి వీలుగా చట్టపరమైన నియమాళి, న్యాయ తర్కాలను కార్యనిర్వాహక వ్యవస్థకు లోబడిపోయేలా చేశారు. వలసకాలపు నాటి వారసత్వమే నేటికీ కొనసాగుతున్నది. సమాజంలో చట్టం ఆస్తి సంబంధాలు పరిరక్షించబడాలంటే అలగా జనాన్ని, కాయకష్టం చేసే ప్రజానికాన్ని, ఓటు హక్కులేని వాళ్లను అదుపులో ఉంచడానికి పోలీసులు చట్ట వ్యతిరేక పాల్పడడం అవసరం, ప్రయోజనకరం అని అటు రాజ్యం ఇటు పబ్లిక్ కూడా గట్టిగా నమ్ముతున్నారు. అదే అసలు విషాదం.
విద్యారవీంద్రనాధన్
అనువాదం: కె సత్యరంజన్
(వ్యాసరచయిత సెంటర్ ఫర్ మోడ్రన్ ఇండిన్ స్టడీస్, గోట్టింజెన్లో డాక్టొరల్ పరిశోధకులు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.